అన్న బెదిరింపులు..తమ్ముడి అర్థింపులు!!

`రెండు సంవత్సరాల క్రితమే విఆర్‌ఎస్‌ తీసుకున్న మహేందర్‌ రెడ్డి

`రాజీనామా చేసినా ఉద్యోగ సంఘంలో నాయకుడు చెలామణి

Vanga mahender reddy
Vanga mahender reddy

`అటు రియలెస్టేట్‌ వ్యాపారం.. ఇటు రాజకీయం

`సులువుగా ఎమ్మెల్సీ కావాలనే దొడ్డి దారి రాజకీయం

`మొత్తానికి టిచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ గెలవాలన్న తాపత్రయం

`అడ్డదారిలో ఆధిపత్య కుటిల ప్రయత్నం

`పిఆర్‌టియు అభ్యర్థి వంగా మహేందర్‌ రెడ్డి అసత్యాలు ప్రచారం

`అన్నను అడ్డం పెట్టుకొని గెలిచేందుకు పన్నాగం

`అబద్దాలు ప్రచారం చేస్తూ గెలిచేందుకు విచిత్ర విన్యాసం

`పిఆర్‌టియు యూనియన్‌ విస్తుపోతున్న సందర్భం

`అన్న సహకారంతో జరుగుతున్న మంత్రాంగం

`డిఈఓలు, ఎంఈఓలతో ఒత్తిడి రాజకీయాలు

`ఎలాగైనా మహేందర్‌ రెడ్డి గెలవాలని డిఈఓలు, ఎంఈవోలు ఆర్డర్లు

`సైలెంట్‌గా సాగుతున్న మహేందర్‌ రెడ్డి ప్రచారం

`చాపకింద నీరులా సాగిస్తున్న రాజకీయం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ రాజకీయాలను మించిపోయాయి. ఉద్యోగ సంఘాలు కూడా టిక్కెట్లు అమ్ముకునే స్ధాయికి ఎదిగిపోయాయి. ఇది ఎవరో కాదు సాక్ష్యాత్తు ఓ టీచర్‌ ఎమ్మెల్సీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒక సామాన్యమైన ఉపాద్యాయుడు కోట్లు పెట్టి టిచర్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కొనుక్కునే పరిస్దితి వుంటుందా? అప్పులు చేసినా సాధ్యమౌతుందా? కాని టిక్కెట్ల పంపిణీలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా స్వయంగా ఆ టీచర్‌ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా చెబుతున్నాడంటే రాజకీయాలు ఎంత ఖరైదైపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒక సగటు ఉపాధ్యాయుడు కరీంనగర్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కోట్లు పెట్టి ఎలా కొనుగోలు చేశాడు. దాని వెనుకు వున్న నిగూఢమైన రహస్యమేటి? రోజూ స్కూలుకు వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు కోట్ల రూపాయలు సంపాదించడం సాద్యమా? అంటే కొన్ని సార్లు సాధ్యమే..కాని అసలైన ఉపాధ్యాయుడు కాదు…ఉపాధ్యాయ కొలువును అడ్డం పెట్టుకొని రియల్‌ వ్యాపారాలు సాగించి, ఫైనాన్స్‌ వ్యవహారాలు నిర్వహించే వారికి మాత్రమే సాధ్యం. అలా కరీంనగర్‌ ఉపాద్యాయ ఎమ్మెల్సీని పేరు పొందిన ఉపాద్యాయ సంఘం నుంచి వంగ మహేందర్‌ రెడ్డి ఎలా కొనుగోలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధి స్వయాన అన్న వంగ రవీందర్‌ రెడ్డి. ఆయన తెలంగాణ రెవిన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర అద్యక్షుడు. ఈ వ్యవహారమంతా ఆయనే దగ్గరుండి నడిపిస్తున్నాడని అంటున్నారు. అందులో భాగంగా రవీందర్‌ రెడ్డి నాలుగు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, మెదక్‌, నిజాబామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన డిఈవోలు, ఏంఈవోలపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. తన తమ్ముడు వంగ మహేందర్‌ రెడ్డి గెలుపుకోసం అందరూ సహకరించాలని ఆయన ఆర్డర్లు వేస్తున్నట్లు చెబుతున్నారు. డీఈవోలు, ఎంఈవోలపై ఒత్తిడి తెచ్చి, ఉపాద్యాయులకు వారితో ఫోన్లు చేయిస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై భారతీయ జనతాపార్టీ ఏకంగా ఎన్నికల కమీషన్‌కు ఉత్తరంకూడ రాశారు. వంగా రవీందర్‌ రెడ్డి తన తమ్ముడు వంగా మహేందర్‌ రెడ్డి గెలుపుకోసం ఉపాద్యాయులు మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు ఎన్నికల కమీషన్‌కు వివరించారు. ఇక అసలు విషయానికి వస్తే వంగా మహేందర్‌రెడ్డి ఉపాద్యాయ కొలువులో చేరినప్పటినుంచి పిఆర్‌టీయూ యూనియన్‌లో క్రియాశీలకంగా పనిచేయడం మొదలు పెట్టారు. అప్పటికే తన అన్న రవీందర్‌రెడ్డి కూడా ఆయన కొలువు చేస్తున్న శాఖలో నాయకత్వం ఎలా చేస్తున్నాడో చూసిన మహేందర్‌ రెడ్డి కొలువులో చేరిన కొద్ది రోజులకే నాయకుడయ్యారు. చదవు చెప్పడం గాలికి వదిలేశాడు. రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన మహేందర్‌ రెడ్డి యూనియన్‌ రాజకీయాలు మొదలు పెట్టారు. చదువు చెప్పాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాడు.

అలా అంచెలంచెలుగా యూనియన్‌లో ఎదుగుతూ వచ్చారు. 2004 తర్వాత తెలంగాణలో వచ్చిన రియల్‌ బూమ్‌ను ఆసరా చేసుకున్నాడు. అటు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే రియల్‌ వ్యాపారం మొదలు పెట్టారు. రియల్‌ వ్యాపారాన్ని కూడా టీచర్లతోనే మొదలు పెట్టి, వ్యాపారాన్ని పెంచుకున్నాడు. అలా కొలువును గాలికి వదిలేసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇక ఇదిలా వుంటే పేద ప్రజలకు చదువు చెప్పాల్సిన కొలువులో వుంటూ, వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత విస్మరించారు. సిద్దిపేటలో కార్పోరేట్‌ స్కూల్‌ ఏర్పాటు చేశాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను కొలువు చేసే చోట విద్యా కుసుమాలను వికసింపచేయాల్సిందిపోయి, తన ప్రైవేటు స్కూల్‌లో చదువు పేరుతో దోపిడీ మొదలు పెట్టాడు. అటు రియల్‌ వ్యాపారం, ఇటు ప్రైవేటు కార్పోరేట్‌స్కూలు, మహేందర్‌రెడ్డికి మరో సోదరుడి పేరు మీద కొన్ని కళాశాలలో పార్టనర్‌ షిప్‌లో పూర్తిగా విద్యా వ్యాపారం మొదలు పెట్టారు. అన్న రెవిన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా వుండడం, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలున్నాయో గుర్తించడం, వాటిని తమకు అనుకూలంగా మల్చుకోవడం, అక్కడ రియల్‌ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అయితే తమ వ్యాపారాలపై ఎవరి కన్ను పడకుండా ఓ స్వచ్ఛంద సంస్ధను ఏర్పాటు చేశారు. ఈ సంస్ధనిర్వహణకు మరో వైపు పెద్దఎత్తున విరాళాలు సేకరించడం అలవాటు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థ నిర్వహణ కోసం అటు నిధులసేకరణను తోడు చేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం వేసుకున్నాడు. కొన్ని స్కూళ్లలో వాటర్‌ ప్లాంటులుఏర్పాటుచేసి విద్యా వ్యవస్ధకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం తన ఉద్యోగానికి వాలెంటరీ రిటైర్‌ మెంటుతీసుకొని ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు మొదలు పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కూడా వంగ మహేందర్‌ రెడ్డి ఎలా ఉపాద్యాయ సంఘం నాయకుడుగా వుంటారు. ఎలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అర్హుడౌతాడు. కేవలం ఎన్నికల కోసం కొద్ది రోజుల ముందు రాజీనామా చేశారంటే అదీ కాదు. రెండు సంవత్సరాల క్రితమే రాజీనామా చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ కొలువును అలాగా వదిలేస్తారా? అంటే అదీ వుండదు. అదృష్టం వుండి గెలిస్తే ఎమ్మెల్సీ అవుతారు. లేకుంటే ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని మళ్లీ ఉపాద్యాయ కొలువులో చేరుతారు. ఇలాంటి జిత్తుల మారి రాజకీయాలు చాలా మంది చేస్తున్నారు. అందులో వంగా మహేందర్‌ రెడ్డి ఒకరు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో ఎమ్మెల్సీ కావాలనుకునే కొంత మంది ఈ దారిని ఎంచుకున్నారు. అటు అన్న రెవిన్యూ అసోసియేషన్‌ ద్వారా తన పలుకుబడిని ఉయోగిస్తున్నాడు. రవీందర్‌ రెడ్డిపై కూడా పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించారనే అపవాదు వుండనేవుంది. సంపాదించిన ఆస్ధులను కాపాడుకోవాంటే తన తమ్ముడు ప్రజా ప్రతినిధి కావడం ఒక్కటే మార్గం అనుకున్నారు. ఇలా సులువైన మార్గంలో ఎమ్మెల్సీ కావడం రవీందర్‌రెడ్డికి దారి లేదు. తిమ్మిని బమ్మిని చేసి రికార్డులు మార్చి, ఆక్రమణదారులకు సహకరించి, సంపాదించిన సొమ్ముతో తమ్ముడితో రియల్‌ వ్యాపారం రవీందర్‌ రెడ్డి సంపాదించారు. అలా అన్నదమ్ములంతారూ అక్రమంగా సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలంటే టీచర్స్‌ ఎమ్మెల్సీ ఒక్కటే మార్గమని ఎంచుకున్నారు. ఇది టీచర్స్‌ యూనియన్‌లోని సభ్యులే చెబుతున్నమాట.

ఓ ఎమ్మెల్సీ మీడియా సమావేశంలో పూసగుచ్చినట్టు చెప్పిన ముచ్చట. ఒక నిబద్దత గలిగిన గురువు విద్యార్టులకు విద్యతోపాటు విద్యా వ్యవస్ధలో రావాల్సిన నూతన ఆవిష్కరణల గురించి మాట్లాడతారు. ప్రభుత్వ విద్యా వ్యవస్ధ మేలు కోసం పనిచేస్తాడు. అలాంటి ఉపాధ్యాయులను ఎమ్మెల్సీలు చేయడానికి సంఘాలకు కూడా చేతులు రావడం లేదు. టిక్కెట్లు అమ్ముకునే యూనియన్లు వుంటే మహేందర్‌ రెడ్డి లాంటి టీచర్లే ఎమ్మెల్సీ కావాలని కలలు గంటారు. ముఖ్యంగా ఈ దారి ఎంతో సులువైంది. తాను ఉపాద్యాయుడై రేపటి తరానికి దారి చూపుతాననుకునే ఏ ఉపాద్యాయుడు తన వృత్తికి ద్రోహం చేయడు. కాని ఉపాద్యాయ కొలువు పొంది, రాజకీయాలను లక్ష్యంగా చేసుకునే కొంతమంది ఇలా ప్రభుత్వాలను మోసం చేస్తుంటారు. పదవులు అడ్డం పెట్టుకొని కొలువులు చేయకుండా రాజకీయాలు చేస్తుంటారు. లేనిపోని హమీలు ఎంతో చైతన్యవంతులైన ఉపాద్యాయులకే చెబుతుంటారు. సాటి ఉపాద్యాయులను కూడా మోసం చేస్తుంటారు. పాత పెన్షన్‌ విధానం తీసుకురావడం అసలు సాధ్యమా? ప్రభుత్వాలతోనే సాధ్యం కాని ఆ విదానం టీచర్‌ ఎమ్మెల్సీలతో సాధ్యమౌతుందా? దేశ వ్యాప్తంగా అమలౌతున్న కొత్త విధానంలో మార్పు చేయడానికి కేంద్ర ఒప్పుకుంటుందా? అది అమలు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యపడుతుందా? కేంద్రం అంగీకరించకుండా జరుగుతుందా? విద్య అనేది రాష్ట్ర స్ధాయిలో వుండే అంశం కాదు. ఉమ్మడి అంశం. కేంద్రం జోక్యం లేకుండా ఎలాంటి నిర్ణయాల అమలు సాధ్యంకాదు. కాని తమ రాజకీయ భవిష్యత్తు కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడై వుండి, యూనియన్‌ సభ్యులను మోసం చేసేవారిని ఎలా ఎన్నుకుంటారో కూడా టీచర్లే ఆలోచించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!