చేటు తెచ్చిన చెలిమి?

`ఈటెల గెలుపు రేవంత్‌ మెడకు?

`హుజూరాబాద్‌ ఎన్నికల నాడు ఎంత మంది చెప్పినా వినలే!

`టిఆర్‌ఎస్‌ ఓడితే చాలనుకున్నాడు?

`బిజేపి బలపడితే మొదటికే మోసమని గ్రహించలేకపోయాడు?

`టిఆర్‌ఎస్‌తో రోకలి దరువే ఉండేది?

`ఈటెలకు సపోర్ట్‌ చేసి మద్దెల దరువు తెచ్చుకున్నాడు?

`బిజేపికి లేని ధైర్యం తెచ్చి, తను కుదేలయ్యాడు?

`కాంగ్రెస్‌ నేతలను ఈటెల లాగేస్తుంటే చూస్తూ వుండాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు?

`మొన్నటి దాకా టిఆర్‌ఎస్‌తో పోరాడితే పోయేది!

`ఇప్పుడు పక్కలో బల్లెమైన బిజేపితో ఎలా వేగేది?

`చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహదేవా? అని ఊరికే అనలేదు!

`రేవంత్‌ దూకుడు ముంచిన కొంప?

`నల్లేరు మీద నడకను కొంప కొల్లేరు చేసుకున్నాడు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నవ్వు నాకు రక్ష…నేను నీకు రక్ష…ఎక్కడైనా బాగుంటుందేమో! కాని రాజకీయాల్లో సరిపడదని మరోసారి రుజువైంది. అందుకు తగిన మూల్యం పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుభవిస్తున్నట్లే కనిపిస్తోంది.

ఎంత గొప్ప మేధావులైనా సరే తమ గోతిని తామే తవ్వుకుంటారంటే ఇదే…ఈటెల రాజేందర్‌ హుజూరాబాద్‌లో గెలుపుకు పరోక్షంగా సహకరించి, చేసిన తప్పుకు రేవంత్‌ అనుభవిన్నాడు. ఎంతో కాలంగా ఎదురుచూసిన పిపిసి పదవి వచ్చిన కొత్తలో రేవంత్‌రెడ్డికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. కాని ఒక్కసారిగా ఆయన కాడి కిందపడేసినంత పనిచేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నానని అనుకున్నాడే గాని, తర్వాత తానే గుడ్లు తేలేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నానని ఊహించలేకపోయాడు. కాకపోతే అందరూ అప్పటికే రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. హుజూరాబాద్‌ లాంటి అవకాశాన్ని రేవంత్‌ రెడ్డి చేజేతులా వదిలేసుకోవడం వల్ల భవిష్యత్తులో తీరని నష్టం కూడా ఎదుర్కొక తప్పదన్న సంగతిని రాజకీయ మేధావులు సైతం చెప్పి చూశారు. కాని రేవంత్‌ రెడ్డి వినలేదు. ఎవరి మాట ఆయన వినిపించుకోలేదు. పార్టీలోని సీనియర్లు చెప్పిన మాటలు కూడ ఆయన పెడ చెవిన పెట్టారు. ఒంటెద్దుపోకడలు పోయారు. పార్టీ ప్రచార బాధ్యతలు ఆనాడు సీనియర్లకు ఎవరికీ అప్పగించలేదు. ఆయన కూడా పెద్దగా అక్కడ దృష్టి కేంద్రీ కృతం చేయలేదు. రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ లాంటి నాయకుడిని పోటీలోకి దింపి కూడా బలంగా ప్రచారం చేయాలని చూడలేదు. పోటీలో వెంకట్‌ను నిలబెట్టి మమ అనిపించాడు. రాజకీయంగా ఆయన చేసిన తొలి అడుగే తప్పటడుగు వేశాడు. దిక్కుకోలేని తప్పు చేశాడు. పార్టీలో ఓ వైపు నిత్యం సెగను అనుభవిస్తున్న రేవంత్‌రెడ్డి, రాజకీయ పక్షాలతో కోరి సెగను అరువు తెచ్చుకున్నట్లు చేసుకున్నాడు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓడితే చాలనుకున్నాడు. టిఆర్‌ఎస్‌ వీకౌతుందని రేవంత్‌ అంచనా వేసుకున్నాడు. కాని బిజేపి బలపడుతుందని కల గనలేదు. తెలంగాణలో పెద్దగా ప్రభావం లేని బిజేపి పుంజుకోవడం అంత సులువు కాదని ఊహించుకున్నాడు. పైగా ఆ ఎన్నిక కేవలం ఈటెల రాజేందర్‌, టిఆర్‌ఎస్‌ల మధ్య ఎన్నికగానే రేవంత్‌ పరిగణించాడు. కాని భవిష్యత్తులో అది కాస్త రాజకీయ రణమౌతుందని అనుకోలేకపోయాడు. కనీసం మేధావులను సైతం సంప్రదించి అడుగులు వేయలేకపోయాడు. హెచ్చరించేవారి మాటలు కూడా వినిపించుకోలేదు. ఈటెల గెలిస్తే ఆ గెలుపు ఆయన ఖాతాలో పడుంతుందే తప్ప బిజేపికి పెద్ద లాభం వుండకపోవచ్చనుకున్నాడు. అంతే కాదు ఈటెల కూడా బిజేపిలో ఇమడకపోవచ్చని కూడా రేవంత్‌ అనుకున్నట్లున్నాడు. ఎందుకంటే అప్పటికే ఈటెల వామపక్ష భావజాలం నరనరాన జీర్ణించుకున్న నాయకుడు బిజేపిలో నెగలడం కష్టమని అందరూ చర్చించుకునే ట్రాప్‌లో రేవంత్‌ పడ్డాడు. ఆ మాటలే నిజమని నమ్మి బోల్తా పడ్డాడు. ఇప్పుడు ఈటెల తన రాజకీయ చాణక్యం చూపిస్తుంటే దిక్కు తోచని స్ధితిలో రేవంత్‌కొట్టుమిట్టాడుతున్నాడు. 

టీఆర్‌ఎస్‌ చేతిలో ఓటుకు నోటు కేసుతో కుదేలైన రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే బెబ్బులిలా చెలరేగిపోతాడని పార్టీ అంచనా వేసింది. ఎంతో మంది సీనియర్లను కాదని ఆయన చేతిలో పిపిసి పెట్టింది. ఇంత వరకు బాగానే వుంది. అసలు రేవంత్‌ రెడ్డి పార్టీలోకి వచ్చిన వెంటనే ఆయనకు వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఆఫర్‌ చేశారు. అది ఆయనకు కలిసొచ్చింది. కాని పిపిసి కావడానికి చాలా కాలం పట్టింది. అలా పదవి దక్కడానికి పట్టినంత సమయం కూడా ఆయన వెచ్చించకుండానే కొత్త శత్రువును బిజేపి రూపంలో ప్రజాక్షేత్రంలో పెంచి పోషించుకున్నాడు. రేవంత్‌ రెడ్డి పిపిసి అయిన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే ఎంతో ఆవేశంగా కోవర్టులు వెల్లిపోచవచ్చు అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. నిజానికి అప్పటి వరకు వున్న పిపిసి అధ్యక్షుడైన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి లాంటివారే టిఆర్‌ఎస్‌ కోవర్టులుగా ముద్ర పడి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో టిఆర్‌ఎస్‌కు రాష్ట్రంలోనే వ్యక్తిగతంగా బలమైన శత్రువు రేవంత్‌ రూపంలో కాంగ్రెస్‌కు కనిపించింది. ఇప్పుడు అదే పాపమై పార్టీ మెడకు చుట్టుకుంటోంది. రేవంత్‌ను కూడా గిలగిల లాడిస్తోంది. 

పార్టీలో కోవర్టులు వెళ్లిపోతే చాలు తన హవా కొనసాగుతుందని రేవంత్‌ లెక్కలేసుకున్నాడు. కాని రెక్కలు తెగిపోతే తానొక్కడే ఎగడరడం కష్టమౌతుందని అంచనా వేసుకోలేకపోయాడు. ఇప్పటికే చాలా మంది రేవంత్‌కు దూరమయ్యారు. పార్టీకి కూడా దూరమౌతున్నారు. అదే దారిలో మరి కొందరిని దూరం చేసే పనిలో ఈటెల రాజేందర్‌ పడ్డారు. దాంతో రాజకీయం రంజులో పడిరది. ఈటెల రాజేందర్‌ గెలిస్తే టిఆర్‌ఎస్‌ను ఢీ కొట్టడం చాలా తేలిక అనుకున్నాడు రేవంత్‌. కాని అదే ఈటెలతో సమరం చేయాల్సి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు బిజేపిలో చేరికల కమిటీ చైర్మన్‌ అనే పదవి దక్కించుకొని ఈటెల రాజేందర్‌ నెరుపుతున్న రాజకీయం కాంగ్రెస్‌నే దెబ్బకొడుతుందే తప్ప టిఆర్‌ఎస్‌కు జోలికి వెళ్లడం లేదు. టిఆర్‌ఎస్‌లో స్వయం అసంతృప్తులు కొంత మంది పార్టీని వీడినా వాళ్లుకూడా కమలం వైపు చూస్తున్నారే గాని, హస్తం సాయం కోసం ఎదురు చూడడం లేదు. కాంగ్రెస్‌ వైపు చూడాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. ఇటు కాంగ్రెస్‌నుంచి వీడుతున్న వారు, అటు టిఆర్‌ఎస్‌ నుంచి దూరమౌతున్న వారందరికీ బిజేపి ద్వారాల వైపే చూస్తున్నారు. నిజానికి హుజూరాబాద్‌ ఎన్నికల వరకు బిజేపికి నిజానికి అంత బలం లేదు. ఆ పార్టీకి ప్రచారం కూడా లేదు. కాని ఈటెల గెలుపు తెచ్చిన ఊపుతో ఇక మొదలైన ఆటలో కాంగ్రెస్‌ పార్టీ కుదేలు కావడానికి ప్రధాన కారణంగా రేవంత్‌ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నాడు. ఆరేళ్లలో ఇంతగా చతికిలపడని కాంగ్రెస్‌ ఇప్పుడే ఎందుకు పడుతుందన్న దానికి రేవంత్‌రెడ్డే సమాధానం చెప్పాలి. కోవర్టులన్న ముద్ర వున్నవారి హయాంలో కూడా పార్టీనీ వీడి బిజేపిలో చేరిన వారు లేరు. ఇప్పుడు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ నేతలు బిజేపి వైపు క్యూ కడుతున్నాడు. రేవంత్‌ను దూకుడును మొగ్గలోనే తుంచేస్తున్నారు.

నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ వెళ్లగడమే కాదు ఏకంగా పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేశాడు. ఈటెల సారధ్యంలోని చేరికల కమిటి సినీ నటి సికింద్రాబాద్‌ మాజీ ఎమ్మెల్యే జయసుధను పార్టీలోకి ఆహ్వానించే పనిలో వున్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినా రేవంత్‌లో ఎలాంటి మార్పు కనిపిచండం లేదు. వెళ్లేవాళ్లు వెళ్లనీ ఇంకా అనుకుంటున్నట్లే వున్నాడు. తనను ప్రశ్నించేవారు లేకుండా వుంటేనే మేలనుకుంటున్నట్లున్నాడు. అందుకే ఇప్పటికీ ఆయనలో చలనం లేకుండా వుంటున్నాడు. పార్టీలో సీనియర్లు పడుతున్న మధనం కూడా ఆయనలో లేనట్లే కనిపిస్తున్నాడు. అందుకు కారణం ఆయనకు మాత్రమే తెలియాలి. అంతే కాకుండా రాజగోపాల్‌రెడ్డి పార్టీకి దూరం కావడంతో వచ్చిన ఉప ఎన్నికలోనైనా పార్టీని ఎలాగైనా గట్టెక్కిస్తానన్నంత ధీమా రేవంత్‌లో ఇప్పటికీ కనిపించడం లేదు. ఓడిపోయినా ఫరవాలేదన్నంతగానే ఆయనలో మాటలు ధ్వనిస్తున్నాయి. అంటే మునుగోడును కూడా బిజేపి చేతిలో పెట్టేందుకు రేవంత్‌ పరోక్షంగా సిద్దమయ్యాడా? అన్నది కూడా త్వరలో తేలుతుంది. అదే జరిగితే రేవంత్‌ పట్టుబట్టి కాంగ్రెస్‌కు సారధైంది ఎందుకు అన్నది అప్పుడే అందరికీ స్పష్టమౌతుంది. పిపిసికి ముందు ఆయన చెప్పిన మాటల్లో ఏ ఒక్కటీ ఆచరిస్తున్నట్లుగాని, అనుసరిస్తున్నట్లు గాని కనిపించడం లేదు. ఆ దిశగా అడుగులేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. ఇప్పటిదాకా సీనియర్ల మాటలను పెడచెవిన పెట్టిన వాళ్లుకు ఇప్పుడు వాళ్ల మాటలే నిజమా? అన్న ఆలోచన అందరిలోనూ మొదలైనట్లు చెప్పుకుంటున్నారు…ఈటెల రూపంలో కోరి గాలికి పోయే కంపను రేవంత్‌ తగిలించుకొని, పార్టీకి ముళ్ల కంచెను నాటినట్లే వున్నాడంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *