పని ప్రదేశాలలో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసే వారిపై చట్టపరమైన చర్యలు
జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు,పని ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధించే వారిపై పోష్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.మహిళలు లైంగిక వేధింపుల నిరోధక చట్టం పాస్ – 2013 పై అవగాహన కలిగి ఉండాలని,పని ప్రదేశాలలో మహిళలకు భద్రత,గౌరవం, సమానత్వం కల్పించడమే లక్ష్యంగా చట్టం రూపొందించడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వ,ప్రైవేట్ పరిశ్రమలలో,వాణిజ్య, వ్యాపార సముదాయాలలో, షాపింగ్ మాల్స్,జిన్నింగ్ మిల్లులు,ఇతర పని ప్రదేశాలలో పని చేసే మహిళలు లైంగిక వేధింపులకు గురైతే బాధిత మహిళలు నిర్భయంగా అంతర్గత ఫిర్యాదు కమిటీకి ఫిర్యాదు చేయవచ్చని,పోష్ చట్టం 2013 ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు.ఫిర్యాదు పై కమిటీ నిర్నిత కాలంలో విచారణ పూర్తి చేసి తగు చర్యలు తీసుకుంటుందని, అవసరమైతే పోలీస్ కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి కార్యాలయంలో,పని ప్రదేశాలలో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని,మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు.మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ద్వారా విస్తృతస్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.పోష్ చట్టం,అంతర్గత ఫిర్యాదు కమిటీ ఉద్దేశం,హక్కులు, ఫిర్యాదు విధానం,కమిటీ నిర్మాణం,బాధ్యతలు వంటి అంశాలపై అధికారులు, ఉద్యోగులకు స్పష్టమైన అవగాహన కల్పించడం జరుగుతుందని,కమిటీ వివరాలను నిర్దిష్ట ఫారం ద్వారా సేకరించి సంబంధిత సమాచారాన్ని షీ బాక్స్ పోర్టల్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఇప్పటివరకు 47 అంతర్గత ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని,వీటిలో ప్రభుత్వ జిల్లా స్థాయి కార్యాలయాలలో 30 కమిటీలు,ఉప జిల్లాస్థాయి కార్యాలయాలలో 16, ప్రైవేట్ సంస్థలు,షాపింగ్ మాల్స్, దుకాణాలలో 1 కమిటీ పనిచేస్తున్నాయని తెలిపారు.ప్రైవేట్ సంస్థలు తమ సంస్థలలో కమిటీలను ఏర్పాటు చేయాలని,జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం, షీ బాక్స్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని తెలిపారు.పోష్ చట్టం అమలుతో మహిళలకు పని ప్రదేశాలు సురక్షితంగా మారుతాయని,ప్రతి మహిళ తన హక్కులను తెలుసుకొని ధైర్యంగా ముందుకు రావాలని తెలిపారు.
