ఖాళీ స్థలం కబ్జా చేసిన మున్సిపల్ ఉద్యోగి?

మున్సిపల్ కమిషనర్ కి పిర్యాదు చేసిన కాలనీ వాసులు

బల్దియా అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమంగా ఇంటి నంబర్ పొందిన సదరు మున్సిపల్ ఉద్యోగి

నేటిధాత్రి, వరంగల్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్, హన్మకొండ మండలం, ప్రకాష్ రెడ్డి పేట, లోటస్ కాలనీలో ఖాళి ఫ్లాట్ ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న వరంగల్ మున్సిపాలిటి ఉద్యోగి మీద స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో, కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వర్లు, కాలనీకి సంబందించినటువంటి పెద్దలు కలిసి సోమవారం నాడు వరంగల్ మునిసిపల్ కమీషనర్ కి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఖాజీపేట గ్రామ శివారు సర్వే నెం.93 ప్రకాష్ రెడ్డి పేట, లోటస్ కాలనీలో 400గజాల భూమి కీ.శే గాదె పాపిరెడ్డి యొక్క నివాస స్థలం అని, ఈ స్థలాన్ని అక్రమంగా కాజేయాలనే ఉద్దేశంతో మునిసిపల్ కార్పొరేషన్ లో పనిచేసే నరేందర్ అనే ఉద్యోగి, 2003లో దొంగ నోటరీ డాకుమెంట్స్ తయారు చేసి, ఓనర్ ద్వార కొనుగోలు చేసినట్లు ఫోర్జరీ నోటరీ డాకుమెంట్స్ చేసి అతని బందువుల పేరు మీద ఇంటి నెంబర్ (24-3-78/3/ఏ) తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఆఫీసులో పనిచేసే బేర నరేందర్, అదే మునిసిపల్ ఉద్యోగులను, అధికారులను తప్పుదోవ పట్టించి ఖాళీ స్థలంలో ఇల్లు లేకున్నా కూడా ఇల్లు ఉన్నట్టుగా చూపించి ఇంటి నంబర్ తీసుకున్నాడు అని బాధితులు తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై, నోటరితో తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఇట్టి తప్పుడు రిజిస్ట్రేషన్ పైన స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం నాడు మున్సిపల్ కమిషనర్ ను కలిసి అక్రమ ఇంటినంబర్ మీద సమగ్ర విచారణ జరిపించి కేటాయించబడిన ఇంటి నెంబర్ రద్దు చేయాలని స్థానికులు కమీషనర్ కి ఫిర్యాదు చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు. కమీషనర్ సానుకూలంగా స్పందించి విషయాన్ని వెంటనే విచారణ చేసి, నివేదిక సమర్పించుటకు గాను, స్థానిక ఖాజీపేట డిప్యూటీ కమీషనర్ రవీందర్ కి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *