`ప్రజా సేవలో సాహిత్య ప్రేమికుడు!
`అధికారిగా కర్తవ్యం.. మానసిక ఉల్లాసానికి కవిత్వం.
`సామాజిక శ్రేయస్సు లక్ష్యం.. కవిత్వంతో నిండిన జీవన చైతన్యం.
`కళలంటే ప్రాణం.. కళా పోషణ ప్రపంచం.
`స్నేహం ఒక మధురం.. స్నేహితులకు వరం.
`వృత్తి ఉద్యోగం.. కవిత్వంలో ఉద్యమం.
`కలం కార్మికుడు.. కవిత్వానికి ప్రేమికుడు.
`అనుబంధాలకు ఆప్తుడు.. బంధాలకు భక్తుడు.
`చిన్ననాడే వికసించిన కళల విజ్ఞాన సర్వస్వం.
`అక్షరాలతో పెనవేసుకున్న బంధం.. కలం కార్మికుడిగా ప్రయాణం.
`ఉన్నత జీవితం కోసం కష్టపడి పైకొచ్చిన ఉత్తమ ఆదర్శం.
`యువతకు స్ఫూర్తి నింపిన జీవన ప్రస్థానం.
`అక్షరాలకు అడుగులు నేర్పే కవి అవతారం.
`పదాలుకు పరుగులు నేర్పిన వచన విహారం.
`సమాజ చైతన్యం కోసం కనిపించే అక్షర కాంతి పుంజం.
`అటు వృత్తి, ఇటు ప్రవృత్తి కలబోసిన సాహితీ రత్నం.
`ఉద్యోగిగా శ్రమైక కర్తవ్యం.. సమాజంలో సామాన్య జీవనం.
`అధికారిననే అహం ఎక్కడా కనిపించని వ్యక్తిత్వం.
`అందరిలో కలిసిపోయే గొప్ప మేలిమి తత్త్వం.
`పదిమంది నుంచి ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనే విద్యార్థి గుణం.
`సభలు, సాహిత్య వేదికలలో సాదా సీదాగా ఆహార్యం.
`ఇంతింతై వటుడింతై అనే పదానికి నిర్వచనం.
హైదరాబాద్, నేటిధాత్రి:
కాలం చెప్పే సమాధానాలలో ఎక్కువగా కవులు, రచయితలే కనిపిస్తారు. కాలాన్ని బంధించి తమ అక్షరాలలో బంధిస్తారు. చరిత్ర కారులుగా మారుతుంటారు. చరిత్రలో నిలిచిపోతుంటారు. అందుకే రాజు జీవించే రాత్రి విగ్రహముల మీద, సుకవి జీవించే ప్రజల నాలుక మీద అని పెద్దలు ఊరికే చెప్పలేదు. సామాజిక జిజ్ఞాస అనేది అందరికీ వుండదు. స్వతహాగా వచ్చేది కాదు. అది పూర్వ జన్మ సుక్రతం. రాజుల వద్ద అదికారులుగా వున్న తిమ్మరుసు, అల్లసాని పెద్దన లాంటి వాళ్లు ఇంకా ఈ తరానికి కూడా గుర్తున్నారంటే వాళ్లు కవులు కావడమే..వారి అక్షరాలు ఇంకా మన ముందు కదలాడడమే! పాలకుల్లో కూడా కవులున్నారు. అలాంటి రాజులే నేడు జనానికి గుర్తుంటారు. వేమన లాంటివారి శతకాలు తరతరాలకు దారి చూపే మార్గాలుగా అనుసరిస్తున్నాము. ఆనాటి రాజులైనా, నేటి పాలకులైనా కవి హృదయం వున్నవారిలో పివి. నర్సింహారావు లాంటి వారు తమ పేరును పదిలం చేసుకునేందుకు కవిత్వాన్ని, రచనýనే ఎంచుకున్నారు. అంత గొప్పది అక్షర విన్యాసం. అంత గొప్పది అక్షరంతో కవికి అనుబంధం. నేటి ప్రజా ప్రభుత్వాలలో కూడా అలాంటి ఉన్నతాధికారుల్లో కూడా కవులున్నారు. కవి హృదయం వుంది. కవిత్వాన్ని ప్రేమించే గుణముంది. తన అక్షరాలతో తమ జ్ఞాపకాలనే కాదు, అనుభవాలను జోడించి, రేపటి తరానికి అంందిస్తున్న వారున్నారు. అలాంటి వారిలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ గాజుల ఒకరు. ఆయన తెలంగాణ సమాజానికి పరిచయం అక్కర్లేని అక్షర సామ్రాట్. అదికారిగా ఆయన తెలిసింది కొద్ది మందికే కాని, కవిగా ఆయన కొన్ని వేల మందికి పరిచయం. ఆయనలో వున్న సామాజిక సృహ ఎంతో విభిన్నమైంది. అందరూ అనసరించలేనిది. సహజంగా ఒక వ్యక్తిలో ఏదో ఒక సుగుణం వుంటుంది. కాని అన్ని సుగుణాలు కలబోసుకున్న వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి వుంటుంది. శ్యామ్‌తో శుభోదయం అని ఆయన నిత్యం కొన్ని వేలమందిని తన అక్షరాలతో పలకరిస్తుంటారు. తన సంతోషాలు, ఇష్టాలు పంచుకుంటుంటారు. కొందరు శాసిస్తారు. కొందరు సహనశీలిని కలిగి వుంటారు. కొందరు ఆదేశిస్తుంటారు. కొందరు ఆదరించే గుణం కలిగి వుంటారు. కొందరు ఇతరులనుంచి ఆశిస్తారు. కాని కొందరు ఇతరులకు పంచుతుంటారు. కొందరు అదికారం చూపిస్తుంటారు. మరి కొందరు అభిమానం చూపిస్తుంటారు. వృత్తిపరంగా శ్యాం ప్రసాద్ ఉన్నత స్ధానంలో వున్నారు. అంటే ఆయన శాసించే స్ధాయిలో వున్నారు. కూర్చున్న చోట నుంచి ఆయన ఆదేశాలు జారీ చేసే స్ధానంలో కూర్చున్నారు. ప్రతి విషయంలోనూ ఆదేశాలు జారీ చేసే స్ధాయిలో వున్నారు. అంతే కాదు ఆయన అదికారం చూపించే స్ధాయిని అందుకున్నారు. కాని వ్యక్తిగా ఆయన ఆదర్శంగా నిలుస్తారు. తోటి స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, ఆత్మీయులను ఆదరిస్తూ వుంటారు. తనకు వున్నంతలో తన చుట్టూ వున్నవారికి పంచుతూ వుంటారు. తనంటే ఇష్టం వున్నవారందరినీ ఆయన అభిమానిస్తుంటారు. ఇన్ని మంచి గుణాలు ఒక వ్యక్తిలో వుండడం చాల అరుదు. అందుకే వ్యక్తిగా శ్యాం ప్రసాద్ సమాజంలో గౌరవం పొందుతున్నారు. ప్రజాసేవలో సాహిత్య ప్రియులుంటారు. కాని ఆయన సాహిత్య ప్రేమికుడు. ఎందుకంటే ఇష్టం వేరు. ప్రేమ వేరు. ఇష్టాయిష్టాలు కొన్ని సార్లు మారొచ్చు. కాని ప్రేమ మాత్రం మారదు. అందుకే శ్యాం ప్రసాద్‌కు ఊహ తెలిసినప్పటి నుంచి అక్షరాలను ప్రేమించారు. అక్షర శ్రామికుడిగా తన ప్రస్తానం ప్రారంభించారు. కలం కార్మికుడిగా కష్టం చూశారు. కలం విద్యకు కూడా పదును నేర్పారు. తన అక్షరాలను తీర్చిదిద్దుకున్నారు. తన జీవితానికి దారి వేసుకున్నారు. జీవితంలో గెలవాలంటే యజ్ఞం చేయాలి. అది అక్షరాలతో చేయాలి. అప్ప్పుడే జీవితంలో స్దాయి అనేది దరి చేరుతుంది. అలా ప్రభుత్వ ఉద్యోగం కోసం గ్రూప్స్ రాశారు. ఉద్యోగం సంపాదించారు. నిస్వార్ధ ఉద్యోగిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ప్రస్తుతం ఐఏఎస్ అయ్యారు. తన విధినిర్వహణలో అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. అయితే ఒక ప్రభుత్వ ఉన్నతోద్యోగికి ఎంత ఒత్తిడి వుంటుందో అందరికీ తెలుసు. అలాంటి ఒత్తిడిని జయించేందుకు అదికారులు రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. కాని శ్యాం ప్రసాద్ మాత్రం ఆదినుంచి అక్షరాలతో స్నేహం చేస్తూ వచ్చారు. ఆ స్నేహాన్ని మనసు నిండా అక్షరాలతో నింపుకుంటూ వచ్చారు. అధికారిగా ఆయన కర్తవ్య నిర్వహణలో దీక్షా పరుడుగా గుర్తింపు పొందారు. తన మానసిక ఒత్తిడిని జయించేందుకు కవిత్వాన్ని అల్లుకున్నారు. వాణీ నారాణి అని పిల్లల మర్రి ఎలా సర్వస్వతీ కటాక్షం పొందారో అలాగే శ్యాం ప్రసాద్ కూడా పొందినట్లున్నారు. అందుకే ఉన్నత ఉద్యోగంలో ఇంత ఒత్తిడిలోనూ కూడా ఆయనలో కనిపించే ఉల్లాసం అంతా ఇంతా కాదు. ఎప్ప్పుడూ పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోదు. ఆయన ముఖంలో తేజస్సు తగ్గిపోదు. అది మానసిక ప్రశాంతత కల్గిన వారికే సొంతమౌతుంది. అదికారిగానే కాదు, కవితగా ఆయన సామాజిక శ్రేయస్సును కోరుకుంటారు. ఉభయ కుశలోపరిగా సామాజిక జిజ్ఞాసను కలిగి వున్నారు. కళాపోషణను ప్రపంచం చేసుకున్నారు. ఎందుకంటే ఆయనకు కవిత్వమే కాదు, కళలంటే ఎంతో ప్రాణం. సమాజాన్ని మేలు కొలుపేది కళ అని శ్యాం ప్రసాద్ బలంగా నమ్ముతుంటారు. వృత్తి ఉద్యోమైనా సరే కవిత్వాన్ని ఉద్యమంగా సాగిస్తారు. అనుబంధాలకు ఆయన ఇచ్చే విలువ ఎంతో ఆదర్శమైంది. అలాంటి అనుబంధాలలో ఆయనకు మనుషులే కాదు, జంతువులు కూడా తక్కువ కాదు. ఇంట్లో పెంచుకునే కుక్క పిల్ల దగ్గర నుంచి, తమ దొడ్లో పెరిగే ఆవు, గేదెల వరకు కూడా ఆయన ఎంతో ప్రేమను పంచుతుంటారు. ఇక అనుబంధాల క్రమంలో శ్యాం ప్రసాద్ స్నేహితులకు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. అలాంటి స్నేహితులకు వరంగా కనిపిస్తారు. తన చిన్న నాటి స్నేహితులతో ఆయన కలిసి వుండే తీరు, వారితో పంచుకునే ఆప్యాయత ఎంతో స్పూర్తిదాయకంగా వుంటుంది. ఎందుకంటే సమాజంలో ఒక వ్యక్తి ఉన్నత స్దానానికి చేరుకుంటే వారి స్నేహితులను మర్చిపోతుంటారు. ఒక వేళ గుర్తున్నా వారి పలకరింపులో కూడా గర్వం కనిపిస్తుంది. కాని స్నేహం అనేది గర్వంతో కాకుండా నిండు గుణంతో చేసే వారే అసలైన స్నేహితులు అని శ్యాం ప్రసాద్ నిరూపించుతున్నారు. చిన్న నాటి స్నేహితులే కాదు, ఆయన ఉద్యోగ రిత్యా తనతోటి పనిచేసిన వారిని కూడా స్నేహ సంఘంలో సభ్యులను చేసుకుంటారు. ఎక్కడికెళ్లినా ఆయన తన స్నేహితులను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఉద్యోగిగా ఆయన ఎంత ఉన్నత స్ధానంలో వున్నా సామాన్య జీవనం శ్యాం ప్రసాద్‌లో చూస్తాం. అదికారిగా ఆయన ఎక్కడా అహం ప్రదర్శించిన సందర్భం చూడం. సాహితీ సభలు, సాహిత్య వేదికలకు పిలుపొస్తే చాలు హజరౌతుంటారు. తన కళాపిపాసన ఎంత గొప్పదో చూపిస్తుంటారు. ఇంతింతై వటుడింతై అనే పదానికి నిర్వచనంగా చెప్ప్పుకునే స్దాయికి చేరుకున్నారు.