రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ సందడి..
రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులను స్వాగతించేందుకు సీనియర్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉత్సాహభరిత వాతావరణంగా మారింది.
కార్యక్రమానికి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నృత్యాలు, పాటలు, నాటికలు, వినోదాత్మక ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఫ్రెషర్స్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మల్లేశం మాట్లాడుతూ –
“కళాశాలలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విద్యతో పాటు సామాజిక సేవా భావనను పెంపొందించుకోవాలని” సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచి ఎల్లప్పుడూ సహకారం అందిస్తారని తెలిపారు.
ఈకార్యక్రమంలో అధ్యాపకులు మాట్లాడుతూ, ఫ్రెషర్స్ పార్టీ విద్యార్థుల మధ్య ఆత్మీయత పెంపొందించేందుకు, ప్రతిభ ప్రదర్శనకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలలో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్లు ఫ్రెషర్స్ విద్యార్థులకు పుస్తకాలు బహుమతులుగా అందజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని పంచుకున్నారు.