కోడ్ ఉన్నా బెల్ట్ జోరు!
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా జహీరాబాద్ నియోజకవర్గంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్నా పల్లె, పట్నం తేడా లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది. ఎకడ చూసినా పర్మిట్ రూమ్, బార్లను తలపిస్తున్నాయి. గతంలో కోడ్ రాగానే బెల్టు దుకాణాలపై ఉకుపాదం మోపేవారు. ఇప్పుడు యధేచ్ఛగా దందా సాగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
◆:- విచ్చలవిడిగా బెల్టు షాపుల నిర్వహణ
◆:- గతంలో ఎలక్షన్ కోడ్ రాగానే ఉకుపాదం
◆:- నేడు పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం
◆:- బార్లను తలపిస్తున్న కిరాణా దుకాణాలు
◆:- బహిరంగంగానే మద్యం తరలింపు
◆:- బెల్టు షాపులు తీస్తేనే ప్రశాంత ఎన్నికలకు ఆసారం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా జహీరాబాద్ ఝరాసంగం న్యాల్ కాల్ మొగుడంపల్లి కోహిర్ మండలాలలో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్నా పల్లె, పట్నం తేడా లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది. ఎకడ చూసినా పర్మిట్ రూమ్, బార్లను తలపిస్తున్నాయి. గతంలో కోడ్ రాగానే బెల్టు దుకాణాలపై ఉకుపాదం మోపేవారు. ఇప్పుడు యధేచ్ఛగా దందా సాగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గల్లీకో బెల్టు దుకాణం..
సాధారణ సమయాల్లో గ్రామాలు, పట్టణాల్లో బెల్టు దుకాణాలు జోరుగా నడుస్తాయి. వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోదు. పైగా వైన్స్ యజమానులను పురమాయిస్తుంది. దీంతో గల్లీకో బెల్టు దుకాణం వెలిసింది. ఒకో గ్రామంలో 5 నుంచి 10 దుకాణాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 82 వైన్స్ ఉండగా, 2000 వరకు బెల్టు షాపులు ఉన్నట్టు తెలిసింది. అయితే ఎన్నికల సమయంలో కోడ్ అమలులోకి రాగానే బెల్టు షాపులపై ఉకుపాదం మోపుతారు. కానీ స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చి వారం దాటినా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో అప్పటి అధికారులు ఒక షాపు కూడా తెరవకుండా కఠిన చర్యలు తీసుకున్నారని చర్చించుకుంటున్నారు.
బహిరంగంగానే మద్యం తరలింపు
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు అన్ని రకాల కార్యకలాపాలు ఎన్నికల సంఘం నియంత్రణలోకి వస్తాయి. రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తూ నగదు, తదితరాలను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే సీజ్ చేసే అధికార యంత్రాంగం, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా అవుతున్న ఎందుకు ఫోకస్ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోడ్ ఉండటంతో పరిమితంగా మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. అడ్డూ అదుపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌ల నుంచి మద్యం, బీర్లు బహిరంగంగానే మారుమూల ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు.
బార్లను తలపిస్తున్న బెల్ట్ షాపులు
ఒకప్పుడు బెల్ట్ షాపులు గ్రామానికి ఒకటీ రెండు ఉండేవి. కానీ నేడు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ఉన్న కిరణాషాపుల్లోనే చాలావరకు మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. ఈ విషయం ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులకు తెలియదా..? లేక మామూలు సమయంలో లాగే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైన్స్ ఓనర్లకు సహకరిస్తున్నారా? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మార్పీ ధర అంటే క్వార్టర్‌కు రూ.20 నుంచి రూ.40, బీరుకు రూ.30 నుంచి రూ.50 అదనంగా బెల్ట్ షాపుల్లో వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా పర్మిట్ రూమ్‌ల మాదిరి ఏర్పాట్లు చేస్తున్నారు. మందు, గ్లాసులు, వాటర్, స్టఫ్ కొనుకొనే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు.
బెల్టు దుకాణాలు తరలిస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు..
ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం సేవించాకే అసలు పంచాయితీ షురూ అవుతుంది. అయితే వైన్స్ రాత్రి 10 గంటల వరకే ఉంటాయి. ఆ తర్వాత అంతా బెల్టు దుకాణాల హవానే కొనసాగుతుంది. పీకల్లోతు తాగాక.. తరచుగా గొడవలు చోటుచేసుకుంటాయి. ఇవి మీతిమిరితే ఘర్షణలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.
అధికారుల కనుసన్నల్లోనే?
జహీరాబాద్ లో ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే మద్యం దందా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నో బెల్టు షాపులు వెలిసినా ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారని, అన్నీ తెలిసి చర్యలు తీసుకోవడం లేదని ప్రచారం జరుగుతున్నది.. మరోవైపు మద్యం యజమానులు, బెల్ట్ షాపు నిర్వాహకులు, అధికారుల మధ్య ఒప్పందాలతోనే ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తున్నది. అధికారులు స్పందించి బెల్టు దందాను అడ్డుకోవాలని కోరుతున్నారు.
