2025: ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? డేట్, టైమ్, ఇతర వివరాలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
2025 సంవత్సరానికి గానూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతోంది. వివిధ దేశాల్లో ఈ సమయం వేర్వేరుగా ఉంటుంది. నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ మాస ఉపవాసాలను ముస్లింలు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన కానీ, మార్చి 1 వ తేదీన కానీ నెలవంక కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
2025: చంద్రవంక దర్శనం ప్రకారం.. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. నెలవంక వేర్వేరు దేశాల్లో వేర్వేరు సమయాల్లో కనిపించడం వల్ల, ఆయా దేశాల్లో రంజాన్ మాసం ప్రారంభ సమయం మారుతూ ఉంటుంది. ఈ వ్యత్యాసం కొత్తదేమీ కాదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ లోని ప్రతి నెల ప్రారంభ తేదీని ప్రభావితం చేసే నెలవంక దర్శనంపై ఆధారపడతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ ఫితర్ వేడుక తేదీలలో కూడా వైవిధ్యాలకు దారితీస్తుంది.
మార్చి 1వ తేదీననా? లేక మార్చి 2 నా?
ఇస్లామిక్, పాశ్చాత్య దేశాలలో ఎనిమిదవ ఇస్లామిక్ నెల షబాన్ జనవరి 31, 2025 శుక్రవారం ప్రారంభమైంది. అందువల్ల, ఈ సంవత్సరం సాంప్రదాయకంగా, రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక ఫిబ్రవరి 28, శుక్రవారం, అంటే షబాన్ 29 వ రోజున కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ నెలవంక కనిపిస్తే ఈ దేశాల్లో 2025 మార్చి 1 నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. అయితే చాలా చోట్ల చంద్రుడు ఆ రోజు కనిపించకపోవచ్చని, అందువల్ల షబాన్ నెల మరో రోజు పొడిగించబడుతుందని భావిస్తున్నారు. అంటే, మార్చి 1వ తేదీన నెలవంక కనిపిస్తే, రంజాన్ మాసం ప్రారంభం 2025 మార్చి 2కి మారే అవకాశం ఉందని కొందరు పండితులు వాదిస్తున్నారు.
రంజాన్ విషయంలో ప్రాంతీయ వ్యత్యాసాలు
సౌదీ అరేబియా ఖగోళ అంచనాలకు అనుగుణంగా మార్చి 1న రంజాన్ ప్రారంభమవుతుందని పాశ్చాత్య దేశాలలోని అనేక నగరాలు ఇప్పటికే తమ రంజాన్ 2025 టైమ్ టేబుల్ ను ప్రచురించాయి.
అయితే, మొరాకో వంటి దేశాలు కఠినమైన విధానాన్ని అనుసరిస్తాయి. అక్కడ నెలవంక స్పష్టంగా కంటికి కనిపించిన మరుసటి రోజు రంజాన్ ను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 న మొరాకోలో చంద్రుడు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే మొరాకోలో మార్చి 2 నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
జర్మనీలో రంజాన్ 2025 ఫిబ్రవరి 28 న ప్రారంభమవుతుందని అంచనా వేశారు. అలాగే, అక్కడ ఈ పవిత్ర మాసం మార్చి 30 నాటికి ముగుస్తుంది.
అమెరికాలో కూడా మార్చి 1వ తేదీన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే, ఈద్ అల్-ఫితర్ వేడుకలతో పవిత్ర మాసం మార్చి 30న ముగుస్తుందని భావిస్తున్నారు.
2025 మార్చి 1న రంజాన్ ప్రారంభమైతే, 2025 మార్చి 30న సౌదీ అరేబియా సహా పలు దేశాల్లో ఈద్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే మార్చి 2న రంజాన్ ప్రారంభమయ్యే వారికి ఈద్ 2025 మార్చి 31న వచ్చే అవకాశం ఉంది.