ఇండ్ల స్థలాల భూమి అక్రమ పట్టాకు గురైంది
జమ్మికుంట: నేటిధాత్రి
– భూ భారతి సదస్సులో దళిత కాలనీ వాసులు ఫిర్యాదు
– ధరణి మా దళితుల బ్రతుకులు దరిద్రంగా మార్చిందని ఆవేదన
– తిరిగి తమ భూమి తమ కాలనీ పేరు మీద పట్టా చేయాలని విజ్ఞప్తి
జమ్మికుంట మండలం,తనుగుల గ్రామం:-
మా మూడు వందల కుటుంబాల ఇండ్ల స్థలాల పట్టా భూమి,అక్రమ పట్టాకు గురైందని,వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని,గురువారము దళిత కాలనీ వాసులు గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భారతి సదస్సులో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా దళిత కాలనీవాసులు మాట్లాడుతూ…తమకు గ్రామ శివారులో సర్వే నెంబర్ 169/a లో 2.31 గుంటల ఇండ్ల స్థలాల పట్టా భూమి కలదని దానిని తమ గ్రామానికి చెందిన నిమ్మకాయల నర్సయ్య తండ్రి మల్లయ్య అక్రమ పత్రాల సృష్టించి గ్రామ పంచాయతీ ధృవీకరణ పత్రం ఆధారంతో ధరణిలో అక్రమ పట్టా చేసుకున్నాడని తెలిపారు.ధరణితో మా దళిత కుటుంబాల బ్రతుకులు దరిద్రంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై తాము గత మూడు సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ పట్టా చేసుకున్న నిమ్మకాయల నర్సయ్య తండ్రి మల్లయ్య పేరును,భూ రికార్డుల నుంచి తొలగించి,తిరిగి తమ దళిత కాలనీ పేరు మీద పట్టా మార్పిడి చేయాలని వేడుకున్నారు.