అతిబలవంతుడు రేవంతుడు.

సీఎంపై కొందరి ఏడుపెక్కువైంది? 

-కుర్చీపై కూర్చోవాలని ఆరాటమెక్కువైంది?

-పార్టీ కోసం పనిచేసే వాళ్లు తక్కువయ్యారు.

-పదవుల కోసం పాకులాడేవాళ్లెక్కువయ్యారు.

-ప్రతిపక్షాల మీద నోరు మెదపలేరు.

-ప్రతిపక్షాలను పల్లెత్తు మాటలనలేరు.

-ప్రతిపక్షాల విమర్శలకు కనీసం స్పందించరు.

-ప్రతిపక్షాల దాడిని చూసి మురిసిపోతుంటారు!

-ఎప్పటికప్పుడు ముసలం పుడితే బాగుండనుకుంటారు!

-కూర్చున్న కొమ్మనే నరుక్కునే కుట్రలు చేస్తుంటారు.

-సవ్యంగా సాగుతున్న పాలనలో పచ్చగడ్డి వేసి పొగపెడుతుంటారు.

-ఒకరి మీద ఒకరు పుల్లలు పెట్టుకుంటూ పార్టీ పరువు తీసుకుంటారు.

-రహస్య మంతనాలతో పార్టీని బజారుకీడుస్తుంటారు.

-అసంతృప్తుల అవతారంలో కోవర్డులౌతారు.

-అంతర్గత ప్రజాస్వామ్యం..కొంప కొల్లేరుకు మార్గం!

– కెలికి, గెలికి..కుంపట్లు పెట్టి!

-అప్పుడే కొంపలు మునిగిపోయినట్లు ప్రవర్తిస్తుంటారు ?

-ఏడాదిలోనే అంతగాకంగారెందుకు?

-పదేళ్లుగా ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీని పట్టించుకోలేదు.

-కొట్లాడి కొట్లాడి అధికారం తెచ్చిన వాళ్లను ఓర్వలేరు.

-పడరాని పాట్లు పడి అధికారంలోకి తెచ్చిన సిఎంకు సహకరించలేరు.

-రేవంత్‌ రెడ్డిని నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అందించారు.

-కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్‌ నానా కష్టాలు పడ్డారు.

-పార్టీని నడపలేక చేతులెత్తేసిన వాళ్లు కూడా కుర్చీ కోసం ఆరాటపడుతున్నారు.

-పదవులు రాని వాళ్లను ఎగదోస్తున్నారు.

-ఎమ్మెల్యేలైన వారికే అసంతృప్తి వుంటే, ఏమీ కాని నాయకుల పరిస్థితి ఏమిటి?

-ఏడాదే పూర్తయింది..భవిష్యత్తుపై ఓపిక పట్టలేరా!

-దినదిన గండంగా మార్చి అలజడి మొదలుపెడతారా!

-అవకాశ వాద రాజకీయాలకు పాల్పడి పార్టీని ఆగం చేస్తారా?

-మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలన్న సోయి లేకుండా పోతుందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత బలవంతమైన నాయకుడు, పాలకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఇందులో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. ఆశ్యర్యం అసలే అక్కర్లేదు. నాయకులు ప్రజల్లో నుంచి పుడతారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం సిఎం. రేవంత్‌రెడ్డి. అంచెలంచెలులగా ఒక్కొ మెట్టు, ఎక్కుతూ, రాజకీయాలను తన చేతుల్లోకి ప్రజల మెప్పు పొందుతూ వచ్చారు. మొత్తం తెలంగాణ రాజకీయాలను తనవైపు తిప్పుకొని తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రజా సేవలో, నాయకుడిగా ఎదుగుదలలో ఎవరి ప్రమేయం లేదు. ఎవరి ప్రోద్భలం లేదు. ఎవరి వెన్నుదన్ను అసలే లేదు. స్వయం ప్రకాశిత శక్తిగా రేవంత్‌ రెడ్డి ఎదిగారు. ఇప్పుడున్న కాంగ్రెస్‌ పార్టీలో అలాంటి నాయకుడు ఏ ఒక్కరూ లేరు. అంతే కాదు తెలంగాణ ఇతర రాజకీయ పార్టీలలో అసలే లేరు. ఆయన ఏ పార్టీ నీడన రాజకీయాలు నేర్చుకోలేదు. ఆయన నాయకుడిగా ఎదిగిన తర్వాతే తెలుగుదేశంలో చేరారు. అంతకు ముందు ఆయన మొదటిసారి పోటీతోనే జడ్పీటీసి అయ్యారు. తర్వాత మళ్లీ వెంటనే ఎమ్మెల్సీ అయ్యారు. ఆ పదవి కూడా ఇండిపెండెంటుగా గెలిచారు. తన రాజకీయ చతురతను చూపించారు. చిన్న వయసులోనే రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. అప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీని ఎంచుకున్నారు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ, చిన్న వయసులోనే రాష్ట్ర స్దాయి నాయకుడయ్యారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లందరికీ కొరకరాని కొయ్యగా ఎదిగారు. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం ప్రదర్శించిన నాయకులు కూడా వున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ఉనికి ప్రశ్నార్ధం కావడంతో కాంగ్రెస్‌లో చేరారు. చేరుతూనే వర్కింగ్‌ ప్రెసిండెట్‌ అయ్యారు. ఆ వెంటనే తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రెసిడెంటు అయ్యారు. అలా మూడు సంవత్సరాలలో పార్టీకి పునర్వైభవం తెచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి అష్టకష్టాలు పడ్డారు. అనేక కేసులను కేసులను ఎదుర్కొన్నారు. అనేక సార్లు జైలు జీవితం ఎదుర్కొన్నారు. నిర్భందాలు ఎదుర్కొన్నారు. అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక్కడ మరో విషయమేమింటే సహజంగా ఏ నాయకుడికైనా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నుంచి సవాళ్లను ఎదుర్కొంటారు. కాని రేవంత్‌ రెడ్డి స్వపక్షం నుంచి, ప్రత్యర్ధి పార్టీల నుంచి కూడా ఎదుర్కొన్నారు. వాళ్లందరూ చూస్తుండగానే ముఖ్యమంత్రి అయ్యారు. అందుకు ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఇటు సొంత పార్టీ నేతలను భుజ్జగించుకుంటూ, వారు చేస్తున్న అమానాలను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఎలాంటి సమస్యలనైనా చిరునవ్వుతో స్వాతతించుకుంటూ వెళ్లారు. అంతే కాని ఎక్కడా బ్యాలెన్స్‌ తప్పలేదు. పార్టీని నిలబెట్టడంతో ఎక్కడా వెనుకంజ వేయలేదు. ధీరుడిగా ముందుకు సాగారు. పదేళ్ల తర్వాత పార్టీని అధికారంలో తెచ్చారు. అందుకే పార్టీ అధిష్టానం రేవంత్‌ రెడ్డి నాయక్వాన్ని మెచ్చి, నచ్చి ముఖ్యమంత్రిని చేసింది. ఇదీ రేవంత్‌ రెడ్డి ట్రాక్‌ రికార్డు. ఇలాంటి రికార్డు వున్న నాయకుడు ఎవరూ కాంగ్రెస్‌ పార్టీలో లేరు. పదేళ్ల కాలంలో కనీసం పార్టీ మా వల్ల బలపడిరదని చెప్పుకోగలిగిన నాయకుడు మరొకరు లేరు. పాలతో నిండిన కుండలో నీళ్లదంరూపోస్తారు. నా పాలతోనే కుండ నిండిరదని చెప్పుకుంటారు. కాని ముందు చిక్కని పాలు ఎవరు పోశారన్నది తెలియకుండా వుండదు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి ఎవరు పార్టీని సమర్ధవంతంగా నడిపి అదికారంలోకి తెచ్చారన్నది తెలియదా? ప్రతిపక్షంలో వున్నన్నప్పుడు పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తెస్తానని చెప్పిన నాయకుడు లేదు. అంతగా పార్టీ కోసం కొట్లాడిన నాయకుడు ఎవరూ లేరు. కాకపోతే సీనియర్లమని కొందరు, మాకు పిసిసి. అవకాశమివ్వాలని కొందరు కోరుకున్నారు. కాని వాళ్లలో ఏ ఒక్కరు నాకు పిపిసి ఇస్తే పార్టీని అధికారంలోకి తెస్తానని అధిష్టానానికి భరోసా కల్పించలేదు. అధిష్టానం నమ్మకాన్ని చూరగొనలేదు. ఎందుకంటే పుట్టింటి గొప్పదనం మేనమామకే చెబితే ఎలా వుంటుంది. అందుకే పాత తరం నాయకులకు పక్కన పెట్టి, రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చి రేవంత్‌ రెడ్డి చూపించారు. అయితే ఈ మధ్య ప్రభుత్వంలో లుకలుకలు అంటూ పెద్ద పదవి కోసం పోటీ పడుతున్న నాయకులు కొందరు లేనిపోనివి ప్రచారంలోకి వచ్చేలా చేస్తున్నారని కూడా తెలుస్తోంది. లేని వివాదాలు ముసురుకునేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిని మార్చినట్లు కొంత మంది పనిగట్టుకొని ప్రచారం సాగిస్తున్నారు. కాని అది నిజం కాదు. సిఎం. రేవంత్‌ రెడ్డిని కట్టడి చేయడానికి ఇన్‌చార్జిని మార్చినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం అసలేలేదు. దీపాదాస్‌ మున్షీఇంత కాలం తెలంగాణకు అడిషినల్‌ ఇన్‌చార్జిగా వున్నారు. ఆమె కేరళ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల తెలంగాణతోపాటు, చాలా రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జిలను ప్రకటించింది. అందులో భాగంగానే కొత్త ఇన్‌చార్జిని తెలంగాణకు పంపించారు. ఈ విషయాన్ని చిలువలు పలువలు చేస్తూ, కొంత ప్రచారం సాగిస్తున్నారు. కూర్చున్నచెట్టునే నరుక్కునేందుకు సిద్దపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుంటే ఆ నాయకులకు ఏదో ఒక పదవి వస్తుంది. కాని ఆ సత్యం మర్చిపోతున్నారు. లేనిపోని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఆ అంతర్గత ప్రజాస్వామ్యమే కాంగ్రెస్‌ కొంప ముంచుతుంది. కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఓడిరచాల్సిన పనిలేదు. అసమ్మతి వాదులు నలుగురుంటే చాలు చెల్లాచెదురౌతుందని ఎప్పటి నుంచో నానుడి వుంది. దాన్ని మళ్లీ నిజం చేస్తారా? అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అసంతృప్తి రాజేస్తారా? పార్టీలో గాని, ప్రభుత్వంతో గాని ఏదైనా సమస్యలుంటే చర్చించుకునే వేదికలున్నాయి. మంత్రుల తో ఇబ్బందులుంటే చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వున్నారు. పార్టీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ వున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే పార్టీ అధిష్టానంవుంది. అక్కడ చెప్పుకోవాల్సిన విషయాలను మీడియా కంటపడేలా? ప్రజలు తెలిసేలా, ప్రతిపక్షాలకు ఆయుధం అందేలా సమాలోచనలు చేయాల్సిన అవసరం లేదు. పదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఓవైపు మేమే కొట్లాడి తెలంగాణ తెచ్చామని బిఆర్‌ఎస్‌ పదే పదే చెప్పుకుంటుంది. కాంగ్రెస్‌ మెడలు వంచి తెలంగాణ సాధించామని ఒకటికి పదిసార్లు చెప్పుకుంటుంది. మేం లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని బిజేపి అంటుంది. వాళ్లకు ధీటైన సమాదానం చెప్పడానికి మాత్రం ఏ కాంగ్రెస్‌ నాయకుడికి నోరు రాదు. మాటలు రావు. కాని మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి మాత్రం అన్నీ వస్తాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో మేమే తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే అవకాశం దొరకలేదు. చెప్పుకోవడానికి నోరు రాలేదు. 2014 ఎన్నికల తర్వాత స్దానిక సంస్దల ఎన్నికల్లోనూ చెప్పుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత కూడా చెప్పుకునేందుకు ముందుకు రాలేకపోయారు. కాని ప్రజలు గ్రహించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశమిద్దామని కనికరించారు. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ సమజామంతా ఏకమైన కాంగ్రెస్‌ పార్టీని గెలిపించింది. అందుకు అందరూ కృషి చేశారు. ఏ ఒక్కరిదీ తక్కువ భాగస్వామ్యమేమీ లేదు. పై స్దాయిలో వున్న నాయకులకే అసంతృప్తి వుంటే కింది స్ధాయిలో జెండా మోసిన సామాన్య కార్యకర్తల కష్టం ఎవరు తీర్చాలి. వారికి పదువులు ఎవరు ఇవ్వాలి. పదేళ్ల పాటు పార్టీకి అండగా నిలిచి, జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలి. ఆస్ధులు అమ్ముకొని పార్టీని నమ్ముకొని పని చేసిన వాళ్ల గోడు ఎవరికి వినిపించాలి. ఎమ్మెల్యే స్ధాయి నేతలకేనా అసంతృప్తి వుండేది? నిజానికి ఎమ్మెల్యేలు ఎంతో సంతోషపడాలి. లక్షలాది మంది వున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్లో ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం కొద్ది మందికే దక్కింది. ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రి పదవి కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కాని అన్యాయం జరిగిందన్న కారణంతో పార్టీపై నెపం నెట్టేసి, అన్యాయం జరిగిందని వీధులకెక్కితే పార్టీ పరువు పోతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నాయి. ఏడాది కాలంలో అజ్ఞాతంలోవున్న కేసిఆర్‌ కూడా వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. బిజేపి ఈసారి గెలవాలని కాచుకొని కూర్చున్నది. మరో పదేళ్లయినా ప్రతిపక్షాలకు అవకాశమివ్వకుండా రాజకీయాలు చేయాల్సిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడే అసంతృప్తి జ్వాలలు రగిలించడం సరైందికాదు. పార్టీకి ఏ రకంగా మేలు జరగదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!