శ్రీ చైతన్య స్కూల్ లో గ్రాండ్ పేరెంట్స్ డే..

శ్రీ చైతన్య స్కూల్ లో గ్రాండ్ పేరెంట్స్ డే

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

సామాజిక వారోత్సవాల కింద శనివారం శ్రీ చైతన్య పాఠశాల మంచిర్యాల లక్ష్మీనగర్ బ్రాంచ్‌లో గ్రాండ్ పేరెంట్స్ డే ఘనంగా జరుపుకున్నారు.ఇందులో 50 మంది గ్రాండ్ పేరెంట్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పాఠశాల యాజమాన్యం నిర్వహించిన ఆటలలో పాల్గొని,నేటి సమాజంలో అమ్మమ్మ,తాతల ప్రాముఖ్యతని కొద్ది మంది గ్రాండ్ పేరెంట్స్ వారి మాటల్లో చెప్పుకుంటూ మురిసిపోయారు.విద్యార్థులందరూ కుటుంబ సంబంధాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని,పిల్లలు మెరుగైన జీవితం కోసం వారి గ్రాండ్ పేరెంట్స్ తో జీవితాన్ని గడపాలని ప్రిన్సిపాల్ అయూబ్ తన ప్రసంగంలో తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అయూబ్,ఇంచార్జ్ అనగమత విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.

కలెక్టర్ నామినేషన్ కేంద్రాలు, వరి కొనుగోలు పరిశీలన

నిర్ణీత గడువులోగా వచ్చిన నామినేషన్లు మాత్రమే స్వీకరించాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు సమర్పించే నామినేషన్లను నిర్ణీత గడువులోగా మాత్రమే స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, ముత్యంపేట, రెబ్బెనపల్లి,చెల్కగూడ గ్రామాలకు కొర్విచెల్మ గ్రామపంచాయతీ, నెల్కివెంకటాపూర్,వందూర్ గూడ,చింతపల్లి,తానిమడుగు గ్రామాలకు నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ,ద్వారక, కొండాపూర్,ధర్మారావుపేట గ్రామాలకు ద్వారక గ్రామపంచాయతీ, మ్యాదరిపేట,మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాలకు మ్యాదరిపేట గ్రామపంచాయతీ,దండేపల్లి, కర్ణపేట,నర్సాపూర్ గ్రామాలకు దండేపల్లి గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే,మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల లోగా నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుండి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని,5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలని తెలిపారు. నామినేషన్ కేంద్రంలో రద్దీ లేకుండా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ నిబంధనలకు లోబడి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి విడతలో 90 సర్పంచ్,816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని,నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించకూడదని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు,ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన,గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.అనంతరం మండలంలోని ద్వారక గ్రామంలో కొనసాగుతున్న షెడ్యూల్డ్ తెగల బాలుర సంక్షేమ వసతిగృహం నిర్మాణ పనులను సందర్శించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయాలని,కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు,నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు,గోనె సంచులు, తేమ యంత్రాలు,తూకం యంత్రాలు,ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు.దొడ్డు రకం,సన్న రకం ధాన్యాలను వేరువేరుగా కొనుగోలు చేయాలని,సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.కొనుగోలు సమయంలో రైతుల వివరాలు, ధాన్యం వివరాలను సేకరించి ట్యాబ్ లలో నమోదు చేయాలని, సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బాపూజీ ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగుదాం…

బాపూజీ ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగుదాం

దశాబ్దాల పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు మహేష్ వర్మ

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బాపూజీ 110 వ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మహేష్ వర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం టీఆర్పీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ మాట్లాడుతూ.. తెలంగాణ మొదటి ఉద్యమకారుడు బాపూజీ అని అన్నారు. తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయులని,బడుగు బలహీన వర్గాల చైతన్యానికి, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగాలు, సేవలను గుర్తు చేసారు. తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించి తెలంగాణ జాతిపితగా కీర్తిని గడించారని అన్నారు.పదవులకన్నా ప్రాంతానికే మొదటి ప్రాధాన్యతను ఇచ్చి,తన పదవులను వదులుకుని ఉద్యమాన్ని ఉదృతం చేసి, ప్రజలను చైతన్యం చేసారని అన్నారు.వారి జయంతి సందర్భంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దు బిడ్డ, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ ని స్పూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో మన రాజ్యాధికారం సాధించుకునేందుకు అధికారం,ఆత్మగౌరవం,వాటా నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుందని, దీనికి అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్,పడాల శివతేజ,కొత్తూరి సంతోష్, కుంట రాజేంద్రప్రసాద్, నామాల తిరుపతి,అకెనపల్లి మధు,పెట్టం రాజేష్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

దిగ్వాల్ గ్రామంలో మహాలక్ష్మీ దేవికి ఘనంగా పూజలు…

దిగ్వాల్ గ్రామంలో మహాలక్ష్మీ దేవికి ఘనంగా పూజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్/కోహిర్: దిగ్వాల్ గ్రామంలో దేవి నవరాత్రులలో భాగంగా మహాలక్ష్మీ రూపంలో అమ్మవారు పూజలు అందుకున్నారు. “ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః” అంటూ పూజారులు ఆశీర్వదించారు. కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అమ్మవారి పూజలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ పవిత్ర దినమున శ్రీ మహాలక్ష్మీ దేవి ఆశీస్సులు జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలు…

ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలు

నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్

మంచిర్యాల, నేటి ధాత్రి:

తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్ మాట్లాడుతూ.. భగవంతుని ఆశీస్సులతో అందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం లోపు తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరైతే,తెలంగాణ నాల్గవ తరగతి హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.చిన్న స్థాయి ఉద్యోగులైన తమపై దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కవిత రాణి, కోశాధికారి సుజాత, అసోసియేట్ అధ్యక్షులు శ్రీలత,శోభ,సునీత, ముంతాజ్ అలీ ఖాన్,గోవర్ధన్, శ్రీనివాస్,జయప్రద తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాలలో ముగిసిన బర్డ్స్ ఫెస్టివల్..

మంచిర్యాలలో ముగిసిన బర్డ్స్ ఫెస్టివల్

పక్షుల సంరక్షణ పై సమగ్ర అధ్యయనం

అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ

మంచిర్యాల:నేటి ధాత్రి

పర్యావరణంలో మిగిలిన జీవరాశుల కంటే ఎంతో జీవ వైవిధ్యం కలిగిన పక్షుల సంరక్షణపై సమగ్ర అధ్యయనం జరగాలని ఇందుకు దీర్ఘకాలిక పరిశీలన అవసరమని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (కంపా ) డాక్టర్ సువర్ణ అన్నారు.అటవీ శాఖ మరియు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్,నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో మంచిర్యాలలో గత రెండు రోజులుగా జరిగిన బర్డ్స్ ఫెస్టివల్ ఆదివారం అట్టహాసంగా ముగిసింది.ఈ సందర్భంగా మంచిర్యాలలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ముగింపు సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు•పక్షుల గమనానికి పరిధిలు లేవని అవి ఖండాలు దాటి ప్రయాణిస్తూ పర్యావరణంలో కీలకపాత్ర వహిస్తున్నాయన్నారు. పర్యావరణంలో జరిగే పెను మార్పుల వల్ల కొన్ని జాతుల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వలస వెళ్తుంటాయని ఇలాంటి పక్షులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.పక్షులు ఎంతో జీవవైవిద్యం ప్రదర్శిస్తూ మానవాళి మనుగడకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయన్నారు.ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం పక్షులని చెప్పారు.ఇవి వాటి భాషలో మంచి కమ్యూనికేషన్ కలిగి రాకపోకలు కొనసాగిస్తూ పర్యావరణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రస్తుత రోజుల్లో పక్షుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,విద్యార్థి దశ నుంచే దీనిని ఒక హాబీగా పెట్టుకోవాలన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు తమ విద్యార్థి దశ నుంచి అంచలంచలుగా పక్షుల గురించి తమ ఉపాధ్యాయుల సహాయంతో తెలుసుకోవాలన్నారు. ఇందుకుగాను పాఠశాల ఉపాధ్యాయులు సైతం పక్షుల స్థితిగతులు వాటి జీవన విధానంపై విద్యార్థులకు క్విజ్ లు నిర్వహించాలన్నారు. మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎన్నో వేల పక్షులు సంచరిస్తున్నాయన్నారు.గత రెండు సంవత్సరాలుగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ సహకారంతో జన్నారం అటవీ డివిజన్ లో దీర్ఘకాలిక పరిశీలన చేసి 201 జాతుల పక్షులను గుర్తించామన్నారు.జిల్లా పరిధిలోని మిగిలిన అటవీ డివిజన్ లలో కూడా అటవీ సిబ్బంది తమ పరిధులలో పక్షుల గమనాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రికార్డు చేసుకోవాలని సూచించారు.కొమురం భీమ్, ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్ టిబ్రేవాల్ మాట్లాడుతూ కాగజ్ నగర్ డివిజన్ అటవీ ప్రాంతంలో రాష్ట్రంలోనే అరుదైన రాబందుల సంరక్షణకు తాము తీసుకుంటున్న చర్యల వల్లే వాటి జనాభా పెరుగుతుంది అన్నారు.నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ శాస్త్రవేత్త మహేష్ శంకరన్ మాట్లాడుతూ సవన్నా గడ్డి మైదానాలకు మరియు అడవులకు మధ్య వ్యత్యాసాన్ని,అక్కడి జీవవైవిద్యం గురించి వివరించారు.పక్షులు క్రమంగా అంతరిస్తే బయోడైవర్సిటీ దెబ్బతింటుందని,వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ విజయన్ మాట్లాడుతూ పక్షులపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్ లు ఉండాలన్నారు.బి ఎన్ హెచ్ ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ సాథియా సెల్వం మాట్లాడుతూ ముంబై లాంటి నగరాల్లో ఆరో తరగతి నుంచే పక్షుల గురించి ప్రత్యేకంగా రికార్డులు నిర్వహిస్తున్నాని,ఇక్కడి పాఠశాలల్లో కూడా బర్డ్స్ ఏకో క్లబ్ నిర్వహించుకోవాలన్నారు. వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ప్రధాన అధికారి బండి రాజశేఖర్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అటవీ శాఖ సహకారంతో జన్నారం అటవీ డివిజన్ లో పక్షుల అధ్యయనం పై సమగ్ర పరిశీలన చేయగా 11 పక్షి జాతులు అంతరించి పోయే దశలో ఉన్నాయన్నారు. 57 జాతుల పక్షులు కేవలం అటవీ,ప్లాంటేషన్ ఏరియాలోని సంచరిస్తున్నాయని పరిశీలించామన్నారు.99 జాతుల పక్షులు కీటకాలు తినే వాటిగా,16 జాతుల పక్షులు కేవలం పండ్లను తినే పక్షులుగా గుర్తించామన్నారు. పక్షుల అధ్యయనం,సంరక్షణకు తమ సంస్థ ఆధ్వర్యంలో సమగ్ర చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఈ బర్డ్స్ ఫెస్టివల్ సందర్భంగా పక్షుల సంరక్షణలో సేవలందిస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు సభ్యులకు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ,కవ్వాల్ టైగర్ రిజర్వ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతా రాములు కలిసి జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ కుమార్ పాటిల్,మంచిర్యాల ఫారెస్ట్ డివిజనల్ అధికారి సర్వేశ్వరరావు,పక్షులపై అధ్యయనం చేస్తున్న ప్రముఖులు డాక్టర్ శాంతారామ్,డాక్టర్ బిక్షం గుజ్జ, డాక్టర్ సాథియా సెల్వం, సంజీవ్ మీనన్,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఫారెస్ట్ రేంజ్ అధికారులు,డిప్యూటీ రేంజ్ అధికారులు,ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు,బీట్ అధికారులు,పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version