దివ్యాంగుల దీనస్థితి కమీషనర్‌ కు పట్టదా?

`దివ్యాంగుల సంక్షేమ శాఖకు కమీషనర్‌ గా వుండి వారి సంక్షేమం పట్టకపోతే ఎలా?

`కమీషనర్‌ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఎందుకు జరుగుతోంది?

`హక్కుల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం చూశాం…మొదటి సారి కమీషనర్‌ ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు?

`ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి?

`నిధులు మంజూరు చేశామని చేతులు దులుపుకోవద్దు?

`దివ్యాంగుల సంక్షేమం పట్టని అధికారుల పని కూడా పట్టండి?

`కనీసం దివ్యాంగుల మీద జాలి లేని కమీషనర్‌ ను ముందు తప్పించండి?

`దివ్యాంగుల సొమ్ము కూడా తింటున్న కమీషనర్‌ ను సాగనంపండి?

 

`నెలలో నాలుగు రోజులు కూడా పని చేయని కమీషనర్‌ వుండి ఏం లాభం?

`ఒక్కసారి రోడ్డెక్కిన దివ్యాంగుల గోడు వినండి!

 

`కమీషనర్‌ దివ్యాంగుల మీద వేధికల మీద జాలి నటించాల్సిన అవసరం లేదు?

`వారి న్యాయమైన హక్కులు అమలు చేస్తే చాలు!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పుట్టుకలోనే దేవుడు అన్యాయం చేసి, పుట్టిన తర్వాత సమాజం అన్యాయంచేసి, కళ్లులేక , కాళ్లు లేక, చేతులు లేని దివ్యాంగుల సమస్యలు మాటల్లో చెప్పలేనివి. వారు అనుభవించే వ్యధలు రాతలకందనివి. మన చుట్టూ కొందరు చూడలేకపోతున్నారు. రంగుల ప్రపంచం చూడలేక, చీకటి జీవితాలను జీవితాంతం అనుభవిస్తున్నారు. అయినా ఆత్మస్ధైర్యంతో ప్రతి అడుగును చాలెంజ్‌ చేసుకొని జీవితంలో పరుగెడుతున్నారు. నడవాలని వున్నా, నడిచే అవకాశం లేక, నడిపించేవారు లేక జీవితం అవిటితనంతో వెళ్ల దీస్తున్నవారు ఎంతో మంది వున్నారు. చేతులు లేక చేవలేక, చేతులతో చేసుకోవాల్సిన పనులు కాళ్లతో చేసుకుంటూ, జీవితం చేతికందనిదైనందుకు కన్నీళ్లను కూడా తుడుచుకోలేని ధీన స్ధితిలో బతుకుతున్నారు. ఇలాంటి పదాలు వింటుంటేనే మనసు చివుక్కుమంటోంది. అలాంటిది అనుభవిస్తున్న వారి జీవితాలు ఎలా వుంటాయో! కళ్లున్న సమాజం కుళ్లును పక్కన పెట్టి ఒక్కసారి చూడండి? నడవలేక , చేతులు పనిచేయక కొందరు నానా తిప్పలు పడుతుంటే జాలి లేదా? పాలకులు అయ్యే పాపం అన్నా, అధికారులు పట్టీపట్టనట్లు వుంటే వాళ్ల గోడు ఎవరికి చెప్పుకోవాలి. ఎవరు పట్టించుకోవాలి. వారి గోడు ఎవరు తీర్చాలి. ఎందుకు పుట్టామా? అని ఏడుస్తూ …ప్రతి క్షణం కుంగిపోతూ…నిలబడి బతకలేమా? అని తమను తాము నిందించుకుంటూ, పుట్టించిన దేవుణ్ని శపించుకుంటూ, కన్నవాళ్లు పడుతున్న గోసను చూసుకుంటూ బతుకుతున్నవారు ఎంతో మంది మన చుట్టూ వున్నారు. వారి గురించి అయ్యో అనడం అందరూ చేసేదే! కాని చేయూతనిచ్చేవారేరీ! బాధ్యత కల్గిన వారు అనుసరిస్తుదేమిటి? వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సినస్ధానంలో కూర్చున్నవారు చేస్తున్నదేమిటి? మనలో ఏదో ఒక సమస్య అనుకోకుండా ఎదురై, ఓ క్షణం పాటు కాళ్లు చేతులు ఆడకపోతేనే విలవిలలాడిపోతాం… జీవితం అంతా శూన్యంగా అనిపిస్తుంది. బతుకంటే భయం వేస్తుంది. రేపటి గురించి అప్పుడే దిగులు మొదలౌతుంది. అలాంటిది జీవితాంతం మా బతుకులింతే అని కనుగుడ్డు తెరిచిన నాటి నుంచే అనుభించేవారి పరిస్ధితి ఎలా వుంటుందో ఒక్కసారైనా ఆలోచించారా? కాలుకో చేయికో దెబ్బ తగిలితే పడే ఇబ్బందినే నరకంగా భావిస్తాం…అలాంటిది కండ్లులేక,కాళ్లు లేక, చేతులు పనిచేయక, నడుము వంగి పుట్టకతోనే నరకాన్ని తోడు తెచ్చుకున్నవారిపట్ల కనీస మానవత్వం ప్రదర్శించాలి. వారిని అక్కున చేర్చుకోవాలి. వారికి చేయూతనివ్వాలి. ఆకలి తీర్చాలి.నీడనివ్వాలి. వారి జీవితాలకు భరోసా కల్పించాలి. ఇది కదా! ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నతమైన కుర్చీలలో కూర్చున్నవారు చేయాల్సింది! నిజానికి ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఏ దివ్యాంగుడు సమాజం నుంచి సానుభూతి కోరుకోవడంలేదు. వారి జీవితాలను కూడా చాలెంజ్‌గా తీసుకునేలా ప్రోత్సహించేవారు కావాలనుకుంటున్నారు.

అందుకే అధికారులు దివ్యాంగుల మీద వారి దయాదాక్షిణ్యాలు చూపించమని వేడుకోవడం లేదు. వాళ్లు కూడా జీవితాలాను ఛాలెంజింగ్‌ తీసుకుంటామనే అంటున్నారు. అందుకు రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలు వారికి అందిస్తే చాలు…వారిని అందాల్సిన న్యాయమైన హక్కులను అమలు చేస్తే చాలు…ప్రభుత్వాలు అందజేస్తున్న సౌకర్యాలు సకాలంలో కల్పిస్తే చాలు…దివ్యాంగుల కోరికలేమో! గొంతెమ్మ కోరికలు కాదు…ప్రభుత్వాలు కల్పించిన అవకాశాలు కల్పించమంటున్నారు. వాటిని అమలు చేయమంటున్నారు. ఇది దివ్యాంగుల సంక్షేమ శాఖ కమీషనర్‌ శైలజకు నచ్చడం లేదట! తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కమీషనర్‌ శైలజ మూలంగా దివ్యాంగులకు అందాల్సినవి పధకాలు చేకూరకుండా, చేయూత లేకుండా, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందకుండా, న్యాయమైన హక్కులు పొందకుండా పోతున్నామని గోడు వెల్లబోసుకుంటున్నారు.గోస పడుతున్నారు? దివ్యాంగులు నిరసన దీక్షలు చేస్తున్నారు. కమీషనర్‌ అర కొర ప్రతిపానలు పంపిస్తూ, దివ్యాంగులకు న్యాయం చేయడం లేదంటున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలు అందకుండా చేస్తున్నారని, వారి జీవితాలతో శైలజ ఆటలాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తమ జీవితాలకు, ఆమె చేసే ఉద్యోగానికి కూడా న్యాయం చేయకుండా కమీషనర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. అంతే కాదు వెంటనే ఆమెను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దివ్యాంగులు నిరసన చేస్తున్న సమయంలో పిలిచి వారి సమస్యలు తెలుసుకోవాల్సింది పోయి, సెలవులు పెట్టి వెళ్లిపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా ఆమెకు దివ్యాంగుల మీద వున్న చిత్తశుద్ది అని అడుగుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలు శైలజ అమలు చేయడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ జీవోలు కూడా అమలు చేయలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల వసతీ గృహాలు కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు కమీషనర్‌ దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లినా, వాటిని పరిష్కరించలేదని, కనీసం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాష్ట్రంలోని ఏ ఒక్క వసతీ గృహాన్ని ఆమె సందర్శించలేదని అంటున్నారు. ఈ విషయంలో హైకోర్టు కూడా సీరియస్‌ అయినా కమీషనర్‌ కదలకపోవడం గమనార్హం. గతంలో ఇలాంటి పరిస్దితి ఎప్పుడూ లేదని వాపోతున్నారు. దివ్యాంగుల హక్కులను కాపాడాల్సినస్ధానంలో వున్న శైలజ వారి హక్కులను కాలరాస్తోందని ఆరోపిస్తున్నారు. ఓ వైపు దివ్యాంగులు ఇంత కాలం తమ సమస్యలను పరిష్కరించమని చెప్పీ, చెప్పి విసిగిపోయి, ఇక ఆందోళనకు దిగితే, కమీషనర్‌ సెలవులు పెట్టి వెళ్లిపోతే సమస్య పరిష్కారమౌతుందా? ఓ వైపు దివ్యాంగులు నిరసన వ్యక్తం చేస్తుంటే వారిని పోలీసులతో అరెస్టులు చేయించడం, వారిని బెదిరిస్తున్నట్లు విమర్శలున్నాయి. జివోనెం.8,10 ప్రకారం దివ్యాంగుల పట్ల ఉద్యోగులు, సమజం ఎలా వుండాలో సూచించే ప్రభుత్వ ఉత్తర్వులు తెలిసిన కమీషనరే దివ్యాంగులపై పోలీసులను ఉసిగొల్పుతున్నట్లు విమర్శలున్నాయి. అంతే కాదు దివ్యాంగులకు కమీషనర్‌ కార్యాలయంలో ఎదురౌతున్న చీత్కారాలు, దాష్టికాలు వెలుగులోకి రాకుండా ఏడాది కాలంగా సిసి కెమెరాలు పనిచేయకుండా చేశారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అందాల్సిన అనేక పథకాలలో ఎంతో అవినీతి జరుగుతోందని వాటిపై ప్రభుత్వం విచారణ జరపాలని కోరుతున్నారు. నెలలో కనీసం 4 రోజులు కూడా సరిగ్గా కార్యాలయానికి రాని కమీషనర్‌ శైలజ దివ్యాంగుల జీవితాలను ఏం పట్టించుకుంటుందని అంటున్నారు.సహజంగా సమాజంలో ఏ వర్గమైన ప్రభుత్వాల మీద ఆరోపణలు చేస్తాయి. విమర్శలు గుప్పిస్తాయి.

కాని కమీషనర్‌ను తొలగించాలని, వెంటనే కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్లు చేయడం చాలా అరుదు. అంటే దివ్యాంగుల సంక్షేమ శాఖ కమీషనర్‌ శైలజ వ్యవహార శైలి ఎలా వుందో ఈ ఒక్క ఆందోళనతో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాల్సిన అసవరం వుంది. ప్రభుత్వ నిర్ధేశిత లక్ష్యాలను, దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు,అవకాశాలను మృగ్యం చేస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న కమీషనర్‌ వ్యహారంపై వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరం వుంది. అసలు దివ్యాంగుల సంక్షేమ శాఖకు కమీషనర్‌గా వుండి వారి సమస్యలు పట్టని కమీషనర్‌ వుండి ఏం లాభం? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే నిధులను కూడా దుర్వినియోగం చేస్తూ, కమీషనర్‌ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. నేటిధాత్రి పరిశోధనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దివ్యాంగుల జీవితాలతో ఆడుకుంటున్న కమీషనర్‌ అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగాలు, ఉద్యోగపరమైన నిర్వాకాలు ఒక్కొక్కటి వరసగా మీ నేటిధాత్రిలో రేపటి నుంచి…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *