సర్వే అంతా తప్పులు తడక. రాజ్యసభ సభ్యులు “వద్దిరాజు రవిచంద్ర”.

బీసీల పట్ల కాంగ్రెస్కు చులకన భావం ఉంది.

కులగరణ సర్వేలో తప్పులను వెంటనే సరిదిద్దాలి.

క్యాబినెట్ విస్తరణలో నలుగురు బీసీలకు స్థానం కల్పించాలి.

“నేటిధాత్రి” హైదరాబాద్, ప్రతినిధి.
రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వే తప్పులతడకగా,కాకి లెక్కలతో అశాస్త్రీయంగా ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం 2011లో జరిపించిన లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3 కోట్ల 50 లక్షల 3674కాగా,2014 సమగ్ర కుటుంబ సర్వే (SKS)ప్రకారం 3 కోట్ల 68లక్షల 76వేల 544, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సర్వేలో జనాభా 3 కోట్ల 70 లక్షల 77 వేల 544 గా నమోదయ్యిందన్నారు.పదేళ్లలో తెలంగాణ జనాభా కేవలం 2లక్షలు మాత్రమే పెరిగిందని ఈ ద్వారా పేర్కొనడం విడ్డూరంగా ఉందని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2014లో జరిపించిన SKS ప్రకారం బీసీలు (ముస్లింలలోని బీసీలు కాకుండా) 52% అని నిర్ధారణ కాగా,అదిప్పుడు 46%శాతమేనని ప్రభుత్వం వెల్లడించడం,6% తగ్గించి చూపడం దారుణమని ఆవేదన చెందారు.బీసీల జనాభాను తగ్గించి చూపడమే కాక,ఈ తప్పులతడక సర్వే నివేదికను మంత్రిమండలి ఆమోదించడం, చట్టసభల్లో ప్రవేశపెట్టి ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేయాలన్న చిత్తశుద్ధి అధికార పార్టీలో పూర్తిగా లోపించిందని ఎంపీ వద్దిరాజు మండిపడ్డారు.కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశానా కూడా లేదనేది ఈ అశాస్త్రీయ కులగణన సర్వేతో తేటతెల్లమయ్యిందన్నారు.బీసీల పట్ల కాంగ్రెస్ పాలకులకు చాలా చులకన భావం నెలకొందని చెప్పడానికి మంత్రిమండలి కూర్పే ఒక ప్రబల నిదర్శనమని ఎంపీ రవిచంద్ర చెప్పారు.బీసీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరుకాపు,యాదవ, ముదిరాజ్,కుర్మలకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడం,రాజ్యాధికారంలో న్యాయమైన వాటా దక్కకపోవడం శోచనీయమని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.కులగణన సర్వేలో చోటుచేసుకున్న తప్పులను వెంటనే సరిదిద్దాలని, ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించాలని, కేబినెట్ విస్తరణలో 4 గురు బీసీలకు స్థానం కల్పించాలని ఎంపీ వద్దిరాజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి గురవుతున్న బీసీలను బీఆర్ఎస్ మరింత సంఘటితపరుస్తూ న్యాయమైన హక్కులు,వాటా కోసం నిరంతరం పోరాడుతుందని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!