మానవ హక్కులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి…

మానవ హక్కులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి

◆-: ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్:సమాజంలో ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు మానవ హక్కుల మూల సూత్రమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు అన్నారు.
ఆదివారం హైదరాబాద్ లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ 2026 క్యాలెండర్ ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యం నిలకడగా కొనసాగాలంటే మానవ హక్కుల పరిరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు.ప్రతి పౌరుడికి జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, న్యాయం పొందే హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని ఆయన గుర్తు చేశారు. అయితే సమాజంలో ఇప్పటికీ పేదలు, మహిళలు, బాలలు, దళితులు, గిరిజనులు, కార్మికులు, వృద్ధులు అనేక సందర్భాల్లో హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మానవ హక్కులు కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదని, అవి మానవత్వానికి ప్రతీకలని అన్నారు. ఇతరుల హక్కులను గౌరవించడం ద్వారా మాత్రమే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. మానవ హక్కులపై అవగాహన లేకపోవడం వల్లనే అనేక అన్యాయాలు జరుగుతున్నాయని, అందుకే గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంస్థ దేశవ్యాప్తంగా హక్కుల ఉల్లంఘనలపై పోరాటం చేస్తూ, బాధితులకు న్యాయం అందించేందుకు కృషి చేస్తోందని వివరించారు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ వ్యవస్థల వద్ద బాధితులకు సహాయం అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, యువత అందరూ కలిసి మానవ హక్కుల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు తన హక్కులపై అవగాహన పెంచుకోవడంతో పాటు, ఇతరుల హక్కులను కూడా గౌరవించే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు.న్యాలకల్ మండలం మల్గి గ్రామంలో ప్రజలకు నష్టం కలిగించే కంపెనీ ఏర్పాటు జరగకుండా సంస్థ తరపున గట్టి పోరాటం చేశామని , గ్రామ ప్రజల భద్రత, జీవనాధారాలను కాపాడాలనే ఉద్దేశంతో సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు.అలాగే సిగచి కంపెనీ ప్రమాదంలో గాయపడిన 53 మంది బాధితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సంస్థ పోరాటం చేసిందని, ఆ క్రమంలో ప్రతి బాధిత కుటుంబానికి రూ. లక్ష చొప్పున పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.భవిష్యత్తులో కూడా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ అంశమైనా ఎదురైతే సంస్థ తరపున పోరాటం కొనసాగిస్తామని, ప్రజల పక్షాన నిలబడి హక్కుల సాధన కోసం ముందుండి పోరాడతామని వారు స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని నవోదయ సిద్దు కోరారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలమని తెలిపారు. ప్రత్యేకంగా ప్రజలు తమ హక్కులు, విధులు తెలుసుకొని న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది చీఫ్ అడ్వైజర్ పుట్ట పద్మారావు, జేఎన్జీఓయూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు బిట్ల ప్రభాకర్, బి. క్రాంతి కిరణ్, ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ అడ్వైసర్ వెంకట్ దాస్, ప్రొఫెసర్ సీబీఐటి చీఫ్ అడ్వైసర్ ఎం. స్వామి దాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వి మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శులు దత్తా రెడ్డి, ఆనంద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తలారి కుమార్, రాష్ట్ర అడ్వైజర్ ప్రశాంత్ గాంధీ, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఫెరోజ్, సహాయ కార్యదర్శులు ఏ. ప్రదీప్ కుమార్, ఆందోల్ మల్లేశం, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్, బోరంచ సాయిలు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.ఏ ఖైసర్ తదితరులు పాల్గొన్నారు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నీ జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరపడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి గౌరవంగా జీవించేందుకు మానవ హక్కులు.మూలాధారమని అందరూ హక్కులు తెలుసుకొని ఇతరుల హక్కులను గౌరవించాలని తెలియజేస్తూ. 1948. డిసెంబర్ .10న. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటనలను ఆమోదించిందని.అందుకే ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని. జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ న్యాయ సహాయం ద్వారా ప్రజల హక్కులను రక్షిస్తుందని. తెలుపుతూ. జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవాధికారిక సంస్థ అధ్యక్షురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పి నీరజ గారి ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి. కార్యదర్శి. DLSA.. శ్రీ పి లక్ష్మణ చారి సమన్యాయంతో.బుధవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జ్యోతి కాలేజ్ ఎడ్యుకేషన్లో.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడంతోపాటుజిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ న్యాయ సహాయం ద్వారా ప్రజలకు రక్షిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి సమావేశ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ.జే .శ్రీనివాసరావు. లోక్ అదాలత్ సభ్యులు న్యాయవాదులు.ఆడేపువేణు గుర్రం ఆంజనేయులు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పి పద్మ. విద్యార్థి నీ.విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

మహిళా పోలీస్ శక్తికి అండగా తెలంగాణ ప్రభుత్వం – మంత్రి సీతక్క

మహిళా పోలీస్ శక్తికి అండగా తెలంగాణ ప్రభుత్వం – మంత్రి సీతక్క

కొత్త దిశకు నాంది పలికిన తెలంగాణ మహిళా పోలీసుల తొలి సదస్సు

మహిళా పోలీస్ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మంత్రి సీతక్క

మహిళా పోలీసుల్లో నూతన ఉత్తేజం నింపిన సీతక్క ప్రసంగం

మహిళా పోలీసుల అవసరాలను గుర్తించి ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తాం- మంత్రి సీతక్క

హైదరాబాద్‌, నేటిధాత్రి.

 

రాజేంద్రనగర్‌లోని రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో తెలంగాణ మహిళా పోలీస్ రాష్ట్రస్థాయి తొలి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మహిళా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డైరెక్టర్ జనరల్ అధికారులు అభిలాష బిష్ట్, చారు సిన్హా, శికా గోయల్, స్వాతి లక్రాతో పాటు కానిస్టేబుల్ నుండి ఎస్పీ స్థాయి వరకు సుమారు 400 మంది మహిళా పోలీస్ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో మహిళా పోలీసులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అనుభవాలు, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి సీతక్క మహిళా పోలీసుల తొలి సదస్సు నిర్వహిస్తున్నందుకు పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు. మహిళా పోలీసుల సంక్షేమం పట్ల ప్రభుత్వ కమిట్‌మెంట్‌ను ఈ సదస్సు ప్రతిబింబిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్‌గా మహిళా శక్తిని ప్రోత్సహిస్తున్నారని, ఈ సదస్సులో మహిళా పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా సంక్షేమానికి సంబంధించిన సానుకూల నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. యూనిఫార్మ్‌లో ఉన్న అక్కచెల్లెమ్మలకు సెల్యూట్ అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1973లో కేరళలో కోజికోడ్‌లో దేశంలోని తొలి మహిళా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన విషయాన్ని స్మరించుకున్నారు. అదే దిశగా దేశవ్యాప్తంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పడి, న్యాయం కోసం మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఒకప్పుడు పోలీసులు, తాను భిన్న ధ్రువాలుగా ఉన్నామని మారిన పరిస్థితుల్లో తాను ప్రజాసేవలోకి రావాల్సి వచ్చిందని తన ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వృత్తి ధర్మానికి మానవీయతను జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయని, కమిట్మెంట్‌కు, కాన్ఫిడెన్స్‌కు చిరునామాగా తెలంగాణ మహిళా పోలీసులు నిలుస్తున్నారని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. వృత్తి ధర్మం, మాతృత్వం మధ్య మహిళా పోలీసులు ఎదుర్కొనే సంఘర్షణల దృష్ట్యా మెటర్నిటీ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. బొగ్గుబాయిల నుంచి అంతరిక్షం వరకు మహిళలు రాణిస్తున్న ఈ రోజుల్లో మహిళా పోలీసుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ అండగా నిలవాలని, సమాజంలో మహిళల పట్ల ఉన్న చిన్నచూపును అరికట్టే బాధ్యత కూడా పోలీసులపైనే ఉందని ఆమె పేర్కొన్నారు. డెడికేషన్, డిసిప్లిన్, డిగ్నిటీతో మహిళా పోలీసులు పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు భరోసాగా నిలవాలని ఆమె సూచించారు. ప్రతి ఏడాది జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని, మహిళా పోలీసులకు వీక్లీ ఆఫ్, ప్రత్యేక పని వేళల సౌకర్యాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని సీతక్క సూచించారు. మహిళా పోలీసుల అవసరాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తే, వాటి ఆధారంగా చట్టాలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆమె స్పష్టం చేశారు. జూనియర్ మహిళా కానిస్టేబుళ్లకు సీనియర్ అధికారులు మెంటర్లుగా మారి మార్గదర్శనం ఇవ్వాలని, సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ హరాస్మెంట్ వంటి కేసులలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, కౌన్సెలింగ్ కార్యక్రమాలు తప్పనిసరిగా ఉండాలని మంత్రి చెప్పారు. మహిళా పోలీసుల కృషిని గుర్తించేలా ప్రత్యేక అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, మెటర్నిటీ, పోస్ట్ డెలివరీ కాలానికి తగినట్లుగా తమిళనాడు తరహాలో ప్రత్యేక యూనిఫార్ములు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి వాటిని తెలంగాణలో అమలు పరచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళా పోలీసులకు అవసరమైన రెస్ట్ రూములు, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 వేల మంది పోలీసుల్లో మహిళా పోలీసులు కేవలం 7 వేల మంది మాత్రమే ఉన్నారని, వారి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని సీతక్క గుర్తుచేశారు. మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి ఈ సదస్సు దోహదపడుతుందన్న నమ్మకాన్ని మంత్రి సీతక్క వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళా పోలీస్ రాష్ట్రస్థాయి తొలి సదస్సును ప్రారంభించి ప్రసంగించిన మంత్రి సీతక్కను పోలీసు ఉన్నతాధికారులు సన్మానించారు. తెలంగాణ మహిళా పోలీస్ సదస్సు విచ్చేసిన ఇతర రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులను, పోలీస్ శాఖలో ఉన్నత స్థానంలో ఉన్న మహిళా పోలీసు అధికారులను మంత్రి అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version