బేమాన్‌ లకే బిఆర్‌ఎస్‌ టిక్కెట్లు?

https://epaper.netidhatri.com/view/267/netidhathri-e-paper-17th-may-2024

`బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బహిరంగంగానే అంటున్న మాట.

`కార్యకర్తల కష్టం పట్టించుకోలేదు.

`ఇన్‌ ఛార్జుల కష్టం వృధా చేశారు.

`రాత్రింబవళ్ళు కష్ట పడిన ఇన్‌ ఛార్జులకే నామం పెట్టారు.

`పార్టీని నిండా ముంచే వారికే టిక్కెట్లు పంచారు!

`పార్టీ శ్రేణులను అభ్యర్థులు కసురుకున్నంత పని చేశారు.

`సరిగ్గా పోలింగ్‌కు ముందు అభ్యర్థులు చేతులెత్తేశారు.

`మా వల్ల కాదని కార్యకర్తల ముఖం మీదే చెప్పేశారు.

`పార్టీ మాకేమిచ్చిందని అభ్యర్థులే ఎదురు ప్రశ్నించారు.

`పార్టీ టిక్కెట్‌ ఇచ్చి పరేషాన్‌ చేసిందని బహిరంగంగానే అన్నారు.

`కార్యకర్తల ముందే అధినేత కేసీఆర్‌ను సైతం తూలనాడిన వాళ్లున్నారు.

`అభ్యర్థులు అసహనం ప్రదర్శిస్తుంటే ఆశ్చర్యపోయిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు.

`అప్పుడేమో టిక్కెట్లు కావాలన్నారు!

`ఇప్పుడేమో టిక్కెట్లు ఎందుకు తీసుకున్నామా? అన్నారు.

`ఇంత కాలం పదవులు అనుభవించిన వారే ఇలాంటి విపరీత వ్యాఖ్యలు చేశారు.

`పార్టీ ఇచ్చిన డబ్బులు దాచుకున్నారు.

`పార్టీ మాకేం చేయలేదని ప్రజల ముందే అని పార్టీ పరువు తీశారు.

`మా కష్టమంతా పార్టీకి దారపోశామని అన్నారు.

`అభ్యర్థుల మాటలు విని శ్రేణులు విస్తుపోయారు.

`కేసీఆర్‌ ప్రచారం బూడిదలో పోసిన పన్నీరు చేశారు.

`బీజేపీకి ఓట్లు పడేందుకు అభ్యర్థులే పరోక్షంగా సహకరించారు.

`కేసిఆర్‌ ఆశలు వమ్ము చేశారు.

`ఎన్నికల ముందు ఎక్కడ విన్నా కారే వినిపించింది.

`ఎన్నికలయ్యాక చర్చలేకుండా పోయింది.

`తప్పంతా అభ్యర్థులదే…

`గెలిస్తే అదంతా కేసిఆర్‌ దయే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సద్విమర్శను స్వీకరించాలి. ఆలోచించాలి. అంతర్మధనం చేసుకోవాలి. లేకుంటే ఎప్పుడూ తప్పటడుగులే పడుతుంటాయి. అంతా మాకే తెలుసనుకోకూడదు. ప్రతి సందర్భంలోనూ సొంత నిర్ణయాలు ఫలించవు. ఎంతటి వారికైనా సలహా అవసరం. పది మందితో చర్చ అవసరం. లాభ నష్టాల బేరీజు తప్పని సరి. ముఖ్యంగా రాజకీయాల్లో వున్నవారు, పార్టీల అగ్రనేతలు, అధినేతలకు సలహా సంప్రదింపులు ఎంతైనా అవసరం. అందుకే రాజులైనా, ప్రజాస్వామ్యంలో పాలకులైనా సరే సలహా మండలి ఎంతో ముఖ్యం. కొన్ని సార్లు పదిమందితో చర్చలు జరిగినా వ్యూహాలు విఫలమయిన సందర్భాలు కూడా వుంటతాయి. కాని విజయాలే ఎక్కువగా వుంటాయి. ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు ఎంతో అవసరం. పార్టీ మేలు కోరేవారు చాలా మంది వున్నారు. ఆ పార్టీ బతికి బట్టకట్టాలని ఆశిస్తున్నవారు వేలల్లో వున్నారు. పార్టీని నమ్ముకొని కార్యకర్తలు లక్షల్లో వున్నారు. బిఆర్‌ఎస్‌ అభిమానులు కోట్లలో వున్నారు. తెలంగాణ గుండెల్లో కేసిఆర్‌ వున్నాడు. కేసిఆర్‌ గుండెల్లో తెలంగాణ వుంది. ఇంతవరకు బాగానే వుంది. పార్టీలో ఏం జరగుతోంది. పార్టీ అపజయాల పాలెందుకౌతుంది. రాజకీయ పార్టీ అన్న తర్వాత గెలుపోటములు సహజం. కాని గెలుపు కూడా ఎక్కువ సార్లు పొందిన పార్టీలు అనేకం వున్నాయి. గుజరాత్‌లో బిజేపి వరసుగా ఏడోసారి విజయం సాధించింది. అంతగా జనంలో నిలిచిపోయింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా బిజేపి పునాదులు గట్టిగా కావడానికి కారణం గుజరాత్‌. అలాగే తెలంగాణలో బలమైన పునాదులున్న బిఆర్‌ఎస్‌కు ఏమైంది. ఏంతో మేధో మధనం వున్న కేసిఆర్‌ నాయకుడుగా వున్నారు. వారసులు రాజకీయంగా ఎంతో వ్యూహాత్మకంగా వున్నారు. పార్టీ నాయకులు ప్రజల్లో ఎంతో గుర్తింపుతో వున్నారు. కింది స్ధాయిదాకా పటిష్టమైన యంత్రాంగం వుంది. కాని లోపం జరుగుతోంది. ఎందుకు వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఇది సగటు బిఆర్‌ఎస్‌ కార్యకర్తల అనుమానం. భయం. ఎందుకంటే పార్టీ కోసం జీవితాలు త్యాగం చేస్తున్న వాళ్లు కొన్ని వేల మంది వున్నారు. వారి అనుచరలు మెత్తంగా లక్షల్లో వున్నారు. వారి భవిష్యత్తు కూడా పార్టీమీదే ఆధారపడి వుంది. గత శాసన సభ ఎన్నికల్లో ఏం జరిగింది. ఎక్కడ లోపం జరిగింది. అనేది పునశ్చరణ చేసుకున్నామని బిఆర్‌ఎస్‌ పెద్దలు చెప్పారు. పొరపాట్లు జరక్కుండా చూసుకుంటామన్నారు. శాసన సభ ఎన్నికలకు ఏడాది ముందుగానే నేటిధాత్రి పార్టీ పరిస్ధితి గురించి కొన్ని వందల కథనాలు రాసింది. పార్టీలో ఏం జరుగుతోందన్నదానిపై ఎప్పటికప్పుడు అనేక విశ్లేషణలు అందించింది. కేసిఆర్‌ పాలన మూలంగా తెలంగాణ ఎంత పచ్చగా వుందనేది కూడా చెబుతూ వచ్చింది. ఒకనాడు ఎడారి లాంటి తెలంగాణ తెలంగాణ రాగానే ఒయాస్సిస్సులాగా మారింది. అలాంటి కేసిఆర్‌ పాలనను సైతం తెలంగాణ ఎందుకు వద్దనుకున్నది. ప్రజల మనసులో ఏముంది. ప్రజల గుండెల్లో కేసిఆర్‌ వున్నా, పార్టీకి పరిస్ధితులు బాగా లేవన్న సంగతి నేటిధాత్రి ఏడాది కాలంగా చెబుతూనే వస్తోంది. కనీసం 30 మంది ఎమ్మెల్యేలను మార్చితే మళ్లీ బిఆర్‌ఎస్‌కు తిరుగలేదని పదే పదే నేటిధాత్రి ఎన్నో విలువైన సూచనలు చేసింది. కాని బిఆర్‌ఎస్‌ పెడ చెవిన పెట్టింది. ఫలితం అనుభవించేదాకా తెచ్చుకున్నది. పట్టుమని పది రోజులు కాకముందే తెలంగాణ మళ్లీ బిఆర్‌ఎస్‌ వైపు చూసింది. కాని బిఆర్‌ఎస్‌ ప్రజల వైపు చూడలేదు. కేవలం రాజకీయ ప్రకటనల వరకే పరిమితమైంది. ఉద్యమ కారులకు గుర్తింపునిస్తుందని అనుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో వారికి ప్రాదాన్యతనిస్తారని అనుకున్నారు. కాని అదీ జరగలేదు. దాంతో ప్రజల్లో బిఆర్‌ఎస్‌ మీద ఎంత ప్రేమవున్నా, అభ్యర్ధుల మూలంగా మళ్లీ ప్రజలకు దూరమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.

ఎవరు ఏమనుకున్నా…సరే నేటిధాత్రి చెప్పాల్సింది చెబుతుంది.

పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ కొంత మంది బేమాన్‌లకే టిక్కెట్లు ఇచ్చింది. ఇది ముమ్మాటికీ నిజం. కార్యకర్తలు సైతం చెబుతున్న వాస్తవం. ఎన్నికల సమయంలో వారు పడిన వేదన అంతా ఇంత కాదు. వారు ఎదుర్కొన్న యాతన మాటల్లో చెప్పలేము. అంతగా కార్యకర్తలు అభ్యర్ధుల వల్ల బాధపడ్డారు. బిఆర్‌ఎస్‌ ఎంపిక చేసిన కొంత మంది అభ్యర్థులు టిక్కెట్లు కావాలిన వారు కోరుకున్నారా?..లేక పార్టీ వారికి బలవంతంగా టికెట్‌ ఇచ్చిందా? అన్నది క్యాడర్‌కు అవసరం లేదు. కాని టికెట్లు వచ్చిన వారిలో కొంత మంది మాత్రం క్యాడర్‌ను పురుగులను చూసిన ట్లు చూసిన వాళ్లున్నారు. క్యాడర్‌ను ముప్పుతిప్పలు పెట్టిన వారున్నారు. రాత్రింబవళ్లు కష్టపడిన క్యాడర్‌ను యోగక్షేమాలు చూసుకున్నవారు లేరు. మండుటెండల్లో వారు పడుతున్న శ్రమలో అభ్యర్ధులు పది శాతం కూడా పడలేదంటే అతిశయోక్తి కాదు. కేవలం కేసిఆర్‌ బస్సు యాత్రల సమయంలోనే అభ్యర్ధులు హడావుడి చేశారు తప్ప, మిగతా సమయంలో వాళ్లు ప్రజల వద్దకు వెళ్లింది లేదు. ప్రజలను కలిసి ఓట్లడిగింది లేదు. అటు ఇన్‌చార్జులు, ఇటు నాయకులు, కార్యకర్తలు తమ శాయశక్తులా ప్రయత్నం చేశారు. కాని అభ్యర్ధులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరించారు. అది తెలంగాణ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో క్యాడర్‌ ముక్తకంఠంతో చెబతున్న మాట. ఈ విషయాలు పార్టీ అధిష్టానానికి తెలియాల్సిన అవసరం వుంది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీని ముంచేవారికే టిక్కెట్లు ఇచ్చారని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ టికెట్లు తీసుకొని వెళ్లిపోయిన వారు కొంత మంది వున్నారు. ఇతర పార్టీలలో టిక్కెట్లు తెచ్చుకున్నారు. కేసిఆర్‌ నాయకత్వాన్నే సవాలు చేశారు. అలాంటి వారికి గుణపాఠం చెప్పాలంటే ఆయా స్ధానాలలో నిలబడిన అభ్యర్దులు ఎంతో పటిష్టంగా ప్రచారం సాగించాలి. అయినా కేసిఆర్‌ ప్రచారానికి వచ్చారు. అభ్యర్ధుల తరుపున ప్రచారం విసృతంగా చేశారు. కాని అభ్యర్దులకు ఆ కృతజ్ఞత అసలే లేదు. సరిగ్గా పోలింగ్‌కు ముందు చాలా మంది బిఆర్‌ఎస్‌ అభ్యర్ధులు చేతులెత్తేశారు. సోషల్‌ మీడియా ప్రభావాన్ని బలంగా నమ్మారు. ఇతర పార్టీలు దూసుకుపోతున్నాయన్న అసత్య ప్రచారాన్ని బలంగా విశ్వసించారు. కాని వారికి అనుకూలంగా పనిచేసిన మీడియాను పట్టించుకోలేదు. వారిని వాడుకోలేదు. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాము కూడా ఓ ముప్పై సోషల్‌ మీడియాలను ఏర్పాటు చేసుకుంటే బాగుండేది అని చెప్పిన కేటిఆర్‌ ఆ పని ఎందుకు చేయలేదు. పార్టీకి అనుకూల మీడియా మీద ఎందుకు ఆధారపడలేదు. అయినా పార్టీ కోసం ఇరవై ఏళ్లుగా పనిచేస్తూ వస్తున్న నేటిధాత్రి లాంటి మీడియాను కూడా ఎందుకు నిర్లక్ష్యం చేసింది. అయినా అన్ని మీడియా సంస్ధలు నేటిధాత్రిలాగా పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేయాలని లేదు. పార్టీ కోసం పనిచేసేవారిని అభ్యర్ధులు పట్టించుకోలేదు. పార్టీ కోసం ఎన్నొ త్యాగాలు చేసే మీడియాను పార్టీ పట్టించుకోలేదు. గత శాసనసభ ఎన్నికల్లో చేసిన పొరపాటే పార్లమెంటు ఎన్నికల్లోనూ బిఆర్‌ఎస్‌ చేసింది. నిజానికి కేసిఆర్‌ బస్సు యాత్రతో బిఆర్‌ఎస్‌లో ఒక ఊపు కనిపించింది. ఆ ఊపు పోలింగ్‌ రోజున ఎందుకు ఒక్కసారిగా చల్లబడిరది. అసలు పోలింగ్‌ రోజున బిఆర్‌ఎస్‌ పదమే జనం నుంచి ఎందుకు వినిపించలేదు. పోలింగ్‌ రోజున క్యాడర్‌ ఎందుకు అసంతృప్తిగా వుందన్న సంగతి ఏ నాయకుడైనా గుర్తించాడా? లేదు. ఎంత సేపు వారి వ్యక్తిగత స్వార్ధం తప్ప పార్టీ మీద ఏ నాయకుడికి మమకారం లేదు. అభ్యర్ధులకు గెలవాలన్న తపన లేదు. ఆఖరు ఓటు దాకా పోరాటం చేయాలన్న సంకల్పం లేదు. పరుగు పందెంలో విజిల్‌ వేసేదాక నిలబడి, ఆగిపోయినట్లు చేశారు.

ఇంకా కొంత మంది అభ్యర్ధుల మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.

పార్టీ మాకేం చేసింది. మేమే పార్టీకి ఎంతో చేశాం. జీవితాలు త్యాగాలు చేశాం. ఇలాంటి మాటలు చెప్పిన వారు కొత్తగా టిక్కెట్లు వచ్చిన వారు కాదు. గత పదేళ్ల కాలంగా పార్టీ పదవులు, పార్టీతో ప్రజా ప్రతినిధులైన వారు అన్న మాటలు. వారి మాటల్లో పార్టీ మీద కనీసం ఒక్క శాతం ప్రేమ కనిపించలేదు. పదేళ్లుగా చట్ట సభల్లో వివిధ పదవులు అనుభించిన వారే తమకు పార్టీ ఏం చేసిందని ప్రశ్నిస్తే, సామాన్య కార్యకర్తల పరిస్ధితి ఎవరు చెప్పాలి. అంతే కాదు పార్టీ కోసం తాము చేసిన త్యాగాల ముందు పార్టీ ఇచ్చింది అణువంత కాదంటున్నారు. పదేళ్లు పార్టీ అధికారంలో వున్నా తమకు ఒరిగిందేమీ లేదన్నారు. ఏ రాజకీయ పార్టీలో నైనా గ్రామ స్దాయిలో సర్పంచ్‌, ఆ తర్వాత మండలం, తర్వాత జిల్లా…అది దాటినా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కావాలంటే ఎంతో శ్రమ పడాలి. ఎంతో ఓపిక కావాలి. అదృష్టం కూడా కావాలి. రాజకీయ పార్టీలలో నాయకుడు ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలనుకుంటారు. అందుకోసం జీవితాంతం ఎదురుచూస్తుంటారు. కొంత మంది అవకాశం కోసం పార్టీలు కూడా మారుతుంటారు. ఒక్కసారైనా చట్టసభలో కూర్చోవాలనుకుంటారు. ఆ పదవే అతి పెద్దది. అందుకోసం సర్వం పోగొట్టుకున్నవారు ఎంతో మంది వున్నారు. మరి అలాంటి పదవులు పొందిన వారు కూడా పార్టీ మాకేం చేసింది? అని ప్రశ్నిస్తున్నారంటే బిఆర్‌ఎస్‌లో ఎంత బేమాన్‌ నాయకులున్నారో అర్ధం చేసుకోవచ్చు. మేం లేకుంటే పార్టీయే లేదన్నంతగా మాటలు మాట్లాడుతున్నారంటే వారి అంకితభావం ఎంత గొప్పదో పార్టీ తెలుసుకోవాలి. శాసన ఎన్నికల్లో ఎంతో మంది ఎమ్మెల్యేల ఓటమికి కారణమైన వాళ్లు కూడా వున్నారు. వారిలో కొందరికి పార్లమెంటు ఎన్నికల్లో టికెట్లు వచ్చాయి. ఆనాడు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ఈ ఎన్నికల్లో ఇంత ప్రయాస పడాల్సిన అగత్యం వచ్చేది కాదు. కాని వాళ్లను శత్రువులుగా చూశారు. వారి ఓటమికి ప్రధాన కారణమయ్యారు. శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్దులు ఎంత బ్రతిమిలాడుకున్నా సాయం చేయని వారు, పార్లమెంటు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ అదికారంలో వున్ననాడు ఏ ఒక్కరి యోగక్షేమాలు చూడని వారు ఇప్పుడైనా క్యాడర్‌ను పట్టించుకున్నారా? అంటే అదీ లేదు. పార్టీ అగ్రనేతలనే క్యాడర్‌ ముందు తూలనాడిన అభ్యర్ధులున్నారు. ఇలాంటి వారికి పార్టీ టికెట్‌ ఇచ్చి ప్రచారం చేయమని చెబితే , క్యాడర్‌ కూడా ఎంతో విసిగిపోయింది. ఎన్నికల ముందు టికెట్లు కావాలన్నవారే..తర్వాత ఎందుకు ఇచ్చారని మాట్లాడారు. టికెట్లు ఇవ్వగానే సరిపోతుందా? పార్టీ సహాకారం అందించదా? ప్రశ్నించారు. వారి కోసం ఇన్‌ఛార్జులు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అభ్యర్ధులు ఒట్టి చేతులు చూపిస్తుంటే పార్టీ కోసం ఇన్‌చార్జులు కోట్లరూపాయలు ఖర్చు చేసిన వారు కూడా వున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కొంత మంది బేమాన్‌లను ఇంతకష్టపడి గెలిపించినా వారికి ఆ కృతజ్ఞత వుంటుందా? వుండదా? అన్న ప్రశ్నే తలెత్తుతోంది. అంతటా చర్చ జరుగుతోంది. పోలింగ్‌ రోజును బిఆర్‌ఎస్‌ గురించి ప్రజలు ఆలోచించకపోవడానికి ప్రధాన కారణం అభ్యర్థులు…ఎందుకంటే బిజేపి నుంచి హైదరాబాద్‌లో పోటీ చేసిన బిజేపి అభ్యర్ధి చేసిన ఎన్నికల పోరాటంలో బిఆర్‌ఎస్‌ అభ్యర్దులు ఒక్క శాతం కూడా చేయలేదు. గెలవాలన్న కసి బిఆర్‌ఎస్‌ అభ్యర్దుల్లో పది శాతం కూడా కనిపించలేదు. ఒక వేళ ప్రజల ఆశీర్వాదంతో బిఆర్‌ఎస్‌ అభ్యర్ధులు గెలిచినా అది కేవలం కేసిఆర్‌ దయే అన్నది జీవితంలో మర్చిపోవద్దు. కేసిఆర్‌ లాంటి నాయకుడి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలకు దూరం చేయొద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *