‘‘పొంగులేటి’’ పొలిటికల్‌ సునామీ.

https://epaper.netidhatri.com/view/261/netidhathri-e-paper-10th-may-2024%09

`సరికొత్త చరిత్రకు ‘‘పొంగులేటి’’ ‘‘శ్రీకారం’’.

`ఖమ్మం లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం.!

 

`నామా అహంకారం! పార్టీపై లేని మమకారం!!

`ఫ్లెక్సీ ల మీద తప్ప ప్రజల్లో వుండని ‘‘నామా’’!

 

`ఖమ్మంలో ‘‘బిఆర్‌ఎస్‌’’ ఖతం!

`త్రిశంకు స్వర్గంలో గులాబీ ఉనికి.

`పొంగులేటి ధాటికి ఎప్పుడో ఎండిపోయిన గు ‘‘లాబీ’’!

`పొంగులేటి వల్ల ఇప్పటికే కారు అడ్రస్‌ గల్లంతయింది.

`ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన ‘‘బిఆర్‌ఎస్‌’’ నాయకులు.!

`మెజారిటీ మీదనే ‘‘పొంగులేటి’’ అంచనాలు!

`జోరు జోరుగా కాంగ్రెస్‌ హుషారు.

`పొంగులేటి గాలిలో కొట్టుకుపోనున్న కారు.

`తలో దిక్కుగా ‘‘బీఆర్‌ఎస్‌’’ జిల్లా ‘‘పెద్దలు’’!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఒక నాయకుడి ధైర్యం పార్టీకి వెయ్యేనుగులు బలం కావాలని రాజకీయ పండితులన్నారు. అలాంటి నాయకుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. ఈ తరం రాజకీయాల్లో ఉత్తుంగ తరంగం లాంటి నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి. అంతే కాదు శ్రీనివాస్‌ రెడ్డిని రాజకీయ సునామీ అని చెప్పడంలో సందేహంలేదు. ఎందుకంటే సహజంగా రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు అనేవి ఉత్తుత్తి మాటలనుకుంటారు. మార్నింగ్‌ పైట్‌, ఈవినంగ్‌ టాక్‌ అనుకుంటారు. పొద్దున లేస్తే ఒకరినొకరు తిట్టుకునే నాయకులు, ఏకాంతంగా వున్నప్పుడు ఫోన్లలో సంబాషించుకుంటారని అనడం సహజంగా వింటుంటాం. అయితే ఇది మంచి సంప్రదాయమే..నాయకులు ఎప్పుడూ సిద్దాంతాలపై విభేదాలుండాలే గాని, రాజకీయ వైరుద్యాలుండాలే, వ్యక్తిగత వైషమ్యాలుండకూడదు. కాని నాయకులకు పట్టుదల వుండాలి. ప్రజలను ప్రేమించే గుణం వుండాలి. నాయకుడిగా ఎదిగి తనను నమ్ముకున్నవారికి న్యాయం జరిగేందుకు కృషి చేయాలి. తన వెంట నడిచేవారికి దారి చూపేలా వుండాలి. తనకే దారి లేనప్పుడు ఆ నాయకుడి వెంట నడిచేందుకు ఎవరూ ముందుకు రారు. అందుకే నాయకుడు ఎప్పుడూ ప్రజల్లో వుండాలి. రాజకీయాల్లో బలంగా వుండాలి. అలా తాను పదవిలో వున్నా, లేకున్నా బలమైన నాయకుడిగా పేరున్న నాయకులు చాలా అరుదు. ఆ ఉత్తమ లక్షణాలున్న ఈ తరం నాయకుల్లో శ్రీనివాస్‌ రెడ్డి ముందు వరుసలో వుంటారు. సిద్దాంతాలకు కట్టబడి పనిచేస్తారు. తాను నమ్మిన సిద్దాంతం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి త్యాగాలైనా చేస్తారు. ఎందుకంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 2014 తెలంగాణ ఎన్నికల్లో ఒక్కసారిగా వినిపించిన పేరు. తెలంగాణ వచ్చిన తర్వాత వైసిపి నుంచి ఎంపిగా ఎన్నికవ్వడమే కాకుండా, ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా గెలిపించాడు. అలాంటి బలమైన నాయకుడు బిఆర్‌ఎస్‌ లో చేరితే ఆయనకు మరింత సముచిత స్ధానం అందితే ఎంతో బాగుండేది. అలాంటి బలమైన నాయకుడిని బలహీనపర్చాలన్న ఉద్దేశ్యంతో బిఆర్‌ఎస్‌లో చేర్చుకొని, కర్ణుని కవచ కుండాలు లాగేసుకున్నట్లు చేద్దామనుకున్నారు. కాని శ్రీనివాస్‌ రెడ్డి బలం మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. 2018 బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో లోక్‌సభ సీటివ్వలేదు.

బీఆర్‌ఎస్‌ కోసం ఆయన ఎంతో శ్రమించారు.

ఆ పార్టీకి విధేయుడుగా వున్నారు. కాని రాను రాను ఆయనను దూరం పెట్టి, ఏకంగా రాజకీయాలకే దూరం చేయాలని కుట్రపన్నారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తల్చిందని, పొంగులేటిని దూరం పెట్టాలనుకున్నవారే పవర్‌కు దూరమయ్యారు. ఒక్క బిఆర్‌ఎస్‌ అభ్యర్ధిని గెలవనివ్వనని, ఒక్క బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వని పొ ంగులేటి చేసిన శపథం నెరవేర్చారు. ఇలాంటి నాయకులు ఇటీవల కాలంలో అరుదు. అన్నట్లుగానే ఖమ్మం జిల్లాను కాంగ్రెస్‌కు కంచు కోట చేశారు. బిఆర్‌ఎస్‌కు ఉనికి లేకుండా చేశారు. బిఆర్‌ఎస్‌ అన్న పదం ఖమ్మంలో వినపడకుండా చేశారు. ఇప్పుడు అసలు బి ఆర్‌ఎస్‌ కండువా కూడా ఎక్కడ కనిపించకుండా రాజకీయ చదరంగంలో తన ఎత్తుల చాణక్యాన్ని చూపించారు. తెలంగాణ రాజకీయాల్లో అపర చాణక్యుడు అన్న పేరున్న కేసిఆర్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. తన రాజకీయ జీవితాన్ని చిదిమేయాలనుకున్న కేసిఆర్‌కు పవర్‌ లేకుండా చేశాడు. తెలంగాణ సమజం ఊహించని దాన్ని నిజం చేసి చూపించాడు. దటీజ్‌ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అనిపించుకున్నాడు. తెలంగాణలో అక్కడక్కడ వాడిపోయిన దశలో వున్న గులాబీని ఖమ్మం జిల్లాలో ఏకంగా ఎండిపోయేలా చేసిన ఘనత పొంగులేటిది. ఆ పార్టీని త్రిశంకు స్వరంలోకి నెట్టి, దిక్కు దివానం లేకుండా చేశాడు. భవిష్యత్తులో ప్రజలకు బిఆర్‌ఎస్‌ గుర్తుకు రాకుండా చూసుకుంటున్నాడు. పొంగులేటి రాజకీయం వల్ల ఇప్పటికే ఖమ్మంలో కారు డొక్కుడొక్కయిపోయింది. పూర్తిగా ఎన్నికల్లోపోటీలో లేకుంటే భవిష్యత్తు మనుగడ కష్టమౌతుందన్న ఆలోచనతో బిఆర్‌ఎస్‌ ఖమ్మంలో పోటీ చేస్తుందే తప్ప, డిపాజిట్‌ కూడా కష్టమే. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు గతంలో ఎంపిగా పలుమార్లు పని చేశారు. చెట్టు పేరు చెప్పు రాజకీయాలు చేయడం తప్ప నామా ఖమ్మానికి చేసిందేమీ లేదు.

ఎన్నికల సమయంలో నలుగురు నాయకులతో తప్ప, గెలిచిన తర్వాత నామా ముఖం ప్రజలు ఎప్పుడూ చూసేది వుండదు.

ఆయన ప్రజల వద్దకు వచ్చేది వుండదు. అని అంటుంటారు. నామా నాగేశ్వరరావును చూడాలంటే ఫ్లెక్సీలతో తప్ప, ఎక్కడా కనిపించే అవకాశం వుండదని చెబుతుంటారు. అలాంటి నాయకుడిని పక్కన పెట్టుకొని పది మందిని గెలిపించుకునే సత్తా వున్న పొంగులేటిని పక్కన పెట్టి కేసిఆర్‌ పెద్ద పొరపాటు చేశాడు. కేసిఆర్‌ చేసి పొరపాటు కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎంత బలమైన నాయకుడో సమాజానికి తెలిసింది. ఒక రకంగా ఆ పరిణామం పొంగులేటికి మంచే చేసిందని చొప్పొచ్చు. బిఆర్‌ఎస్‌లో కొంచెం ప్రాదాన్యత వున్నా, అక్కడే వుంటే గుంపులో గోవిందయ్యలా పొంగులేటిరాజకీయం వుండేది. కాని ఇప్పుడు శాసించే రాజకీయం చేస్తున్నారు. తన కనుసన్నల్లో జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు. క్యాబినేట్‌లో నెంబర్‌ 2గా వెలుగొందుతున్నారు. పొంగులేటి దెబ్బకు బిఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మంలో కనీసం ప్రచారం చేసుకునేందుకు కూడా వీలులేకుండా పోయింది. ప్రజలు ఎక్కడికక్కడ నామాను నిలదీస్తున్నారు. ఆఖరుకు నామా సామాజిక వర్గం కూడా వెలివేసినంత పనిచేస్తోంది. గతంలో తెలుగుదేశంలో పనిచేసిన నామా ఇటీవల తెలుగు తమ్ముళ్లను కలవాలని వెళ్తే కనీసం కార్యాలయం మెట్లు కూడా ఎక్కనివ్వకుండా తరిమేశారు. ఇలా ఖమ్మంలో బిఆర్‌ఎస్‌ పరిస్ధితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా తయారైంది.

ఖమ్మంలో కాంగ్రెస్‌ గెలుపు ఎప్పుడో ఖాయమైంది.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముందు రాజకీయం చేయడం అంటే ఇతర పార్టీలకు మాటలు కాదు. ఆయన ముందు నిలబడి రాజకీయం చేయడం అంటే అంత ఆశామాషీ కాదు. ఖమ్మంలో కాంగ్రెస్‌కు రికార్డు మెజార్టీ సాధించి తన సత్తా ఏమిటో మరోసారి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కారుకు దిక్కులేకుండా చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో బిఆర్‌ఎస్‌ను పూర్తిగా ఖాళీచేశారు. ఏదొ పిడికెడు నాయకులు తప్ప, బిఆర్‌ఎస్‌లో ఎవరూ లేరు. అంతా పొంగులేటి వెంట ఆనాడే వచ్చారు. ఇంకా మిగిలిన వారు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే చేరిపోయారు. పార్లమెంటు ఎన్నికలైపోయిన తర్వాత బిఆర్‌ఎస్‌లో వున్న నాయకులు కూడా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకునేందుకు రెడీగా వున్నారనే తెలుస్తోంది. ఒక నాయకుడి పట్టుదల రాజకీయాలను ఎలా శాసిస్తోందో శ్రీనివాస్‌రెడ్డిని చూస్తే అర్ధమౌతుంది. ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధి రఘురాం రెడ్డి కూడా బలమైన నాయకుడే. వారి మూలాలు కూడా ఖమ్మంలోనే వున్నాయి. పైగా వారి కుటుంబం వరంగల్‌ జల్లా రాజకీయాలను శాసించిందే కావడం గమనార్హం. అయితే రాజకీయంగా కొంత గ్యాప్‌ వచ్చినా, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బలమైన నాయకుడుగా వుండడం కూడా రఘురాంరెడ్డికి కలిసివచ్చింది.ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. తెలంగాణలోనే ఖమ్మం నుంచి రికార్డు మెజార్టీతో రఘరాంరెడ్డిని గెలిపించాలని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎంతో పట్టుదలతో వున్నారు. ఖమ్మంలో ప్రజలంతా పొంగులేటి నాయకత్వం బలపరుస్తున్నారు. పొంగులేటి రఘురాంరెడ్డికి తోడుగా వున్నారు. ఇలాంటి సందర్భంలో విజయం కూడా మామూలుగా వుండదు. ఒక చరిత్రను సృష్టించేలా వుంటుందని లెక్కలేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రత్యర్ధుల రాజకీయ లెక్కలు తేల్చడంలో పొంగులేటిని మంచిన వారు లేరు. అందుకే ఖమ్మంలో డిపాజిట్‌ మీద కూడా బిఆర్‌ఎస్‌ ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నది. పొంగులేటి శిబిరంలో ఎప్పుడో పండుగ వాతావరణం నెలకొన్నది. ఎన్నికలు కావడమే తరువాయి. ఫలితాలపై ఉత్కంఠ అవసరం లేదు. రిజల్ట్‌ ఎప్పుడొస్తుందా?అన్న తొందరేమీ లేదు. ఎందుకంటే గెలిచేది కాంగ్రెస్సే…గెలిపించేంది పొంగులేటే…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *