అక్రమార్కులకు అండ..పేదలకు పన్నుల గుదిబండ!

దోచుకునేవారికి దన్ను…పేదలకు పన్ను!

పేదలకు సాయం చేయాలంటే ప్రజల మీదే పన్నులు వేయాలి.

పిడికెడు మంది పెద్దల చేతుల్లోనే సంపద.

అక్రమ వ్యాపారులకు కొమ్ము కాస్తారు.

పేదల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు.

ఇంటి పన్ను కట్టలేదని చావు డప్పు మోగిస్తారు.

రైతు రుణం చెల్లించలేదని తలుపు చెక్కలు తీసుకెళ్తారు.

వ్యాపారులు పన్నులు కట్టకపోతే బ్రతిమిలాడుకుంటారు.

మా వల్ల కాదని చేతులెత్తేస్తే రాయితీలిస్తారు.

రుణాలు కూడా మాఫీ చేస్తారు.

పార్టీలకు ఫండ్‌ ఇస్తే వదిలేస్తారు.

సంక్షేమం పేరుతో పిడికెడు పథకాలు.

వ్యాపారులకు కోట్లలో సంతర్పణలు.

అక్రమ మైనింగ్‌లో బకాయిలు వసూలు చేయరు.

హడావుడి పేరుతో ఐఏఎస్‌లను మార్చుతారు.

అవినీతి పరులను వదిలేస్తారు.

ఏ పాలకులైనా ఇంతే…ఏ చరిత్ర చూసినా అంతే?

పేదలకు సాయపడాలంటే ప్రభుత్వాలు పన్నులే పెంచాలా…పేదలను ముక్కుపిండి పన్నులు వసూలు చేసి పేదలకు సాయపడాలా? ఇదెక్కడి లాజిక్కో ఏ నాయకుడు చెప్పడు. ఇది తప్పని చెప్పే ఏ ఎకనామిస్టు మాట ఏ పార్టీ వినదు. తాజాగా రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలంటే ఏంచేయాలన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులను రుణ విముక్తి చేయడం అన్నది మంచి పని. కాని దాని సాధ్యాసాధ్యాలను ముందు పరిశీలించలేదు. అందుకు అధ్యయనం జరగలేదు. ఎన్నికల్లో గట్టెక్కాంటే ఏదో ఒకటి చెప్పాలి. అధికారంలోకి వచ్చాక అధికారులను ఆదేశించాలి. సమీక్ష సమావేశాలలో సూచనలు కోరాలి..ఇదే రాజకీయ పార్టీలు పాలకులై సాధిస్తున్న విజయాలు…ఏ అదికారైనా రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పని చేసేందుకు పన్నుల మార్గం తప్ప మరో మార్గం వారు చెప్పలేరు. సాద్యం కాదు. పాలకులు ఏ పని చేయాలన్నా నిదులు కావాలి. అవి సమకూర్చుకోవాలి. అందుకు యంత్రాంగం ముందుకు కదలాలి. ఇంతవరకు బాగానే వుంది. కాని రైతు రుణమాఫీ కోసం మళ్లీ ప్రజల మీదే పన్నుల బారం మోపడం వల్ల నష్టం తిరిగి ప్రజలకే అన్నది మర్చిపోతున్నారు. రాష్ట్రంలో భూముల ధరలు పెంచాలి. సంపద వృద్ది కావాలి. కావాలి ప్రజల స్ధిరాస్ధుల విలువ పెరగాలి. అదే సమయంలో భూముల ధరలు సామాన్యులకు అందుబాటులో వుండాలి. ప్రస్తుత పరిస్ధితుల్లో పేదలు గ్రామీణ ప్రాంతాలలో కూడా వంద గజాల స్ధలం కొనుగోలు చేసుకునే స్ధితిలో లేరు. దాని వల్ల సామాన్యుడు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేయబడతాడు. పల్లెల్లో కూడా సరైన గూడు ఎంతో మంది అవస్ధలు పడుతున్నారు. అలాంటిది పట్టణాలలో సామాన్యుడి నివాసం కలగానే మారిపోయింది. పల్లెల్లో ఎకరాలు అమ్ముకున్న పట్టణాల్లో వంద గజాలు దొరికే పరిస్ధితి లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ఎకరం వంద కోట్లు ధర పలుకడం అంటే రాష్ట్ర వృద్ది సూచి కాదు. అది తిరోగమనం వైపు అడుగులు. ధరల పెరుగదల ఇండెక్స్‌లో చూపించుకునే సూచికలాగా మారింది. దాని వల్ల ద్రవ్యోల్భనం పెరుగుతుంది. సందప కొన్నివర్గాల చేతిలో కేంద్రీకృతమౌతుంది. సమాజంలో అసమానతలు పెరిగిపోతాయి. అది సమాజానికి ఎప్పుడూ మంచిది కాదు. ఏ పాలకులు నిర్ణయం తీసుకున్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేపట్టాలే గాని, తాత్కాలిక అవసరాల పేరుతో ధరలు పెంచి చేతులు దులుపుకుంటే, పేదలు అవస్ధలు ఎదుర్కొవాల్సివుంటుంది. నిజానికి ప్రభుత్వాలను మోసం చేస్తూ, పన్నులు ఎగ్గొడుతున్న వ్యాపారులు కొన్ని వేల మంది వున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని చేతులెత్తేస్తున్నవారు ఎంతోమంది వున్నారు.
వ్యాపారాల పేరుతో వందల కోట్ల రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన వారున్నారు. వారిని ఏ ప్రభుత్వం పట్టించుకోదు. కాని పేదల మీద పన్నుల భారం మోపి, నడ్డి విరస్తుంటారు. కోవిడ్‌ సమయంలో పారిశ్రామిక వేత్తలకు కేంద్ర ప్రభుత్వం 16లక్షల కోట్ల రూపాయల రద్దు చేసింది. కాని అదే సామాన్య రైతుకు ప్రభుత్వ ఆదేశాలు లేకుండా రుణాలు ఇవ్వదు. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తే తప్ప రైతుకు గత్యంతరం లేదు. మధ్యలో రైతులను బ్యాంకులు పెట్టే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. రైతులు రుణాలు చెల్లించడం లేదని తలుపు చెక్కలు తీసుకెళ్లిన ఘటనలు దేశంలో కోకోల్లలున్నాయి. అంతెందుకు ఇటీవల తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో బ్యాంకర్లు రైతులకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుందని చెప్పినా, మాకు సంబంధం లేదని రైతులను బెదిరించారు. ఇక ఇంటి పన్నులు కట్టడం లేదని మున్సిపల్‌ శాఖ చావు డప్పులు కొట్టడం చూస్తూనే వుంటాం. అంటే ప్రభుత్వాల పెత్తనాలన్నీ పేదల మీదనే…అదే వ్యాపారుల జోలికి అధికారులు వెళ్లగలరా? అక్రమార్కులుగా గుర్తించి వారి నుంచి వసూలు చేయగలరా? అలా పాలకులకు చిత్తశుద్ది వుంటే తెలంగాణలో మైనింగ్‌ వ్యాపారాల్లో వసూలు కాని పన్నులు కొన్ని వేల కోట్లలో వున్నాయి. వారి నుంచి ఇప్పటికిప్పుడు వసూలు చేసినా కొన్ని వందల కోట్లు ప్రభుత్వానికి సమకూరుతాయి. తెలంగాణలో మైనింగ్‌ వ్యాపారంలో ముందువరుసలోవుంది. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో మైనింగ్‌ వ్యాపారం కొన్ని వేల కోట్లలో జరుగుతుంది. అదే సమయంలో ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల ఇసుక వ్యాపారం జరుగుతుంది. వీటి ద్వారా ఆదాయం పొందుతున్న ఎంతోమంది వ్యాపారులు ఏటా వేల కోట్లు ఆర్జిస్తున్నారు. పన్నులు ఎగ్గొడుతున్నారు. ఆ బకాయిలు ఏ పాలకులు వసూలు చేయరు. ఎందుకంటే అందులో వున్న వాళ్లంతా రాజకీయ నాయకులు. వివిధ పార్టీలలో ప్రముఖులు. రాజకీయ నాయకులు వ్యాపారాలు చేయొద్దుని కాదు. కాని వాళ్లు ఆదర్శంగా వుండాలి. కాని వాళ్లే వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటున్నారు. పార్టీలు మారినప్పుడుల్లా కండువాలు మార్చుకుంటున్నారు. నిర్ణాయాక శక్తులుగా మారుతున్నారు. పన్నులు ఎగ్గొడుతున్నారు. వారి నుంచి పన్నులు వసూలు చేయడానికి పాలకులు ఇష్టపడరు. ఇదిలా వుంటే ఉద్యోగుల అవినీతి కూడా విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్‌ శాఖలో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.
ఇక రెవిన్యూ వ్యవస్ద గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచింది. ఇలా వ్యవస్దలను భ్రష్టుపట్టిస్తున్నవారిని వదిలేస్తున్నారు. ట్రాన్స్‌ఫర్ల పేరుతో వారి అవినీతిని తుడిచేస్తున్నారు. ఇంక్రిమెంట్లు కట్‌ చేస్తున్నామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నత స్ధానాల్లో వున్న ఎంతో మంది అధికారుల ఆస్ధులు కొన్ని వందల రెట్లు పెరిగాయి. ఇటీవల పట్టుబడిన వారి ఆస్ధుల విలువ చూస్తూ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒక్క హెచ్‌ఎండియే అధికారి బాలకృష్ణ ఆస్దులే వందల కోట్లు వున్నాయంటే ఉద్యోగికి అన్ని ఆస్ధులు సాధ్యమా? పట్టుబడుతున్న రెవిన్యూ అదికారుల ఆస్దులు కోట్లలో ఎలా వుంటున్నాయి. రిజిస్ట్రేషన్‌ శాఖలో ఉద్యోగులు ఆస్దులు ఎందుకు పెరుగుతున్నాయి. అంటే లోపం పాలకుల్లో వుంది. అదికారుల అవినీతిని అరికట్టలేరు. వ్యాపారుల అక్రమాస్ధుల జోలికి వెళ్లలేరు. ఆఖరుకు ప్రజా సేవలో అంత్యంత ముఖ్యమైన వైద్యశాఖలో కూడా విపరీతమైన అవినీతి ఎందుకు జరుగుతోంది. పేదల ప్రాణాలను నిలబెట్టాల్సిన శాఖలో కూడా వందల కోట్లు ఎలా సంపాదించుకుంటున్నారు. పేదల జీవితాలతో ఎలా ఆటాడుకుంటున్నారు. ఆసుపత్రుల పేరుతో ప్రజల ప్రాణాలను నిలువునా దోచేస్తున్న ఆసుపత్రులపై నియంత్రణ ఏది? నిఘా ఏది? వారి నుంచి వసూలు చేసిన సొమ్మేది. వారికి అండగా వుంటున్న వారి ఆస్ధుల చిట్టా ఏది? ఇలా చెప్పుకుంటూ పోతే ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగానే వుది. మరి ఇలాంటి సందర్భంలో ఉన్నతాధికారుల స్ధాన చలనాలు పరిష్కారం కాదు. వ్యవస్ధలను మాయ చేస్తున్న, మభ్యపెడుతున్న , మోసం చేస్తూ, అక్రమంగా కోట్లు కూడబెట్టుకుంటున్నవారి నుంచి వారు చెల్లించాల్సిన న్యాయబద్దమైన పన్నులనే వసూలు చేయండి. అప్పుడు ఏ సామాన్యుడిని మీద పన్నులు వేయాల్సిన అవసరం రాదు. ప్రజలకు సంక్షేమ పథకాలపేరుతో ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పోతే, భవిష్యత్తులో ప్రభుత్వ బడి నిర్మాణం చేయడానికి స్ధలం వుండదు. ఒక ఆసుపత్రి కావాల్సిన భూమి కూడా మిగలదు. ఇప్పుడు సంక్షేమం పేరుతో సంతర్పణలు చేసుకంటూ పోతే భవిష్యత్తు తరాలు అరిగోస పడుతాయి. రైతు రుణమాఫీ పేరుతో ప్రభుత్వం ఆదాయా మార్గాలు వెకడం కోసం మళ్లీ ప్రలజ మీదే భారం వేయడాన్ని స్వాగతించరు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది. గత ప్రభుత్వం రుణమాఫీ కోసం చాల సమయం తీసుకున్నది. ప్రతిపక్షాల ట్రాప్‌లో పడి, ఇప్పటికిప్పుడు రైతులను సంతృప్తి పర్చాలన్న ఆలోచనతో మరిన్ని సమస్యలు తెచ్చుకోవద్దు. ప్రతిపక్షాలన్న తర్వాత ప్రశ్నిస్తూనే వుంటాయి. పాలకులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలనే చూస్తాయి. అందుకోసం తొందరొద్దు…ప్రజల మీద బారం వద్దు. ఇది సగటు తెలంగాణ వాది సూచన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *