పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి కొండా సురేఖ
దేశాయిపేట ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ
నేటిధాత్రి, దేశాయిపేట, వరంగల్.
పేదప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం జిడబ్ల్యుఎంసి పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేట ఎస్సీ కాలనీ ప్రాంతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు,
జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ప్రతులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అధికారులతో కలిసి దేశాయిపేట ఎస్సీ కాలనీలో కలియ తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ..
ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని, నియోజకవర్గానికి 3500 ఇల్లు మొదటి విడతలో మంజూరయ్యాయని, రెండో విడతలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులను ఏమాత్రం ఆలస్యం చేయడం లేదని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. మధ్య దళారుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నదని, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్యశ్రీ పరిస్థితిని 10 లక్షల రూపాయలకు పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి కల ఇందిరమ్మ ఇల్లు సొంతమయ్యేలా నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడుదల రాష్ట్రవ్యాప్తంగా 22 వేల 500 కోట్ల రూపాయలతో నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులు అధైర్య పడాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల దేవదాయ శాఖకు 176 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని మంత్రి తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప గత పది ఏళ్లలో అభివృద్ధి జరగలేదన్నారు. కొండా దంపతులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల వల్లే ప్రజలు ఆశీర్వదించడం వల్ల ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని, తూర్పు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ అన్ని డివిజన్లను పూర్తిస్థాయిలో పూర్తి చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న షాదిఖానను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
మహిళలు తలచితే ఏదైనా సాధిస్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో 6 గ్యారంటీలు మహిళల పేరు మీదే నామకరణం చేయడం జరిగిందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచడంతోపాటు 200శాతం కాస్మెటిక్ చార్జీలను పెంచడం, పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు మెప్మా ద్వారా కుట్టించిన యూనిఫామ్ లు పాఠ్యపుస్తకాలు అందించి ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలలను బలోపేతం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కోటి మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, తూర్పు లోని 5 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ ద్వారా ఐదు బస్సులను అద్దెపై నిర్వహించుకొనుటకు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వెనుకబడిన తరగతుల వారికి కమ్యూనిటీ హాల్ లకు బదులు మ్యారేజ్ హాల్ లను నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సూచించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ..
ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలని, పురోగతిని బట్టి లబ్ధిదారులకు ప్రతి సోమవారం జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు సమీక్షలు జరుపుతున్నామన్నారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. బేస్మెంట్ పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే మేస్త్రీలకు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మహిళ సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రుణం ఇప్పించడం జరుగుతుందన్నారు. 500 ఎస్ ఎఫ్ టి వరకే నిర్మించుకునేలా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ..
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరిలో మధ్య దళారుల సమయం లేకుండా చూడాలని, అలాంటి దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శుభం, 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్న రాణి, సీఎంహెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.