మహిళా పోలీస్ శక్తికి అండగా తెలంగాణ ప్రభుత్వం – మంత్రి సీతక్క
కొత్త దిశకు నాంది పలికిన తెలంగాణ మహిళా పోలీసుల తొలి సదస్సు
మహిళా పోలీస్ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మంత్రి సీతక్క
మహిళా పోలీసుల్లో నూతన ఉత్తేజం నింపిన సీతక్క ప్రసంగం
మహిళా పోలీసుల అవసరాలను గుర్తించి ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తాం- మంత్రి సీతక్క
హైదరాబాద్, నేటిధాత్రి.
రాజేంద్రనగర్‌లోని రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో తెలంగాణ మహిళా పోలీస్ రాష్ట్రస్థాయి తొలి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మహిళా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డైరెక్టర్ జనరల్ అధికారులు అభిలాష బిష్ట్, చారు సిన్హా, శికా గోయల్, స్వాతి లక్రాతో పాటు కానిస్టేబుల్ నుండి ఎస్పీ స్థాయి వరకు సుమారు 400 మంది మహిళా పోలీస్ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో మహిళా పోలీసులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అనుభవాలు, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి సీతక్క మహిళా పోలీసుల తొలి సదస్సు నిర్వహిస్తున్నందుకు పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు. మహిళా పోలీసుల సంక్షేమం పట్ల ప్రభుత్వ కమిట్మెంట్ను ఈ సదస్సు ప్రతిబింబిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్‌గా మహిళా శక్తిని ప్రోత్సహిస్తున్నారని, ఈ సదస్సులో మహిళా పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా సంక్షేమానికి సంబంధించిన సానుకూల నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. యూనిఫార్మ్‌లో ఉన్న అక్కచెల్లెమ్మలకు సెల్యూట్ అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1973లో కేరళలో కోజికోడ్‌లో దేశంలోని తొలి మహిళా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన విషయాన్ని స్మరించుకున్నారు. అదే దిశగా దేశవ్యాప్తంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పడి, న్యాయం కోసం మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఒకప్పుడు పోలీసులు, తాను భిన్న ధ్రువాలుగా ఉన్నామని మారిన పరిస్థితుల్లో తాను ప్రజాసేవలోకి రావాల్సి వచ్చిందని తన ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వృత్తి ధర్మానికి మానవీయతను జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయని, కమిట్మెంట్కు, కాన్ఫిడెన్స్‌కు చిరునామాగా తెలంగాణ మహిళా పోలీసులు నిలుస్తున్నారని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. వృత్తి ధర్మం, మాతృత్వం మధ్య మహిళా పోలీసులు ఎదుర్కొనే సంఘర్షణల దృష్ట్యా మెటర్నిటీ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. బొగ్గుబాయిల నుంచి అంతరిక్షం వరకు మహిళలు రాణిస్తున్న ఈ రోజుల్లో మహిళా పోలీసుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ అండగా నిలవాలని, సమాజంలో మహిళల పట్ల ఉన్న చిన్నచూపును అరికట్టే బాధ్యత కూడా పోలీసులపైనే ఉందని ఆమె పేర్కొన్నారు. డెడికేషన్, డిసిప్లిన్, డిగ్నిటీతో మహిళా పోలీసులు పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు భరోసాగా నిలవాలని ఆమె సూచించారు. ప్రతి ఏడాది జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని, మహిళా పోలీసులకు వీక్లీ ఆఫ్, ప్రత్యేక పని వేళల సౌకర్యాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని సీతక్క సూచించారు. మహిళా పోలీసుల అవసరాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తే, వాటి ఆధారంగా చట్టాలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆమె స్పష్టం చేశారు. జూనియర్ మహిళా కానిస్టేబుళ్లకు సీనియర్ అధికారులు మెంటర్లుగా మారి మార్గదర్శనం ఇవ్వాలని, సైబర్ క్రైమ్, ఆన్లైన్ హరాస్మెంట్ వంటి కేసులలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, స్ట్రెస్ మేనేజ్మెంట్, కౌన్సెలింగ్ కార్యక్రమాలు తప్పనిసరిగా ఉండాలని మంత్రి చెప్పారు. మహిళా పోలీసుల కృషిని గుర్తించేలా ప్రత్యేక అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, మెటర్నిటీ, పోస్ట్ డెలివరీ కాలానికి తగినట్లుగా తమిళనాడు తరహాలో ప్రత్యేక యూనిఫార్ములు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి వాటిని తెలంగాణలో అమలు పరచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళా పోలీసులకు అవసరమైన రెస్ట్ రూములు, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 వేల మంది పోలీసుల్లో మహిళా పోలీసులు కేవలం 7 వేల మంది మాత్రమే ఉన్నారని, వారి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని సీతక్క గుర్తుచేశారు. మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి ఈ సదస్సు దోహదపడుతుందన్న నమ్మకాన్ని మంత్రి సీతక్క వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళా పోలీస్ రాష్ట్రస్థాయి తొలి సదస్సును ప్రారంభించి ప్రసంగించిన మంత్రి సీతక్కను పోలీసు ఉన్నతాధికారులు సన్మానించారు. తెలంగాణ మహిళా పోలీస్ సదస్సు విచ్చేసిన ఇతర రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులను, పోలీస్ శాఖలో ఉన్నత స్థానంలో ఉన్న మహిళా పోలీసు అధికారులను మంత్రి అభినందించారు.