వీధి కుక్కల దాడిలో.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.

వీధి కుక్కల దాడిలో.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

 

వెల్దండ /నేటి ధాత్రి.

 

 

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో చర్చి సమీపంలో నివాసం ఉంటున్న జంగిలి ఆంధ్రయ్య అనే వ్యక్తి పై గురువారం రాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి. ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో ఆంధ్రయ్య పై ఒక్కసారిగా దాదాపు 10 కి పైగా వీధి కుక్కలు మీద పడి ముఖంపై దాడి చేశాయి. దీంతో కల్వకుర్తి ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి నాగర్ కర్నూలుకు వైద్యులు రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని కుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని మండల కేంద్రం ప్రజలు కోరారు.

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా.

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగు బిల్లులకై,వినతి పత్రం అందజేత.ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన రంగం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సంబంధించి దాదాపు 5 నుంచి 6 నెలల మే స్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు, అలాగే గౌరవ వేతనం దాదాపు నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్నవి. దీనివల్ల కార్మికుల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొద్ది రోజుల్లో స్కూలు తిరిగి ప్రారంభం అవుతున్న సందర్భంగా వంట చేయడానికి చేతులు డబ్బులు లేనందున విద్యార్థులకు భోజనాలు పెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వం గౌరవ వేతనం 10000, రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 15 నెలలు పూర్తికావస్తున్న కూడా ఎక్కడ కూడా అమలుకు నోచుకున్న పరిస్థితి లేదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గౌరవ వేతనం 2000, కూడా దాదాపు నాలుగు నెలల నుంచి కార్మికులకు ఇవ్వడం లేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సి.ఐ.టి.యు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.కావున కార్మికులకు రావాల్సిన 5 నెలల పెండింగ్ మెస్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు వెంటనే అందించి, గౌరవ వేతనం 10000 ,రూపాయలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సి.ఐ.టి.యు అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి, మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్, మరియు కార్మికులు వసంత, సత్తవ్వ, పద్మ, ఎల్లవ్వ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

ఖుర్బానీ.. స్ఫూర్తిదాయకం.

ఖుర్బానీ.. స్ఫూర్తిదాయకం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం హజ్రత్ ఇబ్రాహీం (అలై), ఆయన కుమారుడు ఇస్మాయీల్ (అలై) అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించిన కాబా గృహం నేడు గొప్ప ఆరాధనా స్థలంగా మారింది.

‘ఈ గృహాన్ని సకలజనావళికి కేంద్రంగా, శాంతి నిలయంగా రూపొందించాం.

ఇబ్రాహీం ఆరాధన కోసం నిలిచిన ఈ పవిత్ర ప్రదేశాన్ని శాశ్వత నమాజు స్థలంగా ఏర్పాటుచేయమని ఆదేశించాం.

అలాగే ఈ గృహానికి ప్రదక్షిణ, అందులో ఏతెకాఫ్, రుకూ, సజ్దాలు మొదలైనవన్నీ పాటించేవారి కోసం ఈ స్థలాన్ని పరిశుద్ధంగా ఉంచమని ఇబ్రాహీంను, ఇస్మాయీలును నిర్దేశించాను’ అని ఖురాన్లో అల్లాహ్ పేర్కొన్నాడు.

అందుకే ముస్లింలు ఏటా మక్కా వెళ్తారు. అక్కడ ఖుర్బానీ ఇస్తారు.

పండుగకు ముందురోజైన ‘యౌమె అరపా’ నాడు ఉపవాసం పాటిస్తే..

వారు గత సంవత్సరం చేసిన పాపాలు క్షమకు నోచుకుంటాయని ప్రవక్త (స) తెలియజేశారు.

హజ్ యాత్ర

 

Qurbani.. inspiring.

 

 

 

ఇస్లాం ఐదు మూలస్తంభాల్లో హజ్ ముఖ్యమైంది.

స్తోమత ఉన్న ముస్లింలు జీవితకాలంలో ఒక్కసారైనా తప్పక చేయాల్సిన ధార్మిక విధి.

ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక, ఆర్ధిక ప్రయోజనాలున్న విశిష్ట ఆరాధన ఇది. ఏటా లక్షలాదిమంది ముస్లింలు మక్కాకు వెళ్తారు.

ప్రపంచం నలుమూలల నుంచి అల్లాహ్ పట్ల భక్తితో ఆయన ఆహ్వానానికి జవాబుగా ‘లబ్బైక్’ (హాజరయ్యాను) అని పలుకుతూ కాబాగృహానికి వస్తారు.

జాతి, ప్రాంతం, భాషా భేదాలు అక్కడ కనిపించవు.

అందరూ ఒకేరకమైన నిరాడంబరమైన వస్త్రాలు ధరించి, ఒకే విధమైన హజ్ కర్మలు నిర్వర్తిస్తారు.

సర్వమానవ సమానత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తారు.

హజ్ యాత్రికుల హృదయాల్లో అల్లాహ్ పట్ల అంతులేని విశ్వాసం, ప్రేమ తొణికిసలాడుతుంటాయి.

హజ్ యాత్రికుల అంతరంగంలో దేవుడొక్కడే అనే భావన, సమాజపరంగా అందరూ ఒక్కటేనన్న ఆలోచన బలపడతాయి.

హజ్ యాత్ర ప్రజల్లో సమానత్వాన్ని, సహోదర భావాన్ని దర్శింపజేస్తుంది.

ఒకే దైవం, ఒకే ప్రవక్త (స) అన్న విశ్వాసం, ఒకే జీవిత లక్ష్యం (ఖురాన్), ఒకే జీవన విధానం (కిల్లా.. కాబా ప్రదక్షిణ) ఇవన్నీ సామాజిక సమైక్యతకు బలమైన పునాదులు

ఇబ్రాహీం గాథ

 

 

Qurbani.. inspiring.

నేటికి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం అరబ్బు భూభాగంలో దైవగృహం సాక్షిగా జరిగిన ఇబ్రాహీం గాథను, ఆయన త్యాగస్ఫూర్తి, సహనశీలతలను బక్రీద్ నాడు స్మరించుకుంటారు.

ఇబ్రాహీం (అలై) మహా దైవప్రవక్త.

ఆయనకు ఖలీలుల్లాహ్ (దేవుని మిత్రుడు) అనే బిరుదు కూడా ఉంది.

ఒకనాడాయన తన పుత్రుడి గొంతు కోస్తున్నట్లు కలగన్నారు.

దీన్ని దైవాజ్ఞగా భావించి పుత్రుణ్ణి సంప్రదించారు. ‘ఆ ఆదేశాన్ని వెంటనే నెరవేర్చండి.

నేను సిద్ధంగా ఉన్నాను.

అది దైవచిత్తమైతే మీరు నన్ను సహనవంతునిగా చూస్తారు’ అన్నాడు.

దీంతో ఇబ్రాహీం తన ప్రాణం కంటే మిన్న అయిన పుత్రుడి మెడ నరికేందుకు కత్తి తీసుకున్నారు.

బాల ఇస్మాయీల్ తన మెడ కోయడానికి వీలుగా నేలపై పడుకున్నాడు.

మెడపై కత్తి పెట్టగానే ‘ప్రియమైన ఇబ్రాహీం!

నువ్వు నీ కలను నిజం చేయడానికి పూనుకున్నావు.

నా ఆజ్ఞను అమలుచేసేందుకు మీరిద్దరూ మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను ప్రసన్నుడనయ్యాను.

పరీక్షలో అత్యుత్తమంగా ఉత్తీర్ణులయ్యారు.

ఇక భౌతిక చర్యగా మిగిలిన బలి తతంగంతో నాకు నిమిత్తం లేదు.

ఇది మీ పరిపూర్ణ విశ్వాసానికి మచ్చుతునక అంటూ దైవవాక్కు వినిపించింది.

స్వర్గం నుంచి పొట్టేలు ప్రత్యక్షమై ఇస్మాయీల్ స్థానంలో కనిపించింది.

దాంతో పుత్రుడికి బదులు పొట్టేలును బలి ఇచ్చారు. ఇలా బలివ్వడాన్ని ఇస్లామీయ పరిభాషలో ఖుర్బానీ అంటారు.

బక్రీద్ అంటే త్యాగోత్సవం.

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి

సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2026 మార్చినాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఫాసిస్టు చర్యల్లో భాగమేనని ఆయన విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటివరకు 540 మందిని చట్ట విరుద్ధంగా హత్య చేశారని తెలిపారు. ఆపరేషన్ కగార్ మూలంగా మృతుల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అక్కడి ప్రజలు భయానక స్థితిలో జీవనం కొనసాగించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడ్డాయని ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే న్యాయ విచారణ చేపట్టాలని అన్నారు
ఈ చట్టవిరుద్ధ హత్యలను సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కొనసాగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేయాలని అప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన సాగుతుందన్నారు. శత్రు దేశాలపై యుద్ధం చేసినట్లు మధ్య భారతంలో భారత పౌరులపై యుద్ధం చేయడం సరికాదన్నారు. ఉగ్రవాద సంస్థలతో గత ప్రభుత్వాలు చర్చలు జరిపాయని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర ప్రజాస్వామ్య శక్తులు, ప్రజలు చర్చలు చేయాలని కోరుతున్నారని, ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయకపోవడం విచారకరమన్నారు. శాంతి చర్చల కమిటీ, 10 వామపక్ష పార్టీలు, లౌకిక శక్తుల ఆధ్వర్యంలో ఈ నెల మూడు నుంచి ఆరు వరకు అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో సభలు, సమావేశాలు జరపాలని, ఈనెల 14న హైదరాబాదులో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయని, వీటన్నింటినీ జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భూముల సమస్యలు పరిష్కరించేందుకే.!

భూముల సమస్యలు పరిష్కరించేందుకే రెవిన్యూ సదస్సులు

తహశీల్దార్ కృష్ణవేణి

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూమి హక్కుల సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ కృష్ణవేణి అన్నారు. మరిపెడ మండల పరిధిలోని రాంపురం, ఉల్లెపల్లి,భూక్య తండ, లూనావత్ తండా గ్రామాలలో నాల్గవరోజు నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులలో భాగంగా రాంపురం గ్రామపంచాయతీలో తాసిల్దార్ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రజలు, రైతులు ఎవరైనా సరే భూములకు సంబంధించిన హక్కుల విషయంలో రైతులు పడుతున్న బాధలపై,ఆధారాలతో కూడిన దరఖాస్తులను సమర్పిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తి స్థాయి హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు. మండల తాసిల్దార్ కృష్ణవేణి స్వయంగా ప్రజలతో మమేకమై వారు ఇచ్చే అర్జీలను కూలంకషంగా పరిశీలిస్తూ, సరైన రీతిలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. వారికి భూభారతి ద్వారా మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది, ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు వినియోగించుకుని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ తాసిల్దార్ కృష్ణవేణి, గిర్ధవర్ శరత్ గౌడ్,జూనియర్ అసిస్టెంట్లు సందీప్,ప్రవీణ్,నరేష్,గ్రామపంచాయతీ సిబ్బంది హాఫీజ్,మెకానిక్ వెంకన్న,గ్రామ రైతులు రాంపల్లి నాగన్న,వంగ చిన్న వెంకన్న,సుదగానికి శంకర్,దిడ్డి వెంకన్న,చింతపల్లి మల్లేశం,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన.

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బాల్యమిత్రులు ..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:-

 

 

 

చిన్ననాటి కాలంలో వారితో పాటు చదువుకున్న మిత్రుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి తోటి విద్యార్థులు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. పొత్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరంలో వారితోపాటు విద్యను అభ్యసించిన ఎనగందుల రాజు ఇటీవల మల్లయ్య పల్లె గ్రామంలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అప్పట్లో రాజు తో చదువుకున్న మిత్రులందరూ రాజు కుమార్తె పేరు మీద ఉన్నత చదువులు కొరకు రూ. ఇరవై ఐదు వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడిదుల రవీ గుండ్లపల్లి శ్రీనివాస్ వంగ కుమార్ గడ్డం ఉపేందర్ ఐలయ్య రవి పాల్గొన్నారు.

సర్కారు బడుల్లో పిల్లల నమోదు పెంచుదాం.

సర్కారు బడుల్లో పిల్లల నమోదు పెంచుదాం

సర్కారు బడిని బలోపేతం చేద్దాం

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

 

 

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు , సర్కారు బడిని బలోపేతం చేద్దామని డీఈవో రవీందర్, ఎంఈఓ అనిత దేవి ఆదేశానుసారం మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శుక్రవారం మరిపెడ మండల కేంద్రం లోని రాంపురం, చిల్లంచర్ల, భావోజిగూడెం, వెంకంపాడు గిరిపురం,తానంచర్ల, మండలంలోని వివిధ గ్రామాల్లో బడి బాట కార్యక్రమం చేపట్టారు, రాంపురం గ్రామంలో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మార్వో కృష్ణవేణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో విద్యార్థులను చేర్పించాలని వారు కోరారు.గ్రామాల్లోని పిల్లలను వారి తల్లిదండ్రులు ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని సూచించారు.ఆర్థిక భారం తగ్గించుకుందామని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, ఇంగ్లీష్ మీడియం తో పాటు, కంప్యూటర్ విద్యాబోధన జరుగుతుందని వారు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఉదయం అల్పాహారం,మధ్యాహ్న భోజనం,రాగి జావా, పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్, అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శశిధర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్, పంచాయతీ కార్యదర్శి అజయ్,ఉపాధ్యాయులు జయపాల్ రెడ్డి,హరి శంకర్, గణేష్,శ్రీనివాస్,కిన్నర శ్రీను, మన్సూర్ ఆలి,చంద్ర ప్రకాష్ విద్యార్థుల తల్లిదండ్రులు పరశురాములు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, మొత్తం 24 మంది లబ్దిదారులకు ఉత్తర్వుల మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రంజిత్ నోటు పుస్తకాలను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ రామచంద్రయ్య తోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత.

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కరేటేలో ఝరాసంగం సిద్దు మాస్టర్ విద్యార్థుల ప్రతిభ జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం సదాశివపేట పట్టణంలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ ను తెలంగాణ చీఫ్ రాపోలు సుదర్శన్ మాస్టర్ జిల్లా ఎగ్జామినర్ శంకర్ గౌడ్ మాస్టర్ జిల్లా చీఫ్ చందర్ మాస్టర్ ఎగ్జామినేటర్గా విద్యార్థులను పరీక్షించారు. ప్రతిభ కనబరిచిన సైఫ్ సంగమేశ్వర్ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ లో గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు సిద్ధంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సిద్దు మాస్టర్ సతీష్ గౌడ్. శ్వేత వారిని అభినందించడం జరిగింది

ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన.

ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద ప్రజల కొరకు ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఝరాసంగం మండలం లో గల కొల్లూరు,కక్కరవాడ,జోనవాడ,ప్యారవరం మరియూ లో గల వివిధ గ్రామాలలో ఈ రోజు ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది…ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం మండల అధికారి MPDO సుధాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ గారు,కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, నందు పాటిల్, యూత్ కాంగ్రెస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, లక్ష్మారెడ్డి,ఆలయ ఛైర్మన్ రాజేందర్, వీరన్న పాటిల్,నర్సింలు, విజయ్ కుమార్, ఎం విష్ణు, సి సుబాకర్, సి ప్రకాష్, సతీష్ గౌడ్,మాజీ సర్పంచ్ సిద్ధిరాములు, శ్రీశైలం,రమేష్, దేవదాస్, నర్సింలు మరియు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్ ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మరియు వివిధ పార్టీల మండల నాయకులు,సంఘనాయకులు, వివిధ గ్రామల ప్రజలు పాల్గోని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పనులకు శంఖుస్థాపన చెయ్యడం జరిగింది.

సిబ్బందికి జీతాలు చెల్లించాలి.

‘సిబ్బందికి జీతాలు చెల్లించాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి: జహీరాబాద్లోని 1962 పశుసంచార వాహన సేవల సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం జీతాలు చెల్లించాలని నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మూగ జీవాలకు వైద్య సేవలు అందిస్తున్న వీరికి సకాలంలో జీతాలు చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఎవర్రా ఆ కూత కూసింది! ఎక్కడ రా ‘‘రియల్‌ భూమ్‌ తగ్గింది!?

 

`కార్పోరేట్‌ బిల్డర్ల మాయాజాలం.

`రియల్‌ హల్‌ చల్‌..సామాన్యులు బెంబేల్‌.

`కొనాలనుకుంటే గుండె గుబేల్‌!

`రియల్‌ తగ్గిందన్న ప్రచారమంతా ఫేక్‌.

`రియల్‌ వ్యాపారులాడుతున్న నాటకం.

`గత ఏదాడితో పోలిస్తే పెరిగిన ధరలు.

`వ్యాపారం పడిపోయిందని దొంగేడుపులు.

`బడా కంపెనీలు ఎక్కడా రూపాయి తగ్గించింది లేదు.

`హైదరాబాద్‌లో సంపన్నులే ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి.

`ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి మరీ దీన స్థితి.

`అప్పార్టుమెంట్ల ధరలే ఆకాశాన్నంటుతున్నాయి.

`సొంత ఇల్లు కొనుగోలు చేయాలంటే మరో జన్మకు కూడా సాధ్యం కాదు.

`లక్ష ఇండ్లు ఖాళీ అనేది శుద్ధ అబద్దం.

`బ్యాంకర్లకు కుచ్చు టోపీ పెట్టే వ్యవహారం.

`హైదరాబాద్‌లో బిల్డర్లు వేలల్లో వున్నారు.

`వాళ్లు ఇస్తున్న ధరలకు కార్పొరేట్‌ కంపెనీలు ఇవ్వడం లేదు.

`మునిగిపోతున్నామంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.

`ఇతర బిల్డర్లు స్వేర్‌ ఫీట్‌కు రూ.6 వేలు చార్జ్‌ చేస్తున్నారు.

`కార్పొరేట్‌ బిల్డర్లు రూ. 20 వేలకు పైగా వసూలు చేస్తున్నారు.

`మధ్య తరగతి ప్రజలు కిరాయిలకు వుండలేరు. ఇల్లు కొనుక్కోలేరు.

`హైదరాబాద్‌లో పేక మేడల్లా పెరుగున్న బిల్డింగులు.

`ఆకాశాన్నంటుతున్న అప్పార్టుమెంట్ల ధరలు.

తెలంగానలో రియల్‌ వ్యాపారం కుదేలైందంటూ మొసలి కన్నీరు కారుస్తున్న వాళ్లుంతా జనం రక్తం మరిగిన వాళ్లే. అమ్మకాలు లేకుండా దివాళా తీస్తున్నామంటూ దొంగేడుపులు ఏడుస్తున్న వారంతా మోసగాళ్లే..అవును ఇది ముమ్మాటికీ నిజం. వ్యాపారం అంటే లాభాపేక్ష కోసమే చేసినా, కొంతైనా న్యాయంగా, ధర్మంగా చేయాలి. కాని ప్రజల నుంచి అడ్డగోలుగా వసూలు చేసి, రూపాయి విలువైన భూమిని వంద రూపాయలకు అంటగట్టినప్పుడు తెలియదా? ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని కోట్లకు కోట్లు, వందల వేల కోట వ్యాపారం చేసింది నిజంకాదా? రియల్‌ వ్యాపారం పేరుతో బ్యాంకులను నమ్మించి అప్పులు తీసుకున్నది నిజం కాదా? సామాన్య ప్రజలకు అందమైన బ్రోచర్లు చూపించి, అసలు ప్లాట్‌ ఎక్కడుందో చూపించకుండా వేధించిన సంస్ధలులేవా? ఇప్పటికీ రియల్‌ వ్యాపారలు వేసిన వెంచర్లలో తమ ప్లాట్‌ ఎక్కడుందో కూడ తెలియకుండా, లక్షలకు లక్షలు చెల్లించిన బాధితులు హైదరాబాద్‌ పరిసరాల్లోనే కొన్ని వేల మంది వున్నారు. చూపించిన ప్లాట్లనే వందల మందికి చూపించి, అమ్మిన ప్లాట్లనే పది మందికి అమ్మిన దొంగ వ్యాపారులేరా? ఏదో ఆగమైపోతున్నామంటూ లేనిపోని లెక్కలు చెప్పి ఇంకా ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు. బ్యాంకులను ముంచేద్దామని చూస్తున్నారా? వ్యాపారాలు పడిపోయాయి. నిర్మాణంలో వున్న ప్లాట్లు అమ్మకాలు జరడం లేదు. కట్టిన విల్లాల్లో గబ్బిలాలు చేరుతున్నాయంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఏ వ్యాపారమైనా సక్కగా చేస్తే ఏ నష్టం వుండదు. ఎక్కడా ఆగిపోదు. కాని రియల్‌ వ్యాపారం పేరుతో జనం సొమ్మును మంచినీళ్లలా తాగారు. జనం దగ్గర డబ్బులు లేకుండా చేశారు. భూమి మీద పెట్టుబడి పెడితే పదింతలౌతుందని నమ్మించారు. జనం చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేశారు. పది రూపాయలకు కొన్న భూమిని వెయ్యి రూపాయలకు అమ్మారు. ఆ వెయ్యి నుంచి మరిన్ని కొని లక్షకు అమ్మి కోట్లకు పడగలెత్తారు. చిన్న చిన్న కార్యాలయాల్లో అద్దెలకు రూంలు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టిన వాళ్లు ఎక్కడైనా కిరాయలు కడుతున్నారా? అంతస్దుల మీద అంతస్దులు కట్టి కార్యాలయాలు చేసుకున్నారు. వాటిని కూడా చూపించి మరింత జనాన్ని దోచుకుంటున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్‌ వ్యాపారం పడిపోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆ మధ్య ఓ బిఆర్‌ఎస్‌ నాయకుడే భహిరంగంగానే చెప్పాడు. రియల్‌ వ్యాపారులు ప్రభుత్వాన్ని దించేయమంటున్నారు. అవసరమైన సొమ్ము ఇస్తామని కూడా చెబుతున్నారని అన్నాడు. అంటే ప్రభుత్వాలనే మార్చేంత శక్తివంతులయ్యారు. ఒకప్పుడు అనామకులుగా వున్న వారు రియల్‌ పేరుతో కోట్లకు పడగలెత్తారు. ప్రభుత్వాలనే శాసించే స్ధాయికి చేరుకున్నారు. అయినా హైదరాబాద్‌లోనే కాదు, పరిసర ప్రాంతాలతోపాటు, తెలంగానలో ఎక్కడైనా సామాన్యుడు ఓ వంద గజాల స్దలం కొనుక్కునే పరిస్టితి వుందా? భూములన్నీ కొని, చేతుల్లో పెట్టుకొని అమ్ముపోతలేవు. వ్యాపారాలు సాగడం లేదంటూ మాట్లాడేవారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్లు కొన్నప్పుడు భూమి విలువ ఎంత? ఇప్పుడు రియల్‌ వ్యాపారులు పెంచి అమ్ముతున్న ధరలుఎంత? ఇప్పటికీ రియల్‌ వ్యాపారులు కొన్న ధరలకు సగం దరలు పెంచి అమ్మినా తెలంగాణలో ఎంతో మంది ఇంటి స్ధలాలు కొనుగోలు చేసుకునేందుకు సిద్దంగా వున్నారు. కాని సొంతింటి కలను అందని ద్రక్షను చేసేశారు. అమ్మకాలు లేవంటూ సొల్లు పురాణం చెబుతున్నారు. నిజంగా హైదరాబాద్‌లో రియల్‌ వ్యాపారం ఆగిపోతే ఎక్కడా నిర్మాణాలు జరగొద్దు.కాని నగరశివారుతోపాటు, ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు సాగుతూనే వున్నాయి. అంతస్దుల మీద అంతస్ధులు కడుతూనే వున్నారు. అవన్నీ ఎందుకు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు. ఎవరు కట్టమంటున్నారు? చిన్న చిన్న నిర్మాణ సంస్దలు నడిపేవారు మహా అయితే నాలుగైదు అంతస్ధులు మాత్రమే నిర్మాణం చేస్తున్నారు. కాని కార్పోరేట్‌ శక్తులుగా మారి, ఎకరం, రెండెకరాల్లో అంతస్ధుల మీద అంతస్ధులు పెంచుకుంటూ, ముప్పై, నలభై అంతస్ధులు నిర్మాణం చేస్తున్నారు. హైరేజ్‌ అప్పార్టుమెంట్లు అని కలరింగులిస్తున్నారు. వాటి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగముందా? రియల్‌ వ్యాపారులకు డబ్బులు సమకూర్చే ఏటిఎం మిషన్లుగా నిర్మాణాలు మారుతున్నాయి. తప్ప కొనుగోలు చేసిన వారు నానా కష్టాలు పడుతున్నారు. ఒకప్పటి కన్నా ఇప్పుడే స్ధలాలు కొనాలన్నా, ఇండ్లు కొనాలన్నా సామాన్యుడు భయపడుతున్నాడు. బెంబేలెత్తిపోతున్నాడు. భూముల ధరలు గతంకన్నా మరింత పెంచి, అమ్ముడయ్యే ఒక్కదాని మీదే లాభాలన్నీ వచ్చేలా అమ్మకాలు సాగిస్తున్నారు. పైగా అమ్మకాలులేవని నాటకాలాడుతున్నారు. సామాన్యుడు హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కునే పరిస్దితి వుందా? రియల్‌ వ్యాపారం తగ్గిందని అంటున్నమాటల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆ ప్రచారమంతా ఫేక్‌ అని కూడాతెలుస్తోంది. గత ఏడాదితో పోలీస్తే ధరలు పెరిగాయే తప్ప ఎక్కడా తగ్గలేదు. కాకపోతే అమ్మకాలు తగ్గివుండొచ్చు. అయినా రియల్‌ వ్యాపారులకు వచ్చిన నష్టమేమీ లేదు. ఈ ఏడాది రియల్‌ వ్యాపారులు చాల మంది అత్యంత ఖరీదైన కార్లు కొన్నట్లు ఒక సర్వేలో తేలింది. వ్యాపారమే ఒడిదొడుకులు వున్నప్పుడు ఖరీదైన కార్లు ఏ వ్యాపారికొనుగోలు చేయడు. కాని ఒక్క హైదరాబాద్‌లోనే కొన్ని వందల ఖరీదైన కార్లు రియల్‌ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు లెక్కలున్నాయి. బడా కంపనీలు ఎక్కడా ఒక్క రూపాయ తగ్గించినట్లు దాఖలాలు లేవు. కొన్ని చిన్న కంపనీలు ఇస్తున్న ధరలకు, కార్పోరేట్‌ సంస్దలు ఇస్తున్న ధరలను పోల్చి చూస్తే, వ్యాపారం ఎక్కడా దిగిజారినట్లు లేదు. అవే ప్రాంతాలు. అక్కడే స్ధలాలు. అయినా చిన్న చిన్న కంపనీలకు, కార్పోరేట్‌ సంస్దల నిర్మాణాలలో వ్యత్యాసం ఎందుకుంటోంది. పైగా చిన్న చిన్న వ్యాపారులు నిర్మాణాలు చేసే అప్పార్టుమెంట్లలో స్ధలం కూడా ఎంతో ఎక్కువ వస్తుంది. అదే కార్పోరేట్‌ సంస్ధలు నిర్మాణం చేసే అప్పార్టుమెంట్లలో ధరలు ఎక్కువే. భవిష్యత్తులో వచ్చే స్ధలం చిన్నదే. అంటే ఏ రకంగా చూసినా కార్పోరేట్‌ సంస్ధలు చేసే నిర్మాణాల వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం వుండదు. ఇక హైదరాబాద్‌ నగరంలో ఉద్యోగం చేసే సామాన్యులకు ఇల్లు కొనుగోలు అనేది జీవితంలో జరిగే పని కాదు. నెలకు కనీసం ఓ రెండు లక్షల రూపాయల జీతం చేసే వారికి కూడా కొనడం భారమే. ఇక నెలకు రూ.30, 40 వేలు సంపాదించుకునేవారికి కిరాయలు కూడా చెల్లించడం కష్టంగానే మారుతోంది. జూబ్లీహిల్స్‌లో ఒకప్పుడు సీనియర్‌ ఎన్టీఆర్‌ లాంటి వారితోపాటు, సినీ రంగానికి చెందిన వాళ్లంతా రూ.10 రూపాయలకు గజం చొప్పున కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు అదే జూబ్లిహిల్స్‌ గజం ధర కనీసం 3లక్షల రూపాయలుగా అమ్మకాలు సాగుతున్నాయి. అసలు సంసన్నులే హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలుచేసుకోలేని స్ధితికి రియల్‌ వ్యాపారులు తెచ్చారు. ప్రైవేటు ఉద్యోగుల పరిసి ్ధతి మరీ దారుణమనే చెప్పాలి. అప్పార్టు మెంట్ల ధరలే ఆకాశాన్నంటుతున్నాయి. ఇదంతా కార్పోరేట్‌ వ్యాపారుల మాయా జాలం. ఎందుకంటే ప్రభుత్వ ధరలకు, వ్యాపారులు చెప్పే ధరలకు ఎక్కడా పోలిక లేదు. కోట్ల రూపాయలు తీసుకుంటూ ప్రబుత్వ ధరలకు టాక్స్‌లు చెల్లిస్తున్నారు. జనం సొమ్ముతోనే కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నారు. అటు ప్రజలను , ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. పేకమేడలు ఎన్ని పెరిగినా అక్కరకు రావు. సామాన్యులకు అందుబాటులో ఇల్లు లేనప్పుడు కొనుక్కునేవాడు కూడా కరువౌతారు. అంతే కాని వ్యాపారాలు ఏమీ ఆగలేదు. ధరలు తగ్గించడానికి వ్యాపారులు సిద్దంగా లేరు. కొనుగోలు చేసేంత శక్తి సామార్దాలు ప్రజల వద్ద లేదు.

కేరళలో కమల వికాసానికి బీడీజేఎస్‌ అడ్డంకి?

`బీజేపీ సొంత ప్రయత్నాలు చేసుకుంటేనే మేలు

`బీడీజేఎస్‌తో పొత్తు వల్ల ప్రయోజనం శూన్యం

`కమ్యూనిస్టులను ఎదుర్కోవాలంటే వ్యూహం మార్చక తప్పదు

`వచ్చే పంచాయతీ ఎన్నికల్లో గెలవాలంటే చెమటోడ్చక తప్పదు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పరశురాముడు నడయాడిన నేల కేరళ. దేవభూమిగా చెప్పుకునే ఈ రాష్ట్రంలో సనాతనధర్మం, హిందూత్వ సిద్ధాంతంతో భాజపా ఎందుకని చొచ్చుకొని లేకపోతున్నదని ప్రశ్నిస్తే అనేక కారణాలు చెప్పవచ్చు. ముఖ్యంగా వామపక్ష భావజాలం ప్రజల్లో బలీయంగా నాటుకొనివుండటం ఒకవైపు కాగా మరోవైపు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడీఎఫ్‌ కూటమి కూడా బలమైన పునాదులు కలిగివుండటమన్నది సాధారణంగా చెప్పే కారణం. మరో విషయమేంటంటే రాష్ట్రంలో క్రైస్తవులు, ముస్లింల జనాభా అధికంగా వుండటం, వీరిలో క్రైస్తవులు కాంగ్రెస్‌కు, ముస్లింలు వామపక్ష కూటమికి గట్టి మద్దతుదార్లుగా వుండటంతో బీజేపీ రాష్ట్రంలో వేళ్లూనుకోలేకపోతున్నదనేది సాధారణవిశ్లేషణ. వీటితోపాటు పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు కూడా విస్తరణను అడ్డుకుంటున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు. ఇదిలావుండగా రాబోయే ఏడాదికాలం లోగా బీజేపీ కేరళలో ఎన్నికల పరంగా రెండు పరీక్షలను ఎదుర్కోబోతున్నది. మొదటిది వచ్చే డిసెంబర్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు కాగా, వచ్చే ఏడాది ఎండాకాలంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు ఎన్నికల్లో గట్టి ప్రభావశీలక పనితీరు ప్రదర్శించకపోతే, రానున్న కాలంలో పార్టీ విస్తరణఅవకాశాలు దెబ్బతినే ప్రమాదం వుంది. ప్రస్తుతం బీజేపీకి కేరళలో భారత ధర్మ జనసేన(బీడీజేఎస్‌) భాగస్వామిగా కొనసాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో (2024) ఈ రెండు పార్టీలు కలిపి రాష్ట్రంలో 19శాతం ఓట్లు సాధించాయి. ఇదే ఎన్నికల్లో త్రిస్సూర్‌ పార్లమెంట్‌ స్థానాన్ని గె లుచు కుంది కూడా. రాష్ట్రంలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో ఈ రెండు పార్టీలు గత ఎన్నికలకంటే కొంత మెరుగైన పరితీరు ప్రదర్శించిన మాట వాస్తవం. ఇదే సమయంలో అట్టింగళ్‌, అలప్పుజా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ మూడోస్థానంలో వుండటం గమనార్హం. ఇందుకు మురళీధరన్‌, బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ శోభా సురేంద్రన్‌ల ప్రచార సరళే కారణ మని చెప్పక తప్పదు. ఇదే లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో 19 కాంగ్రెస్‌ కూటమివిజయం సాధించగా, కమ్యూనిస్టుల కూటమి కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల కృషి కారణంగా ఆరు సెగ్మెంట్లలో పార్టీకి 40శాతం ఓట్లు పోలవడం గమనార్హం. ఇక నిమమ్‌ సెగ్మెంట్‌లో ఏకంగా 45శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. మ రో 17 సెగ్మెంట్లలో 30శాతం వరకు ఓట్లు సంపాదించుకోగలిగింది. కాంగ్రెస్‌ వృద్ధనేత రమేష్‌ చెన్నితలకు కంచుకోటగా పరిగణించే హరిపాడ్‌ సెగ్మెంట్‌లో బీజేపీ సహచరి బీడీజేఎస్‌ వెయ్యి ఓట్ల లీడ్‌ సాధించింది. అయితే ఈస్థానాన్ని గతంలో బీజేపీ గెలుచుకుందన్న విషయం మరువరా దు. మరో 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో 25శాతం ఓట్లు బీజేపీకి అనుకూలంగా పోలవడం, లెఫ్ట్‌ రమరియు కాంగ్రెస్‌ కూటములను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సీట్లు గెలుచుకోకపోయినా క్రమం గా రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నదనడానికి ఇవి సంకేతం. గతంతో పోలిస్తే పార్టీ కొంత సానుకూల స్థితికి చేరుకునేదిశగా అడుగులు పడుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. సరిగ్గా ఇదేసమ యంలో నూతన బీజేపీ సారథిగా రాజీవ్‌ చంద్రశేఖర్‌ను రాష్ట్ర రథసారథిగా పార్టీ నియమించడంగమనార్హం. ఇదిలావుండగా పార్టీకి మద్దతుగా వున్న బీడీజెఎస్‌ పనితీరు నిరాశాజనకంగా వుండటాన్ని ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం. 

గత లోక్‌సభ ఎన్నికల్లో చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీడీజేఎస్‌ ఓట్లశాతం సింగిల్‌ డిజిట్‌ను మించకపోవడం నిరాశను కలిగిస్తోంది. అదీకాకుండా ఆయా సెగ్మెంట్లలో పోలైన ఓట్లశాతం బీజేపీకిస్థానికంగా వున్న బలం వల్ల వచ్చినవేనని కూడా విశ్లేషణలో తేలింది. ఉదాహరణకు కయాంకు లం అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీడీజేఎస్‌ అభ్యర్థికి 33శాతం ఓట్లు పోలయ్యాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి పోలయిన ఓట్లు 26శాతం! అంటే ఇక్కడ బీడీజేఎస్‌ అభ్యర్థికి ఈమాత్రం ఓట్లు పోలయ్యాయంటే అందుకు బీజేపీకి స్థానికంగా వున్న బలమే కారణమన్నది స్పష్టమైంది. నిజానికి బీడీజేఎస్‌ 2015లో ఏర్పాటైంది. శ్రీ నారాయణ ధర్మపరిపాలన యోగం (ఎస్‌ఎన్‌డీపీ) కు రాజకీయ విభాగంగా, ఎజవా ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ)ను కూడగట్టే లక్ష్యంతో వెల్లప్పల్లి నటేషన్‌ నాయకత్వంలో ఇది ఆవిర్భవించింది. కమ్యూనిస్టులకు కంచుకోటగా వున్న ఎజవావర్గం ప్రజల ఓట్లను ఆకర్షించడం దీని ఏర్పాటు లక్ష్యం. ఇదే సమయంలో ఎజవా వర్గాల్లో క మ్యూనిస్టు కార్యకర్తల హింసాత్మక దాడులనుంచి రక్షణగా వుంటుందన్న లక్ష్యంతో కూడా ఈ బీడీజేఎస్‌తో భాజపా జతకట్టింది. లక్ష్యం ఏదైనా ఓట్ల విషయానికి వచ్చేసరికి ఎజవా వర్గంవారు కమ్యూనిస్టులకే సానుకూలంగా వ్యవహరించడంతో బీడీజేఎస్‌ నుంచి ఆశించిన ప్రయోజనాన్ని బీజేపీ పొందలేకపోయింది. ఎన్నికల్లో ఎజవా వర్గం ఓట్లు ఎన్నికల్లో అత్యంత కీలకం. ఈ వర్గా ల్లో ప్రాబల్యం పెంచుకోవడానికి బీడీజేఎస్‌తో కలిసి పనిచేయడం బీజేపీకి కలిసిరాలేదు. అదీకా కుండా ఎజవా వర్గ ప్రజల్లోకి తనకై తాను చొచ్చుకొని వెళ్లాలంటే బీడీజేఎస్‌ పెద్ద అడ్డంకిగా మారింది. అట్లాగని కమ్యూనిస్టు కార్యకర్తల దాడులు ఆగాయా అంటే అదీలేదు. ఈ నేపథ్యంలో బీడీజేఎస్‌ భాజపా ఎదుగుదలకు ఒక గుదిబండలా మారుతోందనేది క్రమంగా వెల్లడవుతున్న సత్యం. అదీకాకుండా ఈ వర్గాల్లో ఎస్‌ఎన్‌డీపీ, కమ్యూనిస్టు కార్యకర్తల మధ్య తరచుగా జరిగే సంఘర్ష ణలు బీజేపీ విస్తరణకు ప్రధాన అవరోధంగా మారాయి. ఈ సంఘర్షణలు ఎంతమాత్రం వాంఛనీయం కావనేదీ బీజేపీ నాయకత్వ ఉద్దేశమైనా, స్థానిక రాజకీయ పరిస్థితులు, మార్క్సిస్టుల దా డులు, స్వీయరక్షణకోసం ప్రతిఘటించక తప్పని పరిస్థితులున్నాయి. ప్రస్తుతం మార్క్సిస్టు కార్యకర్తల దాడులనుంచి రక్షణకోసం బీడీజేఎస్‌పై ఆధారపడుతున్నప్పటికీ, భాజపా తనకు తాను ఎజవా వర్గ ప్రజల్లో పలుకుబడిని పెంచుకోవాలంటే మరో తోవను ఎంచుకోక తప్పదు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్‌లో సరిగ్గా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో, దీన్ని ఎదుర్కొనేందుకు భాజపాఅక్కడ తనకంటూ ఒక వ్యూహాన్ని అమలు చేసింది. అదేమాదిగా ఇక్కడ కూడా వ్యవహరించకపోతే తన ఉనికిని విస్తరించుకోవడం కష్టం కాగలదు. అట్లాగని ఎజవా వర్గాల్లో విస్తరించే ప్రయ త్నాలను కమ్యూనిస్టులు చూస్తూ ఊరుకుంటారనుకోవడం కూడా భ్రమే. అయితే ఇక్కడ గుర్తుం చుకోవాల్సిన అంశమేంటంటే బీజేపీ`బీడీజేఎస్‌ కూటమిగా వుండటం పార్టీ ఎదుగుదలను దెబ్బతీస్తున్నదనేది తిరుగులేని సత్యం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎస్సీ/ఎస్టీలకు రిజర్వ్‌ అయిన 14 అసెంబ్లీ స్థానాల్లో సీపీఎంకు తిరుగులేని ఆధిపత్యం వుంది. ఎట్లా అంటే, మహారాష్ట్రలో బీజేపీ`శివసేన కూటమిగా కొనసాగినంత కాలం మరాఠా ఓట్లను కోల్పోయారు. ఎప్పుడైతే విడిపోయారో అప్పుడు బీజేపీకి ఈ వర్గాల్లోకి చొచ్చుకెళ్లడానికి వీలైంది. అదేవిధంగా బీడీజేఎస్‌నుంచి విడిపోతే భాజపా సొంతంగా ఈ వర్గ ప్రజల్లో తన పలుకుబడి పెంచుకోవచ్చనేది ఒక విశ్లేషణ. ఇక్కడ ‘కులాలకతీతంగా’ అనే భావన ప్రతికూల ప్రభావానే చూపుతుంది తప్ప సానుకూల ఓట్లను రా ల్చదనేది సుస్పష్టం. 

ప్రస్తుతం ఎజవా కమ్యూనిటీలు అధికంగా వున్న ప్రాంతాల్లో ‘ఉద్రిక్త శాంతి’ కొనసాగుతున్నదంటే, ఇక్కడ బీజేపీ విస్తరణకు తన ప్రయత్నాలకు తాత్కాలిక విరామం ఇవ్వడమే. గత మార్చి 25 నుంచి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పార్టీ సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు. ఆయనకు ముందు పనిచేసినసురేంద్రన్‌ పార్టీ పాలనా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లా ను పాలనాపరంగా రెండుగా విభజించారు. బూత్‌ స్థాయివరకు సమన్వయ సహకారాలు కొనసా గేలా చర్యలు తీసుకున్నారు. రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇప్పటివరకు ఆయా జిల్లాల నాయకత్వాలతో రెండుసార్లు చర్చలు జరిపారు. ఇదే సమయంలో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. యాప్‌ ఆధారంగా నిర్వహించిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేవలం రెండు నెలల కాలంలో అప్పటివరకు 19వేలుగా వున్న సభ్యత్వం ఏకంగా లక్ష దాటింది!

ఇప్పుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రధానంగా వచ్చే డిసెంబర్‌లో జరిగే పంచాయతీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకరిని అదేవిధంగా ప్రతి పట్టణ మున్సిపల్‌ వార్డుకు ఒకరిని చొప్పున ఇన్‌చార్జ్‌ నియామకాలు పూర్తిచేశారు. ‘వికసిత కేరళం’ కింద జిల్లాలో ఐదుగురితో కూడిన ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ అన్ని స్థాయిల్లో మరింత బలోపేతంగా పనిచేసేందుకు వీలుగా చేసిన సంస్థాగత ఏర్పాటిది. అయితే రాష్ట్రస్థాయిలో ఆర్గనైజేషనల్‌ సెక్రటరీ పోస్టు ఇంకా ఖాళీగానే వుంది. ఇదే సమయంలో మధ్యస్థాయి పోస్టులు కూడా చాలావరకు బర్తీ కాలేదు. ఉన్నతస్థాయి, క్షేత్రస్థాయి నాయకత్వాల మధ్య ప్రథానమైన అనుసంధానాన్ని ఏర్పచ డంలో ఇవి కీలకం. ఈ నియామకాల్లో జాప్యం జరిగేకొద్దీ పార్టీలో గ్రూపులు, రాజకీయాలు మరింత బలోపేతమవుతాయి. అందువల్ల ఈ పోస్టులు భర్తీ చేయకపోవడం పార్టీకి ఒక శాపం వంటిదనే చెప్పాలి. గ్రూపు రాజకీయాలు ఎదగడానికి యత్నిస్తున్న పార్టీకి ఎంతమాత్రం మంచిది కాదు. ఈ గ్రూపురాజకీయాలు పెచ్చరిల్లితే రాజీవ్‌ చంద్రశేఖర్‌ వాటిని అరికట్టడంతో పరిమిత పా త్రనే పోషించగలరు తప్ప పూర్తిస్థాయిలో నియంత్రించలేరు. ఎందుకంటే ప్రస్తుతం పార్టీని ఏకతాటిపై నడిపించే సామర్థ్యమున్న రాష్ట్రస్థాయి నాయకుడు అత్యంత అవసరం. కొన్ని దశాబ్దాల క్రితం కె.జి.మారర్‌ ఆవిధంగా పార్టీని నియంత్రించగలిగారు. అటువంటి నాయకత్వం ఇప్పుడు పార్టీకి అత్యవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత బలంగా వున్న సీపీఐఎం మాదిరిగానే సంస్థాగతంగా పార్టీ అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత విధానాల్లో కొన్ని మార్పులు తీసుకొనిరాక తప్పదు. వీటితో పాటు రాష్ట్రంలో అధికార కూటమికి అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే యంత్రాంగం ఇప్పుడు పార్టీకి అవసరం. బాహ్య సమస్యలను ఎదుర్కోవడానికి, అంతర్గత సమస్యల పరిష్కారానికి, పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతం కావడానికి నిధులు కూడా అవసరమే. ఇన్ని సమస్యలను అధిగమించి రానున్న పంచాయతీ ఎన్నికల్లో మంచి పనితీరు ప్రదర్శించాలంటే చమటోడ్చక తప్పదు!

ఆంజనేయస్వామి నూతన దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన

ఆంజనేయస్వామి నూతన దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవo.

కల్వకుర్తి/నేటి ధాత్రి:

 

కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో గురువారం ఆంజనేయస్వామి నూతన దేవాలయంలో విగ్రహప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి దేవాలయంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని,స్వామి వారి తీర్ధప్రసాదాలు స్వీకరించి,స్వామి వార్ల ఆశీస్సులతో గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది…ఈసందర్భంగా
ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు మాట్లాడుతూ…తమ గ్రామంలో ఆంజనేయ స్వామి నూతన దేవాలయ నిర్మాణంలో బాగంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కలిసిన వెంటనే దేవాలయానికి తన వంతు సహకారంగా దాదాపు రూ.5,00,000/-(ఐదు లక్షలతో) పెయింటింగ్ పనులు పూర్తి చేసి దేవాలయ అభివృద్ధికి సహకారం అందించినందుకు గ్రామస్తులందరి తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించడం జరిగింది..ఈ కార్యక్రమంలో…గ్రామ మాజీ సర్పంచ్ పి.లింగారెడ్డి, సీనియర్ నాయకులు అల్వాల్ రెడ్డి బన్నె శ్రీధర్,పి.పరమేశ్వర్, ఎల్.తిరుపతయ్య, ఎల్.లాలయ్య, జి.బాలస్వామి,లింగం శ్రీను,బన్నె శ్రీను,బన్నె మల్లయ్య,ఎం.బుచ్చిరెడ్డి లతో పాటు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

రైతులు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి

భూపాలపల్లి నేటిధాత్రి : 

 

భూపాలపల్లి రూరల్ మండలం నేరేడుపల్లి గ్రామంలో తాసిల్దార్ శ్రీనివాస్ భూభారతి రెవెన్యూ అవగాహన న సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 3 నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ అవగాహన సదస్సు నిర్వహిస్తా ప్రజలు తమ భూమికి సంబంధించిన దరఖాస్తు ఇవ్వాలని సూచించారు ప్రతి దరఖాస్తుదారుడు లెక్క పక్కగా ఉండేటందుకు రిజిస్ట్రేషన్ లో నమోదు చేస్తాం అని వారు అన్నారు నేరేడుపల్లి గ్రామంలో మొత్తం 363 దరఖాస్తులు వచ్చాయి వాటిని పరీక్షిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రామస్వామి ఏఎస్ ఓ విజయ్ కుమార్ టైపిస్ట్ రాజు రాజ్యలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు

ఇండ్ల స్థలాల భూమి అక్రమ పట్టాకు గురైంది

ఇండ్ల స్థలాల భూమి అక్రమ పట్టాకు గురైంది
జమ్మికుంట: నేటిధాత్రి

– భూ భారతి సదస్సులో దళిత కాలనీ వాసులు ఫిర్యాదు
– ధరణి మా దళితుల బ్రతుకులు దరిద్రంగా మార్చిందని ఆవేదన
– తిరిగి తమ భూమి తమ కాలనీ పేరు మీద పట్టా చేయాలని విజ్ఞప్తి

జమ్మికుంట మండలం,తనుగుల గ్రామం:-

మా మూడు వందల కుటుంబాల ఇండ్ల స్థలాల పట్టా భూమి,అక్రమ పట్టాకు గురైందని,వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని,గురువారము దళిత కాలనీ వాసులు గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భారతి సదస్సులో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా దళిత కాలనీవాసులు మాట్లాడుతూ…తమకు గ్రామ శివారులో సర్వే నెంబర్ 169/a లో 2.31 గుంటల ఇండ్ల స్థలాల పట్టా భూమి కలదని దానిని తమ గ్రామానికి చెందిన నిమ్మకాయల నర్సయ్య తండ్రి మల్లయ్య అక్రమ పత్రాల సృష్టించి గ్రామ పంచాయతీ ధృవీకరణ పత్రం ఆధారంతో ధరణిలో అక్రమ పట్టా చేసుకున్నాడని తెలిపారు.ధరణితో మా దళిత కుటుంబాల బ్రతుకులు దరిద్రంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై తాము గత మూడు సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ పట్టా చేసుకున్న నిమ్మకాయల నర్సయ్య తండ్రి మల్లయ్య పేరును,భూ రికార్డుల నుంచి తొలగించి,తిరిగి తమ దళిత కాలనీ పేరు మీద పట్టా మార్పిడి చేయాలని వేడుకున్నారు.

ప్రజా ప్రభుత్వం..తెలంగాణ రైతుకు వరం.

-మంత్రి ‘‘ఉత్తమ్‌’’ పర్యవేక్షణ.. కమీషనర్‌ ‘‘చౌహాన్‌’’ కార్యదక్షత.

-మిల్లర్‌ నుంచి వసూలు చేస్తున్న ఖమ్మం జేసికి ప్రశంసలు!

-జిల్లా అధికారులతో పాటు, కమీషనర్‌ చౌహాన్‌ను రైతులు ప్రశంసిస్తున్నారు.

-అధికారులు స్పందిస్తే మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు వసూలు?

-అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ రైతు మోసపోడు.

-అధికారులకు ప్రభుత్వ స్వేచ్ఛ..తప్పు చేసే మిల్లర్లకు తప్పదు శిక్ష.

-ఒక్క బస్తా మోసానికి పాల్పడినా మిల్లర్‌ నుంచి రికవరీ..

-వరి పండిరచే రైతులకు ఇక నుంచి లేదు వర్రీ.

-మిల్లర్‌ నుంచి ముక్కు పిండి వసూలు… రైతుల ఖాతాలో పైసలు.

-2 వేల బస్తాలు మింగిన మిల్లర్‌ జగన్‌కు చుక్కలు..

-టోపి పెట్టాలనుకున్న మిల్లర్‌…తాట తీసిన ఆఫీసర్‌.

-మరో సారి జగన్‌ మోసం బైట పడిరది!

-‘‘నేటిధాత్రి’’ ముందే పసిగట్టి చెప్పింది.

-రెండు వేల వడ్ల బస్తాల స్వాహా వెలుగులోకి వచ్చింది?

-అధికారులను గుప్పిట్లో పెట్టుకొని 50 లారీలు మళ్లించుకున్నాడు.

-2 వేల బస్తాలు కన్నం పెట్టాడు.

-ఖమ్మం జేసి వ్యూహం హన్మకొండ జిల్లా అధికారులు పసి గట్టలేకపోయారు.

-ప్రతి బస్తా మీద వడ్ల లెక్క రాయించారు.

-అది గమనించలేక హన్మకొండ అధికారులు బోల్తా పడ్డారు.

-మిల్లర్‌ జగన్‌ మోసం వెలుగులోకి వచ్చింది.

-దేశంలోనే ఇది మొదటి సారి అని అంటున్నారు.

-రైతులను వందల కోట్లు ముంచిన మిల్లర్లు?

-రైతులను నిలువుగా మిల్లర్‌ ముంచాలని చూశాడు.

-అధికారులు అప్రమత్తమై రికవరీ చేయిస్తున్నారు.

-ఖమ్మం జిల్లా అధికారుల బేష్‌.

-అన్ని జిల్లాల అధికారులకు ఆదర్శం.

-రైతుల వద్ద కోసిన వడ్లతో కోట్లు కూడబెట్టుకుంటున్నారు.

-ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో వేల బస్తాలు మాయం చేస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే ప్రజలకు మేలైన, మెరుగైన పనులు చేయొచ్చని తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిరూపించింది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన కొంత మంది అక్రమ మిల్లర్లు ఆడిరది ఆట పాడిరది పాట అయ్యింది. గత ప్రభుత్వ పెద్దలు కళ్లు చూసుకోవడం వల్ల మిల్లర్లు కొందరు రైతులను విపరీతంగా మోసం చేసే వారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే వారు. రైతులకు చెందాల్సిన సొమ్మును తమ ఖాతాల్లో వేసుకునే వారు. రైతుల గోస పుచ్చుకునే వారు. ఆ సమయంలో మిల్లర్లు చెప్పిందే వేదమన్నట్లు చేసే వారు. అప్పటి ప్రభుత్వం ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి మూలంగా రైతులు ఎంతో నష్టపోయే వారు. యధా రాజ, తదా ప్రజా అన్నట్లు అధికారులు మేమేం తక్కువ అన్నట్లు మిల్లర్లకే సాయపడేవారు. వారు కూడా రైతులను దోచుకునేందుకు పరోక్షంగా సహకరించే వారు. రైతుల ఆందోళన అరణ్య రోదనయ్యేది. పట్టించుకునే వారు కాదు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కూడా గత పాలకుల కాలంలో జరిగింది. కానీ ఇకపై మిల్లర్ల ఆట కట్‌ అనే విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు రూపాయి కూడా మోసానికి గురి కాకుండా చూసుకునే పరిస్థితి తెస్తున్నారు. సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్తి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆ శాఖ కమీషనర్‌ చౌహాన్‌ తీసుకుంటున్న చర్యల మూలంగా రైతులకు భవిష్యత్తులో నష్టం వాటిల్లకుండా చూసే రోజులు రాబోతున్నాయి. ఇది ఎంతైనా తెలంగాణ రైతుకు వరమనే చెప్పాలి. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పర్యవేక్షణతో కమీషనర్‌ చౌహాన్‌ కార్యదక్షతతో కూడుకున్న చర్యల వల్ల ఖమ్మం జిల్లా రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఏర్పడిరది. గతంలో ప్రభుత్వ పెద్దల ఆలోచనలు, అధికారులను కూడా తప్పు దోవ పట్టించేలా వుండేవి. పైకి మాత్రం రైతులకు ఎంతో మేలు చేస్తున్నట్లు ప్రకటనలు చేసే వారు. చేతులు దులుపుకునే వారు. దాంతో రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకునే వారు అసలే కాదు. నేటిధాత్రి లాంటి మీడియాలో ఎన్ని కథనాలు రాసినా పట్టించుకునే వారు కాదు. స్పందించే విధానం వుండేది కాదు. ఇక రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తినప్పుడు మాత్రం నామ మాత్రపు స్పందన కనబర్చినట్లు నటించే వారు. అంతకు మించి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వాలు ఆ బాధ్యతలు పూర్తి స్థాయిలో అధికారులకు అప్పగించి, ఎలాంటి అవకతవకలు జరగొద్దని చెప్పడం గతంలో చూడలేదు. కానీ ప్రజా ప్రభుత్వం వడ్ల సేకరణలో అధికారులకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు. అది ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తన కర్తవ్యాన్ని అంకిత భావంతో అమలు చేశారు. ఒక్క బస్తా మోసానికి పాల్పడినా మిల్లర్‌ నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగా చర్యలు మొదలుపెట్టారు. తప్పు చేసిన మిల్లర్‌ కు చుక్కలు చూపిస్తున్నాడు. వరి పండిరచే రైతులకు ఇక నుంచి లేదు వర్రీ వుండాల్సిన అవసరం లేకుండా చూస్తున్నారు. అయితే ఆ కధ ఏమిటో తెలియాలి. ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వడ్లు హన్మకొండ జిల్లాలో వున్న కొన్ని మిల్లులకు జాయింట్‌ కలెక్టర్‌ సిఫారసు చేశారు. వాటిని ఖమ్మం జేసి సూచించిన విధంగా ఎంపిక చేసిన మిల్లర్లకు చేరలేదు. మధ్యలో హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఓ మిల్లర్‌ కు కొమ్ము కాసే పని పెట్టుకున్నారు. ఖమ్మం నుంచి వచ్చిన 50 లారీల వడ్లను జగన్‌ అనే మిల్లర్‌ కు మళ్లించారు. నిజానికి చెందాల్సిన మిల్లర్లకు చెందకుండా చేశారు. అధికారుల అండతో జగన్‌ అనే మిల్లర్‌ ఆ వడ్ల నుంచి ఏకంగా 2 వేల బస్తాలు మింగేశాడు. తప్పుడు లెక్కలు సృష్టించాడు. బస్తాకు కోసే వడ్ల విషయంలో తన ఇష్టానుసారం వ్యవహరించాడు. ఈ విషయం తెలిసిన ఖమ్మం జేసి సదరు మిల్లర్‌ జగన్‌కు చెందిన మిల్లులకు నోటీసులు జారీ చేశారు. ఓ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వార్తా కథనం నేటిధాత్రి మిల్లులకు ప్రచురించింది. అది ఖమ్మం జిల్లా జేసికి చేరింది. అంటే వెంటనే స్పందించారు. నివేదిక తెప్పించుకున్నారు. మిల్లర్‌ చేసిన మోసం పసిగట్టారు. రెండు వేల బస్తాలకు సంబంధించిన సొమ్ము కక్కాల్సిందే అని నోటీస్‌ జారీ చేశారు. ఇది సివిల్‌ సప్లయ్‌ శాఖ చరిత్రలోనే మొదటి సారి అంటున్నారు. గతంలో ఇలా స్పందించిన అధికారి ఎవరూ లేరని ప్రశంసిస్తున్నారు. రైతులకు ఎంతో ఊరట కలిగించడమే కాదు, మోసపోయిన సొమ్ము కూడా రైతుల ఖాతాలలో వేసేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి, రైతుల కష్టానికి టోపి పెట్టాలనుకున్న మిల్లర్‌ తాట తీసే పని ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ పెట్టుకున్నాడు. ఒక మిల్లర్‌ ప్రభుత్వం కళ్లు గప్పి, రైతులను మోసం చేసి, రెండు వేల వడ్ల బస్తాల స్వాహా చేయడం సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వ్యూహం హన్మకొండ జిల్లా అధికారులు పసి గట్టలేకపోయారు. ఏ పనైనా తూతూ మంత్రంగా చేసే అలవాటు హన్మకొండ అధికారులకు వుంది. లారీలు వచ్చాయా? వాటిని తమకు అనుకూలమైన మిల్లర్‌ జగన్‌కు అందించామా! లేదా!! అనేదే చూసుకున్నారు. కానీ బస్తాలపై వున్న మర్మం కనిపెట్ట లేకపోయారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎంతో తెలివిగా ప్రతి బస్తా మీద వడ్ల లెక్క రాయించారు. అది గమనించలేక హన్మకొండ అధికారులు బోల్తా పడ్డారు. ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. మొదటి నుంచి నేటిధాత్రి ఈ విషయం చెబుతూనే వుంది. అధికారులను హెచ్చరిస్తూనే వుంది. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులు నేటిధాత్రి అందిస్తున్న వార్తలను పెడ చెవిన పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో సాగినట్లే ఇప్పుడూ సాగుతుందనుకున్నారు. పదేళ్లు తిష్ట వేసుకొని తినడం అధికారులకు అలవాటైంది. రైతులను మోసం చేయడం మిల్లర్లకు సామాన్యమైపోయింది. రైతుల నెత్తిన కోత శఠగోపం పెట్టడం నిండా ముంచడం బాగా అలవాటైపోయింది. అదే ధోరణి విచ్చలవిడిగా సాగుతోంది. మమ్మల్ని అడిగేవారు ఎవరు? పట్టించుకునే వారు ఎవరు? నేటిధాత్రి రాస్తూనే వుంటుంది. అదంతా కామనే అనుకున్నారు. కానీ ఖమ్మం జిల్లా జేసి ఇచ్చిన రaలక్‌తో ఒక్క సారిగా హన్మకొండ సివిల్‌ సప్లయ్‌ అధికారుల్లో కూడా రైళ్లు పరిగెత్తే పరిస్థితి వచ్చింది. నిజానికి ఉన్నత స్థాయిలో వున్న అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఫలితాలు ఇంత అద్భుతంగా వుంటాయి. ప్రజలకు మేలు చేసేలా వుంటాయి. అని నిరూపనైంది. జిల్లా అధికారులతో పాటు, కమీషనర్‌ చౌహాన్‌ను రైతులు ప్రశంసిస్తున్నారు. అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ రైతు మోసపోడు. ఇలాంటి వ్యవహారాలు అన్ని జిల్లాలలోనూ సాగుతున్నాయి. అన్ని జిల్లాల అధికారులు ఖమ్మం జిల్లా అధికారులను ఆదర్శంగా తీసుకుంటే ఏ మిల్లర్‌ మోసానికి పాల్పడలేడు. రైతుల సొమ్ము అప్పనంగా దోచుకునే వెలుసుబాటు అసలే వుండదు. రైతులను కొట్టి కోట్లు మింగాలనుకుంటున్న మిల్లర్లు తప్పులు చేయడానికి అసలు ఆస్కారం వుండదు. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా రైతులను వందల కోట్లు ముంచుతూనే వున్నారు మిల్లర్లు. వారికి సహకరిస్తూనే వున్నారు అధికారులు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు వసూలు? జరగడం ఖాయం. ఈ ఖమ్మం జిల్లా అధికారుల బేష్‌. అన్ని జిల్లాల అధికారులకు ఆదర్శం. ఏటా రైతుల వద్ద కోసిన వడ్లతో మిల్లర్లు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో వేల బస్తాలు మాయం చేస్తున్నారు. దయచేసి ఇకనైనా మిల్లర్ల దోపిడీ ఆపండి. రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు మిల్లర్లకు సహకారం ఆపండి. 

బాక్స్‌.

ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్‌ విఫలం!

ఖమ్మం జిల్లా అధికారులు చూపిన చొరవతో రైతులకు ఎంతో మేలు జరిగింది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులంతా ఏకతాటిపైకి వచ్చి మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులను మోసం చేసిన మిల్లర్‌ నుంచి రికవరీ వసూలు చేసిన సందర్భాలు లేవు. ఇంత మంచి విషయాన్ని, విజయాన్ని కాంగ్రెస్‌ క్రాడర్‌ ప్రచారం చేసుకోవడం లేదు. రైతులకు జరిగే మేలుపై కాంగ్రెస్‌ క్యాడర్‌ కదలకపోవడం కూడా పార్టీకి ఎంతో నష్టం జరుగుతోంది. ప్రతిపక్షాలు రైతులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నప్పుడు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అయినా కాంగ్రెస్‌ నాయకులకు అవగాహన లేకపోవడం విడ్డూరం. ఇప్పటికైనా కాంగ్రెస్‌ క్యాడర్‌ కళ్లు తెరవండి. ప్రతిపక్షాల నోరు మూయించండి.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

 

గచ్చిబౌలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అనే పంచభూతాలు ప్రకృతిలో భాగమని, వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని ప్రేమిస్తూ, పర్యావరణాన్ని రక్షిస్తూ ముందుకు సాగితే భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

protection

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు రాజశేఖర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, లత, రోజా, నాయకులు సయ్యద్ గౌస్, సంఘ, దేవేందర్, అమన్, బాలరాజు సాగర్, సందీప్ ముదిరాజ్, నవీన్ ముదిరాజ్, నర్సింహ గౌడ్, టోనీ, విజయ్, కిరణ్ మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రధాన కార్యదర్శి నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బేటి

ప్రధాన కార్యదర్శి నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బేటి.

మహదేవపూర్ -నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మతినుల్లా ఖాన్ నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు బీటీ కావడం జరిగింది.
గురువారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానా గడ్డ లోని మతిన్ ఖాన్ నివాసంలో కోట రాజబాబు భేటీ కావడం,రాబోయే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తుంది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మతిన్ ఖాన్, మహాదేవపూర్ కాటారం మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన నాయకుడుగా ఉండడం, రెండు మండలాల్లో ప్రజల్లో పలుకుబడి సంపాదించిన ఖాన్ సాబ్, కావడంతో పంచాయితీ ఎన్నికల్లో, సర్పంచ్ నుండి ఎంపీటీసీ ల పోటీలకు బి ఫాం నుండి, గెలుపు పొందె వరకు ఖాన్ సాబ్ అవసరం ఉంటుంది కనుక, ముందస్తుగా మతిన్ ఖాన్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో, పలు నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కోట రాజబాబు మతిన్ ఖాన్ గృహంలో కలవడం ఒక సాధారణ ప్రక్రియ లో భాగమేనని చెప్పడం జరుగుతుంది.

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పాలన

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పాలన రావాలని తిరుమల శ్రీవారిని వేడుకున్న రవీందర్ యాదవ

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం యువనేత, బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌ను కేటీఆర్ ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దారని రవీందర్ యాదవ్ కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి, కమీషన్ల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతి పనికి కమీషన్ల పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని రవీందర్ యాదవ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని, బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version