Headlines

*ఆరోగ్య రంగంలో తెలంగాణ నెం.1 స్థానానికి చేరాలి*

*ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలి*

*రౌండ్ ద క్లాక్ వైద్యులు అందుబాటులో ఉండాలి*

*అనవసర రిఫరల్స్ తగ్గించాలి, స్థానికంగా చికిత్స అందించాలి*

*టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు*

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మార్గనిర్దేశనంలో అందరం కలసి చేస్తున్న కృషి వల్ల వైద్యారోగ్య రంగంలో మనం దేశంలోనే మూడో స్థానానికి చేరుకున్నామని, మొదటి స్థానానికి చేరడమే లక్ష్యంగా పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆసుపత్రుల పనితీరుపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా ఆసుపత్రులు బలోపేతం చేసుకుంటున్నామని, అధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చుకుంటున్నామన్నారు. అవసరమైన వైద్య సిబ్బందిని ఎప్పటికప్పుడు నియమించుకుంటున్నామని తెలిపారు. 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించగా, మంచి స్పందన వస్తున్నదన్నారు. మెడికల్ కాలేజీల్లో 201 ట్యూటర్ల పోస్టులు భర్తీ చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తరుపు నుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని, వైద్య సిబ్బంది సైతం ఉత్సాహంగా పని చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. కొత్తగా 800 మంది పీజీ SR లను జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు, వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆసుపత్రులకు అవసరం మేరకు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్పెషాలిటీ సేవలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఎక్కువగా జిల్లాల్లో వీరిని కేటాయించడం జరిగిందన్నారు. వీరి సేవలను పూర్తి స్థాయిలో వినియోగం చేసుకునే బాధ్యత సూపరింటెండెంట్లదే అన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉండాలని, ఏ సమయంలో వచ్చినా పేషెంట్లకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రౌండ్ ద క్లాక్ సేవలు అందేలా చూడాలన్నారు. అవసరం అయితే తప్ప రెఫరల్ ఆసుపత్రులకు రిఫర్ చేయకూడదన్నారు. స్పెషాలిటీ సేవలు సైతం జిల్లా పరిధిలోనే ప్రజలకు అందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గారు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. ఎన్ ఎం సి నిబంధనలు ప్రకారం నడుచుకునేలా మెడికల్ కాలేజీలను చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ ల పైన ఉందన్నారు. తరగతులు, అనుమతుల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. స్టయిఫండ్సు, వేతనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని, ఎలాంటి ఆలస్యం జరగకుండా సూపరింటెండెంట్ లు చూసుకోవాలన్నారు. టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. అవయవ దానం ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలన్నారు. డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు ఉచితంగా మందులు ఇచ్చి పంపాలని, ఈ విషయం పేషెంట్లకు తెలిసేలా బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన ఆసుపత్రుల్లో రాత్రి వేళల్లో పోస్టుమార్టం జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను ఏకకాలంలో ప్రారంభించుకున్నామని, అన్ని వైద్య పరికరాలు పనిచేసేలా చూసుకోవాలని, గర్భిణులకు నిరంతరం సేవలు అందాలన్నారు. కొత్త మెను ప్రకారం డైట్ అందుతుందా లేదా తరుచూ చెక్ చేయాలన్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఇన్ఫెక్షన్ కంట్రోల్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి సోమవారం ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ సమావేశమై మానిటరింగ్ చేసుకోవాలని ఆదేశించారు. 

 

సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఇ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీపీహెచ్ శ్రీనివాస రావు, అన్ని టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *