’’వంగ’’కు ఎదురుతిరుగుతున్న టీచర్లు?

`బెడిసికొడుతున్న ‘‘వంగ’’ ప్రచారం.

`టీచర్ల ప్రశ్నలకు కంగు తింటున్న ‘‘వంగ’’.

`’’వంగ మహేందర్‌ రెడ్డి’’ మాటలు నమ్మమని వ్యాఖ్యలు.

`’’వంగ’’ ఇన్నేళ్లు చేసిందేమీ లేదు!

`టీచర్ల సమస్యలపై ‘‘వంగ’’ పోరాటం చేయలేదు.

`గత ప్రభుత్వాన్ని ‘‘వంగ’’ నిలదీసింది లేదు.

`సమస్యల సాధనకు ‘‘వంగ’’ కొట్లాడిరది లేదు.

`’’వంగ’’ లీడర్‌ గా ఒరగబెట్టిందేమీ లేదు!

`’’వంగ’’ ఎమ్మెల్సీ అయితే రాజకీయాలు తప్ప మరేమీ చెయ్యలేడు!!

`’’వంగ మహేందర్‌ రెడ్డి’’ పై యూనియన్‌ సభ్యుల గుసగుసలు.

`వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం రాజకీయాలు.

`పరపతి పెంపుకోసమే పాకులాటలు.

`317 జీవోను అడ్డుకున్నది లేదు.

`టీచర్లు చెట్టుకొకరు పుట్టకొకరైతే కాపాడిరది లేదు.

`ఆ జీవో రద్దు చేయించలేదు.

`ఆ సమయంలో కేంద్ర మంత్రి ‘‘బండి సంజయ్‌’’ పోరాటం చేశారు.

`కనీసం ‘‘బండి సంజయ్‌’’ కి ఆయనకు మద్దతు పలికింది లేదు.

`టీచర్ల కోసం ‘‘బండి సంజయ్‌’’ దీక్ష చేశారు.

 `యూనియన్‌ తరుపున ‘‘వంగ’’ చేసిన ఉద్యమాలేమీ లేవు.

`టీచర్లకు అండగా నిలిచింది లేదు!

`ట్రాన్స్‌ఫర్ల మీద నోరు విప్పింది లేదు.

`తెలంగాణ కోసం కొట్లాడిన టీచర్లను అడుక్కునే స్థితికి ఎవరు తెచ్చారు?

`జీతాలు నెలనెల రాకున్నా నోరు మూసుకున్నదెవరు?

`టీచర్లకు రావాల్సిన ‘‘జీపిఎఫ్‌’’ నిధులు ఆగిపోతే యూనియన్‌ ఏం చేసింది?

`’’పిఆర్‌సీ’’ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు?

`’’రిటైర్డ్‌ టీచర్ల బెన్‌ఫిట్స్‌’’ ఆగిపోతే యూనియన్‌ చేసిందేముంది.

`నోరు మూసుకొని కూర్చున్న యూనియన్‌ లీడర్‌ ‘‘వంగ’’ గెలిస్తే ప్రశ్నిస్తాడా?

`ఏ రకంగా చూసినా ‘‘వంగ’’ సాధించేదేమి వుండదు.

`సంపాదనకు అప్పుడు అడ్డూ అదుపు వుండదు.

`ఇది ‘‘టీచర్ల’’ మనోగతం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రిత్రలో మొదటి సారి యూనియన్‌ లీడర్‌కు టీచర్లు ఎదురు తిరుగుతున్నారు. ప్రతిసారి యూనియన్‌ పేరు చెప్పుకోవడం ఎమ్మెల్సీలుగా గెలవడం, రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం అలవాటైందని నిలదీస్తున్నారు. యూనియన్‌ లీడర్‌ ముదిరి రాజకీయ నాయకుడౌతాడంటే ఇదే నిదర్శనమంటున్నారు. దేశంలో ఏ ఉద్యోగులకు, ఏ యూనియన్లకు లేని అవకాశం ఒక్క టీచర్లకే రాజ్యాంగం ఈ అవకాశం కల్పించింది. దానిని ఉపాద్యాయుల హక్కులు, విద్యా వ్యవస్ధలో నూతన ఆవిష్కరణలకు ఉపయోగపడాల్సిన ఎమ్మెల్సీలు రాజకీయాలను ఎంచుకుంటున్నారు. ఉపాద్యాయుల సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. అందుకే ఈసారి యూనియన్‌ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటున్నవారికి ఎన్నుకోమని టీచర్లు ముక్తకంఠంతో చెబుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న యూనియన్‌ లీడర్‌ వంగ మహేందర్‌ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. నిన్నటి వరకు మహేందర్‌ రెడ్డికి ఎదురు చెప్పడానికి కూడా ఆలోచించే ఎంతో మంది టీచర్లు ముఖం మీదే టీచర్ల కోసం ఏం చేశావని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. మొదటిసారి టీచర్లు తమ గొంతువిప్పడం వారిలో వచ్చిన చైతన్యానికి నిదర్శనం. ఏకంగా సోషల్‌ మీడియా వేదికగా వంగా మహేందర్‌రెడ్డికి ఎందుకు ఓటేయ్యాలని అంటున్నారు. యూనియన్‌ పేరు చెప్పుకొని వారు బాగు పడడం తప్ప టీచర్లకు జరిగిన న్యాయం ఏదీ లేదంటున్నారు. అనాదిగా ఏం జరుగుతుందో మహేందర్‌రెడ్డిని ఎన్నుకుంటే అదే జరుగుతుందని కూడా తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆనవాయితీని కొనసాగించమంటున్నారు. సమాజానికి చైతన్యం నింపే ఉపాద్యాయులే ప్రశ్నించకపోతే, సమాజ చైతన్యం ఎలా వెల్లివిరుస్తుందంటున్నారు. యూనియన్‌ ముసుగేసుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నవారికి ఈ ఎన్నికలు ఒక చెంప పెట్టు కావాలని కోరుకుంటున్నట్లు కూడా టీచర్లు చెబుతున్నారు. ఏ సోషల్‌ మీడియా చూసినా ఇవే వార్తలు వుంటున్నాయి. ఎక్కడికక్కడ టీచర్లు తమ గొంతు సవరించుకుంటున్నారు. యూనియన్‌ అనేది సమస్యల పరిష్కారం కోసం, ఉపాద్యాయుల మద్దత కోసం, వారి ప్రయోజనాల కోసం…కాని యూనియన్ల వల్ల ఒరిగిందేమీ లేదంటున్నారు. ముఖ్యంగా వంగా మహేందర్‌ మూలంగా ఇప్పటి వరకు జరిగిన మేలు కూడా ఏదీ లేదంటున్నారు. ఇలా ఒక్కసారిగా టీచర్లు ఎదురు తిరుగుతారని కూడా మహేందర్‌ రెడ్డి ఊహించలేదు. గత రెండేళ్లుగా ఉద్యోగాన్ని వదులకొని ఊరూరు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. కాని ఆఖరుకు ఈ పరిస్టితి వస్తుందని అనుకోలేదు. ఆయన ఉద్యోగం పూర్తిగా మానేయలేదు. కేవలం వాలెంటరీ రిటైర్‌ మెంటు తీసుకున్నారు. అంతే…ఈ ఎన్నికల్లో గెలిస్తే ఎమ్మెల్సీ అవుతాడు. లేకుంటే మళ్లీ తన ఉద్యోగాన్ని ఎలాగో తెచ్చుకొని కొలువు చేసుకుంటాడు. మళ్లీ యూనియన్‌ లీడర్‌గా తన పెత్తనం ఎలాగూ సాగిస్తాడు. అలాంటప్పుడు ఆయన వల్ల ఒనగూరేదేమీ వుండడు. ఈ మధ్య మహేందర్‌ రెడ్డి ఎక్కడికెళ్లినా ఇలాంటి ప్రశ్నలు ముఖం మీదే అడుగుతున్నారట. దాంతో ఆయన ఖంగు తింటున్నారు. ప్రచారానికి వెళ్లాలంటే కూడా భయపడుతున్నాడట. టీచర్లను ఒక చోటకు పిలవాలంటే కూడా ముందు వెనుక ఆలోచిస్తున్నాడట. టీచర్లు ఒక్కసారిగా ఇలాఎందుకు ఎదురు తిరిగే పరిస్టితి వచ్చిందని ఆలోచించుకుంటూ తల పట్టుకుంటున్నాట. మహేందర్‌ రెడ్డి నీ మాటలు మేం నమ్మం అంటూ ముఖం మీదే చెబుతుంటే సమాదానం చెప్పలేక దండం పెడుతూ వెనుతిరుగుతున్నారట. ఒక్కసారిగా టీచర్లలో ఇలాంటి చైతన్యం చూసి ఆయన విస్తుపోతున్నాడు. ఎమ్మెల్సీ పదవి దేవుడెరుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం తనను యూనియన్‌ లీడర్‌గానైనా అంగీకరిస్తారా? లేదా? అన్న డైలమాలో పడుతున్నారట. ఎందుకంటే ఎప్పుడో రెండేళ్ల క్రితమే రాజీనామా చేసిన ఉపాద్యాయుడు యూనియన్‌లో సభ్యుడుగా వుండడమే సరైంది కాదు. అలాంటిది యూనియన్‌ లీడర్‌గా ఎలా చెలామణి అవుతాడంటూ కూడా నిలదీస్తున్నారట. అయినా మహేందర్‌ రెడ్డి టీచర్ల సమస్యల కోసం పోరాటం సాగించి, ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. టీచర్ల సమస్యలు పరిష్కరింకపోవడంతో నిరసనగా మహేందర్‌ రెడ్డి రాజీనామా చేసి పోరాటం చేయడంలేదు. టీచర్ల హక్కుల పోరాటం కోసం ఆయన రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్లడం లేదంటూ టీచర్లు సెటైర్లు వేస్తున్నారు. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనం తప్ప ఇందులో టీచర్ల కోసం ఏముందంటూ చెబుతున్నారు. తమ అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకోకుండా ఏక పక్షంగా వారికి వారే నిర్ణయాలు తీసుకుంటే యూనియన్‌లో ప్రజాస్వామ్యమెక్కడుంది. మా మాటలకు విలువేముందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. హక్కుల గురించి రేపటి తరానికి పాఠాలు చెప్పే టీచర్ల అభిప్రాయానికే విలువలేకుండా చేస్తున్న యూనియన్ల మూలంగా మా గొంతులు నొక్కబడుతున్నాయంటున్నారు. గత ప్రభుత్వం కొత్త జిల్లాలను తెచ్చి, టీచర్ల జీవితాలు ఆగం చేసింది. జీవో.నెం.317 తెచ్చి టీచర్లను చెట్టుకొకరు, పుట్టకొకరును చేసింది. అప్పుడు యూనియన్‌ ఏం చేసింది? ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదు. జీవో తప్పని ఎందుకు నినదించలేదు. తూతూ మంత్రంగా చెప్పడం కాదు..గతంలో టీచర్ల మాటంటే ప్రభుత్వాలు గౌరవించేవి. టీచర్లు ఉద్యమ బాట పడుతున్నారంటే భయపడేవి. కాని యూనియన్లు ప్రభుత్వాలకు తొత్తులుగా మారిపోయిన తర్వాత అసలు ప్రశ్నించడమే మర్చిపోయారు. హక్కుల సాధనకు కొట్లాటే మానుకున్నారు. అందుకే 317 జీవో అమలైంది. ఆ సమయంలో యూనియన్‌ నిక్కచ్చిగా వ్యతిరేకిస్తే అమలుజరిగేదా? అంటూ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ జీవోపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఎన్నికల ముందు జీవోను సవరిస్తామని చెప్పి,దానిపై ప్రభుత్వం స్పందించడం లేదు. అయినా యూనియన్‌ ఏం చేస్తోంది? నిజం చెప్పాలంటే 317 జీవో రద్దు కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా బిజేపి అధ్యక్షుడుగా ఆ సమయంలో వున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పోరాటం చేశారు. ఈ జీవో విషయంలో అరెస్టుయ్యారు. కాని యూనియన్‌ మాత్రం నోరు మెదపలేదంటూ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోసం అటు విధులు నిర్వర్తిస్తూనే ఉద్యమాలు చేసిన చరిత్ర టీచర్లది. విద్యార్థుల జీవితాలు ఆగం కాకుండా వారికి పాఠాలు బోదిస్తూనే, మరో వైపు ఉద్యమానికి ఊపిరి పోసిన వారిలో టీచర్లున్నారు. అలాంటి టీచర్లు జీతమెప్పుడు వస్తుందా? అని ఎదురు చూసే రోజులు వస్తే కూడా యూనియన్‌ ప్రశ్నించింది లేదు. టీచర్లు అడుక్కుతినే పరిస్ధితి వస్తుంటే గుడ్లప్పగించి చూసిన యూనియన్‌ వల్ల ఒరిగిందేమీ లేదంటున్నారు. జీతాలు సకాలంలో రాకున్నా నోరు మూసుకున్నారు. టీచర్లకు రావాల్సిన జిపిఎఫ్‌ నిధుల ఆగిపోయినా, అడిగే నాధుడు లేదు. అయినా ఒకటీచర్‌దాచుకున్న సొమ్ముకూడా తీసుకోలేని స్దితిలో వున్నారంటే పరిస్దితి ఎలా వుందో అర్దం చేసుకోవచ్చు. పిఆర్‌సీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదంటూ టీచర్లు వంగాన నిలదీస్తున్నారు. కొన్ని వేల మంది రిటైర్డ్‌ టీచర్స్‌ బెన్‌ఫిట్స్‌ అగిపోతే యూనియన్‌ ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాల ప్రశ్నలతో మహేందర్‌రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నాలుగు డిఏలు పెండిరగ్‌లో వున్నా ఇప్పటి వరకు యూనియన్‌ నోరు మెదపడం లేదంటున్నారు. యూనియన్‌ లీడర్‌గా వున్నప్పుడే నోరు మెదపని మహేందర్‌ రెడ్డి రేపు ఎమ్మెల్సీ అయిన తర్వాత సమస్యలపై మాట్లాడతాడంటే నమ్మలేమని తేల్చి చెబుతున్నారు. ఇంత కాలం గొప్పగా నాయకుడిని అని చెప్పుకుంటున్న మహేందర్‌రెడ్డి చేసిన ఉద్యమాలు ఏమీ లేవంటున్నారు. పెద్దగా పోరాటాలు చేసి సాదించిన హక్కులేమీ లేదు. గుంపులో గోవిందయ్యే తప్ప ఉపాద్యాయ సమస్యల మీద సదస్సులు పెట్టిన నాయకుడు కాదు. టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లి కొట్లాడిన సందార్భాలేమీ లేవు. అందుకే ఈ ఎన్నికల్లో ఈసారి యూనియన్‌ నాయకులకు కాకుండా ప్రశ్నించే గొంతులు ఎవరుంటే వారిని ఎంచుకుంటామంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!