సర్పంచ్ లు గ్రామాలల్లో అభివృద్ధి చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
గణపురం రేగొండ సర్పంచ్ లు గ్రామాలల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టి పారదర్శక పరిపాలనతో గ్రామాభివృద్ధికి సేవ చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కొత్తగా ఏకగ్రీవమైన సర్పంచ్ లకు సూచించారు. గురువారం భూపాలపల్లిలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను గణపురం మండలం బుద్దారం ఏకగ్రీవ సర్పంచ్ విడిదినేని శ్రీలత – అశోక్, పన్నెండు మంది ఏకగ్రీవ వార్డు సభ్యులు మరియు రేగొండ మండలం కొత్తపల్లి(బీ) గ్రామ ఏకగ్రీవ సర్పంచ్ బూతం రజిత – రమేష్ లు మర్యాదపూర్వకంగా పూల బొకేలు అందించి కలిశారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ లకు శాలువాలు కప్పి, స్వీటు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజల ఐక్యతతో, అభివృద్ధి లక్ష్యంతో ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకోవడం సంతోషమన్నారు. ఈ నిర్ణయం గ్రామ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టి పారదర్శక పరిపాలనతో గ్రామాభివృద్ధికి సేవ చేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, తాగు నీరు, విద్యా, ఆరోగ్య రంగాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో అవసరమైన చోట (ఎమ్మెల్యే) పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
