హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 1వ తరగతి ప్రవేశాలు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దరఖాస్తుల ఆహ్వానం

1వ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తులు

జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి ఈ. ఇందిరా

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్)లో ఒకటవ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి ఈ. ఇందిరా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు ఒక సీటు కేటాయించారని. దరఖాస్తూ చేసుకునే ఎస్సీ విద్యార్థిని విద్యార్ధులు జూన్ 01 నుండి 2019 నుండి 31.05.2020 మద్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలవారు రూ.1,50,000/- పట్టణ ప్రాంతాలవారు రూ.2,00,000/- మించరాదన్నారు. అర్హులైన ఎస్సీ విద్యార్ధిని విద్యార్థులు ఈ నెల 29 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్ధుల ఎంపిక జూన్ 01 2026న కలెక్టరేట్లో లక్కీడీప్ విదానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫారాలు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఆధికారి కార్యాలయము రూమ్ నెంబర్ ఎఫ్ 3 జిల్లా కలెక్టరేట్ లో లభించును పూర్తి వివరములకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయము సంప్రదించగలరు. వారు తెలిపారు

ఆవిష్కరణలు మానవ అవసరాలకు దోహదపడాలి

ఆవిష్కరణలు మానవ ఆకాంక్షలచే నిర్దేశించబడాలి

* వ్యవస్థాపకులు అండ్ ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్ . వి . పురుషోత్తం రెడ్డి .

చేవెళ్ల, నేటిధాత్రి :

మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లోని చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగడేటా ఇంటెగ్రిటీ వెరిఫికేషన్ అండ్ హైబ్రిడ్ డీప్ లెర్నింగ్ ఎనేబుల్డ్ ఇంట్రుషన్ డిటెక్షన్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్ పరిశోధనలో ఎన్ .సవితకు విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు అండ్ ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్ . వి . పురుషోత్తం రెడ్డి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రంగంలో పరిశోధన దేశాభివృద్ధికి కీలకమని, క్లౌడ్ కంప్యూటింగ్ పరిసరాలలో డేటా సమగ్రత ధృవీకరణ మరియు హైబ్రిడ్ డీప్ లెర్నింగ్ ద్వారా చొరబాటును గుర్తించడం అనే అంశం పరిశోధనపై సవితను అభినందించారు. సిద్ధాంతంపై డాక్టర్ ఈ . సాయి కిరణ్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసి ఈ ఘనతను సాధించారు. పరిశోధనలు దేశానికి గర్వకారణమే కాకుండా భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాదిని ఏర్పరుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ సెక్రటరీ – కం – కరెస్పాండంట్ సిహెచ్ . సువర్ణ దేవి, డైరెక్టర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డాక్టర్. సిహెచ్ . సాత్విక రెడ్డి , వైస్ ఛాన్సలర్ ఆచార్య జి . శంకర్ లింగం, రిజిస్ట్రార్ ఆచార్య,
యం. రవీందర్ , డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆచార్య క్రిస్టోఫర్ , డీన్ అడ్మినిస్ట్రేషన్ ఆచార్య ఏ. రాజు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆచార్య ఎం. జగదీశ్వర్ , పరీక్షల కంట్రోలర్ ఆచార్య బి. రాజేందర్ రెడ్డి , డిప్యూటీ కంట్రోలర్ (పరీక్షల ) ఆచార్య . ఈ . జగదీష్ కుమార్ , విభాగాధిపతి (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) డాక్టర్ ఈ. అరవింద్ రెడ్డి , డాక్టర్ కె . సతీష్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాదన్నపేట చెరువుకట్టపై విద్యుత్ పనుల ప్రారంభం

మాదన్నపేట చెరువు కట్టపై విద్యుత్ లైన్ పనుల ప్రారంభం

నర్సంపేట, నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట చెరువు కట్టపై శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి కంఠ మహేశ్వర స్వామి ఆలయం వరకు నూతన ఎల్.టి విద్యుత్ లైన్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్, 1వ వార్డు కౌన్సిలర్ కొత్తకొండ మేఘన శ్యామ్ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరై పనులను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ… మాదన్నపేట, నాగూర్లపల్లి, పర్ష నాయక్ తండా గ్రామ ప్రజల దశాబ్దాల కాలం నాటి సమస్యకు నేటితో శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే మహా శివరాత్రి ఉత్సవాలకు విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల, భక్తులు చీకట్లోనే తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు.ఈ ఎల్.టి లైన్‌ ను కంఠమహేశ్వర స్వామి ఆలయం వరకు మంజూరు కొరకు మాదన్నపేట, నాగూర్లపల్లె గౌడ సంఘాల కృషి ఎంతో అభినందనీయమని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ జిసిసి డైరెక్టర్ కొర్ర రాజన్న నాయక్, మాజీ ఎంపిటిసి మచ్చిక నరసయ్య, గౌడ సంఘం నాయకులు గాదుగోని సుదర్శన్, వేముల చంద్రమౌళి గౌడ్, నాతి శ్రీను, మేడేపల్లి ప్రసాద్, మచ్చిక సతీష్, పల్లె ప్రశాంత్, తనుగుల విష్ణు, నాతి రమేష్, ఎన్పీడీసీఎల్ లైన్ మాన్ విష్ణు, జూనియర్ లైన్మెన్ ప్రశాంత్, హెల్పర్ రాజేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

జీవో 17 రద్దు చేయాలి: కాంట్రాక్టర్ల డిమాండ్

జీవో 17ను రద్దు చేయాలి: బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కాంట్రాక్టర్లు

కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్

సాంఘిక సంక్షేమ మంత్రికి అసోసియేషన్ వినతిపత్రం

హైదరాబాద్,నేటిధాత్రి:

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, జీవో నెంబర్ 17ను వెంటనే రద్దు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంద శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో మంగళవారం సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ మంత్రికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకే అవకాశం కల్పిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కాంట్రాక్టర్లకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న కాంట్రాక్టర్లకు సమన్యాయంతో దాదాపు 15 నుంచి 20 వేల మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ నోటికాడి బుక్క లాక్కొని అడ్డ కూలీలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

అసోసియేషన్ డిమాండ్లు:

జీవో 17ను రద్దు చేయాలి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయమైన వాటా కల్పించాలి. చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్లను అమలు చేయాలి. జనాభా ప్రాతిపదికన కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. రాష్ట్ర కాంట్రాక్టులను తెలంగాణ కాంట్రాక్టర్లకే ఇవ్వాలి. ఎంఎస్ఎంఈ, కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ వర్గాల కాంట్రాక్టర్లకు ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. టెండర్ నిబంధనలు సులభతరం చేసి చిన్న కాంట్రాక్టర్లు పాల్గొనేలా చేయాలి. ఫ్రీ బిడ్డింగ్ మీటింగ్‌లకు ఎంట్రీ ఫీజులు రద్దు చేయాలి. స్థానిక కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇచ్చే నిబంధనలు రూపొందించాలి. కాంట్రాక్టుల్లో పారదర్శకత, సమాన అవకాశాలు కల్పించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కోఆపరేటివ్ సంస్థల ద్వారా కాంట్రాక్టులు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ బాధ్యులు అబ్రార్ హుస్సేన్, నర్రా నిర్మల, సిఆర్ఓ శనిగరం శ్రీనివాస్, మారపెళ్లి మనోజ్, రుద్రావరం సునీల్, బొట్ల కార్తీక్,సిఆర్ఓ రామ్ చందర్, బొట్ల ప్రశాంత్, ఈసంపల్లి రాజు, దుడేలా సిద్దు, అంబాల అఖిల్,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్ నినో నీడలో మనిషి

ఎల్ నినో నీడలో మనిషి— మంజుల పత్తిపాటి.
——————————- ————————-

అడవుల గుండెలో గొడ్డలి గాయంతో
స్వచ్చమైన చల్లని గాలి ఆవిరి అయిపోయింది..!
కాలుష్యపు పొగలు ఎగసి
పక్షుల పాటల మాధుర్యం
మాయమైపోయింది..!

పచ్చదనం పెరిగితే చల్లని రేపు వస్తుంది అని
గ్రహించలేకపోతున్నాం..!
పచ్చని పంట పొలాలను వెంచర్లు చేస్తూ…
నేలతల్లి శరీరానికి తూట్లు పొడుస్తున్నాం
అని గ్రహించలేకపోతున్నాం..!

ఎల్ నినో ప్రకృతి శ్వాసలో పుట్టిన అలజడే
కాని .. మన పాపాల వేడితో అది ప్రళయగర్జనయి
మన మీదకు వస్తుంది..!
ఒక వైపు ఎండల తుపాను నేలని కాలుస్తుంటే…
మరో వైపు వరదల రాక్షసి ఊర్లను ముంచేస్తుంది
ఇది ప్రకృతి కోపం కాదు మనం చేసిన పాపం
ప్రళయగర్జనయి మన మీదకు వస్తుంది..!

కాబట్టి ఇప్పటికైనా మేలుకో మనిషీ…
ఒక మొక్క నాటు…
భూమి నవ్వేలా ప్రేమతో మొక్కను కాపాడి…
బావితరాల భవిష్యత్తును నిలబెట్టు..!

రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218.

సంప్రదాయ శోభతో కార్మికుల చలివేంద్రం

కార్మికుల చలివేంద్రానికి ప్రత్యేక ఆకర్షణ

కళ్లాపి జల్లి ముగ్గులతో సంప్రదాయ శోభ

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలో వేసవి దాహార్తిని తీర్చేందుకు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సాధారణంగా ఏర్పాటు చేసే చలివేంద్రాలకు భిన్నంగా ఈ చలివేంద్రాన్ని సంప్రదాయ పద్ధతిలో అలంకరించడం ప్రజలను ఆకట్టుకుంది.చలివేంద్రం పరిసరాల్లో కాళ్లాపి జల్లి,రంగురంగుల ముగ్గులు వేయడం ద్వారా ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు.దారిన వెళ్లే ప్రజలు చలివేంద్రం వద్ద ఆగి నీరు సేవించడంతో పాటు అలంకరణను ఆసక్తిగా వీక్షించారు.భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు మాట్లాడుతూ కేవలం దాహం తీర్చడమే కాకుండా సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించేలా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రజలకు సేవ చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.స్థానికులు ఈ వినూత్న ప్రయత్నాన్ని అభినందిస్తూ ఇతరులు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రత్యేకత చూపాలని సూచించారు.

వనపర్తి అభివృద్ధి నిరంజన్ రెడ్డిదే: శ్రీధర్

వనపర్తి అభివృద్ధి చేసేంది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ఇప్పిటి వరకు రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేయంచ లేదు ఎమ్మెల్యే

మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీదర్

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి పట్టణంలో స్వామి వివేకానంద చౌరస్తా నుండి రాజావారి బంగ్లా పాలిటెక్నిక్ కళాశాల కొత్త బస్టాండ్ రోడ్డు కొత్తకోట రోడ్డు కొల్లాపూర్ రోడ్డు ఇంత వరకు రోడ్లు విస్తరణ పనులు వనపర్తి ఎమ్మెల్యే పూర్తి చేయంచాలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ బీ ఆర్ ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీదర్ 33 వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమల్ ఒక ప్రకటన లో తెలిపారు వనపర్తి లో రోడ్ల విస్తరణ పనులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 90 శాతం వనపర్తి ప్రజల కోరిక మేరకు బాధితుల సహకారము తీసుకొని రోడ్డు కటిoగ్ సెంటర్ డివైడర్ అధునాతన లైటింగ్ సెంటరు లో చెట్లు ఏర్పాటు నల్ల చెరువుదగ్గర జమ్మి చెట్టు తాళ్ల చేరుపు సుందరి కరణపాత మార్కెట్ యార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో షాపుల నిర్మాణం .
నియోజకవర్గంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన ఆలోచతో అవసరమైన నిధులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారము తో ప్రజల అవసరాల అభివృద్ధి పనులు పూర్తి చేశారని వారు పేర్కొన్నారు
మంత్రి జుపల్లి ,ఎం.ఎల్.ఏ ప్రారంభించిన డిజిటల్ గ్రంథాలయం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కట్టిచ్చి విషయం వనపర్తి ప్రజలకు తెలుసునని వాకిటి.శ్రీధర్ తిరుమల్ అన్నారు
పత్రికలలో ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారాని వారు విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల విషయములో అరకొర చేస్తూ న్నారని వారు అన్నారు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణలు చేసి ఇస్తున్నారని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడము లేదనిహామీలు గాలికి వదిలేసారని వారు ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి
నిరంజన్ రెడ్డి సాధించిన పథకాలకు ప్రారంభోత్సవాలు చేయడం మాని కొత్త పథకాలు తెచ్చి ప్రజలకు చూపాలని వారు డిమాండ్ చేశారు.

డబ్బు ఎందుకు ముఖ్యం?

డబ్బు ఎందుకు అవసరం?

ప్రాథమిక అవసరాల నుంచి భవిష్యత్ భద్రత వరకు డబ్బుదే కీలక పాత్ర

ఆర్థిక స్థిరత్వం లేకుంటే కుటుంబాలపై పెరుగుతున్న భారం

పరకాల,నేటిధాత్రి

నేటి సమాజంలో డబ్బు ప్రతి మనిషి జీవితంలో విడదీయరాని భాగంగా మారింది.ఒకప్పుడు వస్తువుల మార్పిడి విధానంతో అవసరాలు తీర్చుకునే కాలం ఉండేది.కానీ కాలక్రమేణా సమాజ అభివృద్ధి,జనాభా పెరుగుదల,ఆధునిక జీవనశైలి కారణంగా డబ్బు ప్రధాన అవసరంగా మారింది.ప్రస్తుతం పుట్టిన పిల్లవాడి నుంచి వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తోంది.మనిషి జీవనానికి అవసరమైన ఆహారం,దుస్తులు,నివాసం వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు తప్పనిసరి.కుటుంబ నిర్వహణ,విద్యుత్ బిల్లులు,ఇంటిఅద్దె,రవాణా,నిత్యావసర సరుకుల కొనుగోలు వంటి ప్రతి అంశం డబ్బుతోనే ముడిపడి ఉంది.రోజువారీ కూలీ చేసేవారి నుంచి పెద్ద వ్యాపారుల వరకు అందరూ తమ జీవనోపాధి కోసం ఆర్థిక వనరులపైనే ఆధారపడుతున్నారు.

విద్య, వైద్యం ఖర్చులతో పెరుగుతున్న ఆర్థిక భారం


ప్రస్తుతం విద్య,వైద్యం రంగాల్లో ఖర్చులు భారీగా పెరిగాయి.పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలంటే తల్లిదండ్రులు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.అలాగే చిన్న అనారోగ్యానికి కూడా ఆసుపత్రుల్లో అధిక వ్యయం అవుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ ఆర్థిక స్థితి బలంగా ఉండాల్సిన అవసరం మరింత పెరిగింది.వ్యవసాయ రంగంలోనూ డబ్బు కీలక పాత్రపోషిస్తోంది.విత్తనాలు,ఎరువులు,పురుగుమందులు, కూలీల ఖర్చులు,యంత్రాల వినియోగం వంటి ప్రతి దశలో రైతుకు పెట్టుబడి అవసరం అవుతోంది.పంట చేతికి వచ్చేవరకు అప్పులపైనే ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది.అలాగే చిన్న వ్యాపారం ప్రారంభించాలన్నా, స్వయం ఉపాధి చేపట్టాలన్నా డబ్బు ప్రధాన ఆధారంగా మారింది.

భవిష్యత్ భద్రతకు పొదుపు అవసరం

డబ్బు కేవలం ఖర్చుల కోసమే కాదు,భవిష్యత్తు భద్రతకు కూడా అవసరం.అత్యవసర పరిస్థితుల్లో పొదుపు చేసిన డబ్బు కుటుంబానికి అండగా నిలుస్తుంది.అనారోగ్యం,ప్రమాదాలు,ఉద్యోగ నష్టం వంటి సందర్భాల్లో ఆర్థిక నిల్వలు ఎంతో ఉపయోగపడతాయి.అందుకే చాలామంది బ్యాంకు పొదుపులు,బీమా పాలసీలు,పెట్టుబడులపై దృష్టి పెడుతున్నారు.సమాజంలో ఆర్థికంగా బలమైన వ్యక్తులకు గౌరవం,గుర్తింపు ఎక్కువగా లభిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.డబ్బు ఉన్నవారికి మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి.అయితే డబ్బు ఉన్నంత మాత్రాన మనిషి గొప్పవాడవడంలేదని,మానవత్వం,మంచితనం,కుటుంబ బంధాలు కూడా అంతే ముఖ్యమని పెద్దలు చెబుతున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో,దాన్ని సక్రమంగా వినియోగించడం కూడా అంతే అవసరం.అక్రమ మార్గాల్లో సంపాదించిన ధనం తాత్కాలిక సౌకర్యాలు కలిగించినా,శాశ్వత ఆనందాన్ని ఇవ్వదని వారు సూచిస్తున్నారు.కష్టపడి,నిజాయితీగా సంపాదించిన డబ్బే మనశ్శాంతిని ఇస్తుందని చెబుతున్నారు.ప్రస్తుతం యువతలో డబ్బు ప్రాధాన్యం మరింత పెరిగింది.మంచి ఉద్యోగాలు,వ్యాపార అవకాశాలు,విదేశీ ఉపాధి కోసం యువత పోటీ పడుతోంది.ఆధునిక జీవనశైలి,సోషల్ మీడియా ప్రభావంతో ఖర్చులు పెరుగుతుండటంతో ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన కూడా ఎక్కువవుతోంది.మొత్తంగా చూస్తే డబ్బు మనిషి జీవితాన్ని సులభతరం చేసే ముఖ్యమైన సాధనం.అవసరాలను తీర్చుకోవడం నుంచి భవిష్యత్తును నిర్మించుకోవడం వరకు ప్రతి దశలో డబ్బు కీలక పాత్ర పోషిస్తోంది.అయితే డబ్బుతో పాటు మానవ విలువలు,ఆరోగ్యం,సంబంధాలు,సేవాభావం కూడా సమానంగా ముఖ్యమని సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

అక్షర సామ్రాట్ శ్యాం ప్రసాద్

`ప్రజా సేవలో సాహిత్య ప్రేమికుడు!

`అధికారిగా కర్తవ్యం.. మానసిక ఉల్లాసానికి కవిత్వం.

`సామాజిక శ్రేయస్సు లక్ష్యం.. కవిత్వంతో నిండిన జీవన చైతన్యం.

`కళలంటే ప్రాణం.. కళా పోషణ ప్రపంచం.

`స్నేహం ఒక మధురం.. స్నేహితులకు వరం.

`వృత్తి ఉద్యోగం.. కవిత్వంలో ఉద్యమం.

`కలం కార్మికుడు.. కవిత్వానికి ప్రేమికుడు.

`అనుబంధాలకు ఆప్తుడు.. బంధాలకు భక్తుడు.

`చిన్ననాడే వికసించిన కళల విజ్ఞాన సర్వస్వం.

`అక్షరాలతో పెనవేసుకున్న బంధం.. కలం కార్మికుడిగా ప్రయాణం.

`ఉన్నత జీవితం కోసం కష్టపడి పైకొచ్చిన ఉత్తమ ఆదర్శం.

`యువతకు స్ఫూర్తి నింపిన జీవన ప్రస్థానం.

`అక్షరాలకు అడుగులు నేర్పే కవి అవతారం.

`పదాలుకు పరుగులు నేర్పిన వచన విహారం.

`సమాజ చైతన్యం కోసం కనిపించే అక్షర కాంతి పుంజం.

`అటు వృత్తి, ఇటు ప్రవృత్తి కలబోసిన సాహితీ రత్నం.

`ఉద్యోగిగా శ్రమైక కర్తవ్యం.. సమాజంలో సామాన్య జీవనం.

`అధికారిననే అహం ఎక్కడా కనిపించని వ్యక్తిత్వం.

`అందరిలో కలిసిపోయే గొప్ప మేలిమి తత్త్వం.

`పదిమంది నుంచి ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనే విద్యార్థి గుణం.

`సభలు, సాహిత్య వేదికలలో సాదా సీదాగా ఆహార్యం.

`ఇంతింతై వటుడింతై అనే పదానికి నిర్వచనం.

హైదరాబాద్, నేటిధాత్రి:

కాలం చెప్పే సమాధానాలలో ఎక్కువగా కవులు, రచయితలే కనిపిస్తారు. కాలాన్ని బంధించి తమ అక్షరాలలో బంధిస్తారు. చరిత్ర కారులుగా మారుతుంటారు. చరిత్రలో నిలిచిపోతుంటారు. అందుకే రాజు జీవించే రాత్రి విగ్రహముల మీద, సుకవి జీవించే ప్రజల నాలుక మీద అని పెద్దలు ఊరికే చెప్పలేదు. సామాజిక జిజ్ఞాస అనేది అందరికీ వుండదు. స్వతహాగా వచ్చేది కాదు. అది పూర్వ జన్మ సుక్రతం. రాజుల వద్ద అదికారులుగా వున్న తిమ్మరుసు, అల్లసాని పెద్దన లాంటి వాళ్లు ఇంకా ఈ తరానికి కూడా గుర్తున్నారంటే వాళ్లు కవులు కావడమే..వారి అక్షరాలు ఇంకా మన ముందు కదలాడడమే! పాలకుల్లో కూడా కవులున్నారు. అలాంటి రాజులే నేడు జనానికి గుర్తుంటారు. వేమన లాంటివారి శతకాలు తరతరాలకు దారి చూపే మార్గాలుగా అనుసరిస్తున్నాము. ఆనాటి రాజులైనా, నేటి పాలకులైనా కవి హృదయం వున్నవారిలో పివి. నర్సింహారావు లాంటి వారు తమ పేరును పదిలం చేసుకునేందుకు కవిత్వాన్ని, రచనýనే ఎంచుకున్నారు. అంత గొప్పది అక్షర విన్యాసం. అంత గొప్పది అక్షరంతో కవికి అనుబంధం. నేటి ప్రజా ప్రభుత్వాలలో కూడా అలాంటి ఉన్నతాధికారుల్లో కూడా కవులున్నారు. కవి హృదయం వుంది. కవిత్వాన్ని ప్రేమించే గుణముంది. తన అక్షరాలతో తమ జ్ఞాపకాలనే కాదు, అనుభవాలను జోడించి, రేపటి తరానికి అంందిస్తున్న వారున్నారు. అలాంటి వారిలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ గాజుల ఒకరు. ఆయన తెలంగాణ సమాజానికి పరిచయం అక్కర్లేని అక్షర సామ్రాట్. అదికారిగా ఆయన తెలిసింది కొద్ది మందికే కాని, కవిగా ఆయన కొన్ని వేల మందికి పరిచయం. ఆయనలో వున్న సామాజిక సృహ ఎంతో విభిన్నమైంది. అందరూ అనసరించలేనిది. సహజంగా ఒక వ్యక్తిలో ఏదో ఒక సుగుణం వుంటుంది. కాని అన్ని సుగుణాలు కలబోసుకున్న వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి వుంటుంది. శ్యామ్‌తో శుభోదయం అని ఆయన నిత్యం కొన్ని వేలమందిని తన అక్షరాలతో పలకరిస్తుంటారు. తన సంతోషాలు, ఇష్టాలు పంచుకుంటుంటారు. కొందరు శాసిస్తారు. కొందరు సహనశీలిని కలిగి వుంటారు. కొందరు ఆదేశిస్తుంటారు. కొందరు ఆదరించే గుణం కలిగి వుంటారు. కొందరు ఇతరులనుంచి ఆశిస్తారు. కాని కొందరు ఇతరులకు పంచుతుంటారు. కొందరు అదికారం చూపిస్తుంటారు. మరి కొందరు అభిమానం చూపిస్తుంటారు. వృత్తిపరంగా శ్యాం ప్రసాద్ ఉన్నత స్ధానంలో వున్నారు. అంటే ఆయన శాసించే స్ధాయిలో వున్నారు. కూర్చున్న చోట నుంచి ఆయన ఆదేశాలు జారీ చేసే స్ధానంలో కూర్చున్నారు. ప్రతి విషయంలోనూ ఆదేశాలు జారీ చేసే స్ధాయిలో వున్నారు. అంతే కాదు ఆయన అదికారం చూపించే స్ధాయిని అందుకున్నారు. కాని వ్యక్తిగా ఆయన ఆదర్శంగా నిలుస్తారు. తోటి స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, ఆత్మీయులను ఆదరిస్తూ వుంటారు. తనకు వున్నంతలో తన చుట్టూ వున్నవారికి పంచుతూ వుంటారు. తనంటే ఇష్టం వున్నవారందరినీ ఆయన అభిమానిస్తుంటారు. ఇన్ని మంచి గుణాలు ఒక వ్యక్తిలో వుండడం చాల అరుదు. అందుకే వ్యక్తిగా శ్యాం ప్రసాద్ సమాజంలో గౌరవం పొందుతున్నారు. ప్రజాసేవలో సాహిత్య ప్రియులుంటారు. కాని ఆయన సాహిత్య ప్రేమికుడు. ఎందుకంటే ఇష్టం వేరు. ప్రేమ వేరు. ఇష్టాయిష్టాలు కొన్ని సార్లు మారొచ్చు. కాని ప్రేమ మాత్రం మారదు. అందుకే శ్యాం ప్రసాద్‌కు ఊహ తెలిసినప్పటి నుంచి అక్షరాలను ప్రేమించారు. అక్షర శ్రామికుడిగా తన ప్రస్తానం ప్రారంభించారు. కలం కార్మికుడిగా కష్టం చూశారు. కలం విద్యకు కూడా పదును నేర్పారు. తన అక్షరాలను తీర్చిదిద్దుకున్నారు. తన జీవితానికి దారి వేసుకున్నారు. జీవితంలో గెలవాలంటే యజ్ఞం చేయాలి. అది అక్షరాలతో చేయాలి. అప్ప్పుడే జీవితంలో స్దాయి అనేది దరి చేరుతుంది. అలా ప్రభుత్వ ఉద్యోగం కోసం గ్రూప్స్ రాశారు. ఉద్యోగం సంపాదించారు. నిస్వార్ధ ఉద్యోగిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ప్రస్తుతం ఐఏఎస్ అయ్యారు. తన విధినిర్వహణలో అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. అయితే ఒక ప్రభుత్వ ఉన్నతోద్యోగికి ఎంత ఒత్తిడి వుంటుందో అందరికీ తెలుసు. అలాంటి ఒత్తిడిని జయించేందుకు అదికారులు రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. కాని శ్యాం ప్రసాద్ మాత్రం ఆదినుంచి అక్షరాలతో స్నేహం చేస్తూ వచ్చారు. ఆ స్నేహాన్ని మనసు నిండా అక్షరాలతో నింపుకుంటూ వచ్చారు. అధికారిగా ఆయన కర్తవ్య నిర్వహణలో దీక్షా పరుడుగా గుర్తింపు పొందారు. తన మానసిక ఒత్తిడిని జయించేందుకు కవిత్వాన్ని అల్లుకున్నారు. వాణీ నారాణి అని పిల్లల మర్రి ఎలా సర్వస్వతీ కటాక్షం పొందారో అలాగే శ్యాం ప్రసాద్ కూడా పొందినట్లున్నారు. అందుకే ఉన్నత ఉద్యోగంలో ఇంత ఒత్తిడిలోనూ కూడా ఆయనలో కనిపించే ఉల్లాసం అంతా ఇంతా కాదు. ఎప్ప్పుడూ పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోదు. ఆయన ముఖంలో తేజస్సు తగ్గిపోదు. అది మానసిక ప్రశాంతత కల్గిన వారికే సొంతమౌతుంది. అదికారిగానే కాదు, కవితగా ఆయన సామాజిక శ్రేయస్సును కోరుకుంటారు. ఉభయ కుశలోపరిగా సామాజిక జిజ్ఞాసను కలిగి వున్నారు. కళాపోషణను ప్రపంచం చేసుకున్నారు. ఎందుకంటే ఆయనకు కవిత్వమే కాదు, కళలంటే ఎంతో ప్రాణం. సమాజాన్ని మేలు కొలుపేది కళ అని శ్యాం ప్రసాద్ బలంగా నమ్ముతుంటారు. వృత్తి ఉద్యోమైనా సరే కవిత్వాన్ని ఉద్యమంగా సాగిస్తారు. అనుబంధాలకు ఆయన ఇచ్చే విలువ ఎంతో ఆదర్శమైంది. అలాంటి అనుబంధాలలో ఆయనకు మనుషులే కాదు, జంతువులు కూడా తక్కువ కాదు. ఇంట్లో పెంచుకునే కుక్క పిల్ల దగ్గర నుంచి, తమ దొడ్లో పెరిగే ఆవు, గేదెల వరకు కూడా ఆయన ఎంతో ప్రేమను పంచుతుంటారు. ఇక అనుబంధాల క్రమంలో శ్యాం ప్రసాద్ స్నేహితులకు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. అలాంటి స్నేహితులకు వరంగా కనిపిస్తారు. తన చిన్న నాటి స్నేహితులతో ఆయన కలిసి వుండే తీరు, వారితో పంచుకునే ఆప్యాయత ఎంతో స్పూర్తిదాయకంగా వుంటుంది. ఎందుకంటే సమాజంలో ఒక వ్యక్తి ఉన్నత స్దానానికి చేరుకుంటే వారి స్నేహితులను మర్చిపోతుంటారు. ఒక వేళ గుర్తున్నా వారి పలకరింపులో కూడా గర్వం కనిపిస్తుంది. కాని స్నేహం అనేది గర్వంతో కాకుండా నిండు గుణంతో చేసే వారే అసలైన స్నేహితులు అని శ్యాం ప్రసాద్ నిరూపించుతున్నారు. చిన్న నాటి స్నేహితులే కాదు, ఆయన ఉద్యోగ రిత్యా తనతోటి పనిచేసిన వారిని కూడా స్నేహ సంఘంలో సభ్యులను చేసుకుంటారు. ఎక్కడికెళ్లినా ఆయన తన స్నేహితులను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఉద్యోగిగా ఆయన ఎంత ఉన్నత స్ధానంలో వున్నా సామాన్య జీవనం శ్యాం ప్రసాద్‌లో చూస్తాం. అదికారిగా ఆయన ఎక్కడా అహం ప్రదర్శించిన సందర్భం చూడం. సాహితీ సభలు, సాహిత్య వేదికలకు పిలుపొస్తే చాలు హజరౌతుంటారు. తన కళాపిపాసన ఎంత గొప్పదో చూపిస్తుంటారు. ఇంతింతై వటుడింతై అనే పదానికి నిర్వచనంగా చెప్ప్పుకునే స్దాయికి చేరుకున్నారు.

డ్రైనేజీ సమస్యలపై మాజీ కార్పొరేటర్ పర్యటన

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: అధికారులతో కలిసి మాజీ కార్పొరేటర్ పర్యటన
​మియాపూర్ డివిజన్ కాలనీల్లో డ్రైనేజీ సమస్యల క్షేత్రస్థాయి పరిశీలన
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చొరవ చూపారు. గురువారం న్యూ కాలనీ మరియు శ్రీరంగాపురం కాలనీల్లో అధికారులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు.న్యూ కాలనీలో నూతనంగా చేపట్టబోయే డ్రైనేజీ లైన్ల నిర్మాణ ప్రాంతాలను, అలాగే శ్రీరంగాపురం కాలనీలో ప్రస్తుతం తలెత్తిన డ్రైనేజీ సమస్యను జలమండలి డిజిఎం నారాయణ, సిఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కాలనీవాసుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన, సమస్యల తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్‌లో డ్రైనేజీ, మంచినీటి సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులు మెరుగుపరిచి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. డివిజన్ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సిఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్లు జగదీష్, లింగయ్యలతో పాటు స్థానిక నాయకులు వెంకటేష్ గౌడ్, తిమ్మరాజు, నరేష్, శంకర్ నాయక్, జ్యోతి, లక్ష్మి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

శ్రీ పోచమ్మ నాగుల ఆలయం దర్శించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

పట్టణంలో శ్రీ పోచమ్మ నాగుల ఆలయం దర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
పట్టణం లోని *నూతన పోచమ్మ నాగుల ఆలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,స్థానిక కౌన్సిలర్ లు స్వప్న ప్రవీణ్,ప్రేమలత శంకర్ రెడ్డి ,
నాయకులు భరత్ రెడ్డి, జగదీష్, ప్రభు పటేల్ తదితరులు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి,ఆలయ కమిటీ వారు ,పూజారులు, భక్తులు ఎమ్మెల్యే గారికీ,నాయకులకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతిసౌభాగ్యాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

వివాహ వేడుకకు వచ్చి వెళ్తుండగా ఘోర ప్రమాదం:

జాతీయ రహదారిపై గుల్బర్గా వ్యక్తి దుర్మరణం

జహీరాబాద్ నేటి ధాత్రి :

జహీరాబాద్ మే 14: హైదరాబాద్‌లో బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన గురువారం మే 14, 2026 ఉదయం జహీరాబాద్ పరిధిలోని జాతీయ రహదారి 65 పై చోటుచేసుకుంది.కోహిర్ ఎస్సై టి. నరేష్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన సయ్యద్ సర్దార్, అతని భార్య సబీహా (30), పిల్లలతో కలిసి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉన్న తమ బంధువుల పెళ్లికి వచ్చారు. మే 13 సాయంత్రం వివాహ రిసెప్షన్ ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. భార్యాపిల్లలను ఇతర వాహనంలో పంపిన సర్దార్ కెఎ 32 ఎచ్ఎల్ 0274 నెంబర్ గల తన బైక్ పై ఒంటరిగా బయలుదేరాడు.మే 14 (గురువారం) ఉదయం 5:40 గంటల సమయంలో జహీరాబాద్ వైపు వస్తుండగా, దిగువాల్ గ్రామ శివారులోని పిరమిల్ కంపెనీ ఎదురుగా జాతీయ రహదారిపై సర్దార్ బైక్‌ను ఒక గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన సర్దార్ రోడ్డుపైనే అక్కడికక్కడే మృతి చెందాడు.భర్త మృతిపై భార్య సబీహా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోహిర్ ఎస్సై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమై, ఆగకుండా వెళ్ళిపోయిన గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నీట్ లీకేజీపై విచారణ జరపాలి

*నీట్ పరీక్షల లీకేజ్ పై విచారణ జన్మించాలి..

*కాంగ్రెస్ నేతలు డిమాండ్..

తిరుపతి(నేటిధాత్రి:

దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు తమ ఉన్నతమైన భవిష్యత్తు కోసం రాసిన నీట్ పరీక్షలు రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పరిషత్ పత్రాలు లీకేజీ అవడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారిందని దీనికి వారిని కేంద్ర విద్యా శాఖ మంత్రిని విచారించి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకుడు సి డబ్ల్యూ సి మెంబర్ ఎక్స్ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్
క్లబ్ లో
గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో కూడా సుమారు 75 వేల మంది విద్యార్థులు రాశారని ఆయన పేర్కొన్నారు పరీక్ష పత్రాల లీకేజీ కు పాల్పడిన వారిపై కఠించడం తీసుకోవాలి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇవిలే పెద్ద సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పేర్లపల్లి గోపి చిట్టిబాబు వెంకట నరసింహులు ఐరాల లోకేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

నీట్ రద్దుతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ

*నీట్ పరిక్ష రద్దుతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం..*

భాద్యులపై కఠిన చర్యలు తీసుకో వాలి…ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ -యూజీ 2026 పరీక్షను ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయడం లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమే.పరిక్షా వ్యవస్థలో వరుసగా జరుగుతున్న లోపాలు,పేపర్ లీకుల వల్ల విద్యార్థులలో నమ్మకాన్ని దెబ్బతిస్తున్నాయి.విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి పరిక్ష వ్రాస్తే ప్రభుత్వ అసమర్థతో లీకుల పేరుతో రద్దు చేయడం వారి తల్లిదండ్రులకు మోయలేని ఆర్థిక భారం విద్యార్థులకు తీరని నష్టం,ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వారంతా నెలల తరబడి కష్టపడి సిద్ధమై తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు
నీట్ పరిక్ష నిర్వాహణలో జరిగిన నిర్లక్ష్యానికి బాద్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకొని ఇక ముందు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి,ఎన్ టిఏకు డిమాండ్

పని మనుషులపై అప్రమత్తంగా ఉండాలి

*ఇంట్లో పని మనుషులని పెట్టుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త.*

మండల ఎస్సై క్రాంతికుమార్ పటేల్

*జహీరాబాద్ నేటి ధాత్రి :*

నేపాల్ నుండి కానీ ఇతర రాష్ట్రాల నుండి కానీ మన జిల్లా మండలాలకు పని నిమిత్తం వస్తూ ఉంటారు. ఇలాంటి వారిని పనిలో పెట్టుకోవడానికి ముందు,ఇండ్లు అద్దెకు ఇచ్చే ముందు వారి గత వివరాలు నేర చరిత్ర తెలుసుకోవాలి. ఇలాంటి వారి వివరాలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి వారి వివరాలు పోలీసు స్టేషన్ నందు నమోదు చేయాలి జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఎస్సై క్రాంతికుమార్ పటేల్ సూచించారు. పని పెట్టుకునే వారి సమాచారం, కొత్తవ్యక్తులకు ఇండ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు వారి వివరాలు పోలీసులకు తెలిపి గత చరిత్ర తెలుసుకోవాలని. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను పనిలో పెట్టుకోవద్దు అని కోరారు. నేరాల నిర్మూలన,దొంగతనాల నిర్మూలనలో పోలీసు వారికి సహకరించాలి అని కోరారు. ఇంట్లో పని మనుషులుగా చేరిన పనివారు దోపిడీలకు,దొంగతనాలకు, దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సందర్భంగా మండల ఎస్సై ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. ఇంట్లో పని మనుషులని పెట్టుకునే ముందు వారి పూర్వాపరాలు పరిశీలించాలని సూచించారు.ఈ సందర్భంగా ప్రజలు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొత్తవ్యక్తులను,గుర్తింపు లేని వారిని చేరదీస్తే వారి నుండి అపాయం సంభవించే అవకాశం ఉందని గుర్తు చేశారు. పథకం ప్రకారం పనిలో చేరి నేరాలకు పాల్పడతారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజల రక్షణలో పోలీస్ శాఖ అనుక్షణం పనిచేస్తుందని తెలిపారు. అనుమానిత వ్యక్తుల సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు డయల్ 100 కు, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ కోరారు.

శాన్విక పవర్‌కు గోల్డ్ మెడల్

అవధూత దత్త పీఠం గణపతి సచ్చితానంద స్వామి చేతుల గోల్డ్ మెడల్ బహుమతి

బంజారా ముద్దుబిడ్డ శాన్విక పవర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కర్ణాటక మైసూర్ అవధూత దత్త పీఠం శ్రీ గణపతి సచ్చితానంద స్వామి చేతుల మీదగా శ్రీమత్ భగవద్గీత రెసిటేషన్ ఎగ్జామ్ లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చెందిన ఐదవ తరగతి బాలిక , బంజారా ముద్దుబిడ్డ శాన్విక పవర్ తండ్రి పేరు వినయ్ పవర్ , NHRC సంగారెడ్డి జిల్లా చైర్మన్ కూతురు భగవద్గీత చూడకుండా మొత్తం పుస్తకాన్ని చదివింది ఎ క్కడ ఏ శ్లోకం అడిగినా కంఠస్థగా చెప్పడం జరుగుతుంది కాబట్టి సాన్విక పవర్ కు గోల్డ్ మెడల్ బహుమతిగా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు హిందువులు విద్యార్థి విద్యార్థులు భగవద్గీత తప్పనిసరిగా నేర్చుకోవాలి మనం మైనార్టీ సోదరులు ఏ విధంగా ఖురాన్ చదువుతారు , మన క్రైస్తవ సోదరులు సంబంధించిన బైబిల్ చదువుతారు అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులు మీ ఇంట్లో తప్పనిసరిగా భగవద్గీత చదవాలి ప్రతి ఇంట్లో భగవద్గీత ప్రతి పూజ మందిరంలో ఉండాలి ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.

పొదుపే దేశ ఆర్థిక భద్రతకు బలం

*దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలి..

*దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన పొదుపు సూత్రాలను పాటించాలి..

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటిధాత్రి:

ప్రపంచ రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. చమురు ధరల పెరుగుదల, దిగుమతి వ్యయాల భారము, మార్కెట్ అస్థిరత వంటి పరిణామాలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు ముందుగానే జాగ్రత్తగా వ్యవహరించాలనే. భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన పొదుపు సూత్రాలను పాటించి.దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పిలుపునిచ్చారు.పొదుపు అనేది కేవలం కుటుంబ అవసరం కాదు…అది దేశ భద్రతకు కూడా ఆధారం” అనే భావనను ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
పశ్చిమాసియా సంక్షోభం.., పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవిదేశీ మారక నిల్వలను కాపాడేందుకు,ఇందన వినియోగాన్ని తగ్గించేందుకు కీలక పొదుపు సూత్రాలను ప్రకటించిన దరిమిలా..,
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశంలో…
మోడీ పిలుపునందుకున్న
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను గురువారం చిత్తూరు ఎంపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మీడియాకు
చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు వెల్లడించారు,
విద్యుత్ పొదుపు… దేశానికి ప్రత్యక్ష సహాయం అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ చేయడం చిన్న విషయం అనిపించినా, కోట్లాది కుటుంబాలు అదే చేస్తే దేశ విద్యుత్ వినియోగ భారం గణనీయంగా తగ్గుతుంది. విద్యుత్ ఉత్పత్తికి కూడా భారీగా ఇంధనం అవసరం అవుతుంది. కాబట్టి విద్యుత్ పొదుపు అంటే పరోక్షంగా దేశ సంపదను కాపాడినట్టేనన్నారు.
ఇంధన వినియోగంలో నియంత్రణ అవసరం..,
అవసరం లేని వాహన ప్రయాణాలు తగ్గించడం, ఒకే పనికి అనేకసార్లు బయటకు వెళ్లకుండా ప్లాన్ చేసుకోవడం,సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగించడం వంటి చర్యలు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తాయి. భారత్ ఎక్కువగా విదేశీ చమురుపైనే ఆధారపడుతున్నందున ప్రతి చుక్క ఇంధనం విలువైనదేనని తెలిపారు.
బంగారం దిగుమతుల వల్ల దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా వ్యయమవుతున్నందున, ప్రస్తుత సంక్షోభ పరిస్థితి ముగిసేవరకు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలి. విదేశీ వస్తువుల దిగుమతులను తగ్గించి, విదేశీ కరెన్సీ ఖర్చయ్యే వ్యక్తిగత విలాసాలకు దూరంగా ఉండాలన్నారు.
నీటి సంరక్షణ కూడా ఆర్థిక రక్షణే నీటి వృథా తగ్గితే వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, పట్టణాల నిర్వహణపై ఒత్తిడి తగ్గుతుంది. భవిష్యత్‌లో నీటి కొరత పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నీటి వినియోగంలో జాగ్రత్తలు ఇప్పటి నుంచే అలవాటు కావాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
విదేశీ వస్తువుల కంటే స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం లోకల్‌కు వోకల్” అనే మోదీ పిలుపు ఇప్పుడు మరింత అవసరమైంది. స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేస్తే చిన్న వ్యాపారులు, రైతులు, సూక్ష్మ పరిశ్రమలు బలపడతాయి. దేశంలోనే డబ్బు తిరుగుతుండటం వల్ల ఆర్థిక వ్యవస్థ స్థిరపడుతుందన్నారు.
ఆడంబరాల కంటే అవసరాలకు ప్రాధాన్యం సంక్షోభ కాలాల్లో అధిక ఖర్చులు, అనవసర కొనుగోళ్లు కుటుంబాలను అప్పుల్లోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కుటుంబ బడ్జెట్‌ను నియంత్రించడం, పొదుపుకు ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరం. ప్రతి నెల కొంత మొత్తాన్ని సేవింగ్స్‌గా ఉంచే అలవాటు పెంచుకోవాలన్నారు.
డిజిటల్ లావాదేవీలతో పారదర్శక ఆర్థిక వ్యవస్థకు బలమని చెప్పిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ..,డిజిటల్ చెల్లింపులు పెరిగితే నగదు నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. అలాగే అవినీతి, నల్లధనం నియంత్రణకు కూడా దోహదం అవుతుంది. చిన్న వ్యాపారుల నుంచి సాధారణ కుటుంబాల వరకు డిజిటల్ విధానాలను అలవాటు చేసుకోవడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు ఉపయోగపడుతుందని తెలియజేశారు.
ఆహార ధాన్యాల వృథా తగ్గించాలి..ఒక్క గింజ అన్నం వెనుక రైతు చెమట, నీరు, విద్యుత్, రవాణా వ్యయం అన్నీ ఉంటాయి. కాబట్టి ఆహారాన్ని వృథా చేయకుండా అవసరమైనంత మాత్రమే వండటం, వినియోగించడం కూడా ఒక గొప్ప పొదుపు సూత్రమేనన్నారాయనపొదుపు అనేది పాతతరం అలవాటు మాత్రమే కాదు. భవిష్యత్ భారత్‌ను నిర్మించే యువత కూడా పొదుపు నేర్చుకోవాలి. ఇంధన పొదుపు, నీటి సంరక్షణ, డిజిటల్ చెల్లింపులు, స్థానిక ఉత్పత్తుల వినియోగం వంటి అంశాల్లో యువత ముందుండాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ కేవలం మాటలకే పరిమితం కాకుండా నిబంధనలను స్వయంగా అమలు చేస్తూ తన భద్రతా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను మరియు SPG కమాండోల సంఖ్యను 50 శాతం మేర తగ్గించుకుని, ఆచరణలో చేసి చూపారని, ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ బాటలో పయనిస్తూ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేశారు.

పేపర్ లీకేజీపై చర్యలు తీసుకోవాలి

పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

రైకోడ్ మండల యూసు పూర్ సర్పంచ్ సంగారెడ్డి

జహీరాబాద్ నేటిధాత్రి ;

పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైకోడ్ మండల యూసు పూర్ సర్పంచ్ సంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆరో పించారు. యూసుపూర్ సర్పంచ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పగలు రాత్రి కష్టపడి చదివిన సుమారు 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటo మాడు తోందని మండిపడ్డారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జాతీయ అర్హత పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహించలేని స్థితిలో కేంద్రం ఉంది ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. పరీక్షకు ముందు రోజే వందకు పైగా ప్రశ్నలు లీక్ అయ్యాయంటే, విద్యా వ్యవస్థలో లోపాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థంచేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2024లో జరిగిన నీట్ లీకేజీ ఉదంతం నుండి కేంద్రం ఎలాంటి గుణ పాఠం నేర్చుకోలేదని, ఆ నిర్లక్ష్య వైఖరి వల్లే నేడు మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృత మైందని గుర్తు చేశారు. వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థులకు శాపంగా మారిందని, కేంద్ర సర్కారు తీరువల్ల అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గుర వుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవస్థను ప్రక్షాళన చేయడం లో విఫల మైన ఎన్డీయే ప్రభుత్వం ఈ బాధ్యతను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

నీట్ స్కాంపై బీజేపీపై విమర్శలు

*నీట్-యూజీ 2026 స్కాం బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం*

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వం

కొల్లూర్ మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్

*జహీరాబాద్ నేటిధాత్రి:*

నీట్-యూజీ 2026 పరీక్షలో వెలుగులోకి వస్తున్న పేపర్ లీక్, అవినీతి ఆరోపణలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నాయని ఝరాసంగం మండల కొల్లూర్ గ్రామ మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్ తీవ్రంగా విమర్శించారు. “ఒక దేశం–ఒక పరీక్ష” అంటూ గొప్పలు చెప్పుకున్న బీజేపీ ప్రభుత్వం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును రక్షించడంలో పూర్తిగా విఫలమైందని ఆమె అన్నారు.నీట్ పరీక్షల సమయంలో విద్యార్థులపై అత్యంత కఠిన నిబంధనలు అమలు చేస్తూ, చెవిపోగులు నుంచి జుట్టు క్లిప్పుల వరకు తనిఖీలు చేసే అధికారులు, అసలు ప్రశ్నపత్రాలనే కాపాడలేకపోవడం సిగ్గుచేటని సుగుణక్క మండిపడ్డారు. విద్యార్థులపై మాత్రమే అనుమానం చూపించే ఈ ప్రభుత్వం, వ్యవస్థలో ఉన్న అవినీతిపరులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందని ప్రశ్నించారు.ప్రతి సంవత్సరం నీట్ చుట్టూ పేపర్ లీకులు, మార్కుల గందరగోళం, గ్రేస్ మార్కుల వివాదాలు వస్తూనే ఉండటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అయినా బీజేపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదని, తప్పు చేసిన అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.గతంలో రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు ఉండేవని, కానీ బీజేపీ ప్రభుత్వం బలవంతంగా తీసుకొచ్చిన నీట్ విధానం వల్ల కోచింగ్ మాఫియాలు మాత్రమే లాభపడుతున్నాయని విమర్శించారు. గ్రామీణ, పేద, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు.
పరీక్షలు రద్దు చేయడం, మళ్లీ నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను హక్కుగా కాకుండా వ్యాపారంగా మార్చిన బీజేపీ విధానాల ఫలితమే ఈ పరిస్థితి అని అన్నారు.నీట్-యూజీ 2026 స్కాంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిని ఎంతటి స్థాయిలో ఉన్నా కఠినంగా శిక్షించాలని వారు అన్నారు,

17న అండర్-16 క్రికెట్ జట్టు ఎంపిక

*17న అండర్ 16 బాయ్స్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక..

*సిడిసిఏ అధ్యక్ష,కార్యదర్శులు శ్రీనివాసమూర్తి, సతీష్ యాదవ్…

తిరుపతి(నేటిధాత్రి:

ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్(సిడిసిఏ) ఆధ్వర్యంలో మే 14వ తేదీ ఆదివారం అండర్ 16 బాయ్స్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు సిడిసిఏ అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, కార్యదర్శి సతీష్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్రికెట్ సెలక్షన్స్ తిరుపతి స్థానిక మంగళం రోడ్డులోని కజారియా టైల్స్ ఎదురుగా ఉన్న సీవీ క్రికెట్ అకాడమీ నందు ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సెలక్షన్స్ లో హాజరగు అండర్ 16 బాయ్స్ 1.9.2010 తరువాత, 31.08.2012 లోపు జన్మించిన వారై ఉండాలన్నారు. ఆదివారం జరిగే ఈ సెలక్షన్స్ లో పాల్గొనే క్రికెట్ క్రీడాకారులు తెల్లని దుస్తులు, తమ సొంత క్రీడా సామాగ్రితో పాటు ఆధార్ కార్డు, జన్మ ధ్రువీకరణ పత్రము తప్పక తీసుకురావాలని సూచించారు. ఈ సెలక్షన్స్ కు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రీడాకారులు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ క్రికెట్ సెలక్షన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ యాదవ్ 8886185559, కోచ్ సునీల్ కుమార్ 9000214966, కోచ్ చిన్నబాబు 798188 0381 లను చరవాణి ద్వారా సంప్రదించవలసిందిగా వారు కోరారు…

error: Content is protected !!
Exit mobile version