సైబర్ నేరాలకు అప్రమత్తతే రక్షణ కవచం : ఎస్సై బాలరాజు..
రామాయంపేట, సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)
నేటి డిజిటల్ యుగంలో సాంకేతికతను ఆయుధంగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను ఉచ్చు వేస్తున్నారని రామాయంపేట ఎస్సై బాలరాజు హెచ్చరించారు. పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ప్రజలకు అప్రమత్తతే ప్రధాన రక్షణ కవచమని సూచించారు.
ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు, స్టాక్ మార్కెట్ మోసాలు, యూపీఐ మోసాలు, లోన్ ఫ్రాడ్లు, నకిలీ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు వంటి మోసపూరిత పద్ధతులు ప్రస్తుతం విస్తరించి ఉన్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ ఉచ్చులో పడుతున్నారని, ఆకర్షణీయమైన లాభాలు, సులభంగా డబ్బు సంపాదన వాగ్దానాలను నమ్మకూడదని సూచించారు.
“వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా పంపే APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేస్తే మొబైల్ ఫోన్ మొత్తం నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్లకు స్పందించరాదు. మొదట ఎక్కువ లాభాలు వస్తాయని చూపించి డబ్బు పెట్టించాక, తిరిగి రాబట్టడం అసాధ్యం అవుతుంది” అని ఎస్సై ఉదాహరణలు ఇచ్చారు.
ఒకవేళ మోసపోతే ‘గోల్డెన్ అవర్’ లోనే చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని బాలరాజు హితవు పలికారు. దానికి గాను జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయవచ్చని, లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సైబర్ మోసాల నివారణకు పోలీసులు నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని, అయితే ప్రజలు స్వయంగా అప్రమత్తతతో వ్యవహరించడమే నిజమైన రక్షణ కవచమని ఎస్సై బాలరాజు స్పష్టం చేశారు.