Headlines

మహిళా పోలీసుల కష్టాలు పాలకులకు పట్టవా?

https://epaper.netidhatri.com/view/224/netidhathri-e-paper-31st-march-2024%09/3

`మహిళా పోలీసుల సమస్యలు పాలకులకు తెలియవా?

`వృత్తి పరమైన వ్యధలు తీర్చరా?

`వాళ్లు పడే కష్టాలు కనపడవా?

`మహిళా స్టేషన్‌ విధులు వారికి వద్దా?

`అక్కడ కూడా పురుషాధిక్యతేనా!

`సమాజంలో మహిళకు న్యాయం మేడిపండేనా?

`ఎండలో మగ పోలీసులతో సమాన విధులు!

`డిపార్ట్మెంట్‌ లో గౌరవం లేని జీవితాలు!

`వివక్ష ఇక్కడ ఇంకా కొంత ఎక్కువ పాలు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పోలీసులు అనగానే కర్కషం..కాఠిణ్యం, లాఠిణ్యమే అభిప్రాయంతో వుంటాం…కానీ ఆ అభిప్రాయం తప్పు. పోలీసు అంటే ఒక ధైర్యం.. ఒక బలం.. ఒక నమ్మకం కూడా వుంటాయి. మనిషి ముందడుగు వేయాలనుకున్నా పోలీసు సమాజం వెనుకుందనే ధైర్యమే మనకు ఎక్కువ. తనకు అన్యాయం జరిగిందని మొదటి పిర్యాదు ఇచ్చేది పోలీసుకే. అర్థరాత్రైనా, అప రాత్రైనా దైర్యంగా మనకు అండగా నిలిచేది పోలీసే. ఆ డ్రెస్సు వేసుకోవడం కలగా తపించే వారు, జీవించే వారు చాలా మంది వుంటారు. సహజంగా అందరూ పోలీసు కావాలని అనుకోరు. సమాజం కోసం పని చేయాలి. ప్రజల కోసం పని చేయాలి. దేశం కోసం పని చేయాలన్న ఆశయం వున్న వారే పోలీసు ఉద్యోగం వైపు చూస్తారు. ఇక్కడ ఆయాచితంగా పోలీసు అయ్యాను అని చెప్పుకునే వారు ఒక్కరు కూడా వుండరు. తప్పని పరిస్థితులలో పోలీసు అయ్యాను అని చెప్పే వారు కూడా వుండరు. పోలీసు కావాలన్న లక్ష్యంతో వచ్చిన వారే నూటికి తొంభై తొమ్మిది శాతం వుంటారు. అలాంటి గొప్ప వ్యవస్థ పోలీసుది. ఆ పోలీసు సమాజంలో కూడా వివక్ష అనేది తెల్లని కాగితం మీద నల్లని మచ్చ లాంటిది. కనిపించడం మంచిది కాదు. ఆ పోలీసు ఉద్యోగంలో చిన్న చూపు అసలే పనికి రాదు. ఇదిలా వుంటే పోలీసు వ్యవస్థలో మహిళా పోలీసులు అనుభవించే కష్టాలు అన్నీ ఇన్ని కావు. మహిళలైనా, పురుషులైనా పోలీసు కావాలనే లక్ష్యంతో వచ్చిన వారే అన్నది మర్చిపోవద్దు.

పోలీసులలో వివక్ష అన్నది పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎంతో వుందన్నది నిర్వివాదాంశం. 

ఎస్పీ స్థాయిలో వున్నా, ఆపై స్థాయి అయినా సరే మహిళలు వివక్షకు గురౌతున్నారు. ప్రతి మహిళా పోలీసు ఏ ఒక్క పురుష పోలీసుకు తక్కువ కాకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఒక దశ దాటిన తర్వాత కూడా పోస్టింగ్‌లలో కూడా వెనకకు నెట్టివేస్తున్నారు. డిజిపి స్థాయికి వచ్చిన ఒక్క మహిళా పోలీసు అధికారినైనా చూపించగలరా? ప్రభుత్వాలలో ఛీఫ్‌ సెక్రెటరీలుగా మహిళా ఐఏఎస్‌లు పదోన్నతులు పొందుతున్నారు. రిటైర్‌ అవుతున్నారు. కానీ డిజిపిలుగా మాత్రం వారికి ఎప్పుడూ అవకాశం ఇవ్వరు. గతంలో దేశంలో మహిళా హోం మంత్రులుగా కూడా పాలకులు అవకాశం ఇచ్చే వారు కాదు. మొదటి సారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో సబితా ఇంద్రారెడ్డి కి ఆ పదవిని ఇచ్చారు. ఆ సమయంలో కొంతమంది మహిళా పోలీసులకు ఒక దశ వరకు అవకాశాలు అందాయి. కానీ ఏ మహిళా అధికారి డిజిపి కాలేదు. ఆ తర్వాత కనీసం ఆ అవకాశం కూడా ఎవరికీ రాలేదు. ఎంత పెద్ద స్థాయి పురుష అధికారితో సమానంగా రాత్రనక, పగలనక, ఎండనక, వాననక మహిళా పోలీసు అధికారులు పని చేస్తున్నారు. మరి ఈ విషయాలు ఏ పాలకులకు పట్టవా? మహిళలు ముఖ్యమంత్రులుగా వున్న రాష్ట్రాలలో కూడా ఇవే పరిస్థితులు వున్నాయి. పైగా ఎంత పెద్ద స్థాయిలో వున్నా మహిళా పోలీసు అధికారులకు వేధింపులు వుంటాయంటే ఇంకా మనం ఎలాంటి సమాజంలో వున్నామో! అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం చాలా మందికి తెలియదు. ప్రభుత్వం లో వుండే ఏ శాఖలోనైనా మహిళా అధికారులు, ఉద్యోగులు తమకు జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తారు. వేధింపులపై స్పందిస్తారు. మీడియాకు వివరిస్తారు. ఆఖరుకు పోలీసులకు పిర్యాదు చేస్తారు. కానీ ఏ ఒక్కసారైనా మహిళా పోలీసు అధికారులు తమకు అన్యాయం జరుగుతోందని చెప్పిన సందర్భాలు వున్నాయా? వారు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి చెప్పుకునే అవకాశం వుందా? పై అధికారులకు చెబితే వింటారా? డిపార్ట్మెంట్‌ పరువు పోతుందని వారి నోరు నొక్కేస్తారు. పరువు అనేది ఒక్క పోలీసు శాఖకేనా? మహిళా పోలీసులకేనా? ఇది వివక్ష కాదా? వారి హక్కులు హరించడం కాదా? ఇంకా ఈ వివక్ష ఎంత కాలం? మహిళా పోలీసులు ప్రశ్నించొద్దు. మరి వారికి ఎవరు అండగా నిలవాలి. వారి హక్కులను ఎవరు కాపాడాలి. 

మహిళా పోలీసుల సమస్యలు ఏమిటి? అనే చర్చ ఎప్పుడైనా సమాజంలో జరిగిందా? 

కనీసం డిపార్ట్మెంట్‌లో నైనా జరుగుతుందా? ప్రకృతిలో ఏ జీవిలోనైనా రెండు వర్గాలుంటాయి. వాటిలో కూడా ఆడ జీవులకు ప్రత్యేక గుణాలు ఆపాదించబడతాయి. చీమలలో కూడా ఆడ చీమనే రాజు అంటారు. పులలో ఆడ పులి మాత్రమే వేటాడుంది. ఇది ఎంతమందికి తెలుసు. మరి మనుషులలో పురుష జాతి అహంకారమెందుకు? ఆధిపత్యమెందు? ఆకాశంలో సగమని గొప్పలు చెప్పుకుంటాం. ఎంత వరకు అనుసరిస్తున్నాం. ఆచరిస్తున్నాం. పోలీసు వ్యవస్థ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చిన్న చూపే…పోలీసు స్టేషన్లలో మహిళా కానిస్టేబుళ్లను మగ పోలీసు అధికారులు ఎలా సంభోదిస్తారో…బయటి ప్రపంచానికి తెలుసా? చెప్పుకుంటే పరువు పోతుందని, పలుచనౌతామని దిగమింగుకుంటారు? ఎంత మంది మహిళా పోలీసులు వేధింపులకు గురౌతున్నారో పోలీసు పెద్దలకు తెలియదా? అందరూ ఒకే చదువు చదువుకున్నారు? ఒకే విధులు నిర్వర్తిస్తున్నారు. పురుష కానిస్టేబుళ్లకు వుండే విలువ మహిళా కానిస్టేబుళ్లకు వుందని ప్రకటించగలరా? ఎక్కడా చిన్న చూపు లేదని చెప్పగలరా? వ్యవస్థ అన్న తర్వాత అంతటా? వేధింపులుంటాయని సమర్థిస్తారా? వ్యవస్థలో జరిగే వేధింపులు ఆపాల్సిన పోలీసు సమాజంలోనే మంచికి దిక్కులేకపోతే ఎలా? ప్రపంచం మారుతోంది. విలువలు పెరగాల్సిన కాలంలో వున్నాం. ఆడ మగ అనే తేడా లేని సమాజంలో జీవిస్తున్నామని చెప్పుకుంటున్నాం..మనల్ని మనమో మోసం చేసుకుంటున్నాం.

మహిళా స్టేషన్‌ విధులు వారికి వద్దా? 

మహిళా పోలీసు స్టేషన్లలో పురుషులకు పోస్టింగ్‌ లెందుకు? మహిళా సిఐలు, ఎస్సైలు లేరా? వాళ్లకు పోస్టింగ్‌లు ఇవ్వరా? ఇదిలా వుంటే మహిళా పోలీసులను ట్రాఫిక్‌ విభాగంలో విధులు అప్పగించడం వివక్ష కాదా? మహిళా పోలీసులకు శిక్ష వేయడం కాదా? వారిని శారీరకంగా హింసించడం కాదా? ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేసే సమయంలో మగ పోలీసు డ్యూటీ టైం లో ఎదురయ్యే కొన్ని సమస్యలు తీర్చుకునేందుకు అనేక అవకాశాలున్నాయి. కానీ మహిళా పోలీసులకు ఆ అవకాశం వుందా? ఇంటి నుంచి బయలుదేరితే డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చే వరకు ఆగాల్సిందే! నిజంగా ఆడవారికి అది దేవుడిచ్చిన వరమే కావొచ్చు. నిత్యం మనం మంతెన సత్యనారాయణ వంటి వారి ఆరోగ్య సూత్రాలు వింటుంటాం. వాటిని ఆచరిస్తుంటాం. మనం నిత్యం కనీసం రెండు లీటర్ల మంచినీళ్లు తీసుకుంటేనే ఆరోగ్యంగా వుంటామని చెప్పగా వింటుంటాం. డాక్టర్లు కూడా మంచి నీళ్లు బాగా తాగండి అని చెబుతుంటారు. మరి ట్రాఫిక్‌ విభాగంలో పని చేసే మహిళా పోలీసులు నీళ్లు ఎక్కువగా తాగలేరు. దాంతో శరీరంలో ఉష్ణం పెరుగుతుంది. రక్తం చిక్కబడుతుంది. చిన్న వయసులోనే బిపిలు, షుగర్లు వస్తాయి. ఉబ్బసం లాంటి వ్యాధులు ఎక్కువగా మహిళలనే వేధిస్తుంటాయి. ఇన్ని కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తే వారికి దక్కే గౌరవం ఏమిటి? ఇక మహిళా పోలీసు స్టేషన్లలో మహిళా సిఐలు, ఎస్సైలు వుంటే మహిళల సమస్యలు త్వరగా పరిష్కారమౌతాయి. బాధిత మహిళలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం వుంది. పోలీసు వ్యవస్థలో చైతన్యం నిండాల్సిన అవసరం వుంది. సమాజంలో చర్చ జరిగితే తప్ప పాలకులు కదలలేరు. అందువల్ల మహిళా దినోత్సవాలు జరుపుకునే పెద్ద పెద్ద సభలకు కూడా మహిళా పోలీసుల బందోబస్తు నిర్వహించే పరిస్థితి వుండడం మన వ్యవస్థ దురవస్థ..!! అంతే!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *