వైద్యులు లేని ఆరోగ్య శిబిరాలు ఎందుకు…?
ఆరోపిస్తున్న ప్రజలు…
వైద్యులు లేని శిబిరాలకు రావడానికి విముఖత వ్యక్తం చేస్తున్న ప్రజలు…
కింది స్థాయి ఆరోగ్య కార్యకర్తల చేత మాత్రల పంపిణీతో ఆరోగ్యం కుదుటపడటం లేదని వాపోతున్న ప్రజలు…
రాకపోకలు సాగిస్తూ స్థానికంగా నివాసం ఉండకుండానే అలవెన్స్ తీసుకుంటున్న వైనం…
సమయపాలన పాటించని వైద్య ఆరోగ్య సిబ్బంది…
నేటి ధాత్రి-గార్ల:-
ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చిన్నకిష్టాపురం, పెద్దకిష్ట పురం,గుంపెళ్ళగూడెం తదితర గ్రామాలలో వైద్యులు లేకుండానే అర్థం-పర్థం లేని ఆరోగ్య శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్యులు లేని ఆరోగ్య శిబిరాలు ఎందుకు…? అని ఆరోపిస్తున్న అనారోగ్య పీడితులు.వర్షాకాల సీజన్ లో సీజనల్ వ్యాధులు తరుముకొస్తున్న వేళ స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ,వైద్య సేవలు అందించవలసిన వైద్యులు,వైద్య సిబ్బంది సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ స్థానికంగా ఉండకుండానే ఏజెన్సీ అలవెన్సులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సుదూర పట్టణ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ, సకాలంలో వైద్యం అందించకపోవడంతో అనారోగ్య బాధితులు మంచాలు పట్టారు.గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు వైద్యులు రాకుండానే క్రింది స్థాయి ఆరోగ్య కార్యకర్తల చేత మాత్రలు పంపిణీ చేయడంతో ప్రజల ఆరోగ్యం కుదుటపడటం లేదని వాపోతున్నారు.సమయపాలన సైతం పాటించని వైద్య ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.డి ఎం హెచ్ ఓ,జిల్లా ఉన్నత అధికారులు చొరవ తీసుకొని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.