రైతుల ధాన్యం ఎండబెట్టేందుకు స్థలం కేటాయించాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన
రాయలాపూర్ గ్రామ రైతుల వినతి పత్రం సమర్పణ..
రామాయంపేట అక్టోబర్ 9 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలంలోని రాయలాపూర్ గ్రామ రైతులు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను వెల్లడించారు. ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు తాము కోత కోసిన వడ్లను ఎండబెట్టేందుకు సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి సీజన్‌లో రాయలాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని రైతులు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఉన్న సంఘ స్థలం చాలక రోడ్డుపై, పొలాల్లో ధాన్యం ఆరబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
రోడ్డుపై ధాన్యం పోస్తే రవాణాకు ఆటంకం కలుగుతోందని, పోలీసు అధికారులు కూడా అడ్డుకుంటున్నారని రైతులు వివరించారు. ఈ నేపథ్యంలో రాయలాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ గుడి, హనుమాన్ గుడి ముందు ఉన్న సర్వే నెం. 881లోని ప్రభుత్వ భూమిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్ రజనీకుమారిని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
రోడ్డుపై వడ్లు ఆరబెట్టడం వాహనదారులకు ఇబ్బందికరమని, ప్రమాదం కూడా ఉందని రైతులు పేర్కొన్నారు. కనుక ప్రభుత్వమే తక్షణం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి తమ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ వినతి పత్రం సమర్పణ కార్యక్రమంలో సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు.