జిల్లా అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఖాసిం
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మంచిర్యాల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ ఖాసిం సాహెబ్ అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రామాలయం చౌరస్తాలో రెండో వార్డ్ కౌన్సిలర్ పుల్లురి సుధాకర్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా షేక్ ఖాసిం సాహెబ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉండాలన్నారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారని తెలిపారు.ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని వాపోయారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వాటిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుల్లూరు సుధాకర్, ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు, స్థానికులు పాల్గొన్నారు.