ఏపికి హోదా! తెలంగాణకు వద్దా?

 

`కాంగ్రెస్‌ విచిత్ర వైఖరి!

`బిజేపిది వింత ధోరణి.

`ఈ అంశంలో బిఆర్‌ఎస్‌ సుద్దపూస కాదు.

`ఏపి మీద వున్న ప్రేమ… తెలంగాణ మీద లేదా?

`తెలంగాణపై ఇంకా చిన్నచూపేనా!

`ఇప్పుడు కూడా శీతకన్నేనా?

`కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపికి హోదా మీద కాంగ్రెస్‌ తొలి సంతకమా!

`తెలంగాణకు విభజన హామీలు ఉత్తమాటేనా!

` తెలంగాణలో అధికారం కావాలి.

`తెలంగాణ నుంచి ఎంపి సీట్లు కావాలి.

`తెలంగాణకు నిధుల విషయంలో చేతులెత్తేయాలి.

`తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్‌ దృష్టిలో వరమా!

`బిజేపి కంటికి అరవై ఏళ్ల గోస గుర్తు లేదా!

`కాంగ్రెస్‌ నేతలకు పట్టి లేదు.

`బిజేపి అడిగినా పట్టించుకోదు.

`ఈ అంశంలో బిఆర్‌ఎస్‌ సుద్దపూస కాదు.

`పదేళ్లలో కేంద్రాన్ని ఒక్కనాడూ కొట్లాడిరది లేదు.

`నాయకులకు అడిగేందుకు నోరు రాదు.

`ఏపి మీద ఎనలేని ప్రేమ.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ముందుగా ఒక్కమాట…ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, రాజకీయాలకు తావులేదు. సంకుచిత అభిప్రాయం అసలే కాదు….తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఒక మాట పదే పదే చెబుతోంది. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం…అంటున్నారు. అయినా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించడం లేదు. ఇప్పట్లో ఆదరిస్తారన్న నమ్మకం అసలే లేదు. కాని పదేపదే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్‌ పాకులాడుతోంది. కాంగ్రెస్‌ను ఆదరిస్తున్న తెలంగాణకు మాత్రం ఎలాంటి హమీ ఆనాటి నుంచి కూడా ఇచ్చింది లేదు. కొత్తగా ఇస్తామని చెబుతున్నదిలేదు. కేవలం తెలంగాణ ఇవ్వడమే గొప్ప అన్నట్లు అధికారం ఇవ్వండి అంటున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం గురించి జాతీయ పార్టీలైన బిజేపికి, కాంగ్రెస్‌కు ఆలోచించే తీరిక కూడా లేదా? ఇందులో బిఆర్‌ఎస్‌ పార్టీ సుద్దపూస కాదు. తెలంగాణ ప్రయోజనాల పేరుతో పదేళ్లపాటు అధికారం అనుభించిన బిఆర్‌ఎస్‌ పార్టీ కేంద్రంతో కొట్లాడిరది లేదు. కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిదులు తెచ్చింది లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేసింది లేదు. బిజేపిని అడిగింది లేదు. తెలంగాణకు ఏం ఎక్కువ వుంది? ఆంధ్రప్రదేశ్‌కు ఏం తక్కువ వుంది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ కంటే వంద రెట్ల వనరులు ఆంధ్ర ప్రదేశ్‌కే వున్నాయి. అయినా ఆయ్యో ఆంధ్రప్రదేశ్‌ అంటున్నారు. మాద్రాసు రాష్ట్రంలో వున్నప్పుడు విడిపోయింది ఆంధ్రప్రదేశ్‌. మద్రాసులో పెత్తనం సాగడం లేదని తెలంగాణను కలుపుకున్నారు. అరవై ఏళ్లు అరిగోస పెట్టారు. అందులో కాంగ్రెస్‌ పాత్రే ఎక్కువ. తెలంగాణకు హైదరాబాద్‌ వుందన్న మాటే కాని, మరో ఆదాయ వనరు వుందా? హైదరాబాద్‌ ఒక్క తెలంగాణ ప్రజలకే ఉపాది మార్గంగా వుందా? నిజం చెప్పాలంటే హైదరాబాద్‌లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలన్నీ ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లే కొట్టుకుపోతున్నారు. ఇది ముమ్మాటికీ నిజం. చివరికి తెలంగాణ రాజకీయాల్లో కూడా సీమాంధ్రకు చెందిన వాళ్లున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లున్నారు. ఇక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణకు కొత్తగా వచ్చిందేమీ లేదు. తెలంగాణ విషయంలో ఆది నుంచి కాంగ్రెస్‌ విచిత్ర వైఖరి అనుసరించడం చూస్తూనే వున్నాం. దక్షిణాదిన తమిళనాడులో కాంగ్రెస్‌కు స్ధానం లేదు. కేరళలలో అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పట్లో తావు లేదు. కాని తెలంగాణలో కాంగ్రెస్‌ అదికారంలో వుంది. ఒక వేళ కేంద్రంలో కాంగ్రెస్‌ కూటమి అదికారంలోకి వస్తే తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట ఎందుకు చెప్పడం లేదు. ఎందుకు చెప్పరు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు అడగరు. అసలు ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణకు వున్న వనరులు చాలా తక్కువ. దేశంలో గుజరాత్‌ తర్వాత అంతటి సముద్ర తీరం వున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. గుజరాత్‌ సుమారు 1110కిలోమీటర్ల సముద్ర తీరంతో దేశ విదేశాల సముద్ర వ్యాపారాలు సాగుతున్నాయి. అక్కడి వారికి పెద్దఎత్తున ఉపాధి మార్గం అందుతోంది. మత్స్య పరిశ్రమ కూడా పెద్దఎత్తున ఆదాయాన్ని సమకూర్చుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ సుమారు 972 కిలోమీటర్ల సముద్ర తీరం వుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సహజ ఓడ రేవు ఒక్క విశాఖలోనే వుంది. దేశంలో అన్ని ఓడరేవులు నిర్మాణం చేసినవే…కాని విశాఖ ఓడరేవు మాత్రం సహజంగా ఏర్పాటైంది. దానితోపాటు ఆంధ్రప్రదేశ్‌ మొత్తం అనేక ఓడరేవులున్నాయి. పెద్దఎత్తున విదేశీ వ్యాపారం జరుగుతోంది. మత్య పరిశ్రమకు వుంది. వాటికి తోడు గోదవరి, కృష్ణా, పెన్నా వంటి జీవ నదులతో అన్నపూర్ణగా విరాజిల్లుతోంది. తెలంగాణ ఆదాయం కంటే ఏమి తీసిపోలేదు. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ ఆదాయంలో తెలంగాణ దరిదాపుల్లో కూడా లేదు. అయినా జాతీయపార్టీలకు ఆంధ్ర ప్రదేశ్‌ అంటేనే ఎంతో సానుభూతి.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జాతీయ ప్రాజెక్టు ఇచ్చారు. కాకపోతే అక్కడి రాజకీయ క్రీడలో నిర్మాణం వెనుకబడిపోయింది.. అది ఆ రాష్ట్ర రాజకీయ పార్టీల తప్పు. ఇక తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఏడు మండలాలను బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఆంధ్రకు రాజధాని లేదని అందుకోసం ప్రత్యేకంగా నిధులిచ్చారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హమీని పక్కన పెట్టి, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. అలా ఆంధ్రప్రదేశ్‌కు అనేక రకాల మేలు చేశారు. అయినా బిజేపిని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నమ్మలేదు. ఆ పార్టీకి స్ధానం లేదు. తల్లిని చంపి పిల్లను బతికించారంటూ ప్రదాని మోడీ పదే పదే అనేక సార్లు ప్రస్తావిస్తూ వచ్చారు. ఆంద్రప్రదేశ్‌పై తన ప్రత్యేక ప్రేమను పలుసార్లు ప్రకటించుకున్నారు. కాని ఏనాడు తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. తెలంగాణకు సాయంచేస్తామని ఏనాడు చెప్పలేదు. ఒక దశలో ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో బిహార్‌ లాంటి రాష్ట్రాలకు ఏక కాలంలో రూ.80 వేల కోట్ల వరాలు ప్రకటించారు. కాని తెలంగాణకు ఏనాడు ఒక్క ప్రాజెక్టు ఇచ్చింది లేదు. తెలంగాణకు విభజన చట్టంలో పొందు పర్చిన ఐటిఐఆర్‌ను తీసుకెళ్లారు. వరంగల్‌లో కోచ్‌ ప్యాక్టరీ ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ మంజూరు కాలేదు. ఒక్క జాతీయ సాగునీటి ప్రాజెక్టు మంజూరు చేయలేదు. ఇక హోదా ప్రస్తావన ఎవరూ తేలేదు. పదేళ్ల పాటు కేంద్రంలో సఖ్యత ప్రదర్శించిన బిఆర్‌ఎస్‌ పార్టీ సాధించిన నిధులు లేవు. మోదీతో కొట్లాడిరది లేదు. కాని కేసులు మాత్రం ఎదుర్కొంటున్నారు. మోదీతో కొట్లాడినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం బిఆర్‌ఎస్‌ కొట్లాడిన చరిత్ర ఎక్కడా లేదు. కేవలం రాజకీయాల కోసం తప్ప, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడనట్లు కనిపించింది లేదు. సాక్ష్యాత్తు కల్వకుంట్ల కవిత పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. కాని తెలంగాణకు కూడా ఇవ్వాలని అడగలేదు. తెలంగాణ ధనిక రాష్ట్రం మాకు కేంద్రం ఆసరా అక్కరే లేదన్నట్లు కేసిఆర్‌ బీరాలు పలికారు. తెలంగాణను అప్పుల్లోకి నెట్టారు. ఈ విషయాన్ని గుర్తు చేసే కాంగ్రెస్‌ పెద్దలు తెలంగాణకు ప్రత్యేక హోదా ఎందుకు అడగరు?
ఆంధ్రప్రదేశ్‌లోనైనా రాజకీయ పార్టీలు రాజకీయమే చేశాయి. బిజేపితో పొత్తుకోసం అవసరాన్ని బట్టి పాకులాడడం, మనుగడ కోసం కొట్లాడినట్లు నటించడం, యూటర్న్‌లు తీసుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రత్యేక హోదా కోసం కొట్లాడతామని చెప్పిన జగన్‌ సాధించేందేమీ లేదు. ఆయన అదికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు అడిగింది లేదు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వమంటే చంద్రబాబు తలూపారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే అదే మహా ప్రసాదమన్నారు. రెండు లక్షల కోట్లు ఇస్తామంటే అదే మహాభాగ్యమన్నారు. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ పాచిపోయిన లడ్డూలంటూ వెటకారం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే బిజేపిని ఆకాశానికి ఎత్తుకుంటున్నారు. కాని ప్రత్యేక హోదా అన్న డిమాండ్‌ ఏనాడో వదిలేశారు. ఎందుకంటే ఆంద్రప్రదేశ్‌కు ఆ అవసరం లేదు. కాని కాంగ్రెస్‌ పదే పదే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటోంది. కనీసం అప్పుడైనా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు చలనం కలగడం లేదు. కేంద్రంలో అధికారంలోకి వస్తే మాకూ ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ నేతలు కోరిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఒక్కసారి ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఏటా కనీసం రూ.40వేల కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం వుంది. పైగా రాష్ట్ర పన్నులను కేంద్రం మినహాయించుకుంటుంది. పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయి. అంటే అటు కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చే నిధులు, ఇటు కేంద్రానికి వెళ్లకుండా రాష్ట్రానికే ఉపయోగపడే పన్నులతో తెలంగాణ ఎంతో అభివృద్ది జరిగేది. కొన్ని లక్షల మందికి సొంత ఇండ్ల నిర్మాణం జరిగేది. పెద్దఎత్తున ప్రభుత్వ విద్య అందుబాటులోకి వచ్చేది. పేదలకు మరింత ఉచిత వైద్యం అందేందుకు దోహదపడేది. కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చేవి. పారిశ్రామికంగా రాష్ట్రం మరింత పురోభివృద్ది జరిగేది. కాని బిఆర్‌ఎస్‌కు పట్టలేదు. కేసిఆర్‌కు పదేళ్లు ఆ సోయిలేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలో వుంది. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలిన కోరుకుంటోంది. తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్‌కు పెద్దఎత్తున మద్దతు పలుకుతున్నారు. అధికారం కట్టబెట్టారు. అయినా తెలంగాణకు ప్రత్యేక హోదా ఇస్తామని డిల్లీ పెద్దలు చెప్పడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అడగడం లేదు. ఇప్పటికైనా అడుగుతారో…లేదా ఈ మాత్రం చాలనుకొని ఊరుకుంటారో చూద్దాం…అంతే కాకుండా ఒకవేళ బిజేపి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, రాష్ట్ర బిజేపి నేతలు కనీసం మాట వరసకైనా డిమాండ్‌ చేస్తారో లేదో చూద్దాం..తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరు పాటుపడతారో ఇప్పటికైనా తెలుసుకుందాం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *