సీఎం సీటే ఎదురు చూస్తుండగా!

డిప్యూటీ ఎందుకు దండగ!!

`లోకేష్‌ లౌక్యంగా చెప్పిన సమాధానం.

`డిప్యూటీ పదవి వద్దన్నాడు?

`డిప్యూటీతో కొత్తగా వచ్చేదేమీ లేదు!

`సీఎం పదవి కాదనుకోవడం లేదు!

`ఇప్పటికీ డిఫాక్టో సీఎం లోకేషే.

`చంద్రబాబు తర్వాత ఆ స్థానం లోకేష్‌దే!

`ఎప్పటికైనా లోకేష్‌ సిఎం అయ్యేదే!

`ఆ ముహూర్తం ఎంతో దూరం లేనిదే!

`ఇప్పుడు డిప్యూటీ అవసరమే లేదులే!

`పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవి త్యాగం!

`సీఎం సీటుతో సరిసమాప్తం.

`భవిష్యత్తు పార్టీ అధ్యక్షుడు లోకేషే!

`త్వరలో సీఎం అయ్యేది లోకేషే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తాజాగా మంత్రి లోకేష్‌ ఒక విషయాన్ని చాలా సూటిగా స్పష్టం చేశారు. అది ఎవరికి అర్ధం కావాలో వారికి అర్ధమైంది. ఇక సమస్యలేదు. తమ పార్టీలో ఏ వ్యక్తికైనా పదవులు మూడుసార్లకంటే ఎక్కువ అనుభవించే అవకాశం వుండొద్దని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ విషయాన్ని పార్టీలో కూడా పెట్టి చర్చిస్తా! అని చెప్పాడు. అంతే కాదు తాను తెలుగుదేశం పార్టీకి జాతీయ కార్యదర్శిగా మూడుసార్లు పనిచేశారు. ఆ పదవి నుంచి తాను తప్పుకుంటాను అని ప్రకటించారు. అంటే ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియకుండా చేసిన వ్యాఖ్యలు అని ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదు. కారణం త్వరలో నేను ముఖ్యమంత్రిని అవుతున్నానని చెప్పకనే చెప్పారు. డిప్యూటీ సిఎం. అనే చర్చకు తెరదించారు. ఒక నాయకుడు ఒక పదవిని మూడుసార్లు కంటే ఎక్కువ అనుభవించకూడదని చెప్పడంలో సీనియర్లందరినీ పక్కన పెడుతున్నట్లు కూడా చెప్పడం జరిగింది. పార్టీకి కొత్త నీరు రావాల్సిన అవసరం వుందని చెప్పినట్లైంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అతీతం కాదన్న సంగతిని కూడా లోకేష్‌ తేల్చి చెప్పారు. ఇప్పటికే చంద్రబాబు నాయకుడు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇది నాలుగోసారి. కాకపోతే ప్రాంతీయ పార్టీలో నాయకుడికి కొన్ని వెసులుబాటులుంటాయి. ఆ వెసులుబాటుతోనే ప్రాంతీయ పార్టీల అధినేతలు ఎవరైనా సరే పదవులు ఎన్ని సార్లైనా అనుభవిస్తుంటారు. ఇప్పుడు లోకేష్‌కు సమంయ వచ్చింది. నాయకత్వమార్పుకు అవసరమైన రోజులొచ్చాయి. చంద్రబాబు కూడా త్వరలోనే లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి అన్ని రకాల కసరత్తులు చేపడుతున్నట్లు లోకేష్‌ నమ్మగర్భంగా చెప్పాడు. అంతే కాదు తాను రెడ్‌ బుక్‌ ఓపెన్‌ చేస్తానని అన్నారు. అంటే ఒక మంత్రిగా ఆయన ఆ పని చేయలేరు. ఆయనకు ఇచ్చిన శాఖ మేరకే పనిచేయాల్సి వుంటుంది. రెడ్‌ బుక్‌ ఓపెన్‌ చేయాలంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే సాధ్యమౌతుంది. అందుకే త్వరలోనే తాను రెడ్‌ బుక్‌ ఓపెన్‌ చేస్తానన్నారు. ముందుగా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో మర్యాద పూర్వ సంప్రదింపులు జరుగుతాయి. ఆయన ఒప్పుకుంటే సరే లేకుంటే…అన్నప్పుడు మరో ప్లాన్‌ ఎవరికైనా వుంటుంది. ఎందుకంటే ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే నాయుడు ఒక్కడే వుంటారు. జనసేనలో ఎంత మంది నాయకులున్నారు. జనసేనకు పార్టీ యంత్రాంగం ఏమిటో కూడ ఎవరికీ తెలియదు. పార్టీ నిర్మాణం ఇప్పటికీ చేయలేదు. పార్టీపరమైన ఏ కార్యక్రమం చేపట్టినా సరే స్టేజీ మీద పవన్‌ కళ్యాన్‌ ఒక్కరు తప్ప మరొకరు వుండదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. పార్టీపరమైన కార్యక్రమాలు కూడా ఆయనే పర్యవేక్షిస్తారు. పార్టీ పరమైన మరో పదవిని నాగబాబుకు ఇచ్చాడే గాని, మరెవరికీ అప్పగించగలేదు. పార్టీపరమైన బాద్యతలు పూర్తి స్యాయిలో మెరెవరికీ ఇతర పదువుల ద్వారా అందించలేదు. అందువల్ల ప్రాంతీయ పార్టీల నిర్మాణం ఎలా వుంటుంది? అనేది పవన్‌ కళ్యాణ్‌కు స్పష్టంగా తెలుసు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అధ్యక్షుడుగా చిరంజీవి కొనసాగారు. ఇతర పదవుల్లో అల్లు అరవింద్‌, నాగబాబు చూసుకున్నారు. యువరాజ్యం అధ్యక్ష పదవి పవన్‌ కళ్యాన్‌ చేపట్టారు. అంతే కాని ఇతరులకు పదవుల పంపకాలు చేయలేదు. తెలుగుదేశం పార్టీలోనైనా అంతే. చంద్రబాబు తర్వాత లోకేష్‌ మాత్రమే పార్టీ అధ్యక్షపదవితోపాటు, ముఖ్యమంత్రి పదవికి పూర్తి అర్హలౌతారు. అందుకే లోకేష్‌ స్పష్టత ఇచ్చేశారు. లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని కోరడమే సరైంది కాదు. సాహేతుకం అసలే కాదు. ఎందుకంటే లోకేష్‌ సిఎం.కావాల్సిన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత స్ధానంలో కూర్చొవాల్సిన నాయకుడు. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన నాయకుడు. ప్రజా తీర్పుతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అందువల్ల తెలుగుదేశం నాయకులు ఇప్పుడు బలంగా గొంతు సవరించి లోకేష్‌ను సిఎం చేయాలని అడగాలి. అంతే కాని ఉప ముఖ్యమంత్రి పదవి అన్నది రాజ్యాంగంలో లేని పదవి. చేతికి వుండే ఆరో వేలు లాంటిది. దాని వల్ల ఉపయోగమేమీ వుండదు. ఉప ముఖ్యమంత్రి పదవి అన్నది మంత్రితో సమానమైన పదవే తప్ప ప్రత్యేకమైన అధికారులు ఏమీ వుండవు. ప్రత్యేక ప్రొటోకాల్‌ కూడా వుండదు. కాకపోతే పిలవడానికి గౌరవంగా మాత్రమే వుంటుంది. కూటమి కారణంగా పవన్‌ కళ్యాణ్‌కు ప్రత్యేకమైన గౌరవం ఆపాదించడం కోసం మాత్రమే ఉప ముఖ్యమంత్రి అని సంబోధించడం జరగుతుంది. గతంలో కూడా కూడ ఆనేక మంది ఉప ముఖ్యమంత్రులు పనిచేసిన నాయకులున్నారు. ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత స్దానం కాదు. అందుకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. అయినా లోకేష్‌కు ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి కావాల్సింది? ముఖ్యమంత్రి…ఈ విషయాన్ని ముందు తెలుగుదేశం శ్రేణులు ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీలో ఎంత మంది వున్నా, ఎంత మంది నాయకులున్నా ఆ పార్టీలో ఎవరూ జాతీయ అధ్యక్షులు కాలేరు. అందుకు లోకేష్‌ మాత్రమే అర్హులు. ఒక వేళ జనసేన పార్టీని పవన్‌ కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీలో విలీనం చేసినా లోకేషే తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడౌతారే గాని, పవన్‌ కళ్యాన్‌ కాలేదు. ఇది నిజం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే ఆ పార్టీ అధినేతల వారసులకు మాత్రమే కట్టబెడతారు. లేకుంటే ఆ పార్టీలు నామ రూపాలు లేకుండాపోవచ్చు. రాజకీయాలకు దూరం కావొచ్చు. వున్నా వాటి ప్రభావం లేకుండా కనుమరుగు కావొచ్చు. అలాంటి పార్టీలను మన కళ్లముందే వున్నాయి. తమిళనాడులో చూసుకుంటే జయలతిత అధ్యక్షురాలిగా వున్న ఏఐడిఎంకేలో వారుసులు లేక ఆ పార్టీ ఇప్పటికే చిన్నాభిన్నమైంది. శశికళ ఆ పార్టీకి వారసురాలు అవుతుందని అనుకున్నా కుదరలేదు. ఆ పార్టీ ఇకపై క్రియాశీల రాజకీయాల్లో మనుగడ సాగిస్తుందన్న నమ్మకంలేదు. జయలలితకు వారసులు వుంటే ఆ పార్టీ పరిస్ధితి మరోలా వుండేది. ఏఐడిఎంకేలో ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్‌ సెల్వం కూడా ఆ పార్టీకి అధ్యక్షుడు కాలేదు. ఇకపై తమిళరాజకీయాల్లో ఆపార్టీ వుంటుందేమో కాని, రాజకీయాలను ప్రభావితం చేసేలా వుండకపోవచ్చు. ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో సునామీ సృష్టించిన మాయావతి పార్టీ పరిస్దితి ఎలా వుందో చూస్తూనే వున్నాం. కాన్షీరాం ఏర్పాటు చేసి బహుజన సమాజ్‌ వాదీ పార్టీ మాయవతి చేతుల్లో పెట్టిన తర్వాత దేశ రాజకీయాల్లో ఒక సంచలనాన్ని నమోదు చేశారు. కాని ఏమైంది? ఆ ప్రభావం ఎంత కాలం వుంది? మాయావతి బతికుండగానే ఆ పార్టీ ప్రజలకు దూరమైంది. ఉనికి కోసం ఆరాపడుతుంది. ఆమె తర్వాత అంటే చెప్పుకోవడానికి ఎవరూ వుండరు? ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో ఆ శకం ముగిసిపోతుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ భారతీయ జనతాపార్టీ కాదు. కాంగ్రెస్‌ పార్టీ అంత కన్నా కాదు. ఎవరో ఒకరు ఆ పార్టీని భుజాన వేసుకుంటారని అనుకోవడానికి వీలు లేదు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎప్పుడూ గాందీ కుటుంబం చేతుల్లో వుండడం వల్లనే ఇంత కాలం బతికి బట్టకడుతోంది. ఒక్కసారి ఆ పార్టీని గాందీ కుటుంబం చేతుల్లో నుంచి వదిలేస్తే తెగిన గాలిపటమౌతుంది. అదే వారసుల చేతుల్లో వుంటే వంద సంవత్సరాలైనా సరే పార్టీ క్రియాశీలకంగా వుంటుంది. దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుంది. అందుకే గతంలో కొన్ని పార్టీలు చేసిన తప్పును చంద్రబాబు చేయకూడదు. తమిళనాడులో డిఎంకే పార్టీ వారసుల చేతుల్లో వుండడం వల్లనే ఇంత కాలం రాజకీయాలను ఏలుతోంది. కాని కరుణానిధి గతంలోనే స్టాలిన్‌ను ముఖ్యమంత్రి చేస్తే ఆ పార్టీ పరిస్ధితి మరోలా వుండేది. అయితే డిఎంకే విషయంలో కరునానిధి కుటుంబంలో వారసత్వ పోరు బలంగా వుండేది. దాంతో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలో అర్దం కాక కరునానిధి ఆలస్యం చేశారు. దాంతో ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి కావాల్సిన స్టాలిన్‌ 74 ఏళ్లకు ముఖ్యమంత్రి అయ్యారు. నడవలేని స్దితిలో పాలన సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితులు ప్రాంతీయ పార్టీలో ఏ నాయకుడికి రాకూడదు. కళ్లముందు ఇన్ని సాక్ష్యాలు చూసుకుంటూ కూడా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయడానికి పెద్దగా సమయం తీసుకోకపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!