సంక్షేమం ముసుగులో సోమరులను తయారుచేస్తున్న పార్టీలు
విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తేనే సమాజానికి మనుగడ
సంక్షేమం ఉత్పత్తికి దోహదం చేసేదిగా వుండాలి
శ్రమైక జీవనంలోనే జీనవ సౌందర్యం
సంక్షేమం మాటున పరాన్నభుక్తులను తయారుచేయొద్దు
సంక్షేమం అభివృద్ధి సమతుల్యమైతేనే సమర్థపాలన
రాజకీయ పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే పరమావధిగా ఎన్నికల్లో హద్దూపద్దూ లేని హామీలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేంటి? అప్పులు, ఆదాయ వివరాలు తెలుసో తెలియదో కానీ హామీలు మాత్రం కోటలు దాటే స్థాయిలో వుంటున్నాయి. తీ రా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయలేక కప్పదాటు రాజకీయాలు చేయడం దేశంలో ఒక రివాజుగా మారిపోయింది. క్రమంగా దిగనాసిల్లుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో ఈ ఉచితాలపై ఎక్కువ హామీలు గుప్పించి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధి కారంలోకి రాగలిగింది. కానీ ఇచ్చిన హామీల అమలులో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఢల్లీిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కాం గ్రెస్ తన ఉచితాలను ‘అనుచిత’ రీతిలో ప్రకటిస్తుండటం విస్తుపోయేలా చేస్తోంది. ఢల్లీి ఎన్నిక ల్లో ప్రధాన పోటీ ఆమ్‌ఆద్మీ`బీజేపీల మధ్యే వుంటుందని వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేప థ్యంలో గెలుస్తామన్న ధీమా లేకపోయినప్పటికీ, ‘తెగించి’ మరీ హామీలు ఇస్తోంది. వీటిల్లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీలు ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అయితే ఢల్లీిలో ప్రతి మహిళకు రూ.2500, వృద్ధ వితంతు వులు, వికలాంగులకు నెలకు రూ.5000, యువతకు రూ.8500 స్టైఫండ్ ఇస్తామని కొత్త హామీలను ఇచ్చింది. ఇప్పటివరకైతే కాంగ్రెస్‌కు గాలి అనుకూలంగా లేదు. ఎట్లాగూ ఓడిపోతున్నాం కదా ‘కొండకు వెంట్రుక కట్టాం’ అన్నరీతిలో ఈ హామీలను గుప్పిస్తున్నదేమో తెలియదు. ఎందుకని ఇట్లా అనాల్సి వస్తున్నదంటే, మహిళలకు ఉచితబస్సు సదుపాయం వీటిల్లో లేదు! దీన్ని అమలు చేస్తున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఆర్టీసీకి డబ్బులు కట్టలేక నానా అగచాట్లు పడుతున్నాయి. ఈ బాధలను చూసే ఢల్లీి ఎన్నికల్లో ఈ హామీపట్ల మొగ్గు చూపలేదనుకోవాలి. అయితే మిగిలిన హామీల మాటేంటి? ఒకవేళ అధికారంలోకి వస్తే అమలు చేసే పరిస్థితి కాంగ్రెస్‌కు వుం టుందా? అనేది ఇప్పటికైతే సమాధానం దొరకని ప్రశ్న.
ఉచిత బస్సు కర్ణాటకలో విఫలమైందనే చెప్పాలి. ఈ ఉచిత బస్సు పథకం పుణ్యమాని కెఎస్సార్టీసీ దివాలా తీసే పరిస్థితి ఏర్పడిరది. ‘ఉచిత బస్సు’లోటును పూడ్చడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవు. అట్లాగని పథకాన్ని ఎత్తేయాలంటే భయం! ఈ నేపథ్యంలో టిక్కెట్ రేట్లు ఎడాపెడా పెంచేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే, డబ్బులు పెట్టి టిక్కెట్ కొను క్కున్నవాళ్లు నిలబడి ప్రయాణిస్తుంటే, ఉచిత సౌకర్యం పొందేవారు దర్జాగా సీట్లలో కూర్చొని ప్రయాణిస్తున్నారు! తెలంగాణలో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. కాకపోతే ప్రభుత్వం పంటి బిగువున ఈ పథకాన్ని అమలు చేస్తున్నదనుకోవాలి. అంతేకాదు తెలంగాణలో ఆరు హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కావడంలేదంటే అందుకు ప్రధాన కారణం ప్రభుత్వంపై మోయలేని భారమే! ఇది ప్రభుత్వానికి మింగలేని, కక్కలేని పరిస్థితి! మరి ఢల్లీిలో కాంగ్రెస్ ప్రకటించిన నెలకు రూ.5000, రూ.2500, యువతకు రూ.8500 స్టైఫండ్ పథకాలు తెలంగాణ, కర్ణాటకల్లో అమలు కావడంలేదు. అక్కడ అమలైతే ప్రజలు నమ్మేవారేమో! ఇప్పుడు నమ్మితే మాత్రం ముక్కుమూసుకొని యమునా నదిలో దూకినట్టే! ఇక ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఆరు హామీల విషయంలో చేతులెత్తేసి, ‘రాష్ట్రం 15శాతం వృద్ధి నమోదు చేస్తే వీటిని అమలు చేస్తామని’ ఎవరికీ అర్థంకాని రీతిలో తనదైన శైలిలో గణాంక వివరాలు చెప్పి ‘కాడి కిందపడేసి’ మమ అనిపించారు. ఆయన చెప్పిన లెక్కలు సామాన్యుడికి అర్థమయ్యేసరికి మళ్లీ ఎన్నికలస్తాయి! పనిలో పనిగా ఆస్తిపన్నుమాత్రం 40`50శాతం పెంచేసి ‘సంక్షేమాలు’ అమలు కావడం లేదన్న పరేషాన్‌లో ఉన్న సామాన్యులపై ‘కర్రు’ కాల్చి వాతపెట్టారు. రాష్ట్రం 15శాతం వృద్ధి చెందేదెప్పుడో చంద్రబాబుకే తెలియాలి. కానీ ఆస్తిపన్ను రూపంలో ఆయన పెట్టిన ‘వాత’ మాత్రం తక్షణం అమల్లోకి వచ్చేసింది. తన ప్రతి వైఫల్యానికి జగన్ ‘బూచి’ని చూపి జనాలను భయపెట్టడం ఏపీలో అధికార పార్టీకి అలవాటైపోయింది. రోడ్లు వేయని జగన్‌ను జనం మరచిపోతే, రోడ్లేసిన చంద్రబాబు జనానికి ‘వాత’ల రూపంలో తనను మరచిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.
ప్రజాస్వామ్యంలో సంక్షేమం, అభివృద్ధి సమతుల్యంగా సాగాలి. కానీ అధికారంలోకి రావాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో పార్టీలు అదుపులేని స్థాయిలో సంక్షేమ హామీలిచ్చేసి, అభివృద్ధిని పట్టించుకో వడంలేదు. ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి. అధికారంలోకి వచ్చిన పార్టీలు తమ సొంత డబ్బు లు ఈ సంక్షేమాలకు ఉపయోగించడంలేదు. ఈ నిధులన్నీ పన్ను చెల్లింపు దార్లనుంచి వసూలు చేసినవి! ఆవిధంగా ఇతర వర్గాల వారినుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసే ఈ నిధులను, ఇష్టం వచ్చిన రీతిలో పప్పుబెల్లాల మాదిరిగా సంక్షేమాలకోసం పంచిపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కేవలం కొన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఓట్లకోసం అమలు చేసే ఈ ఉచితాల వల్ల జనాల్లో పనిచేసే అలవాటు కనుమరుగయ్యే అవకాశాలే ఎక్కువ. మానవుడి ఆశకు అంతుండదు. ఒక కోర్కె తీరగానే మరో కోర్కె నెత్తిన నాట్యం చేస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో ఇదే పరిస్థితి! హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలే అమలు చేయలేక ప్రభుత్వం దివాలా తీసే దుస్థితి లో వుంటే, ఇంకా మరిన్ని సంక్షేమాలు కావాలని ప్రజలు కోరుతున్నారట! ఇది సాక్షాత్తు కాంగ్రెస్‌నాయకుడు డి.కె. శివకుమార్ అన్న మాటలు! ఈ మితిమీరిన సంక్షేమాల వల్ల పార్టీలు అధికా రంలోకి వస్తున్నాయేమో కానీ, సామాజికంగా తీవ్ర నష్టాలు కలుగుతున్నాయి. ఉచితాలతో కడుపు నిండుతున్నవారు పనులకు పోవడం మానేయడం పల్లెల్లో కనిపిస్తోంది. ఫలితంగా సామాజిక ‘అల్లిక’ దెబ్బతినడం మొదలైంది. అందరూ అన్ని పనులు చేయలేరు. పరస్పర సహకారమే స మాజ మనుగడకు పరమావధి. కానీ సంక్షేమాలు అందే కొన్ని వర్గాలు తాము చేయాల్సిన పనులు చేయకపోవడంతో వ్యవస్థ దెబ్బతినడం మొదలైంది. శ్రామిక ఉత్పత్తి ద్వారా అభివృద్ధి, సంక్షేమం బాటన నడవాల్సిన సమాజాల్లో, ప్రభుత్వాలు సోమరులను ‘ఉత్పత్తి’ చేస్తున్నాయి. ఇది తి రోగమనం తప్పమరోటి కాదు.
ట్రేడ్ యూనియన్లు, కమ్యూనిస్టు భావజాలం బాధ్యతలు లేని ‘హక్కు’లను నూరిపోయడంతో ప్ర భుత్వరంగ సంస్థలు పెద్ద గుదిబండలుగా మారాయి. ఇది ప్రైవేటీకరణకు దారితీసి ఉత్పాదకత బాగా పెరగడంతో ఉపాధి అవకాశాలతో పాటు, ప్రజల జీనవ నాణ్యత పెరిగింది. కేవలం ‘హ క్కులు’ మాత్రమే ప్రబోధించిన కమ్యూనిస్టులు కనుమరుగైపోయారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ‘సంక్షేమం’ పేరుతో ఇటువంటి బాధ్యతారాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇది కూ డా ‘బాధ్యతలు’ లేని ‘హక్కుల’ వంటిదే! కాకపోతే దీనికి సంక్షేమం అనే అందమైన ముసుగును వేస్తున్నారు. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ప్రజలు గతంలో మాదిరిగా లేరు. వారి జీవన నాణ్యత పెరిగింది. వాళ్ల ఆలోచనా తీరు కూడా మారింది. తిండి, గుడ్డ, ఇల్లు అనే రోజులుపోయాయి. సంపాదించే తీరుతెన్నులు, సంపద సృష్టిలో ప్రభుత్వ ప్రమేయం లేకుండానే ప్రజలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకొని ముందుకు సాగుతున్నారు. అందువల్ల అధికారంలోకి వచ్చే పార్టీలు ముఖ్యంగా ఆలోచించాల్సింది అర్థంపర్థంలేని హామీలకు కాకుండా, ఉచితవిద్య, ఉచిత వైద్యంపై దృష్టి కేంద్రీకరిస్తే ప్రజలకు అంతకు మించి చేసే మేలు మరోటుండదు.
విద్య, వైద్యం నేడు ఎంతో ఖరీదైనవిగా మారాయి. మనిషి ఆరోగ్యంగా వుంటేనే పనిచేయగలడు.పనిచేస్తేనే ఉత్పాదకత పెరికి ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన కారణం ఇదే. సామాన్యులు తమ ఆదాయంతో అప్పులు చేయకుండా ప్రశాంతంగా జీవించాలంటే, విద్యను ఉచితంగా అందించాలి. తల్లిదండ్రులకు తమ పిల్లల చదువు పెద్ద భారం కారాదు. అప్పుడు మాత్రమే వారు తమ జీవితాలకు భరోసా లభించినట్టు భావించగలరు. ఎందుకంటే తమ పిల్లలకు గౌరవప్రద స్థానాన్ని కల్పించే విద్య, అనారోగ్యానికి అందుబాటులో చికిత్స వున్నప్పుడు వారు తమ మిగిలిన అవసరాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఫలితంగా వారి జీవనగమనం సాఫీగా సాగుతుంది. ప్రజల సంక్షేమం పట్ల నిజమైన నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీలు ప్రధానంగా చేయాల్సింది ఇదీ! ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాం కదా అని చెప్పవచ్చు. ప్రభుత్వ బకాయిలు పేరుకుపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని అమలు చేయడానికి కొన్ని సందర్భాల్లో ముందుకు రావడంలేదు. ప్రభుత్వం బకాయిలు పడటానికి ప్రధాన కారణం ఇతర సంక్షేమ పథకాల భారం! ఈ భారాన్ని మోయలేరు, తీసేయలేరు! ఇదొక విచిత్ర సంకట స్థితి! ఒక రకంగా చెప్పాలంటే ‘ఉచితాలు’ ప్రకటించి అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రశాంతంగా లేవు. ‘ఉచి తాలు’ అందని మెజారిటీ ప్రజలు సుఖంగా లేరు. అందువల్ల ఉచితాలు కాదు కావలసింది ఉపాధి. ఒక వర్గంవారిపై భారంవేసి మరో వర్గంవారిని పైకి తేవాలనుకోవడం సముచితం కాదు! ఎందుకంటే ఆ వర్గాలకు డబ్బులు ఊరికే రావడంలేదు! ఎంతో కష్టపడితేనే వస్తున్నాయి! అటు వంటి తమ కష్టార్జితాన్ని పన్నులపేరుతో ముక్కుపిండి వసూలు చేసి సంక్షేమాల పేరుతో అభివృ ద్ధిని నిర్లక్ష్యం చేయడం సమర్థపాలన అనిపించుకోదు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి మాత్ర మే సుపరిపాలన అనిపించుకుంటుంది! మరి ఈ ఓట్ల సుడిగుండంలో చిక్కుకున్న పార్టీలు బయటకు వచ్చి సమర్థపాలన అందించడం ఇప్పట్లో సాధ్యమయ్యేదేనా?