చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తా

పార్లమెంట్​లో బీసీల గొంతును వినిపిస్తా

68 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలే నా బలం

బీసీల అభ్యున్నతి కోసం 45 ఏండ్లుగా పోరాడుతున్నా..

జిత్తుల మారి బీజేపీ, కాంగ్రెస్‌ లకు గుణపాఠం తప్పదు

వారు ధనికులు కావొచ్చు.. జ్ఞానేశ్వర్​ప్రేమ పంచుతడు

డబ్బు సంచులతో వస్తున్న వారికి చేవెళ్ల ప్రజలే తరిమికొట్టాలి

​లోక్​సభ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతా

నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి

‘నేటి ధాత్రి’తో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌

‘‘పనిచేసే వ్యక్తులకు ఓటెయ్యండి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేసిన సేవలను జ్ఞప్తికి తెచ్చుకోండి. నేను జడ్పీ చైర్మన్​గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఐదేండ్లు చేసిన సేవలను గుర్తించండి. మళ్లీ ఒకసారి నా ప్రాంత ప్రజలకు ఎంపీగా సేవ చేసే భాగ్యం కల్పించండి. నాతో పోటీ పడుతున్న కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు ధనికులైతే, కానీ తనకు ఈ ప్రాంత బిడ్డగా ప్రజలపై ప్రేమ ఉంది.” అని బీఆర్ఎస్​చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్​అంటున్నారు. చేవెళ్ల పార్లమెంట్​అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్ఞానేశ్వర్​ను ‘నేటి ధాత్రి’ పలకరించగా ఆయన పలు విషయాలు పంచుకున్నారు.

నేటి ధాత్రి, స్టేట్​బ్యూరో:
కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు ధనికులైతే తనకు ప్రజా బలం ఉందని చేవెళ్ల బీఆర్ఎస్​ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. తాను గతంలో ఐదేండ్ల పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్​గా పనిచేశానని, గతంలో చేసిన పనులే అలవోకగా విజయాన్ని అందిస్తాయని దీమా వ్యక్తం చేశారు. చేవెళ్లలో 68శాతం ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలే నా గెలుపు వారధులని ప్రకటించారు. కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు గడ్డం రంజిత్​రెడ్డి, కొండా విశ్వేశ్వర్​రెడ్డిలను సునాయసంగా ఓడిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను ప్రజలు తిరిగి కోరుకుంటున్నారన్నారు. కరెంటు, నీళ్లు, రైతు బీమా, రైతు బంధు హామీలను కాంగ్రెస్ మరిచిందని మండిపడ్డారు. ఈ కారణాల వల్ల ప్రజలకు బీఆర్ఎస్​పై సానుకూల దృక్పథం ఉందని నేటి ధాత్రి’తో ఆయన చెప్పుకొచ్చారు.

‘లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలకు టికెట్‌ ఇచ్చింది ఒక్క బీఆర్‌ఎస్‌ మాత్రమే. ప్రజలు మమ్మల్ని గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే బీసీల సమస్యలపై పోరాడేందుకు అవకాశం దక్కుతుంది. బీసీ బిడ్డగా 45 ఏండ్లు వివిధ వేదికల ద్వారా పోరాటం చేశాను. 96 కులాలను ఏకం చేసి బీసీల అభ్యున్నతికి బాటలు వేశాను. 4 నెలల్లోనే కాంగ్రెస్‌ పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఎన్నికల ప్రచారంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రజల స్పందన చూస్తుంటే చేవెళ్ల గడ్డపై గులాబీ పార్టీ జెండా ఎగరడం ఖాయం. ’ అని కాసాని జ్ఞానేశ్వర్​దీమా వ్యక్తం చేశారు. ‘నేటి ధాత్రి’ అడిగిన ప్రశ్నలకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.

చేవెళ్లలో ఇద్దరు రెడ్డీలతో పోరాడుతున్నరు.. ఫలితం ఎలా ఉండబోతోంది?
చేవెళ్ల బరిలో నన్ను అభ్యర్థిగా ప్రకటించగానే ఇక్కడి ప్రజల్లో చర్చ మొదలైంది. ఇద్దరు ఉన్నత వర్గాల అభ్యర్థుల మధ్య బహుజనుల నాయకుడు పోరాడుతుండు అని. వారిద్దరితో పాటు నా పనితనంపై ఇక్కడి ప్రజలకు అవగాహన ఉంది. బీసీలకు ఎక్కువగా టికెట్లు ఇచ్చింది ఒక్క బీఆర్‌ఎస్సే. కాంగ్రెస్‌, బీజేపీ బీసీలకు అసలు ప్రాధాన్యమే ఇవ్వలేదు. ప్రస్తుతం మా బాస్​కేసీఆర్​ ఆరుగురు బీసీలను బరిలో దింపారు. బీసీల కోసం దశాబ్ధాలుగా అహర్నిశలు పోరాడి, బీసీల అభ్యన్నతికి బాటలు వేసిన కాసానిని ఓడగొట్టుకుంటమా? అని నన్ను గెలిపించేందుకు బీసీలంతా ఏకమైతుండ్రు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అందరి సహకారంతో చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగరేసి బీఆర్ఎస్​చీఫ్​కేసీఆర్​కు గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నం.

మీరు బీసీల్లో తెచ్చిన చైతన్యం.. గెలుపు బాటలు వేస్తుందా?
బహుజన కులాల సమస్యలను వెలుగులోకి తెచ్చి పోరాడిన. అందులో ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు దశాబ్ధాల కిందనే బస్సు యాత్ర చేసి 96 కులాల అధ్యక్షుడిగా బీసీలను ఏకం చేసిన. జ్ఞానేశ్వర్​బీసీల సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తాలనే ఉద్యమ నేపథ్యం కలిగిని, ప్రజాబలాన్ని నమ్మే కేసీఆర్‌ ఆలోచించి ఆరుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తా. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి, రూరల్​టు అర్బన్​ ప్రాంతాలకు మెరుగైన రవాణా, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పార్లమెంట్‌లో కొట్లాడుతా.

పంద్రాగస్టులోగా కాంగ్రెస్​రుణమాఫీ చేస్తామంటోంది.. మీరు నమ్ముతున్నారా?
డిసెంబర్‌ 9 రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిండ్రు. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఆగస్టు 15 అని కొత్త పాట మొదలుపెట్టిండ్రు. కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మలేమని రైతులే చెబుతున్నరు. నాలుగు నెలల పాలనలోనే దెబ్బ మీద దెబ్బ పడిందని రైతులు లబోదిబోమంటున్నరు.

చేవెళ్ల పల్లెలు ఏమంటున్నయ్​..?
అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్​పాలకులపై ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. 4 నెలల పాలనలోనే పాలనా అస్తవ్యస్తం చూసి బాధపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనే మళ్లీ కావాలని కోరుకుంటున్నరు. సాగునీరందించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినయ్‌. కరెంట్‌ కోతలతో ప్రజలు అల్లాడుతున్నరు. కేసీఆర్‌ హయాంలో ప్రభుత్వంపై ఎంత బర్డెన్​ఉన్నా.. రెప్పపాటు కూడా కరెంట్‌ పోలేదు. గత ఎన్నికల్లో చేసిన పొరపాటును మళ్లీ చేయబోమని కార్మిక, కర్షకులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. నీటి ఎద్దడి రాకుండా కేసీఆర్‌ సూపర్​విజన్​తో మిషన్‌ భగీరథ అమలును ప్రజలు గుర్తుచేసుకుంటున్నరు. ఇంటి పెద్దకొడుకులా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, రంజాన్‌ తోఫాను కేసీఆర్‌ ఇచ్చారని, కాంగ్రెస్‌ పాలనలో అవేమీ లేవని ప్రజలే అంటున్నరు. దళితబందు, బీసీ బంధు, రైతుబంధు రావడం లేదని ఆవేదన చెందుతున్నరు. కాంగ్రెస్‌ పాలనపై విరక్తిచెంది కేసీఆర్‌ సభలు, బస్సు యాత్రలు, మా ప్రచారానికి తండోపతండాలుగా తరలివస్తున్నరు. ప్రజా స్పందన చూస్తుంటే కచ్చితంగా బీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టం కట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.

ఇద్దరు అభ్యర్థులు మీ గూటి పక్షులే కదా?
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అవకాశవాద రాజకీయాలు నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా తెలుసు. ఐదేండ్ల పాటు కేసీఆర్‌, కేటీఆర్‌లతో సన్నిహితంగా ఉండి సొంత ప్రయోజనాలు చూసుకున్నారే తప్ప నియోజకవర్గ ప్రజలకు వారు చేసిందేమీ లేదు. రంజిత్‌రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాతే ఆయన జంప్​అయ్యాడు. అధికారం ఉన్నంత కాలం ఎంజాయ్‌ చేశాడు. లీడర్‌ అనే వాడు గెలుపులో ఎంత సంతోషంగా ఉండాలో? ఓటమిలోనూ అంతే ఉండాలి. డబ్బు సంచులతో గెలువాలనుకుంటున్న ఆ ఇద్దరికి ప్రజలే గుణపాఠం చెప్తరు.

మీ సెగ్మెంట్ పరిధిలో ఐటీ ఎంప్లాయీస్​ ఓటేస్తలేరు కదా?
గతంలో ఎట్లున్నా.. ఈ సారి ఐటీ ఉద్యోగులు పోలింగ్‌ కేంద్రాలకు తప్పకుండా తరలివస్తారు. కేసీఆర్‌ పాలనలో ఐటీ రంగం గణనీయంగా వృద్ధి సాధించింది. నాలుగు నెలల్లో ఈ రంగంలో వచ్చిన మార్పును ఐటీ ఉద్యోగులు గమనించారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటామని చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధముంది. హైటెక్‌సిటీ అభివృద్ధికి ఏం చేయాలో నాకు స్పష్టత ఉంది. అంతిమంగా పదేండ్ల పాటు మేం చేసిన పనులు చూడండి. వచ్చే రోజుల్లో ఏం చేస్తామో కూడా చెబుతున్నాం. ఈ ఎన్నికల్లో సబ్బండవర్గాలు గులాబీ పార్టీ పక్షాన నిలబడుతాయన్న నమ్మకం నాకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *