టీబీజీకేఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు మానుకోవాలి
*కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్
జెట్టి శంకర్రావు*
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
గత కొంతకాలం నుండి టీబీజీకేఎస్ నాయకులు చేస్తున్న అసత్యపు ఆరోపణలను మానుకోవాలని ఐఎన్టియుసి కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ రావు శుక్రవారం ప్రకటనలో హెచ్చరించారు.సింగరేణిలో టీబీజీకేఎస్ ఇంచార్జ్,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలు దయ్యాలు వేదాలు వల్లించడమే తప్ప వాస్తవం కాదని తెలిపారు.మితి మీరిన రాజకీయ జోక్యంతో బిఆర్ఎస్ ప్రభుత్వం బాండ్ల రూపంలో ఉన్న సింగరేణి మిగులు బడ్జెట్‌ను కొల్లగొట్టి సంస్థకు రూ.29 వేల కోట్లపైగా ప్రభుత్వ బకాయిలు ఇవ్వకుండా అజమాయిష్ చేసింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.మీ పరిపాలనలో ఒక్క కొత్త గనిని కూడా తెరవలేని దుస్థితికి సింగరేణిని తీసుకొచ్చారని,సంస్థను ఆర్థికంగా నిర్వీర్యం చేసింది కూడామీ ప్రభుత్వమేనని విమర్శించారు.
మీ టీబీజీకేఎస్ నాయకులను, సంస్థ పాలనా పరంగా చేసిన బదిలీలను రాజకీయ జోక్యంగా చిత్రీకరించడం అసత్యప్రచారం తప్ప మరేమీ కాదన్నారు.అప్పటి గుర్తింపు సంఘం,అధికారంలో మీ పార్టీ ఉండగా జరిగిన ఈ చర్యలు ఇప్పుడు మితిమీరిన జోక్యమని మాట్లాడడం విడ్డురమన్నారు.
2022 లో యాజమాన్యం సంస్థ పాలన పరంగా, సింగరేణి వ్యాప్తంగా 20 మంది యూనియన్ నాయకులను, శ్రీరాంపూర్‌లో ఐదుగురు టీబీజీకేస్ నేతలను బదిలీ చేసింది.అప్పుడు గుర్తింపు సంఘంగా టీబీజీకేస్, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటాన్ని మరిచి,ఇప్పుడు రాజకీయ జోక్యం గురించి మాట్లాడడం నైతిక విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.మీ రాజకీయ హోదా నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వంపై నీతిమాలిన ఆరోపణలు చేయడం తగదని హితువు పలికారు.నిజం తెలుసుకున్న కార్మికులు తప్పకుండా మీ వాస్తవ రూపాన్ని గ్రహిస్తారని హెచ్చరించారు.