ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) ఆధ్వర్యంలో మూడు దశల పోరాటం.
మొదటి దశలో భాగంగా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మండల స్థాయిలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పణ
విద్యారంగంలో పేరుకుపోయిన 51 సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపం.
ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలి. సిపిఎస్ ను రద్దు చేయాలి.
317 బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలి.
టి పి టీ ఎఫ్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రాం నర్సయ్య, కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, యుటిఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, డి టి ఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్యల డిమాండ్ .
కేసముద్రం/ నేటి దాత్రి
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రభుత్వం ముందుంచిన దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పిఆర్సి, డిఏ, ఏకీకృత సర్వీస్ రూల్స్ మొదలగు 51 అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టిపిటిఎఫ్ మహబూబాద్ జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రామ్ నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడం లో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి( యు.ఎస్.పి.సి ) చేపట్టిన మూడు దశల పోరాటం లో, మొదటగా మండల కేంద్రంలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించాలన్న పిలుపు మేరకు గురువారం మండలంలోని యు. ఎస్. పి. సి. భాగస్వామ్య సంఘాలైన టీ.పి.టీ. ఎఫ్, డి. టీ. ఎఫ్. సంఘాల నేతృత్వంలో కేసముద్రం మండల తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, యు.టి. ఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, డి టి ఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉపాధ్యాయులకు, విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యలను పెండింగ్లో ఉంచిన గత ప్రభుత్వాన్ని గద్దె దించామని అన్నారు. కానీ ఏరి కోరి తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వం కూడా ఆ సమస్యలను అలాగే కొనసాగించి ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇచ్చిన ఉచితాల హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం పరుగులు తీస్తుందని విమర్శించారు. కానీ ఉద్యోగస్తులకు మాత్రం హక్కుగా రావాల్సిన వాటిని పెండింగ్లో పెడుతుందని వాపోయారు. విద్యారంగంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పిఆర్సి ,డి ఏ లు ప్రకటించాలని,,ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయాలని, కస్తూరిబాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, గురుకుల వ్యవస్థను తొలగించి గ్రామాలలో ఉండే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆ రోజె అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ప్రధాన కార్యదర్శి నన్నపురాజు నరసింహరాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊట్కూరి ప్రణయ్ కు మార్, జి. శ్రీనివాస్, తండా సదానందం ,జిల్లా కౌన్సిలర్ సదయ్య, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి లావుడ్యా భద్రాసింగ్, కార్యదర్శి భట్టు భద్రు, డి టి ఎఫ్ జిల్లా కౌన్సిలర్ గంగుల శ్రీనివాస్, కార్యదర్శి సుంకరి రవి తదితరులు పాల్గొన్నారు.