సన్నాలు సాధ్యమా!

https://epaper.netidhatri.com/view/267/netidhathri-e-paper-17th-may-2024/2

`పేదలకు సన్న బియ్యం మంచి ఆలోచన!

`తెలంగాణ భూములు అనువేనా!

`సన్నాలకు సమయం ఎక్కువ!

`అంత నీటి సౌలత్‌ వుందా!

`మూడు పంటల చోట రెండు పంటలతో రైతు బతికేనా!

`సన్నాల సస్య రక్షణ ఖర్చుతో కూడుకున్న పని.

`పంట చేతికొచ్చే సమయంలో రసం పీల్చే చీడతో బెడద.

`గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే ఈ ప్రయోగం విఫలం.

`మళ్ళీ సన్నాలంటే రైతులు ముందుకొస్తారా!

`ప్రాంతాల వారిగా ఏ పంటలు వేయాలో రైతులకు తెలుసు.

`బలవంతపు సాగు మొదటికే మోసం.

`ప్రభుత్వం పునరాలోచించాలి.

`రైతు మేలును కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

`సన్నాలు పండిరచేందుకు రైతు ముందుకు రావాలి.

`నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేయాలి.

`నకిలీ విత్తనాలు అరికట్టాలి.

`తెలంగాణకు అవసరమైన విత్తనం వుందా!

`సన్నాల సాగు విపరీతమైన ఖర్చు.

`రైతు భరించగలడా?

`అందుకు సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి వుండాలి.

`సన్నాలకు ఎక్కువ చెల్లింపులు జరగాలి.

`అదనంగా బోనస్‌ అందాలి.

`సన్నాలు నిర్ణీత సమయంలో కొనుగోలు చేయాలి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రేషన్‌ కార్డు దారులకు సన్న బియ్యం ఇచ్చే యోచన చేస్తున్నామని చెప్పడం శుభ పరిణామం. అదే సమయంలో తెలంగాణలో సన్న వరి పంటలకే బోనస్‌ అని చెప్పడం ఒక్కసారిగా రైతులకు కలవరపాటుకు గురిచేసింది. ఈ సలహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎవరిచ్చారోగాని, గత ప్రభుత్వ హయాంలో సన్నాలు పండిరచాలని కేసిఆర్‌ సూచించినప్పుడు వ్యతిరేకించారు. కేసిఆర్‌ రైతులను ఆగం చేసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని కూడా అన్నారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సన్నాలను తెరమీదకు తెవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. కారణం తెలంగాణలో సన్న రకాలు చాలా ప్రాంతాల్లో పండేదుకు అవకాశం లేదు. కేవలం విజయవాడకు సమీపంలో వున్న కోదాడ ప్రాంతాలలో మాత్రమే సన్న రకాలు పండేందుకు అనువైన వాతావరణం ఎక్కువగా వుంది. మిగతా ప్రాంతాలు సన్నాలకు అనువైన ప్రదేశాలు కాదు. వాతావరణం విషయంలో సన్నాలకు గాలిలో తేమ ఎక్కువగా వుండాలి. తెలంగాణలో ఎక్కువ భాగం తేమ వుండదు. అందువల్ల సన్నాలు పండేందుకు అనువైన వాతావరణం కాదు. ఇక తెలంగాణలో నీటి వసతులు పుష్కలంగా వున్న సమయంలోనే సన్నాలను పండిరచాలని గత ప్రభుత్వం సూచించి వెనక్కి తీసుకున్నది. రైతులను సన్నాలు పండిరచాలని సూచించి, కేసిఆర్‌ దొడ్డు రకాలు పండిరచి, రైతులనుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి పేదలకు రేషన్‌ ద్వారా సన్న బియ్యం సరఫరా చేయాలనుకోడం మంచిదే. కాని రైతులు బోనస్‌ పేరుతో రైతులు సన్నాలు పండిరచాలని సూచించడం వల్ల రైతులు అయోమయంలో పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సన్నాలకే బోనస్‌ ఇస్తామంటే, రైతులు ఆ బోనస్‌ను కూడా వదులుకునేందుకు సిద్దంగానే వుంటారు. కారణం తెలంగాణ భూములలో ఎక్కువగా దొడ్డురకాలే ఎక్కువగా పండేదుకు ఆస్కారం వుంది. దొడ్డు వడ్లు ఎకరానానికి సుమారు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దాని వల్ల రైతుకు ఎకరాకు రూ.60వేల సంపాదన సమకూరుతుంది. అందులో సగం ఖర్చులు తీసేసినా రూ.30వేలు ఆదాయం వస్తుంది. కాని సన్నాల వల్ల దిగుబడి చాలా తగ్గిపోతుంది. సన్నాలు ఎకరానికి 20 నుంచి 22 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది. అందుకు మించి ఒక్క క్వింటాల్‌ కూడా ఎక్కువ రాదు. కాని అదే దొడ్డు రకంలో కొన్ని రకాలు 40 బస్తాలు కూడా దిగుబడి వచ్చే అవకాశం వుంది. కాని ఏ సన్నాలలో అలాంటి అవకాశం లేదు.
ఇక దొడ్డు రకం వరికి ఎరువుల ఖర్చు కొంత తక్కువే. చీడల పీడల కోసం వాడే పురుగుల మందుల ఖర్చు సన్న వరికన్నా తక్కువే. అందువల్ల రైతులకు లాభ సాటిగా వ్యవసాయం అంటే కేవలం దొడ్డు వరి మాత్రమే అన్నది అందరికీ తెలుసు. అయినా తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందనేది రైతులకు తెలిసినంతగా ఏ శాస్త్రవేత్తకు తెలియదు. ఎందుకంటే తరతరాలుగా వారి పూర్వీకులు ఏ పంటలు పండిస్తున్నారో చూస్తూనేవున్నారు. తెలంగాణలో గోదుమ సాగు అసలే సాద్యం కాదు. అలా తెలంగాణలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పంటలు పండుతుంటాయి. ఉత్తర తెలంగాణలో వరితోపాటు మొక్కజొన్న, పత్తి ఎక్కువగా పండుతాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎక్కువగా వరి, మిర్చి, పత్తి పంటలు పండుతుంటాయి. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా కంది, మొక్క జొన్న పండేందుకు భూములు అనువుగా వున్నాయి. దేశంలోనే తాండూరు కందిపప్పుకున్న డిమాండ్‌ అంతా ఇంతాకాదు. పొరుగున వున్న కర్నాకటలో ఎర్ర కంది పప్పు పండిస్తారు. కాని ఆ పక్కనే వున్న మన తెలంగాణలో మాత్రం ఎర్ర కందిపప్పు పండదు. ఇలా భూముల రకాలను బట్టి, ప్రజల ఆహార అలవాట్లను బట్టి పంటలు పండిరచడం జరుగుతుంది. ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా, సాగులో కొత్త కొత్త వంగడాలు వచ్చినా, దిగుబడులు పెరిగే పంటలనే రైతులు సాగు చేస్తారు గాని, దిగుబడి తక్కువ పంటలు పండిరచేందుకు సాహసం చేయరు. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయమే వాతావరణంతో జూదం లాంటిది. నిజామాబాద్‌ లాంటి ప్రాంతాలలో ఎర్రజొన్న, చెరుకు పంటలు పండిస్తుంటారు. మరి ఒక్క తెలంగాణలోనే ఇన్ని రకాల పంటలు పండుతున్నాయి. అయితే గతంలో నీటి వసతులు అంతంగా లేనప్పుడు కేవలం వర్షాధార పంటలు పండిచిన సమయంలో నువ్వులు కూడా పండిరచేవారు. కాని తెలంగాణలో ఇటీవల నీటి వసతులు బాగా మెరుగైనందున నువ్వుల సాగు అన్నది జాడ కూడా లేదు. కొన్ని ప్రాంతాలో ఉలువలు పండిరచేవారు. జొన్నలుపండిరచేవారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో వాటి జాడ చూద్దామన్నా లేదు. ఇక నగరాలకు సమీపంలో వున్న ప్రాంతాలలో కూరగాయల సాగు, పువ్వుల సాగులకు ఎక్కువ ప్రాదాన్యతిస్తున్నారు.
శాసనసభ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అన్ని పంటలకు బోనస్‌ రూ.500 ఇస్తామని చెప్పారు. కాని పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే కేవలం సన్న రకం వడ్లకే బోనస్‌ ప్రకటించడం అన్నది సరైంది కాదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అయితే రైతులు సన్నాలు పండిరచి, వాటిని బియ్యం చేసి అమ్ముకుంటే దొడ్డు బియ్యం కన్నా మేలు. కాని తెలంగాణలో సన్న రకాలలో నాణ్యమైన బియ్యం కేవలం ఖరీఫ్‌లోనే సాధ్యమౌతుంది. ఎందుకంటే ఖరీఫ్‌లో సాగుకు అవసరమైన నీరు పుష్కలంగా అందుతుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా వుంటుంది. కాని రబీ సీజన్‌లో తేమ వుండదు. సన్న రకాల వడ్ల గింజ బలంగా వుండదు. తాలు ఎక్కువగా వచ్చే అవకాశం వుంది. పైగా దొడ్డు వరికి, సన్న వరికి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరలో తేడా లేదు. సన్నవడ్లకు మార్కెట్‌లో ధర లేదు. కాని అదే మిల్లర్లు మాత్రం బియ్యాన్ని మూడు రెట్లకు అమ్ముకుంటున్నారు. ఇక్కడ రైతులకన్నా, వ్యాపారులు ఎక్కువగా లాభపడుతున్నారు. అందుకే రైతులు సన్నాలు పండిరచేందుకు ముందుకు రావడం లేదు. గతంలో కేసిఆర్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నమే విఫలమైంది. అందువల్ల మళ్లీ రైతుల మీద ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని రైతులు కోరుతున్నారు. దొడ్డు వరి రకాల పంట కేవలం 4 నెలల్లో చేతికి వస్తుంది. కాని సన్నాలకు మాత్రం ఆరు నెలల సమయం పడుతుంది. అందువల్ల ఏటా సన్న రకాలతో రెండు పంటలు మాత్రమే పండేందుకు అవకాశం వుంది. కాని అదే దొడ్దు రకం మూడు పంటలు పండుతాయి. దాంతో రైతులకు ఏ రకంగా చూసినా మేలే తప్ప నష్టం లేదు. సన్నాల మూలంగా నష్టమేతప్ప లాభం ఎక్కడా కనిపించడం లేదు. సన్నాలు పొట్టకొచ్చే దశలో రకరకాల చీడలు పంట మీద దాడి చేస్తాయి. వాటిని తట్టుకునే రకాలు ఇంకా అందుబాటులో లేవు. కాని దొడ్డు వరిలో చీడ,పడలను ఎదుర్కొనే రకాలు అనేకం వున్నాయి. ఇక్కడ కూడా రైతులకు మేలు జరిగే అవకాశం లేదు. ఇక తెలంగాణ వ్యాప్తంగా సుమారు కోటి ఎకరాల్లో సన్న వరి పంట వేసినా, అందుకు అవసరమైన నాణ్యమైన విత్తనం అందుబాటులో వుందా? అన్నది కూడా ఆలోచించుకోవాలి. పైగా అందులోనూ నకిలీ విత్తనాల బెడత అందరికీ తెలిసిందే. వర్షాకాలం మొదలయ్యే ముందు రైతులు విత్తనాలు కొనే సమయంలో ప్రభుత్వాలు నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం అంటారు. కాని ఇన్నేళ్లలో ఏ ఒక్క కంపనీ మీద ఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది లేదు. ఏ కంపనీల ప్రతినిధులపై పిడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు తరలించింది లేదు. కాని ప్రతీ ఏటా ఇదే విషయం అరిగిపోయిన గ్రామ్‌ఫోన్‌ రికార్డులాగా ప్రభుత్వాలు చెబుతూనే వుంటాయి. రైతులు వింటూనే వుంటారు. నకిలీ విత్తనాలతో మోస పోతూనే వుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు సాగులో వేలు పెట్టకపోవడమే మంచింది. తమకు వున్న భూమి ఏ పంట అనుకూలమన్నది చెప్పడంలో రైతుకు మించిన శాస్త్రవేత్త మరొకరు వుండరు. అందువల్ల రైతులకు ప్రోత్సాహకాలు పెంచకుండా ఎలాంటి సూచనలు జారీ చేసినా, ఆరు గాలం శ్రమను ఆగం చేసినట్లే అవుతుంది. అందువల్ల ఎన్నికల సమయంలో రైతులకు హమీ ఇచ్చినట్లు అన్ని పంటలకు బోనస్‌ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వారి కోరిక న్యాయం కూడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *