విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషితో చొప్పదండి నియోజకవర్గం డిగ్రీ కళాశాల మంజూరు
గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు
హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు
గంగాధర, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. డిగ్రీ విద్య కోసం కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలకు వెళ్లి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో చాలామంది పేద విద్యార్థులు చదువును ఇంటర్మీడియట్ తోనే ఆపేస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్న సదుద్దేశంతో మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఈసమస్య తీసుకువెళ్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తుండడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
