ఆ.. ఉపాధ్యాయునికి జీతమేందుకు సారూ..!
తెరువని స్కూల్..విద్యార్థులు లేని టీచర్.
2016 లో మూతపడ్డ స్కూల్ కు టీచర్ నియామకం
ప్రభుత్వ జీతంతో గ్రామంలో ఎంజాయ్…
బర్ల కొట్టంగా మారినా ప్రాథమిక పాఠశాల భవనం
డీఈఓ నుండి ఆర్డర్ వచ్చేవరకు గ్రామంలోనే ఉండాలే..
నిర్లక్ష్యపు టీచర్ కు వత్తాసు పలుకుతున్న ఎంఈఓ..
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
నిరుపేదలు చదువుకునే ప్రభుత్వ బడిని నిర్లక్ష్యంతో గాలికి వదిలేసిన ప్రభుత్వ ఉపాధ్యాయునికి జీతం ఎందుకు సారూ…అని జిల్లా విద్యాశాఖ అధికారిని గ్రామస్తులు అడుగుతున్నారు. 2016 సంవత్సరంలో మూతపడిన మా పాఠశాలకు టీచర్లు ఎలా కేటాయించారు అని విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. బర్ల కొట్టంగా మారిన ప్రభుత్వ పాఠశాల నేడు విషపురుగులకు నిలయంగా మారడంతో కొన్ని ఏళ్లుగా ప్రైవేటు సదువుల కోసం గ్రామస్తుల పిల్లలు పట్టణాలకు చదువుబాట పట్టారు. చదువులు చెప్తానని గ్రామానికి వచ్చిన ప్రభుత్వ టీచర్ గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ జీతంతో ఎంజాయ్ చేస్తున్నాడు ఈ అమానుష సంఘటన వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం లైనుతండ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదుతో పాఠశాలను సందర్శించిన నేటిధాత్రి ప్రతినిధికి పిచ్చి మొక్కలు, గడ్డివాములు, ఆరేసిన బట్టలు,పశువులు కట్టేస్తున్న ఆనవాళ్లు,చెత్తాచెదారంతో దర్శనమిచ్చింది. కనీసం రికార్డులను భద్రపరిచే గదితాళం కూడా ఆ ఉపాధ్యాయుని వద్ద ఉండకపోవడం విశేషం. పిల్లలు లేరు.. చదువు చెప్పను.. కానీ నేను ఊర్లోనే తిరుగుతా.. అంటూ పాఠశాల ఉపాధ్యాయుడు బలరాముడు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఆ పాఠశాల పట్ల మండల విద్యాశాఖ అధికారిని చరవాణి ద్వారా వివరణ కోరగా జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఇచ్చాం ఆర్డర్ వస్తేనే వేరే స్కూల్ కు వెళ్లాలి.. లేదంటే స్కూల్ ముందరే కూర్చోవాలి అని ఆ ఉపాధ్యాయునికి ఎంఈఓ వత్తాసు పలకడం విద్య వ్యవస్థ ఎటువైపు దారితీస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది.