మంచిర్యాలలో ముగిసిన బర్డ్స్ ఫెస్టివల్..

మంచిర్యాలలో ముగిసిన బర్డ్స్ ఫెస్టివల్

పక్షుల సంరక్షణ పై సమగ్ర అధ్యయనం

అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ

మంచిర్యాల:నేటి ధాత్రి

పర్యావరణంలో మిగిలిన జీవరాశుల కంటే ఎంతో జీవ వైవిధ్యం కలిగిన పక్షుల సంరక్షణపై సమగ్ర అధ్యయనం జరగాలని ఇందుకు దీర్ఘకాలిక పరిశీలన అవసరమని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (కంపా ) డాక్టర్ సువర్ణ అన్నారు.అటవీ శాఖ మరియు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్,నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో మంచిర్యాలలో గత రెండు రోజులుగా జరిగిన బర్డ్స్ ఫెస్టివల్ ఆదివారం అట్టహాసంగా ముగిసింది.ఈ సందర్భంగా మంచిర్యాలలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ముగింపు సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు•పక్షుల గమనానికి పరిధిలు లేవని అవి ఖండాలు దాటి ప్రయాణిస్తూ పర్యావరణంలో కీలకపాత్ర వహిస్తున్నాయన్నారు. పర్యావరణంలో జరిగే పెను మార్పుల వల్ల కొన్ని జాతుల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వలస వెళ్తుంటాయని ఇలాంటి పక్షులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.పక్షులు ఎంతో జీవవైవిద్యం ప్రదర్శిస్తూ మానవాళి మనుగడకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయన్నారు.ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం పక్షులని చెప్పారు.ఇవి వాటి భాషలో మంచి కమ్యూనికేషన్ కలిగి రాకపోకలు కొనసాగిస్తూ పర్యావరణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రస్తుత రోజుల్లో పక్షుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,విద్యార్థి దశ నుంచే దీనిని ఒక హాబీగా పెట్టుకోవాలన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు తమ విద్యార్థి దశ నుంచి అంచలంచలుగా పక్షుల గురించి తమ ఉపాధ్యాయుల సహాయంతో తెలుసుకోవాలన్నారు. ఇందుకుగాను పాఠశాల ఉపాధ్యాయులు సైతం పక్షుల స్థితిగతులు వాటి జీవన విధానంపై విద్యార్థులకు క్విజ్ లు నిర్వహించాలన్నారు. మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎన్నో వేల పక్షులు సంచరిస్తున్నాయన్నారు.గత రెండు సంవత్సరాలుగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ సహకారంతో జన్నారం అటవీ డివిజన్ లో దీర్ఘకాలిక పరిశీలన చేసి 201 జాతుల పక్షులను గుర్తించామన్నారు.జిల్లా పరిధిలోని మిగిలిన అటవీ డివిజన్ లలో కూడా అటవీ సిబ్బంది తమ పరిధులలో పక్షుల గమనాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రికార్డు చేసుకోవాలని సూచించారు.కొమురం భీమ్, ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్ టిబ్రేవాల్ మాట్లాడుతూ కాగజ్ నగర్ డివిజన్ అటవీ ప్రాంతంలో రాష్ట్రంలోనే అరుదైన రాబందుల సంరక్షణకు తాము తీసుకుంటున్న చర్యల వల్లే వాటి జనాభా పెరుగుతుంది అన్నారు.నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ శాస్త్రవేత్త మహేష్ శంకరన్ మాట్లాడుతూ సవన్నా గడ్డి మైదానాలకు మరియు అడవులకు మధ్య వ్యత్యాసాన్ని,అక్కడి జీవవైవిద్యం గురించి వివరించారు.పక్షులు క్రమంగా అంతరిస్తే బయోడైవర్సిటీ దెబ్బతింటుందని,వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ విజయన్ మాట్లాడుతూ పక్షులపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్ లు ఉండాలన్నారు.బి ఎన్ హెచ్ ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ సాథియా సెల్వం మాట్లాడుతూ ముంబై లాంటి నగరాల్లో ఆరో తరగతి నుంచే పక్షుల గురించి ప్రత్యేకంగా రికార్డులు నిర్వహిస్తున్నాని,ఇక్కడి పాఠశాలల్లో కూడా బర్డ్స్ ఏకో క్లబ్ నిర్వహించుకోవాలన్నారు. వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ప్రధాన అధికారి బండి రాజశేఖర్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అటవీ శాఖ సహకారంతో జన్నారం అటవీ డివిజన్ లో పక్షుల అధ్యయనం పై సమగ్ర పరిశీలన చేయగా 11 పక్షి జాతులు అంతరించి పోయే దశలో ఉన్నాయన్నారు. 57 జాతుల పక్షులు కేవలం అటవీ,ప్లాంటేషన్ ఏరియాలోని సంచరిస్తున్నాయని పరిశీలించామన్నారు.99 జాతుల పక్షులు కీటకాలు తినే వాటిగా,16 జాతుల పక్షులు కేవలం పండ్లను తినే పక్షులుగా గుర్తించామన్నారు. పక్షుల అధ్యయనం,సంరక్షణకు తమ సంస్థ ఆధ్వర్యంలో సమగ్ర చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఈ బర్డ్స్ ఫెస్టివల్ సందర్భంగా పక్షుల సంరక్షణలో సేవలందిస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు సభ్యులకు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ,కవ్వాల్ టైగర్ రిజర్వ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతా రాములు కలిసి జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ కుమార్ పాటిల్,మంచిర్యాల ఫారెస్ట్ డివిజనల్ అధికారి సర్వేశ్వరరావు,పక్షులపై అధ్యయనం చేస్తున్న ప్రముఖులు డాక్టర్ శాంతారామ్,డాక్టర్ బిక్షం గుజ్జ, డాక్టర్ సాథియా సెల్వం, సంజీవ్ మీనన్,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఫారెస్ట్ రేంజ్ అధికారులు,డిప్యూటీ రేంజ్ అధికారులు,ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు,బీట్ అధికారులు,పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version