మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య
కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి.
ఆ గ్రామాల్లో అన్నీ డబుల్ ధమాకే..
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వివాదస్పందంగా మారిన ఆ 12 గ్రామాల ప్రజలకు అన్నీ డబుల్ ధమాకే. రెండురెండే ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మొదలుకుని పాఠశాలలు, రహదారులు, తాగు నీటి పథకాల వరకు అన్ని రెండు మంజూరు చేస్తూ వస్తున్నాయి. ఒకే గ్రామానికి ఇద్దరు సర్పంచ్‌లు, రెండు పాఠశాలలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నట్లుగా అటెండర్‌ను మొదలుకుని ఐఏఎస్ దాకా అన్నీ డబుల్ ధమాకే. ఆ ఊర్లలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఇంకా విచిత్రమేమిటంటే తెలంగాణ నుంచి సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తే మహారాష్ట్ర ఎన్నికలు రాగానే ప్లేట్ ఫిరాయించి మహారాష్ట్ర నుంచి ఎన్నిక కావడం ఈ గ్రామాల విశిష్టత.
