బాలాజీ టెక్నోస్కూల్ లో జాతీయ అంతరిక్ష దినోత్సవం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో 2.వ జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చంద్రయాన్- 3 పూర్తయ్యి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశం తన రెండవ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
ఆర్యభట్ట నుండి గగన్ యాన్ వరకు ప్రాచీన జ్ఞానం నుండి అనంత అవకాశాల వరకు అనే ఇతివృత్తంతో జరుపుకునే అంతరిక్ష రంగంలో భారత్ తిరుగులేని విజయాలతో అమెరికా, చైనా, రష్యా, జపాన్ వంటి దేశాలకు సాధ్యంకాని విధంగా అనేక విజయాలను నమోదు చేసిందన్నారు.చంద్రయాన్ 1,2,3 ప్రయోగాలే కాకుండా చంద్రయాన్ – 4 ప్రయోగానికి సన్నద్ధం అవుతుందని, 2035 నాటికి సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉందని గుర్తుకుచేశారు. భారత్ చంద్రునిపై 2023 ఆగస్టు 23 న చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతాన్ని చేరుకున్న మొదటి దేశంగా అవతరించిందని తెలిపారు.విద్యార్థులు, యువత సైన్సును కేవలం ఒక కెరీర్ గా చూడకుండా ఉండాలని, అంతరిక్ష పరిశోధన,సాంకేతికలు,దేశ నాయకత్వం పట్ల జాతీయ గౌరవాన్ని ప్రేరేపించి హద్దులు లేని ప్రయాణాన్ని చూడాలని విద్యార్థులను సూచించారు.ఎన్సిసి పదవ బెటాలియన్ సూచనల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో కూడా జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించగా విద్యార్థులు అంతరిక్షం సంబంధించిన చార్టులు ప్రదర్శించి క్విజ్ పోటీలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. రమేష్, విజయ్, గౌతమ్, పూర్ణిమ, రాజ్ కుమార్, రమ్య, కృష్ణవేణి, హేమలత, నరసింహారెడ్డి, అనిత, విశాల,తదితరులు పాల్గొన్నారు.