ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో బుర్రకాయలగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘం ఎరువుల దుకాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆరోగ్య కేంద్రాలను, తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు, స్టోర్ రూము తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులతో ముకాముఖి మాట్లాడారు. నిర్మాణ పనులలో జాప్యం జరుగకుండా నాణ్యత పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు నిర్మాణ పద్ధతులపై అవగాహన కల్పించి, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చే దిశగా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి ఇంటి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులు వీలైనంత తొందరగా గృహ ప్రవేశం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేస్తూ సత్వరం పనులు పూర్తి అయ్యేలా పని చేస్తేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. గణపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని గృహ నిర్మాణ శాఖ పిడిని అడిగి తెలుసుకున్నారు. ఇసుక ఎక్కడి నుండి తెస్తున్నారని అడిగి తెలుసుకుని ఇసుక ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాల్వపల్లి నుండి ఇసుక తెస్తున్నట్లు పిడి తెలిపారు.
అనంతరం ప్రాథమిక పశు వైద్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పశువుల చికిత్స కు వచ్చిన రైతులతో వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందులు స్టాకు ఉంచాలని, పశువులు వ్యాధులకు గురికాకుండా టీకాలు వేయాలని సూచించారు. పశు సంపదను కాపాడుకోవాలని తెలిపారు. అవసరమైన మందుల కొరకు ప్రతిపాదనలు ఇవ్వాలని పశు సంవర్ధక శాఖ డిడిని సూచించారు. ఈ సందర్భంగా గొర్రెల వైద్య సేవలకు వచ్చిన రైతు జిల్లా కాలెక్టర్ కు గొర్రె పిల్లను బహుకరించారు వ్యాధులతో బాధ పడే ప్రజలు వైద్యుల సలహాలు, సూచనలతో మేరకు క్రమం తప్పక మందులు వాడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలిపారు.శుక్రవారం గణపురం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలకు వచ్చిన ప్రజలతో సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీ పేరేంటి అని గట్టయ్యను అడిగి తెలుసుకుని ఏమి సమస్య ఉంది, వైద్యులు మంచిగా చూశారా లేదా మందులు ఇచ్చారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మీ అనే మహిళతో మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ తేలు కుట్టినందున వైద్య సేవలకు వచ్చానని తెలుపగా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. ఓపి రిజిస్టర్, స్టోర్ రూము ను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.
ప్రాథమిక సహకార సంఘం ఎరువుల విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి ఎరువుల నిల్వలు పరిశీలించారు జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు అవసరం మేర తీసుకోవాలని సూచించారు. ధరల పట్టిక, స్టాకు రిజిస్టర్ పరిశీలించారు. ఈ రోజు ఇప్పటి వరకు ఎంత మంది రైతులు యూరియా తీసుకున్నారని వివరాలు అడుగగా 13 మంది రైతులకు 30 బస్తాలు యూరియా ఇచ్చామని తెలిపారు. ఎరువులు, విత్తన దుకాణాలను నిత్యం పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు, స్టోర్ రూములను పరిశీలించారు
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ భారతి దరఖాస్తులు. పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను ఆదేశించారు. నోటీసు లు జారీ, విచారణ ప్రక్రియ, దరఖాస్తులు తిరస్కరణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరస్కరించిన దరఖాస్తు దారులకు కారణాలు తెలియచేయాలని తెలిపారు.తహసీల్దార్ కార్యాలయ సందర్శనలో కార్యాలయానికి వచ్చిన వయోవృద్ధునితో ఏ సమస్య కొరకు వచ్చారని అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ ఎల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.