పంతమా! భరతమా!! దుర్మార్గులను వేటాడితే రేవంత్‌ పేరు చరిత్రలో పదిలం.

https://epaper.netidhatri.com/

సంక్షేమమా! ఆధిపత్యమా!!

మల్లారెడ్డి వరకే పరిమితమా?

అక్రమార్కులందరికీ శంకరగిరి మాణ్యాలేనా?

మల్లారెడ్డి మీద సాగుతున్నదానికి పేరేది?

తప్పు చేసినందుకు శిక్షా?

తెలంగాణలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్లు కోకొల్లలు!

వాళ్లందరి మీదుకు వెళ్తాయా? బుల్డోజర్లు?

హైదరాబాదు చుట్టూ భూదాన్‌ భూములు అన్యాక్రాంతం!

అనేక నాలాలు మాయం.

గుట్టలకు, గుట్టలే మింగేశారు.

దేవుళ్లకే శఠగోపం పెట్టారు.

తవ్వితే బైటపడేవన్నీ అక్రమాలే!

దుర్మార్గులను వేటాడితే రేవంత్‌ పేరు చరిత్రలో పదిలం.

కొందరికే పరిమితం చేస్తే రేవంత్‌ చిక్కుకునేది రాజకీయ సుడిగుండం.

సొంత పార్టీ నుంచే ఎదురౌతాయి గండాలు.

మొదలు పెట్టింది దీక్షలా పూర్తి చేస్తారా!

ఇతరులను లొంగదీసుకునే ఎత్తుగడలో భాగమా?

రాజకీయాలలో రేవంత్‌రెడ్డి ఆట మొదలుపెట్టారా? వేట మొదలుపెట్టారా? అన్నది కొద్ది రోజులైతే పూర్తి స్ధాయిలో క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాలేజీల మీద దాడులు, అక్రమార్కుల మీద ఉక్కుపాదానికి శ్రీకారం అన్న మాటలైతే వినిపిస్తున్నాయి. వీటిని కొనసాగిస్తారా? లేక ఇక్కడితోనే ఆగిపోతారా? అన్న దానిపై కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అయితే మల్లారెడ్డికి అన్ని అనుమతులు ఇచ్చింది అధికారులే..ఇప్పుడు నిబంధనలను మల్లారెడ్డి ఉల్లంఘించిండు! అని చెబుతున్నది అధికారులే..కూల్చివేతలకు అనుమతులు ఇచ్చింది! అధికారులే…మల్లారెడ్డి అధికారంలో వున్నప్పుడు ఆయన చేసిన తప్పులు ఎలా ఒప్పైనట్లు..ఇప్పుడు తప్పెట్లైనట్లు అన్నది కూడా తేలాల్సిన అవసరం వుంది. నిజానికి ఆది నుంచి మల్లారెడ్డి మీద అనేక ఆరోపణలున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు వందల సంఖ్యలో వున్నాయి. అయినా ఆయనను రాజకీయ పార్టీలు నెత్తిన పెట్టుకున్నాయి. ఆయనను గొప్పగా కీర్తించాయి. ఆయనను రాజకీయాల్లోకి తీసుకొచ్చాయి. మల్లారెడ్డి తెలంగాణ ఉద్యమ కారుడు కాదు..ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలకు, పార్టీలకు వంతపాడిన వ్యక్తే. ఆ పార్టీలకు నిధులు సమకూర్చిన వ్యక్తే. కాలేజీలకు అనుమతులు అప్పుడు కూడా పొందినవే.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెండు కళ్ల సిద్దాంతం పేటెంటు వున్న చంద్రబాబు పార్టీ నుంచే మల్కాజిగిరి నుంచి పోటీ చేశాడు. గెలిచారు. ఆనాడు చంద్రబాబును అంతగా కీర్తించిన మల్లారెడ్డి లాంటి నాయకుడు మరొకరు లేరు. చంద్రబాబు రాజకీయ జీవితంలో మల్లారెడ్డి పొగిడినన్ని పొగడ్తలు చంద్రబాబు విని వుండరు. తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరి అదే పొగడ్తల పరంపరను మల్లారెడ్డి కొనసాగించారు.
కేసిఆర్‌ను బుట్టలో వేసుకున్నాడు. కేసిఆర్‌ను కూడా అంతకు ముందు ఎవరూ కీర్తించనంతగా కీర్తించాడు. ఆ తర్వాత కేటిఆర్‌ను కూడా ఆకాశానికెత్తాడు. ఎమ్మెల్యే అయ్యాడు. మంత్రి కూడా అయ్యాడు. అదే సమయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి కూడా గతంలో అనేక విమర్శలు ఎదుర్కొనాడు. ప్రతిగా ఆనాడు మల్లారెడ్డి తన జీవితంలో ఎవరినీ తిట్టనన్ని తిట్లు రేవంత్‌రెడ్డిని తిట్టారు. ఒకటా..రెండా.. మీడియా రాయలేని భాషలో రేవంత్‌రెడ్డిని తూర్పార పట్టాడు. సవాళ్ల మీద సవాళ్లు చేశాడు. తొడలు కొట్టాడు. లేని మీసం మెలేశాడు. మంత్రిని అన్న సోయి కూడా మర్చిపోయి మీడియా సమావేశంలో అంతంతెత్తు ఎగిరాడు. సహజంగా నాయకులు రాజకీయ సభల్లో రెచ్చిపోతుంటారు. కాని మల్లారెడ్డి ఆ సంప్రదాయానికి చరమగీతం పాడాడు. విలేకరులసమావేశంలో కూడా ఇలా మాట్లాడొచ్చని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. బూతులకే కొత్త బాష్యం నేర్పాడు. అంతలా మల్లారెడ్డి ఆనాడు రెచ్చిపోవాల్సిన పనిలేదు. కాని అదికారం వుంది కదా అని, మంత్రి హోదాలో వున్నానని, కేసిఆర్‌ అండదండలున్నాయని రెచ్చిపోయాడు. ఏదొఒకనాడు రేవంత్‌ రెడ్డి చేతికి అధికారం వస్తే తన పనేమౌతుందని ఆలోచించలేకపోయాడు. నోరుందని కదా అని రెచ్చిపోయాడు. నోటికిష్టమొచ్చినట్లు రేవంత్‌రెడ్డిని తిట్టాడు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. గొడగొడ ఏడుస్తున్నాడు. అసలు మల్లారెడ్డిమీద వున్న ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. చెప్పుకుంటూ పోతే చాట భారతమే అవుతుంది.

అయితే ఇక్కడ ప్రజలనుంచి వస్తున్న ప్రశ్న ఒక్కటే..ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాల కూల్చివేత అన్నది మల్లారెడ్డి వరకే పరిమితమౌతుందా? నిరంతరం కొరసాగుతుందా? అంతే కాకుండా మల్లారెడ్డి మీద రేవంత్‌రెడ్డి పగ సాగిస్తున్నారా? పంతం నెరవేర్చుకుంటున్నారా? లేక అక్రమార్కుల భరతం పడుతున్నారా? అన్నది తేలాలి. ఎందుకంటే మల్లారెడ్డితో దుర్మార్గుల పని పట్టడం మొదలైందనుకుంటే మరో చోట కూడా మొదలైతే ప్రజల ఆలోచన మరో రకంగా వుండేది. మల్లారెడ్డి అక్రమాలు, మల్లారెడ్డి చేసిన మోసాలు కేవలం మేడ్చల్‌ జిల్లాకే పరిమితం. కాని మిగతా జిల్లాల ప్రజలు వివరాలు పూర్తిగా తెలియకు సానుభూని చూపించే అవకాశం వుంది. అప్పుడు ఆది కాస్త మేడ్చల్‌దాకా పాకే ప్రమాదముంది. ప్రభుత్వం చేస్తున్నది తప్పనే అభిప్రాయం జనంలోకి వెళ్లేందుకు ఆస్కారముంది. రాజకీయాల్లో ఏది సాధ్యమో! ఏది అసాధ్యమో!! చెప్పడం ఎవరి వల్ల కాదు. మల్లారెడ్డిమీద కాలేజీల మీద కొనసాగుతున్న దాడులు తెలంగాణ వ్యాప్తంగా సాగితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎంతో పేరు వస్తుంది. అక్రమార్కులందరికీ శంకరగిరి మాణ్యాలే అన్న సంకేతాలు వెళ్తే తప్పు చేసిన వారు భయపడతారు. తప్పు చేయాలంటే ఎవరైనా వణుకుతారు. తప్పు చేసినందుకు మల్లారెడ్డి శిక్ష అనుభవిస్తున్నాడన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాలి.
తెలంగాణలో మల్లారెడ్డిలాగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నవాళ్లు కోకొల్లలున్నారు. అన్ని పార్టీలలో వున్నారు. వారందరినీ గుర్తించేందకు ఏదైనా టాస్క్‌ ఫోర్సు ఏర్పాటు చేస్తారా? అన్నది కూడా ప్రభుత్వం ప్రకటించాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై నేటిధాత్రి అనేక కథనాలు ప్రచురించింది. అందులో భాగ్యనగర్‌ స్టూడియో వ్యవహారం, అనేక రియలెస్టేట్‌ కంపనీల బాగోతం, జూబ్లిహిల్స్‌లోని గుట్ట గుడి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి అక్షర పోరాటం సాగించింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లో పది ఎకరాలలో విస్తరించి వున్న గట్టను నేల మట్టం చేశారు. ఆ గట్టకు ఆనుకొని వున్న మరో 4 ఎకరాలు స్వాహా చేశారు. నిజానికి ఆ గట్ట ఒక వన్యప్రాణ ప్రాంతం. ఆ గట్టమీద జాతీయ పక్షి నెమళ్లు కొన్ని వందల సంఖ్యలో వుండేవి. అదే గుట్ట మీద అభయాంజనేయ స్వామీ గుడి వుండేది. ఆ గుడితో ఎంతో మంది భక్తులకు అనుబంధం వుంది. నిత్యం దీప దూప నైవేద్యాలతో ఆ గుడి కళకళలాడుతుండేది. కాని చూస్తుండగానే గుట్టను ఆనవాలు లేకుండా చేశారు. దేవుణ్ణి ఓ మూలన పడేశారు. నెమళ్ల జాడ ఏమైందో చెప్పిన నాదుడు లేడు. అసలు ప్రభుత్వం ఇవ్వాల్సిన స్థలమెంత? ఇచ్చిందెంత? సదరు వ్యాపారి అవతారంలోవున్న ప్రజాప్రతినిధి ఆక్రమించిన భూమి ఎంత? అన్నదానిపై ప్రతిపక్షంలో వున్న సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే దానిపై ద్వజమెత్తారు. ఓసారి మీడియా సమావేశం కూడా ఏర్పాటుచేయించారు. అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆ స్థలంలో రియల్‌ వ్యాపారం జరుగుతోంది.

ఆకాశహ్రమ్యాలు నిర్మాణం సాగిస్తున్నారు. వాటిని కూల్చేసే శక్తి ప్రభుత్వానికి వుందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గట్ట కూల్చడమే తప్పు. వణ్య ప్రాణలున్న ప్రాంతాలను ప్రైవేటు వ్యక్తులు అప్పగించడం మరో తప్పు. కొన్ని వేల కోట్ల రూపాయల భూములను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, లబ్ధిపొందడాన్ని ఆనాడు ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు దానిపై చర్యలు తీసుకుంటారా? అక్కడికి కూడా బుల్డోజలర్లు పంపిస్తారా? ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకుంటారా? ప్రభుత్వ భూములను అప్పగించిన వారిపై చర్యలుంటాయా? అన్న విషయాలపై కూడా స్పందించాల్సిన అవసరం వుంది. ఈ గుట్ట గుడి వ్యహారంలో ఆనాడు కాంగ్రెస్‌లో వున్న దాసోజు శ్రవణ్‌ ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో వున్నారు. ఆ వివరాలు పూర్తిగా సిఎం రేవంత్‌రెడ్డికి తెలుసు. ఇక భూదాన్‌ భూములు వ్యవహారాలకు లెక్కేలేదు. తెలంగాణకు స్వాతంత్య్రం రాకముందే, తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న సమంయలోనే ఆచార్య వినోభాబావే తెలంగాణ నుంచి భూ దానోద్యమం ప్రారంభించారు. ఆ సమయంలో ఒకప్పటి పోచంపల్లి ప్రాంతంలో రాంచంద్రారెడ్డి వంద ఎకరాల భూమిని దానం చేశారు. అవే భూములను అప్పుడే వినోభాబావే అక్కడి ప్రజలకు పంచారు. అలా మొదలైన భూదాన్‌ భూముల సేకరణ, పంపకాలు తెలంగాణలో అనేక చోట్ల జరిగాయి. ముఖ్యంగా అప్పటి హైదరాబాద్‌ , రంగారెడ్డి జిల్లాల పరిసరాలలో పెద్దఎత్తున భూములు సేకరించి, ప్రజలకు పంచడం జరిగింది. అయితే వాటికి ఇప్పటికీ లెక్కా పత్రం సరిగ్గా లేదు. దాంతో భూములను మింగేసేవారు, తర్వాత కాలంలో కన్నేసి వారి నుంచి అడ్డికి పావుసేరుకు సేకరించారు. భూములు వ్యాపారాలు చేశారు. గత ముప్పై ఏళ్లులో ఆ భూముల ఆక్రమణలు విసృతంగా జరిగాయి. మరి అలాంటి వారి మీద దృష్టిపెడితే కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ వశమౌతాయి. కొన్ని లక్షల కోట్ల విలువైన భూములు ప్రభుత్వపరమౌతాయి. అక్రమార్కుల చెరనుంచి ఆ భూములు విడిపించబడతాయి. వాటిపై కూడా సిఎం. రేవంత్‌ రెడ్డి దృష్టిపెడితే రాష్ట్రానికి మేలు. లేకుంటే సిఎం. పంతం కొద్ది చేస్తున్నారన్న అపవాదులు మోయాల్సివుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *