హనుమకొండ లోని నవయుగ హై స్కూల్ లో విద్యార్థి ఆత్మహత్య

ఉరేసుకుని చనిపోయిన తొమ్మిదో తరగతి విద్యార్థి

హనుమకొండలోని నవయుగ హై స్కూల్ లో ఘటన

ఎన్జీవోస్ కాలనీ (హనుమకొండ) నేటి ధాత్రి:

క్లాస్ రూమ్ లోనే ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగగా..

స్కూల్ సిబ్బంది గమనించి ఎంజీఎం హాస్పిటల్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ లు నిర్ధారించారు.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామానికి చెందిన వివేక్ హనుమకొండ విజయపాల్ కాలనీ ఇందిరానగర్ రోడ్డు లోని నవయుగ హై స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

సోమవారం సాయంత్రం వరకు తోటి స్టూడెంట్స్ తో గడిపిన వివేక్.. రోజువారీలాగే మిగతా పిల్లలతో కలిసి పడుకున్నాడు. కాగా అర్ధరాత్రి 12 గంటల సుమారులో క్లాస్ రూమ్ కి వెళ్లిన వివేక్ అక్కడే ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజామున గుర్తించిన స్కూల్ సిబ్బంది హుటాహుటిన వరంగల్ ఎంజీఎం కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా వివేక్ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్టూడెంట్ సూసైడ్ సమాచారం అందుకున్న సుబేదారి సిఐ షుకూర్, ఇతర సిబ్బంది వివేక్​ ఉరేసుకున్న గదిని, సీసీ ఫుటేజీ పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

విద్యార్థి ఆత్మహత్యపై అనుమానాలు

తరగతి గదిలోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వివిధ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్​ సిబ్బంది తీరు వల్లే విద్యార్థి ఉరి వేసుకున్నాడని ప్రచారం జరుగుతుండగా.. విద్యార్థి తండ్రి రాజుకు పాఠశాల నుంచి అందిన సమాచారం కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. వివేక్​ ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చిన తరువాత పాఠశాల సిబ్బంది వివేక్​ తండ్రి అయిన రాజుకు ఫోన్​ కాల్​ చేసి.. వివేక్​ కింద పడ్డాడని చెప్పాడని రాజు తెలిపారు. మూర్చ వచ్చి కింద పడ్డాడని చెప్పారని, అసలు ఏం జరిగిందో తెలియడం లేదని వివేక్​ తండ్రి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వివేక్​ ఎవరి జోలికి వెళ్లే వ్యక్తి కాదని విలపించారు. కాగా విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం అందగానే సుబేదారి సీఐ, ఇతర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తూ.. సీసీ ఫుటేజీలు పరిశీలించామని, విద్యార్థి ఒక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. కాగా విద్యార్థి ఉరి వేసుకున్న విషయం స్కూల్​ సిబ్బంది ఎందుకు దాచాల్సి వచ్చిందనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి తండ్రికి అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే చర్చ కూడా నడుస్తుంది. దీంతో విద్యార్థి ఆత్మహత్య విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *