విగ్రహ ప్రతిష్ట మహోత్సవా నికి హాజరైన గండ్రజ్యోతి

కన్నులపండుగలా విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం ప్రతిపాక గ్రామంలో జరుగు తున్న ఆదిత్యాది నవగ్రహ పునః ప్రతిష్ట మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన భూపాలపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిని పత్తిపాక భక్త బృందం వారికి ఘన స్వాగతం పలికారు, అనంతరం దేవతామూర్తుల దర్శనం చేసుకుని, భక్తులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు పసుల ప్రవీణ్ కుమార్, గాదె రాజేందర్, దాసి శ్రావణ్ కుమార్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి నందం, ముఖ్య నాయకులు గంటా శ్యాంసుందర్ రెడ్డి దంపతులు, సావుళ్ళ కిష్టయ్య, కరుణ్ బాబు, బండ నారాయణరెడ్డి, పల్లవేనా రామరాజు గజ్జిరాజు, పోతుగంటి సుభాష్, మాందాడి రాజు, కుసుమ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

18వ రోజు రిలే నిరాహార దీక్ష

18వ రోజు రిలే నిరాహార దీక్ష

మంచిర్యాల నేటి దాత్రి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గల శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి 26 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ యాజమాన్యం చెల్లించకపోవడంతో కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికులు రిలే నిరాహార దీక్షకు పోనుకోవడం జరిగింది. అందులో భాగంగానే పవర్ ప్లాంట్ గేట్ ముందు ఈరోజు 18వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతాఉంది. ఇప్పటికైనా కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లిస్తానని ఒప్పుకొని యాజమాన్యం ముందుకు రాని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియూత నిరసన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా కంపెనీకి సంబంధించిన భూములలో గుడిసెలు వేసుకోనైన కార్మిక హక్కులను సాధించుకోవడానికి
సిద్ధంగా ఉన్నామని శాలివాహన పవర్ ప్లాంట్ యాజమాని ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా బిజెపి పార్టీ నుండి పోటీ చేయుచున్న మల్కా కొమురయ్య కి తెలియజేస్తున్నాం, అదేవిధంగా కొంతమంది,బి.ఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు యాజమాన్యానికి తొత్తులుగా మారి, కార్మికులకు సెటిల్మెంట్ కాకుండా చాలా రోజులుగా వివిధ రకాలుగా అడ్డుపడడం జరుగుతుంది, కంపెనీ భూములలో గుడిసెలు వేస్తామంటే అడ్డుపడ్డారు, కంపెనీలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తే అడ్డుపడ్డారు, ప్రస్తుతం కంపెనీ అమ్ముతున్న భూములలో మరియు కార్మికులకు రావాల్సిన బెనిఫిట్ లలో పర్సంటేజ్ లకు ఆశపడి కార్మికులను ఆర్థికంగా మోసం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు త్వరలో తగిన గుణపాఠం చెప్పడానికి కార్మిక సంఘం నాయకులం సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్, ప్రధాన కార్యదర్శి నిమరాజుల సత్యం, ఉపాధ్యక్షులు కాయితి శ్రీనివాస్, కోశాధికారి పెంట సత్యం,ఆసరి రాజయ్య, సిరిపురం తిరుపతి, కాయితి బుచ్చయ్య, ఈసారపు శంకర్, సిహెచ్ చందు, ఆసరి పోశం, మరియు కార్మికులు పాల్గొన్నారు..

మిల్స్ కాలనీ సిఐ మరియు ఎస్ఐ లకు కోర్టు ధిక్కరణ నోటీస్ లు జారీ చేసిన గౌరవ హైకోర్టు

ఫిబ్రవరి, 21 తేదీన హాజరు కావాలని హైకోర్టు ఆదేశం:-

 

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-

 

ఒక సివిల్ తగాదా లో హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ దానిని అమలు చెయ్యకుండా పిటిషనర్ల మీదనే కేసు నమోదు చేసిన విషయంలో గౌరవ హైకోర్టు మిల్స్ కాలనీ సిఐ వెంకట రత్నం మరియు ఎస్ ఐ శ్రీకాంత్ లకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే ఏలుకుర్తి వాల్మీకి మరియు వారి కుటుంబ సభ్యులు తమకున్న ఫోర్ట్ వరంగల్ లో గల దూపకుంట లో సర్వే నెంబర్ 1263 (పాతది) 740 (కొత్తది) లో 2- 00 ఎకరాల భూమి కలదు. ఇట్టి భూమి పైకి బత్తుల సంపత్ కుమార్ మరియు కొందరు వచ్చి ఆక్రమించే ప్రయత్నం చెయ్యడం వలన సీనియర్ సివిల్ జడ్జి, వరంగల్ కోర్టు లో బత్తుల సంపత్ మరియు అతని కుమారునిపై సివిల్ దావా వెయ్యడం జరిగింది, ఇందులో గౌరవ కోర్టు వారు వాల్మీకి వాళ్లకు ఇంట్రిమ్ జంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఐనా బత్తుల సంపత్ మరియు అతని కుమారుడు భూమి పైకి దౌర్జన్యంగా రావడం వలన వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. గౌరవ హైకోర్టు వారు కింది కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను అమలు చెయ్యమని మిల్స్ కాలనీ పోలీస్ లను ఆదేశించింది. ఇట్టి విషయాన్ని వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు సిఐ దృష్టికి తీసుక పోయారు, కానీ ఇంతలో మళ్ళీ బత్తుల సంపత్ మరియు అతని కుమారుడు మళ్ళీ భూమి మీదకు వచ్చి దౌర్జన్యం చెయ్యగా వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు సిఐ గారిని ఆశ్రయించారు, కానీ సిఐ గారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా బత్తుల సంపత్ ఇచ్చిన దరఖాస్తు మీద వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యుల పై కేసు నమోదు చేశారు. ఇట్టి విషయంలో వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు మళ్ళీ గౌరవ హైకోర్టు ను ఆశ్రయించి పోలీసుల పై కోర్టు ధిక్కరణ కేసు వేశారు, గౌరవ హైకోర్టు తేదీ 24-01-2025 నాడు మిల్స్ కాలనీ సిఐ మరియు ఎస్ఐ లకు కోర్టు ధిక్కరణ నోటీస్ లు జారీ చేస్తూ ఈ నెల 21 తారీకున వ్యక్తిగతంగా కానీ లేదా న్యాయవాది ద్వారా కానీ హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్.

భూపాలపల్లి నేటిధాత్రి..

 

మొగుళ్ళపల్లి ఎస్సీ హాస్టల్ విద్యార్థి వాగు చెక్ డ్యామ్ లో పడి చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని పమర్శించిన సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బుచ్చయ్య గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో చదువుకుంటూ విద్యార్థులు రోజువారిగా బడికి పోతున్నారా లేదా అనేది పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యం మూలంగానే సంతోష్ ఇతరులు పిలిస్తే పొలం పనులకు వెళ్లి వాగులో ఉన్నటువంటి చెక్ డ్యాంలో పడి చనిపోయినాడు కానీ ఈతకు వెళ్లి చనిపోయారని అనడం విడ్డూరంగా ఉంది రాత్రికి రాత్రే రెండు లక్షలు రూపాయలు మాట్లాడి రాత్రి రాత్రికే ధాన సంస్కారాలు చేశారు విద్యార్థి మృతికి కారణమైన వారిని పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్రేసే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే విచారణ చేపట్టాలని హాస్టల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల కోసం ప్రభుత్వం మెనూ చార్జీలు కూడా పెంచింది నిరుపేద దళిత పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలని మంచి భోజనాన్ని ఇచ్చింది ప్రభుత్వం కానీ దుర్మార్గం ఏమిటంటే లక్షల రూపాయలు జీతాలు తీసుకున్నటువంటి అధికారులు హాస్టల్లో స్థానికంగా ఉండకపోవడం వారానికి రెండుసార్లు మూడుసార్లు రావడం ఏ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనేది పర్యవేక్షణ చేయకపోవడం అసలు పిల్లలందరూ బడికి పోతున్నారా లేదని చూడకపోవడం ఇట్లాంటి నిర్లక్ష్యం మూలంగానే నిరుపేద దళిత విద్యార్థి చనిపోవడం అనేది చాలా బాధాకరం ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే జిల్లా డిడి లోకల్ హాస్టల్స్ ను ప్రతి వారానికి ఒకసారి తనిఖీ చేయాలి కానీ వార్డెన్ చెప్పిందే వింటూ ఏ హాస్టల్లో కూడా జిల్లా డిడి తనిఖీ చేసిన దాఖలు కానరావడం లేదు అంటే పరోక్షంగా జిల్లా అధికారులు కూడా దీనికి ప్రధాన భాద్యత వహించాలి తక్షణమే నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకొని చట్టపరమైన కేసులు నమోదు చేసి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్

బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మృతి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన తంగళ్ళపల్లి మండల మాజీ బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్.అధ్యక్షులు నిన్న రాత్రి 8:30కు పరమపదించినా రు ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు వారి మరణం పార్టీకి తీరని లోటు అని తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీలో 2009 నుంచి పార్టీలో పని చేస్తూ పని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మండలంలోని ఎన్నో పదవులు చేసిన రఘువర్మ ఈరోజు మాలో లేకపోవడం చాలా దురదృష్టకరమనితెలియజేస్తూ పార్టీపరంగా ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ పార్టీలో పెద్దలతో మాట్లాడి ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ పరంగా చనిపోయిన రఘు వర్మ కుటుంబాన్ని అన్ని అన్ని విధాలుగాఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ మాజీ ఎంపీపీ పడిగల మానస రాజు మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తిరుమల స్వామివారికి చక్రస్నానం

నిజాంపేట: నేటి ధాత్రి

 

తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గల స్వయంభుగా వెలసిన శ్రీ తిరుమల స్వామి దేవస్థానంలో గత మూడు రోజుల నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఘనంగా కొనసాగిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు స్వామివారికి చక్రస్నానం చేయించి దేవాలయం లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, కాకి రాజయ్య, ఎల్లగౌడ్ లు ఉన్నారు.

నూతన కమిషనర్ ను కలిసిన మాజీ కౌన్సిలర్ లు

పరకాల నేటిధాత్రి

హన్మకొండ జిల్లా పరకాల పట్టణ మున్సిపల్ కమీషనర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన చెల్పూరి వెంకటేష్ ని మున్సిపల్ 12వ వార్డు మాజీ కౌన్సిలర్ బండి రాణి సదానందం గౌడ్ మరియు 14వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉమాదేవి రఘుపతి గౌడ్ లు మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

భద్రాచలం నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ గా రావుల నరేంద్ర కుమార్(నాని)..

కాంగ్రెస్ పార్టీకి బలి చక్రవర్తి
యువజన నాయకుడు…

సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత.

నూగూర్ వెంకటాపురం

(నేటి ధాత్రి ) పీబ్రవరి 6 ములుగు జిల్లా వెంకటాపురం మండలం

సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్న వెంకటాపురం మండల నివాసి రావుల నరేంద్ర కుమార్ కు వరించిన భద్రాచలం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్ష పదవి. రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరగిరి ప్రీతం, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ డబ్బేటి రమేష్ గారి చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చింతిరియాల రవికుమార్, ములుగు జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ దాసరి సుధాకర్ సమక్షంలో నియామక పత్రాన్ని అందుకున్న రావుల నరేంద్ర కుమార్ ( నాని)
ఈ సందర్భంగా గురువారం నాడు డిసిసి అధ్యక్షులు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య గారు మాట్లాడుతూ మీలాంటి డైనమిక్ యువత పార్టీకి ఎనలేని చావా అందించాలని మీ వల్ల పార్టీకి ఎంతో మేలని అయినా కొని ఆడారు సుదీర్ఘకాలం పార్టీకి పనిచేసినందుకు తగిన గుర్తింపు లభించిందని, కాంగ్రెస్ పార్టీ లో కష్టపడ్డ వారిని ఎవర్ని విస్మరించదని ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా రావుల నాని మాట్లాడుతూ భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చింతిరియాల రవి ములుగు జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ దాసరి సుధాకర్, కాంగ్రెస్ నాయకులు కిరణ్ కుమార్ వర్మ. ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు.

సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

అరెస్ట్ లు ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనం

నర్సంపేట,నేటిధాత్రి:

తాజా మాజీ సర్పంచులు గ్రామాల అభివృద్ధి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సర్పంచ్ ల ఫోరం వరంగల్ జిల్లా నాయకులు తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఆ బిల్లులు ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ లో సచివాలయం వద్ద శాంతియుతంఘా జరిగే నిరసన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమానికి హైదరాబాద్ మాజీ సర్పంచ్లు బయలుదేరారు.ఈ నేపథ్యంలో వారిని దుగ్గొండి పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్, తొగర్రాయి సర్పంచ్ ఓడేటి తిరుపతి రెడ్డి, ముద్దునూర్ సర్పంచ్ రేవూరి సురేందర్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. సర్పంచులను ముందస్తు అరెస్ట్ చేసి గొంతును నొక్కిపట్టి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా పోలీసులు వ్యవహరించడం తీరు మంచిది కాదని అన్నారు.ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే పెండింగ్ బిల్లు చెల్లిస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేసి నేడు మంత్రి సీతక్క కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 12,000 మంది సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తూ రోజుకు ఒకచోట ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఏర్పడుతున్న పట్టింపు లేనట్టు ముసలి కన్నీరు కారుస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

పరకాలలో విధులు బహిస్కరిస్తూ నిరసన న్యాయవాది పై దాడి సరికాదు 

పరకాల నేటిధాత్రి..

హనుమకొండ జిల్లా న్యాయవాది గంధం శివ పై ట్రాఫిక్ ఎస్ఐ మరియు సిబ్బంది దౌర్జన్యం గా దాడి చేసి తప్పుడు కేసులు నమోదుచేసారని న్యాయవాది పై దాడిని నిరసిస్తూ పరకాల పట్టణంలోని స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ న్యాయస్థానం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల మీద దాడి చేయడం హెయమైన చర్య అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓ.రాజమౌళి,జి. నరేష్ రెడ్డి,పి. వేణు యాదవ్,గూడెల్లి రాహుల్ విక్రమ్,రమేష్,సురేష్,పవన్, రాజేందర్,రాజశేఖర్, చంద్రమోహన్ లు పాల్గొన్నారు.

క్రమంగా పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు

`ఇప్పటికీ మహిళల ఆత్మహత్యలే అధికం

`స్త్రీపురుషుల ఆత్మహత్యలు పెరిగితే సమాజానికి నష్టం

`గృహహింసను అరికట్టేందుకు మరో మార్గం అవసరమేమో?

`మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరం

`ఆధిపత్య ధోరణే అనర్థాలకు మూలం

`ఆనందం కావాలంటే కుటుంబంలో ప్రేమ అవసరం

`ప్రేమ మాత్రమే కుటుంబాన్ని బంధించే బలీయమైన బంధం

`అహంకారాన్ని వదిలేస్తే మిగిలేది సంతోషమే

`దీన్ని గుర్తిస్తే జీవితం స్వర్గమయం లేదంటే నరక ప్రాయం
హైదరాబాద్‌,నేటిధాత్రి:
వైవాహిక సంబంధాల సమస్యల కారణంగా ఏటా సగటున మనదేశంలో లక్షమంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండు నెలల క్రితం బెంగళూరులో అతుల్‌ సుభాష్‌ (35) ఆ త్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సోషల్‌మీడియామరియు టెలివిజన్‌ యాంకర్లు పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కథనాలు రూపొందించడం, ప్రసారం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా పురుష హక్కుల కా ర్యకర్తలు (మెన్స్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌) ఈ పెరుగుతున్న ఆత్మహత్యలకు దేశంలో లింగ వివక్షతో కూడి, స్త్రీ అనుకూల చట్టాలే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ న్యాయసం హిత (బీఎన్‌ఎస్‌)లోని 85, 86 సెక్షన్లను (పూర్వపు ఇండియన్‌ పీనల్‌కోడ్‌లోని 498ఎ సెక్షన్‌)ను ‘లింగ తాటస్త్యం’ (జండర్‌ న్యూట్రల్‌)గా మార్పు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మహిళలపై, భర్త మరియు అతని కుటుంబ సభ్యులు పాల్పడే గృహహింసకు సంబంధించి ఈ సెక్షన్లను రూపొందించారు. ‘స్త్రీవాదం’, ‘మహిళా సాధికారత’ అనేవి ఇప్పుడు వికృతస్థాయికి చేరుకొని,ఏకంగా భార్యలే, భర్తలను ఆత్మహత్యలు చేసుకునేలా పురిగొల్పే దశకు సమాజాన్ని తీసుకెళ్లాయని వారు గగ్గోలు పెడుతున్నారు.
అయితే భారత ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వీరు చెబుతున్న అంశాలకు భిన్నంగా వుండటం గమనార్హం. ఇప్పటికీ దేశంలో సింహభాగం మహిళలు తీవ్ర వివక్షకు గురవుతూనే వున్నారని ప్ర భుత్వం వాదిస్తోంది. లైంగిక దాడులు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, బహిరంగ ప్రదేశాల్లోమహిళల వేధింపులు, గృహహింస, వరకట్నహత్యలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే దేశంలో మహిళలపై జరిగే హింసాత్మక సంఘటల్లో పెద్దగా మార్పు లేదన్న సంగతి స్పష్టమవు తుంది.
ఆత్మహత్యలకు కారణాలు
పరిశీలిస్తే సాధారణంగా ఆత్మహత్యలకు ఏదో ఒక్క బలీయమైన అంశం మాత్రమే కారణంగా వుంటుంది. సామాజిక, సాంస్కృతిక, వ్యవస్థీకృత మరియు ఆర్థిక కారణాలు ఇందుకు ప్రేరేపిస్తా యి. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌.సి.ఆర్‌.బి) రికార్డులను పరిశీలిస్తే పై కారణాల్లో ఏదో కొటి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్‌.సి.ఆర్‌.బి. డేటాను పరిశీలిస్తే ఈ ఆత్మహత్యల సంఘటనల విషయంలో విభిన్న పోకడలు కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
2015-22 మధ్య కాలంలో అంటే ఎనిమిదేళ్ల కాలంలో ఏటా సగటున 1,01,188 మంది పు రుషులు ఆత్మహత్యలకు పాల్పడితే, 43,314 మంది మహిళలు మాత్రమే బలవన్మరణాలకు గురికావడం గమనార్హం. ప్రతి లక్షమంది పురుషుల్లో ఈ ఆత్మహత్యల రేటు 14.2% వుంటే, మహిళల్లో ప్రతి లక్షమందికి 6.6%గా వుంది. భారత్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం కుటుంబ సమస్యలే! మొత్తం ఆత్మహత్యల్లో ఈ కారణంగా జరిగే ఆత్మహత్యలు 23.06%గా వుంటున్నాయి. అయితే ఈవిధంగా ప్రేరేపిస్తున్న కుటుంబ సమస్యలేంటో ఎన్‌.సి.ఆర్‌.బి. స్పష్టంగా నిర్వచించలేదు. ఫలితంగా వీటిపై ఎవరికి అనుకూలమైన వ్యాఖ్యలు వారు చేస్తున్నారు. ఆత్మహత్యలకు రెండో అతిపెద్ద కారణం అనారోగ్యం. దీనివల్ల 23% ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
వైవాహిక సంబంధాలు
ఇక ఆత్మహత్యలకు కారణాల్లో వైవాహిక సంబంధాలు మూడోస్థానం ఆక్రమిస్తున్నాయి. వీటివల్ల పురుషుల్లో 3.28%, మహిలల్లో 9.66% ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. ఈ వైవాహిక సంబంధ ఆత్మహత్యలను ఎన్‌.సి.ఆర్‌.బి ఐదు సబ్‌గ్రూపులుగా విడగొట్టింది. అవి వరుసగా పెళ్లి కు దరకపోవడం, వరకట్న వివాదాలు, వివాహేతర సంబంధాలు, విడాకులు మరియు ఇతరాలు. ఈ సమస్యల కారణంగా ఈ ఎనిమిదేళ్ల కాలంలో (2015`22) 26,588మంది పురుషులు, 33,480మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీటిల్లో మహిళల్లో అత్యధిక సంఖ్యాకులు (14,250) మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం వరకట్నం! ఇక పురుషుల్లో పెళ్లి కుదరకపోవడం అత్యధిక ఆత్మహలకు (10,119) కారణమవుతోంది. ఇక్కడ పెళ్లి కుదరక పోవడం అనేదానికి స్పష్టమైన నిర్వచనం లేదు. అంటే అవివాహితులని అర్థం. తప్పుడు వాగ్దానాలు, మోసం లేదా ఆర్థికపరమైన దోపిడీ, వరకట్న డిమాండ్‌లు, బెదిరిపుంలు లేదా వేధింపులు వంటి కారణాలవల్ల వివాహం కాకపోవడం లేదా రద్దు జరిగినప్పుడు ఈ పెళ్లి కుదరక పోవడం అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. 2015`22 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 8,09,506 మందిపురుషులు ఆత్మహత్యలు చేసుకో గా వీరిలో రైతులు, రైతు కూలీల సంఖ్య 10%అంటే81,402. రైతుల్లో ఆత్మహత్యలకు ప్రధాన కారణం పంటలు దెబ్బతినడం. ఇక ఇందులో సబ్‌ కేటగిరీలేమీ లేవు.
ప్రమాదకరమైన పద్ధతులు
ఒక పరిశోధనా పత్రం ప్రకారం పురుషులు ఆత్మహత్యలకు అత్యంత ప్రమాదరకరమైన పద్ధతు లు అనుసరిస్తే, స్త్రీలు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ ఉన్నంతలో త్వరగా, తక్కువ క ష్టంతో ప్రాణంపోయే పద్ధతులను అనుసరిస్తున్నట్టు తేలింది. పురుషులో ఎంచుకునే ప్రమాదకర మైన విధానాల్లో రైలుకింద పడటం, సజీవదహనం వంటివి వుంటున్నాయి. ఇటువంటి కేసుల్లో తిరిగి బతికే అవకాశాలు చాలా తక్కువ. ఆత్మహత్యలకు పాల్పడానికి స్త్రీపురుషులు అనుసరించే విధానాల్లో తేడాలను స్పష్టంగా అవగాహన చేసుకుంటే, ఆత్మహత్యలనుంచి వారిని కాపాడే వ్యూ హాల్లో మార్పుల తేవడం లేదా కొత్త వ్యూహాలను అనుసరించడం చేయవచ్చు. నిద్రమాత్రలు, నీళ్ల లో దూకడం, విషం తాగడం వంటి ప్రక్రియల ద్వారా పదిమంది మహిళల్లో మరణాలు సంభవిస్తే, ఇవే పద్ధతుల్లో మరణించే పురుషుల సంఖ్య 21గా (10:21)గా వుంటోంది. ఇక వాహనాల కింద మరణించేవారి నిష్పత్తి 10:65 కాగా విద్యుత్‌ షాక్‌ వల్ల సంభవించే మరణాలు 10:35గా వుంటున్నాయి. ఈ నిష్పత్తులను పరిశీలిస్తే అధికశాతం మంది పురుషులు ఆత్మహత్యలకు మరింత హింసాత్మక పద్ధతులను అనుసరిస్తున్నట్టు తెలుస్తుంది. వీరిలో మరణాలరేటు అధికంగా నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో పురుషుల్లో ఆత్మహత్యలను నివారించ డం ఒక సవాలుగా మారింది.
498ఎ సెక్షన్‌
ఇండియన్‌ పీనల్‌కోడ్‌లో 498ఎ సెక్షన్‌ను ప్రభుత్వం 1983లో చేర్చింది. వైవాహిక పరమైన హింసనుంచి మహిళలకు రక్షణ కల్పించడమే ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టడం యొక్క ముఖ్యోద్దేశం. ముఖ్యంగా మహిళలపై భర్త, అతని కుటుంబ సభ్యులు, వేధింపులకు పాల్పడటం, భౌతిక హిం సలనుంచి రక్షణకల్పించడానికి ఈ సెక్షన్‌ను చేర్చారు. మరోరకంగా చెప్పాలంటే పితృస్వామ్య వ్య వస్థలో మహిళలకు రక్షణ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. తర్వాత ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లో ఈ సెక్షన్‌ను రెండుగా అంటే 85,86గా విడగొట్టారు. 85వ సె క్షన్‌ భర్త లేదా అతని బంధువు, హింసకు పాల్పడటాన్ని పేర్కొంటే, 86వ సెక్షన్‌ పాల్పడే వివిధ రకాల హింసల వివరాలను తెలియజేస్తుంది. ఏటా 498ఎ సెక్షన్‌ కింద లక్ష కేసులు నమోదవు తున్నాయి. ఎన్‌.సి.ఆర్‌.బి. డేటా ప్రకారం కేవలం 2022లో దేశంలో 1,40,019 కేసులు నమోదయ్యాయి. ఈ ఎనిమిదేళ్ల కాలంలో మహిళలపై భర్త అతని బంధువులు పాల్పడే హింస క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం. అయితే నేర నిరూపణ కేవలం 15.7% కేసుల్లో మాత్రమే జరుగుతోంది. మహిళా హక్కుల కార్యకర్తలకు ఈ 498ఎ సెక్షన్‌ ఆనందం కలిగించినా, నేర ని రూపణ కేసులు చాలా స్వల్పంగా వుండటం నిరుత్సాహం కలిగిస్తోంది. వ్యవస్థలో లోపమే ఇందుకు ప్రధాన కారణమన్నది వారి వాదన. అయితే పురుష హక్కుల కార్యకర్తలు చెప్పేదేమంటే, చాలా తక్కువ కేసుల్లో నేర నిరూపణ కావడం, పురుషులపై మహిళలు పెడుతున్న తప్పుడు కేసులు,వారిని వేధింపులకు గురిచేస్తున్నారనడానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.
సాక్ష్యాధారాల లేమి
నేర నిరూపణ కాకపోవడానికి ప్రధాన కారణం స్పష్టమైన సాక్ష్యాధారాలు లేకపోవడం. ముఖ్యం గా మానసిక హింసకు సంబంధించిన ఆధారాలు వుండటంలేదు. ఇతర సెక్షన్లు హత్య (సెక్షన్‌ 302), వరకట్న హత్య (సెక్షన్‌ 304బి)కు సంబంధించిన కేసుల్లో మాత్రమే నేర నిరూపణ జరుగుతోంది. 498ఎ సెక్షన్‌ కింద మహిళలు కేసు పెట్టాలంటే, వారికి సామాజికపరమైన సమస్య లు మరో అడ్డంకిగా వున్నాయి. ప్రధానంగా వీరిని అత్తగారింటికి రానీయరు. ఆర్థికపరమైన మద్దతు, ప్రత్యామ్నాయ వసతి లేనప్పుడు వారు నిలువనీడలేని దుస్థితిని ఎదుర్కొనాల్సి వుంటుంది. మరికొన్ని కేసుల్లో విడాకులు తీసుకోవడం ద్వారా వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నా రు. దీనివల్ల తమకు జరిగిన అన్యాయంపై పోరాడే పరిస్థితిలేకుండా పోతున్నది. ఇటువంటి పరిస్థితులు మహిళలను ముందుకెళ్లనీయడంలేదు.
కుటుంబాన్ని బంధించేది ‘ప్రేమ’ మాత్రమే
మొత్తంమీద చెప్పాలంటే భారతీయ సమాజంలో ఆలోచనా ధోరణులు, పోకడల్లో మార్పులు వస్తు న్నాయి. స్త్రీ లేదా పురుషుడు ఎవరికి అవకాశాలు వుంటే వారు తమ ఆధిపత్యాన్ని, హింసాత్మక ధోరణిని ప్రదర్శించడానికి వెనుకాడటంలేదు. వైవాహిక బంధంలో ప్రేమకు బదులు ఆధిపత్యం, అహంకార ధోరణులు పెరుగుతుండటం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మానసిక బలహీనులు, మానసికంగా దృఢంగా వుండేవారు స్త్రీపురుషులిద్దరిలో వుంటారు. సమాన ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన వైవాహిక జంటల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, విడాకులు, పరస్పర హింస అనేవి క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం. పితృస్వామ్యంలో పురుషులవల్ల, మాతృస్వా మ్యంలో మహిళల వల్ల హింసాత్మక ధోరణులు పెరుగుతుంటాయి. ఇక్కడ ఎవరు గొప్ప లేదా ఎవరి వల్ల ఎవరు బాధపడుతున్నారనేది కాదు ప్రశ్న! ఇద్దరిలో ఎవరు బలీయంగా, మానసికంగా దృఢంగా వుండి విపరీత ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తారో వారివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో స్త్రీ పురుషుడు అనే తేడా లేదు. మానసిక పరమైన భావోద్వేగాలు ఇద్దరికీ సమా నమే! జీవితంపై దృఢవిశ్వాసం వున్నవారు ఎదుటివారిని లెక్కచేయరు. ఫలితం సంఘర్షణ. ప్రస్తుతం వైవాహిక సంబంధాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం ఇదే! ‘ప్రేమ’, ‘కుటుంబం పట్ల మమకారం’, ఒకరి సంతోషంలో మరొకరు ఆనందం పొందే ప్రవృత్తి మాత్రమే ఈ హింసా ప్రవృత్తికి విరుగుడు. ఆధిపత్యం స్థానాన్ని సమర్పణభావం, హింస స్థానాన్ని అహింస, కోపం స్థానాన్ని ప్రేమ ఆక్రమిస్తే కుటుంబాలు శాంతిగా, ఆనందమయంగా కొనసాగుతాయి.

40 రోజుల కోడి..రోగాల పుట్ట!

`40రోజుల కోడీలో నాణ్యతఎంత? దానితో ఆరోగ్యమెంత?

`ఆరు నెలలకు ఎదగాల్సిన కోడి 40 రోజులకే కోతకొస్తోంది.

`జనాలకు రోగాలను మోసుకోస్తోంది.

`భయంకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తోంది.

`ఒకప్పుడు బయిలర్‌ కోడి దశ 180 రోజులు.

`తర్వాత కొంత కాలానికి 120 రోజులు.

`మరింత కాలం గడిచాక 80 రోజులు.

`ఇప్పుడు కేవలం 40 రోజులు.

`అదెలా సాధ్యం? ప్రాణాలతో చెలగాటం?

`గుడ్డు నుంచి కోడి వచ్చే కాలం పోయింది.

`గుడ్డే లేని పిల్ల తయారౌతోంది.

`భయంకరమైన మందుల వాడకంతో నెలకే కోతకు రెడీ అవుతోంది.

`ఆ మందుల ప్రభావం మన మీద పడుతోంది.

`ముఖ్యంగా ఆడ పిల్లల జీవితాలపై అధిక ప్రభావం చూపుతోంది.

`హార్మోన్ల సమతూకాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.

`క్లినికల్‌గా నిరూపణ అయ్యింది.

`అయినా మనమెందుకు ఊరుకుంటాం!

`కోడి కూర కొనుక్కొని తెచ్చుంటూనే వుంటాం.

`బిపి, షుగర్‌ల బారిన చిన్న వయసులోనే పడుతున్నాం.

`ఫ్యాట్‌ లెస్‌ వైట్‌ మీట్‌ అనుకుంటున్నాం!

`క్యాన్సర్‌ బారిన పడిపోతున్నాం!

`పేర్లు కూడా తెలియని రోగాలను తెచ్చుకుంటున్నాం.

`మటన్‌ ధరకు భయపడి చికెన్‌ అలవాటు చేసుకున్నారు.

`తక్కువ ధరకు వస్తోందని చికెన్‌ కోసం ఎగబడిపోతున్నాం.

`పౌల్ట్రీ లో చిరు రైతులు ఎప్పుడో చితికిపోయారు.

`కార్పోరేట్‌ పౌల్ట్రీకి భయపడి కోళ్ల పెంపకమే మానేశారు.

`ఏవి వైరస్‌ సోకిన కోళ్లో, ఏవి మంచి కోళ్లో కూడా చూసుకోకుండా కొంటున్నాం?

`షాపు వాడు ఇచ్చిందే చికెన్‌ అని రోజూ లొట్టలేసుకొని తింటున్నాం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  నాకు ముక్కలేనిదే ముద్ద దిగదు..ఈ మాట చాలా అనడం వింటుంటాం. అది ఎంతో గొప్పగాచెప్పుకుంటారు. సంపాదన దండిగా వున్నవారే కాదు,జిహ్వ చాపల్యం వున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి మాటలను చెబుతూవుంటారు. ఈ ముక్క చాలప్యంలో రకరకాలుంటాయి. మాంసాలలో రకరకాలు వున్నాయి. కాని వచ్చిన చిక్కల్లా కోడి మాంసంతోనే వస్తోంది. తంట అంతా ఆ ఫౌల్ట్రీ చికెన్‌తో వుంటోంది. చికెన్‌ మంచిది కాదనుకునేవారు ఎక్కువగా ఆది వారాలలో మటన్‌ తెచ్చుకుంటారు. కాని ఎక్కువ మంది చికెన్‌ ప్రియులుంటారు. ధర మటన్‌తో పోలిస్తే తక్కువ. ఒక్కసారి మటన్‌ తెచ్చుకునే ఖర్చుతో వారంలో మూడు రోజులు చికెన్‌ తినొచ్చనే ఆలోచన వున్నవారు కూడా చాలా మంది వుంటారు. ఆ మూడు రోజులతోపాటు మిగతా నాలుగు రోజులు కూడా ముక్కను భోజనంలోకి చేర్చుకుంటున్నారు. ఒకప్పుడు బంధువులొస్తేనో..లేక పంగడలొస్తేనో..గ్రామ దేవతలకు మొక్కుల కోసమో కోడి కూర తినేవారు. కాకపోతే అది నాటు కోడి. కాని ఇప్పుడు ఆ నాటు కోళ్ల జాడలేదు. పల్లెలు పెరిగి, పట్నాలు విస్తరించిన తర్వాత ఇంట్లో కోళ్లను పెంచుకునే పరిస్దితి లేదు. ప్రజలు వుండడానికే చోటు లేక అంతస్దుల మీద అంతస్తులతో నిర్మాణాలు చేసే అప్పార్టుమెంట్లలో జీవిస్తున్నారు. ఇలాంటి వారికి కోళ్లను పెంచుకోవడమేమో కాని, చూడడం కూడా కుదరదు. అలాంటి వాళ్లు ఖచ్చితంగా పౌల్ట్రీ చికెన్‌ మీద ఆదారపడతప్పదు. అదే తినక అసలే తప్పదు. నగరాల్లో నాటు కోళ్లు అమ్మకాలు ఎంత సాగినా, వాటి ధర కూడా మేక మాంసంతో సమానంగా వుంటుంది. అందువల్ల చికెన్‌ ప్రియులంతా పౌల్ట్రీ చికెన్‌ తినకతప్పదు. మరి మనం తింటున్న చికెన్‌ ఎంత మేలైంది. ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడేది. రుచి కోసం తింటున్నామా? లేక తినాలని తింటున్నామా? అన్నదికూడా తెలియకుండానే రోజూ ముక్క మీద ముక్క లాగిస్తున్నాం. కాని ఆ చికెన్‌ మూలంగా ఎన్ని అనర్ధాలు ఎదురౌతున్నాయో తెలిసిన వాళ్లే ఎక్కువా తింటున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు పౌల్రీ కోడి కూడా షెడ్డులలో ఆరు నెలలకు కోతకు వచ్చేది. ఆరు నెలల కాలం పాటు అది అన్ని రకాల జాగ్త్రత్తలో పెంచేవారు. కాని ఆ రైతులకు అది గిట్టుబాటు పెద్దగా లేకుండాపోయింది. పైగా డిమాండ్‌ అండ్‌ సప్లయ్‌లో వెనుకబడి పోయింది. దాంతో ఎప్పటికప్పుడు జరిగే పరిశోధనల్లో నాలుగు నెలల కోడి తయారైంది. దాంతో పౌల్ట్రీ షెడ్లను వ్యాపారులు పెంచుకున్నారు. పెట్టుబడికి తగిన లాభం వస్తుండడంతో చాలా మంది పౌల్ట్రీ వ్యాపారంలోకి దిగారు. తర్వాత కొంత కాలానికి మూడు నెలల కోడి పుట్టుకొచ్చింది. ఇంకేముంది రోగాలను కొంచెంకొంచెం మోసుకొచ్చే కోడి మన ఇంటికొచ్చింది. మన ఒంట్లోకి చేరడం మొదలైంది. ఒక దశలో మార్కెట్‌లో పప్పుదరల కన్నా చికెన్‌ధర తగ్గింది. ఆఖరురు ఉల్లి పాయల ధరకనా, కొన్ని సార్లు టమాట దరలకన్నా చికెన్‌ తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చింది. బ్లాక్‌ మార్కెట్‌ దారులు ఉల్లిపాయలు, టమాటలను బ్లాక్‌ చేయడమేమో కాని, ప్రజలకు చికెన్‌ తినడం మరింత అలవాటుగా మారింది. మూడు నెలల కోడి కాస్త రెండు నెలలకు వచ్చేసింది. రెండు నెలల్లో పెరిగి తినడానికి వీలుగా ఎదిగింది. ఇంకేముంది చికెన్‌ మార్కెట్‌ల్లో కార్పోరేట్‌ శక్తులు దూరిపోయాయి. కోడి పదిరోజుల్లో పెరిగే అవకాశం వున్నా పెంచే దుర్మార్గపు ప్రయత్నాలు చేసేందుకు గిజగారుతున్నారు. ఒకప్పుడు కోడి గుడ్డు నుంచి వచ్చే కోడి, ఇప్పుడు కృత్రిమంగానే పుడుతోంది. పెరిగిపెరక్క ముందే మార్కెట్‌లో మాయమైపోతోంది. వ్యాపారుల పంట పండిస్తోంది. జనం ప్రాణాల మీదకు తెస్తోంది. కోడి పిల్ల వ్యాపారుల చేతికి రాకముందు నుంచే మందులతో దాని జీవనం, పెంపకం మొదలౌతోంది. హోలిస్టిన్‌ అనే ఆంటి బయాటిక్‌ విపరీతంగా వినియోగించడం వల్ల మూడు నాలుగు నెలల్లో పెరగి, కోతకు రావాల్సిన కోడి నెలకే చేతికొస్తుంది. నలభై రోజుల్లో అమ్మకం జరిగిపోతుంది. ఇలాంటి చికెన్‌లకు బర్డ్‌ ఫ్లూ అనే భయంకరమైన జబ్బులు వస్తుంటాయి. కాని వాటిని వ్యాపారులు కప్పివుంచుతారు. బైట ప్రపంచానికి తెలియకుండా చేస్తారు. వాటిని తక్కువ ధరలకు మార్కెట్‌లోకి పంపిస్తారు. రిటైల్‌ వ్యాపారులు మనకు అంటగడుతూనే వుంటారు. మనం మటన్‌ షాపుల్లో మనకు ఎలాంటి మటన్‌ ఇస్తున్నారో మన కళ్లముందే కనిపిస్తుంది. దాని వాలకం చూసి కొనుక్కొవాలో వద్దో కూడా తేల్చుకునే అవకాశం వుంటుంది. ఎదురుగా వేళాడదీసిన మటన్‌కు చెందిన అవయవాలను మనం చూసి, అవసరమైతే క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేసుకుంటాం. కాని చికెన్‌లో ఆ అవకాశం వుండదు. ఆ చికెన్‌ ఎలా వుందనేది ఇంటికెళ్లి చూసుకుంటే కాని కనిపించదు. అందులోనూ లోపాలు మనకు అసలు తెలియవు. ఇలా ఆంటిబయాటిక్స్‌ విచ్చలవిడిగా కోళ్లకు ఇప్పించి పెంచే చికెన్‌ తినడం వల్ల మనలో అనేక అనారోగ్య సమస్యలు తయారౌతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అనేక అనర్దాలు జరుగుతున్నాయి. క్లినికల్‌గా రుజువు కూడా చేశారు. ఆడపిల్లల్లో హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌ ఎక్కువగా జరుగుతుందని తేలింది. అయినా మా పిల్లలకు చికెనే తింటారు. మటన్‌ తెస్తే తినరు అంటూ కొత్త కథలు కూడా చెబుతుంటారు. తాజాగా మన తెలుగు రాష్ట్రాలలో బర్డ్‌ ఫ్లూ విపరీతంగా పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపిలో ఉభయగోదావరి జిల్లాలో లక్షల కోళ్లను చంపేసి పూడ్చిపెడుతున్నారు. కొంత మంది వ్యాపారులు పంట కాలువల్లో వదిలేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వ్యాపారులు తీరని నష్టం ఏర్పడిరదని అంటున్నారే గాని, తమ వక్ర బుద్ది మూలంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నామని మాత్రం అనుకోడం లేదు. లాబాపేక్ష తప్ప, ప్రజల ప్రాణాలు పౌల్ట్రీ వ్యాపారులకు పట్టడం లేదు. కార్పోరేట్‌ పౌల్ట్రీ రంగం విస్తరించడంలో చిన్న చిన్న పౌల్ట్రీ రైతులు కనుమరుగయ్యారు. ఆ వ్యాపారం మీద బతికిన వాళ్లంతా దివాలా తీశారు. ఇతర వ్యాపారాలను ఎంచుకొని బతుకులీడుస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో గత పది రోజులుగా కోళ్లకు కొక్కెర వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. కొన్ని లక్షల కోళ్లు మృత్యు వాతపడ్డాయంటున్నారు. చికెన్‌ ప్రియులు జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది. ఎందుకంటే పాలకులు ఏదైనా శృతి మించేదాకా మేలుకొనరు. అనర్ధాలు జరిగేదాకా జాగ్రత్తపడరు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు. జనం ప్రాణాల మీదకు వచ్చినప్పుడే స్పందిస్తారు. వ్యాపారుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు మన ముందు చికెన్‌ తింటూ వారికి మేలు చేసే ప్రయత్నాలు చేస్తారు. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చూస్తూనే వున్నాయి. రాష్ట్రంలో కొక్కెర వ్యాధి తీవ్రంగా ప్రబలినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని లక్షల కోళ్లు చనిపోతున్నాయి. అయితే సహజంగా కోళ్లను రాత్రిళ్లు మాత్రమే రవాణా చేస్తుంటారు. చికెన్‌సెంటర్లుకు చేర్చుతుంటారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఏపిలోని ఉభయగోదావరి జిల్లాలతో సంబందం వుంటుంది. దాంతో అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు కొక్కెర వ్యాధి సోకిందంటున్నారు. కొన్ని కిలోమీటర్ల దూరంలో వున్న పామ్‌లకు కూడా ఈ వైరస్‌ సోకుతుంది. ఆ చికెన్‌ తినడం ఎంత మాత్రం మంచిది కాదు. మీడియా కూడా ఫౌల్ట్రీకి నష్టం జరుగుతుందనే చెబుతుందేతప్ప, ప్రజలను చైతన్యం చేయాలని చూసే రోజులు పోయాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా వుండడం ఎంతో మంచిది. కొంత కాలం చికెన్‌ తినపోతే జరిగే నష్టమేమీ లేదు. ఇప్పటికే చికెన్‌ మూలంగా సర్వ దరిద్రాలు మన ఒంట్లోకి వచ్చి చేరుతున్నాయి. గతంలో ఎవరికైనా బిపిలు, షుగర్‌లువుండేవి కాదు. మన వైద్యులు కూడా వైట్‌ ఆహార పదార్దాలు తినకూడదంటారు. అసలు బియ్యం, గోదుమలే తినకూడదంటారు. కాని రకరాల మందులతో తయారైన చికెన్‌ తినడం వల్ల కొలెస్ట్రాల్‌ రాదంటారు. కాని ఆ చికెన్‌ వల్లనే చిన్న వయసుల్లోనే బిపిలు, షుగర్‌లు వస్తున్నాయన్న సంగతిని దాచి పెడతారు. ఇలాంటి వారికి ఫార్మ కంపనీలు తోడౌతాయి. ఆ మందుల అమ్మకాలను పెంచుకుంటాయి. శరీరాలను గుళ్ల చేసే చికెన్‌ లాంటి ఆహారం తినమని నిపుణులే చెబుతుంటారు. రోగాలువచ్చాక ఫలానా మందులు తీసుకోవాలని సూచిస్తుంటారు. ప్రజల జీవితాలతో అందరూ కలిసి ఆడుకుంటారు. ఇదే మన ఖర్మ.

సుద్దాల హనుమంతరావు జీవితం పేద ప్రజలకే అంకితమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో పాటయే ఆయుధం అయిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన సుద్దాల హనుమంతు సాంస్కృతిక ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుద్దాల హనుమంతు కవిగా కళాకారుడిగా, వాగ్గేయకారుడిగా అంతకుమించి జీవితమంతా కష్టజీవుల కోసం అంకితం అంకితం చేశారన్నారు. తెలంగాణ జాతి యావత్తును తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు అని ఆనాడు సాయుధ పోరాటంలో ఆయన రాసిన పల్లెటూరి పిల్లగాడ పసుల గాసే మొనగాడ.. పాట ఎందరినో ప్రభావితం చేసిందన్నారు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుందన్నారు. ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుందని. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల హనుమంతు సాహిత్యం అని ఆయన చెప్పారు. వారి వారసత్వాన్ని సజీవంగా ఉంచడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు . ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా సుద్దాల హనుమంతు జీవితం సాహిత్యం అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నమీబియా దేశపు పూర్వపు మాజీ మంత్రి బెర్నార్డ్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, బెక్కెం జనార్థన్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డాక్టర్ జె.రాంమోహన్, జగపతి రావు, భూపతిరావు తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు.

తంగళ్ళపల్లి నేటి దాత్రి….

తంగళ్ళపల్లి మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో స్థానిక తంగళ్ళపల్లి ఎస్సై రామ్మోహన్ కి రెడ్డి కుల సంఘం సభ్యులు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సందర్భంగా మాట్లాడుతూ మొన్న రెండు తారీకు నాడు జరిగిన బిసి బహిరంగసభలో పాల్గొని రెడ్డి కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెడ్డి కులం వారు బీసీల ఉచ్చ తాగుతున్నారని రెడ్డి సామాజిక వర్గం తలదించుకునేలా అసభ్య పదజాలం వాడారని కక్షపూరితంగా మాట్లాడారని ఇతర బహిరంగ సభలపై వేదికలపై కూడా కూడా రెడ్డి కులస్తులను కించపరిచే విధంగా మాట్లాడారనిరెడ్డి సామాజిక వర్గ ప్రతిష్టలు భంగం కలిగే విధంగా ఉన్నాయని రెడ్డిల పైన ఇతర కులస్తులు దాడులు చేసే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని దీనివల్ల తెలంగాణలో అభద్రత వాతావరణం ఉంటుందని సమాజంలో ఇతర కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉన్నాయని తెలియజేస్తూ గౌరవ ప్రధానమైన పట్టుభద్రుల పదవిలో ఉండి ఎమ్మెల్సీ గా ఎన్నికైన ప్రజలు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు స్వేచ్ఛను కాలరాసే విధంగా వాక్యాలు ఉన్నాయని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను వెంటనే శాసన సభ మండల నుండి బర్తఫ్ చేసి రెడ్డి సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ నుండి బహిష్కరించాలని ఈ సందర్భంగా రెడ్డి సంఘం తరఫున ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి: సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ అన్నారు.గురువారం చండూరు మండల కేంద్రంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిరసనగా సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ ఆదానీ , అంబానీలకు మేలు చేసే విధంగా ఉందని, ఆర్ఎస్ఎస్, కార్పొరేట్ శక్తులు దేశ ప్రయోజనాలను, బడ్జెట్ ను తమకు అనుకూలంగా నిర్ణయించే స్థాయికి మోడీ ప్రభుత్వం దిగజారిందని ఆయన అన్నారు. ఈ బడ్జెట్లోవిద్య, వైద్యంపై బడ్జెట్లో కేటాయింపులు జరగలేదని, అత్యధికంగాపేదలకు ఉపయోగపడే ఉపాధి హామీలో నిధులను పూర్తిగా తగ్గించి పేదల నోట్లో మట్టి కొట్టిందనివారు ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు, కూటమి భాగస్వామ్య పక్షాల రాష్ట్రాలకు బడ్జెట్లో కేటాయింపులు తప్ప మిగతా రాష్ట్రాలకుకేటాయించలేదని, బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఆయన అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం కేటాయించిన 63 వేల కోట్లు మాత్రమే ఉన్నదని, ఇంకా అదనంగా పెంచలేదని సంవత్సరానికి 200 పనిదినాలు పెంచుతూ రోజుకు కూలి 600 రూపాయలు ఇవ్వాలనిఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపైన కనీస మద్దతు ధర పైన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటం చేస్తున్న రైతులకు కనీసం మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వంవిఫలమైందన్నారు.ఒక దేశ ప్రధానిఇది పేదల బడ్జెట్ అని చెప్పటం ఎంత మోసపూరితమైన కుట్ర అని అర్థమైతుందన్నారు. హైదరాబాదు నుండి విజయవాడ వెళ్లే రైలు సింగిల్ లైన్ కారణంగా నాలుగు ఐదు గంటల సమయం పడుతుందని అందుకని అనేక సంవత్సరాలుగా డబల్ ట్రాక్ ఏర్పాటు చేయాలి తెలుగు ప్రజలు కొట్లాడుతున్న ఆ ఉసే బడ్జెట్లో ఎత్తలేదని, మరి బిజెపి ఎంపీలు ఏం చేస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలనిఆయన అన్నారు.కేంద్ర మంత్రినిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు మోకారిల్లె బడ్జెట్ లా ఉందని, విద్య వైద్యాన్ని విస్మరించారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, రైతు సంఘం నాయకులుఈరటి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బల్లెం స్వామి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులుకత్తుల సైదులు, నల్లగంటి లింగస్వామి, బి పంగి నాగరాజు, రమేష్, అలివేలు, చంద్రమ్మ,కలమ్మ, ముత్తమ్మ,పెద్ద వెంకన్న,దానయ్య,కృష్ణయ్య,జంగమ్మ, బక్కమ్మ, లక్ష్మమ్మ, రేణుక,రజిత,ఎల్లమ్మ,యాదయ్య, రామచంద్రం, నరసింహ, రాము,హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, నగేష్, నరేష్, సుమన్, శేఖర్, నరసింహ, జానీ, బిక్షం, చిరంజీవి, సత్యనారాయణ, సత్తయ్య, శ్రీను, అంజి, రమేష్, కుమార్, సురేష్ దితరులు పాల్గొన్నారు.

తుది ఓటర్ల జాబితా పై అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం ఎంపీడీవో లక్ష్మి నారాయణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో ఓటర్ల తుది జాబితా పై సమావేశం నిర్వహించినట్లు తెలుపుతూ మండలంలో ప్రతి గ్రామంలో ఎలక్షన్ బూతులు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎవరైనా చెత్త వ్యతిరేక కార్యాపాలకు పాల్పడకూడదని ఎలక్షన్లు సజావుగా జరిగేందుకు తగిన సిబ్బంది ఏర్పాటు చేశామని ప్రతి గ్రామంలో పోలీసుల సంరక్షణలో ఎలక్షన్ జరుగుతాయని ఈ సందర్భంగాఎంపీడీవో లక్ష్మి నారాయణ తెలిపారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజన్న బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్ రావు సూపర్డెంట్ రమేష్ కార్యాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

భారతీయుల్లో పెరుగుతున్న విదేశీ పర్యటన మోజు

కరోనా పరిస్థితులు దాడిన తర్వాత భారతీయుల ఆలోచనా సరళిలో చాలా మార్పులు వచ్చాయి. ఇందుకు సంకేతమే ప్రపంచాన్ని చుట్టేసి రావాలనుకునేవారి సంఖ్య గణనీయంగా పెరగడం. విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టడానికైనా మనవాళ్లు వెనకాడటం లేదట! అంతర్జాతీయ టూరిస్ట్‌ సంస్థల లెక్కల ప్రకారం విదేశీ పర్యటనకు సగటు భారతీయుడు చేసే ఖర్చు రూ.2లక్షలు! 2023లో 2.82 లక్షల మంది విదేశాలను చుట్టి వచ్చారు. ఇందుకోసం వీరు చేసిన ఖర్చు రూ.2.82లక్షలు! 2034 నాటికి ఈ ఖర్చు రూ.4.78 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా! అంతేకాదు విదేశీ పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య 8కోట్లకు చేరగలదని భావిస్తున్నారు. మనవాళ్లు మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల పట్ల అధిక మోజు కనబరుస్తున్నట్టు ట్రావెల్‌ సంస్థలు తెలుపు తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులను మరింతగా ఆకర్షించేందుకు వివిధ దేశాలు పలు కొత్త రాయితీలు ప్రకటిస్తున్నాయి.

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతం చేయాలి

భజన మండలికి పోటీ తోపాటు బహుమతి ప్రధానోత్సవం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం పత్తిపా క గ్రామంలో శ్రీ సంజీవ ఆంజ నేయ స్వామి దేవాలయంలో 07-02-2025 శుక్రవారం రోజున అదిత్యాది నవగ్రహ పున:ప్రతిష్ట , శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది.ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. అదే రోజున ఉదయం 11 గంటలకు భజన మేళ కార్యక్రమాలు జరుపబడుచు న్నాయి.కావున పాల్గొనే ప్రతి భజన బృందం డ్రెస్ కోడ్ తో పదిమంది సభ్యులతో రావాలని ఎవరి వాయిద్య పరికరాలు వారే తెచ్చుకోగల రని కోరారు.ప్రతి బృందానికి సమయాన్ని బట్టి 15 నిమిషాలలో మూడు పాటలు పాడగలరు.పాల్గొన్న ప్రతి భజన మండలికి బహుమతి ప్రశంసాపత్రాలతో సత్కరించ బడునని సంజీవ ఆంజనేయ భజన మండలి మరియు శ్రీ రామాంజనేయ భజన మండలి పత్తిపాక భక్తులు తెలియజేశారు.భజన భక్తులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7702264370, 8790773601.

సర్వే అంతా తప్పులు తడక. రాజ్యసభ సభ్యులు “వద్దిరాజు రవిచంద్ర”.

బీసీల పట్ల కాంగ్రెస్కు చులకన భావం ఉంది.

కులగరణ సర్వేలో తప్పులను వెంటనే సరిదిద్దాలి.

క్యాబినెట్ విస్తరణలో నలుగురు బీసీలకు స్థానం కల్పించాలి.

“నేటిధాత్రి” హైదరాబాద్, ప్రతినిధి.
రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వే తప్పులతడకగా,కాకి లెక్కలతో అశాస్త్రీయంగా ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం 2011లో జరిపించిన లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3 కోట్ల 50 లక్షల 3674కాగా,2014 సమగ్ర కుటుంబ సర్వే (SKS)ప్రకారం 3 కోట్ల 68లక్షల 76వేల 544, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సర్వేలో జనాభా 3 కోట్ల 70 లక్షల 77 వేల 544 గా నమోదయ్యిందన్నారు.పదేళ్లలో తెలంగాణ జనాభా కేవలం 2లక్షలు మాత్రమే పెరిగిందని ఈ ద్వారా పేర్కొనడం విడ్డూరంగా ఉందని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2014లో జరిపించిన SKS ప్రకారం బీసీలు (ముస్లింలలోని బీసీలు కాకుండా) 52% అని నిర్ధారణ కాగా,అదిప్పుడు 46%శాతమేనని ప్రభుత్వం వెల్లడించడం,6% తగ్గించి చూపడం దారుణమని ఆవేదన చెందారు.బీసీల జనాభాను తగ్గించి చూపడమే కాక,ఈ తప్పులతడక సర్వే నివేదికను మంత్రిమండలి ఆమోదించడం, చట్టసభల్లో ప్రవేశపెట్టి ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేయాలన్న చిత్తశుద్ధి అధికార పార్టీలో పూర్తిగా లోపించిందని ఎంపీ వద్దిరాజు మండిపడ్డారు.కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశానా కూడా లేదనేది ఈ అశాస్త్రీయ కులగణన సర్వేతో తేటతెల్లమయ్యిందన్నారు.బీసీల పట్ల కాంగ్రెస్ పాలకులకు చాలా చులకన భావం నెలకొందని చెప్పడానికి మంత్రిమండలి కూర్పే ఒక ప్రబల నిదర్శనమని ఎంపీ రవిచంద్ర చెప్పారు.బీసీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరుకాపు,యాదవ, ముదిరాజ్,కుర్మలకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడం,రాజ్యాధికారంలో న్యాయమైన వాటా దక్కకపోవడం శోచనీయమని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.కులగణన సర్వేలో చోటుచేసుకున్న తప్పులను వెంటనే సరిదిద్దాలని, ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించాలని, కేబినెట్ విస్తరణలో 4 గురు బీసీలకు స్థానం కల్పించాలని ఎంపీ వద్దిరాజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి గురవుతున్న బీసీలను బీఆర్ఎస్ మరింత సంఘటితపరుస్తూ న్యాయమైన హక్కులు,వాటా కోసం నిరంతరం పోరాడుతుందని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.

‘‘డాలర్‌’’ కలలు ‘‘ఢమాల్‌’’!

ఆవిరైన ఆశలు..కరిగిపోయిన కలలు.

-అమెరికా కలల్లో చేదు నిజాలను మిగిల్చుకున్నారు.

usa trump effect on Indians

-బరువెక్కిన గుండెలతో దేశం తిరిగి వస్తున్నారు.

-ఇష్టంగా కష్టాలు పడినా మిగిలిన కన్నీళ్లు.

-సప్త సముద్రాలు ఆవల సంపాదన.

-దూరపు కొండల నునుపు ఆలోచన.

-చెల్లా చెదురైన యువత భవిష్యత్తు.

-కడుపు కట్టుకొని తల్లిదండ్రులు రూపాయి రూపాయి పోగేసుకున్నారు.

-అప్పులు చేసి పిల్లలను అమెరికా పంపించారు.

-పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలలుగన్నారు.

-మా పిల్లలు అమెరికాలో వున్నారని గొప్పగా చెప్పుకున్నారు.

-గంపెడాశలతో వెళ్ళిన పిల్లలు వట్టి చేతులతో వస్తున్నారు.

-అమెరికాలో జీవితం అని కలల్లో తేలియాడారు.

-ఒక్కసారిగా కలలు చెదిరి తిరిగి వస్తున్నారు.

-ట్రంప్‌ వస్తే మరింత మేలనుకున్నారు.

-మొదటికే మోసం తెచ్చాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  ఓ మనిషి ఏమిటి నీ ఆలోచన. ఎక్కడికి నీ ప్రయాణం. అంటూ ఎవరి మనసైనా ఎప్పుడైనా అడుగుతూనే వుంటుంది. నా మనసలు అమెరిక చుట్టూ తిరుగుతుంది. నా ప్రయాణం అమెరికా వైపు వెళ్లమంటోందని సమాధానం చెప్పుకుంటూ జీవితం గడిపేవారు కొంత మంది. తమకు జీవితంలో దక్కని అవకాశం తన పిల్లల ద్వారా నైనా నెరవేర్చుకొని వారి సంతోషంలో తన ఆనందాన్ని చూసుకోవాలనుకునే ప్రతి తల్లిదండ్రులు అనుభవిస్తున్న సమస్యే. కాకపోతే ఒక దశలో తండ్రి ఆలోచన..చివరి దశలో అదే తండ్రి ఆవేదన ఎలా వుంటుందో కూడా అందరూ తెలుసుకోవాలి. గత ఓ ముప్పై సంవత్సరాల కాలంగా అమెరికా పిచ్చి అందరికీ పట్టుకున్నది. అది అన్ని వర్గాలకు పాకింది. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే అమెరికా వెళ్లడానికి ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇంజనీరింగ్‌ అయిపోయింది. ఎంఎస్‌ చేయాలనుకుంటున్నాడు. అమెరికాకు వెళ్లే ఏర్పాట్లుచేస్తున్నాం అని కొందరు. మా అబ్బాయిని ఎలాగైనా అమెరికా పంపించాలి. మా పక్కింటి వాళ్ల పిల్లలు ఇద్దరూ అమెరికాలోనే వుంటున్నారు. మా ముందు వాళ్లు ఫోజులు కొడుతున్నారు. మా పిల్లలను కూడా పంపించి వారికంటే మేమే గొప్ప అనిపించుకోవాలి అనుకుంటున్న తల్లిదండ్రులు. ఇక పిల్లల మందు బాగా చదువుకో…మన ఆ బంధువులు పిల్లలు అమెరికా వెళ్లారు. ఈ బంధువుల పిల్లలు అమెరికా వెళ్తున్నారు. వాళ్లను చూసైనా బుద్ది తెచ్చుకో..బాగా చదవుకో..నా పరువు నిలబెట్టు..అంటూ పిల్లలను చిన్నప్పటి నుంచే అమెరికా ఆశల పల్లకిని ఎక్కిస్తున్నాం. వాళ్లను చూసి మరి కొందరు…ఇలా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అందరూ అమెరికా జపం తప్ప, ఇక్కడే వుంటాం..ఇక్కడే చదువుకుంటాం..ఇక్కడే గొప్పగా బతుకుతాం అనేవారు లేకుండాపోతున్నారు. ఇక్కడ ఎంత గొప్పగా బతుకున్నా అది బతుకు కాదన్నంతగా జనం మారిపోతున్నారు. అమెరికాలో అంట్లు తోముకుంటూ బతికినా సరే అంత బంగారమైన బతుకు మరొకటి లేదన్నంతగా గొప్పలకు పోతున్నారు. రూపాయిలకన్నా, డాలర్‌ కలలు గొప్పగా వుంటాయనుకుంటారు. కనిపించని దేశాల వెంట పరుగులు తీస్తున్నారు. ఓ నలభై సంవత్సరా క్రితం అమెరికా అంటే అబ్బో అనుకునేవారు. కాని ఇప్పుడు గ్లోబలైజేషన్‌ మూలంగా అమెరికా కూడా మన పక్క ఊరే అన్నంత మాటల దూరం తగ్గిపోయింది. ఇబ్బంది కర కాలం మళ్లీ వచ్చింది. ట్రంప్‌ రూపంలో మళ్లీ చిక్కులు ఎదురౌతున్నాయి. ఇప్పుడు మీ ఊరు మాకు ఎంత దూరమో..మా వూరు మీకు అంతే దూరం అన్న లాజిక్‌ మొదటికి వచ్చింది. మన దేశం నుంచి లక్షలాది మంది వెళ్లి అమెరికాలో చదువుకునే వారు చదువుకుంటున్నారు. వ్యాపారాలు చేసే వారు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు వున్నారు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద కంపనీలు పెట్టిన వారున్నారు. కాని చదువుకోవడానికి వెళ్లినా ఇక్కడి నుంచి పంపే సొమ్ము సరిపోక, అమెరికాలో బారీ బతుకులు బతకాలంటే కూలీ పనులు చేసుకోవాల్సిందే. ఇంట్లో వున్నప్పుడు ఇటు పుల్ల తీసి అటు పెట్టని వాళ్లయినా సరే..అంట్లు కడిగైనా అక్కడ బతకాల్సిందే. ఆ పని కోసం బతిమిలాడుకొని ఆ పని చేసుకొని సంపాదించుకొని బతకాల్సిందే..ఇదే అమెరికా జీవితం కాని..దూరపు కొండలు నునుపు. అక్కడ సంపాదించి విదేశీ మారకద్రవ్యం చెల్లించి, పన్నుల మీద పన్నులు అటూ, ఇటు కట్టి చివరకు చేతిలో కనిపించేది ఎంతైనా సరే అమెరికాలోనే బతకాలనుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. ఇండియాలో తరతరాలు కూర్చొని సరిపడ ఆస్దులున్నా సరే అమెరికాకే వెళ్లాలి. అక్కడే బతకాలి. అక్కడే ఎంజాయ్‌ చేయాలని అనుకునే వారి కధ వేరు. కాని రెక్కాడితే గాని డొక్కాడని పేదలు కూడా అమెరికా వైపు చూసుకుంటూ మబ్బుల్లో నీరు ఒలకబోసుకుంటున్నారు. తమ పిల్లలను కూడా అమెరికా పంపాలన్న ఆలోచనలతో అందిన కాడికి అప్పులు చేస్తున్నారు. కడుపు కట్టుకొని కూడబెట్టుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు కూడా మిగతా సమయాల్లో మరో పని చేస్తున్నారు. ప్రతి రూపాయిని ఆదా చేసుకుంటున్నారు. ఇలా రూపాయి రూపాయి కూడబెట్టి అమెరికా పంపిస్తే తమ తల్లిదండ్రుల మీద ప్రేమ వున్న పిల్లలు ఎంత మంది వున్నారు. అసలు తమను అమెరికా పంపించిన తల్లిదండ్రులను గుర్తుంచుకుంటున్న పిల్లలు ఎంత మంది వున్నారు. తల్లిదండ్రులు బతికి వున్నారా..లేదా అని తెలుసుకుంటున్న వాళ్లు ఎంత మంది వున్నారు. రోజూ కాకపోకపోయినా వారానికో..నెలకో తల్లిదండ్రులను పలకరిస్తున్నారా? అంటే అదీ లేదు. ఎప్పుడూ బీజీ..బిజీ..అన్న సమాదానలతో సరిపెట్టుకుంటున్నారు. తమ పిల్లలు అమెరికా వెళ్తే ప్రయోజకులౌతారు. గొప్పవాళ్లవుతారు. గొప్పగా బతుకుతారు. మమ్మల్ని కూడా గొప్పగా చూసుకుంటారని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కాని తమను తల్లిదండ్రులను మర్చిపోతున్న పిల్లలు వున్నారని తెలిసినా తల్లిదండ్రులు అమెరికా కలలు కనకుండా వుండడం లేదు. తమ పిల్లలను అమెరికా పంపించకుండా వుండలేకపోతున్నారు. కష్టాలు కొని తెచ్చుకుంటూనే వున్నారు. కష్టాలు వస్తాయని తెసినా దైర్యం చేస్తున్నారు. సమస్య తమ దాకా వచ్చేవరకు తల్లిదండ్రులు బోరు మంటున్నారు. అమెరికా వెళ్లిన పిల్లల వల్ల ఎదురయ్యే సమస్యలపై సీతారామయ్య మనవరాలు అని ఓ సినిమా వచ్చింది. కంటే కూతుర్నే కనాలి అనే సినిమా తీశారు. ఇలాంటివి అనేకం వచ్చాయి. అయినా సినిమా చూస్తారు. కాసేపు కళ్ల నీళ్లు పెట్టుకుంటారు. మర్చిపోతారు. తమ పిల్లల్ని అమెరికా పంపేందుకు రకరకాల కష్టాలు పడుతూనే వుంటారు. అవసాన దశలో పదిహేను నిమిషాలు సినిమా చూస్తూ పెట్టుకున్న కన్నీళ్లు జీవితాంతం పెట్టుకుంటున్నారు. అయినా ఎవరూ ఆగడం లేదు. ఇప్పటికైనా మనలో మార్పు వస్తుందని ఆశించాద్దాం. విదేశాలలో గొప్ప గొప్ప చదవులు చదువుకొని దేశానికి సేవ చేయడం పక్కన పెడితే, కనీసం కన్న తల్లిదండ్రులకు అవసాన దశలో చూసుకునే దిక్కులేకుండాపోతోంది. కడసారి చూపులు చూడడానికి కూడా వీలు లేకుండాపోతోంది. అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు బిడ్డలు కాదన్న సామెతలు నిజం చేస్తున్నారు. అయినా ఫరవాలేదని, తమ పిల్లలుతమను చూసుకోకపోయినా సరే..ఆఖరి దశలో తమ వద్దకు రాకపోయినా సరే అని కూడా పిల్లల్ని అమెరికా పంపించాలనే తల్లిదండ్రులే పెరుగుతున్నారు. అందుకే ఈ పరిస్దితి వస్తోంది. ఇప్పుడు ట్రంప్‌ ఆమెరికాకు వెళ్లిన వారిని తిరిగి పంపించేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకొని అమెరికా వెళ్లిన వారిని దోషులుగా చూస్తున్నారు. దొంగలుగా ముద్రలు వేసి పంపిస్తున్నారు. నిజానికి మన దేశం నుంచి వెళ్లిన వాళ్లెవరూ అక్రమ మార్గల ద్వారా వెళ్లిన వారు కాదు. కాకపోతే అక్కడికి వెళ్లిన తర్వాత అక్రమంగా అక్కడ నివాసముంటున్నారు. అది కూడా తప్పే..ఆ దేశ చట్టాల ప్రకారం నేరమే..అందుకే అమెరికా నుంచి తిరిగి పంపిస్తున్నారు. అమెరికాలో వుండడానికి వారికి అర్హత లేదని బలవంతంగా పంపిచేస్తున్నారు. ఇది మంచి పరిణామమేనా కాదా? అన్నది ఇప్పటికిప్పుడు తెలియపోయినా రేపటి తరం ఆశల ఆవిరయ్యాయనే చెప్పాలి.. కన్నకలలు కల్లలయ్యాయనే అనుకోవాలి. అమెరికా ఆశల మీద ఇంకెవరు మోజు పెంచుకోవద్దని కూడా గుణపాఠంగా తీసుకోవాలి. అమెరికా కలల్లో చేదు నిజాలున్నాయని గమనించాలి. ఆ చేదు గుళిక ఇప్పటికప్పుడు గొంతు దిగకపోయినా, ఇక్కడ సంపాదించి అమెరికా అప్పుడప్పుడూ చూసి వచ్చే కల నెరవేరేందుకు ఉపయోపడాలని కోరుకోవాలి. అక్కడే వుండాలి. అక్కడే బతకాలి. అక్కడే భవిష్యత్తు వెతుక్కొవాలి అనేది ఆశే అయినా, అత్యాశ కాకుండా చూసుకోవాలి. స్ధోతమను ఇక్కడ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ కూడా అవకాశాలు వెతుక్కోవచ్చు. ఇక్కడ కూడా ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. బరువెక్కిన గుండెలతో దేశం వస్తున్నామని అనుకోకండి. బరువు దించుకొని వస్తున్నామని సంతోషంగా రండి. లక్షలాది రూపాయలు వృధా అయ్యాయని అనుకోకండి. అంతకు మించి సంపాదించుకునేందుకు కూడా ఇక్కడ అవకాశాలు వెతుక్కొండి. లేకుంటే నిపుణులులైన విద్యావంతులుగా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లు అవకాశాలు సృష్టించండి. మీరే పది మందికి ఉపాది కల్పించేలా ముందుకు సాగండి. అందుకు బ్యాంకులు కూడా సహకారం అందించే అకాశాలున్నాయి. సంపద మీరే సృష్టించండి. ఎవరిమీదో ఆధారపడుకుండా మీ కాళ్ల మీద నిలబడి, దేశానికి ఆదాయం సమకూర్చండి. ఆల్‌దిబెస్ట్‌.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version