`హిందూ సమాజాన్ని కాపాడేందుకు దేవుళ్లే వున్నారు.
`మానవ మాత్రులు కాపాతున్నామనడం కేవలం రాజకీయం.
`హిందూ జనోద్దరణకు దైవ భక్తులున్నారు?
`రాజకీయ పార్టీలు పని గట్టుకొని హిందుత్వాన్ని నిలబెట్టేదేమీ లేదు?
`రాజకీయ పార్టీలు నిలబెడితేనే హిందూ మతం కొనసాగేది కాదు?
`ఎన్ని యుగాలైనా హిందూ మతం అంతరించేది కాదు!
`ఇతర మతాలు పాలించినా హిందూ ప్రవాహం ఆగిపోలేదు.
`ముస్లిం రాజ్యాలు సాగినా హిందూ వెలుగు ఆరలేదు. ఆపలేదు.
`ఆంగ్లేయుల పెత్తనంలో ఏ హిందూ సమాజం భయపడలేదు.
`ఇప్పటికే కాదు, ఎప్పటికీ హిందూ మతానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు?
`రాజకీయ పార్టీలు మాత్రమే హిందూ ఉద్దరణ చేసేవి కాదు!
`ఏ పార్టీ అధికారంలో వున్నా హిందువులపై ప్రభావం చూపలేరు.
`హిందూ సమాజం వేల సంవత్సరాల నుంచి మనుగడలో వున్నదే!
`యుగయుగాల చరిత్ర మన కళ్లముందు కదలాడుతున్నదే.
`వేదాలు, ఉపనిశత్తులతో కళకళలాడుతున్నదే.
`మధ్యలో వచ్చిన మతాల గురించి దిగులెందుకు?
`రాజకీయ నాయకుల అండదండలు హిందూ మతానికెందుకు?
హైదరాబాద్,నేటిధాత్రి:
ధర్మో రక్షితే రక్షిత: అని పెద్దలన్నారు. ధర్మాన్ని నువ్వు కాపాడితే మతాన్ని ఆ ధర్మమే మతాన్ని కాపాడుతుందంటారు. ఇంతకీ ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారు. సత్యభోధన ఎవరు చేస్తున్నారు. ఉపాసకులు ఎక్కడున్నారు. గురువులు ఏం బోధిస్తున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అంతే కాని దేశాన్ని కాపాడేది పాలకులౌతే, మతాన్ని కాపాడుకునేది ప్రజలే..కాని ఆ ప్రజల రూపంలో వున్న రాజకీయ నాయకులు మేమే కాపాడుతున్నామంటూ ప్రజల మధ్య లేనిపోని విభజనలు చేస్తున్నారు. పాలకులు అందర్నీ పాలించాలి. ధర్మానికి, నీతికి,నిజాయితీకి ఇబ్బంది కలగకుండా చూడాలి. అంతే కాని కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అలవాటు చేసుకుంటున్నారు. అందులో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. అన్ని పార్టీలు అలాగే వున్నాయి. మైనార్టీల ఓట్లకోసం కొన్ని పార్టీలు, మెజార్టీ ప్రజల ఓట్లకోసమంటూ కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. మతాలమీద పేటెంట్లు తీసుకుంటున్నాయి. అసలు హిందూ మతోద్దరణ ప్రజలు చూసుకుంటారు. ప్రజలే హిందూ మతాన్ని రక్షించుకుంటారు. పాలకులు ప్రజలను రక్షిస్తే చాలు. వారి యోగక్షేమాలు చూసుకుంటే చాలు. వారికి నాణ్యమైన విద్య, వైద్య ఉచితంగా అందిస్తే చాలు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు. దేశానికి ఎవరైనా హని కలిగించాలని చూస్తే వారిని శిక్షిస్తే చాలు. మన దేశంలో, ధర్మం, మతం ఇంకా ఎన్ని యుగాలైనా సాగుతుంది. ప్రపంచానికి దారి చూపుతుంది. అంతే కాని ఎవరో వచ్చి, ఏదో చేస్తే హిందూ మతానికి వచ్చే ప్రమాదమేమీ వుండదు. అనాది కాలం నుంచి హిందూ మతాన్ని రాజులేం కాపాడలేదు. ప్రజలే కాపాడుకుంటూ వచ్చారు. హిందూ మతాన్ని ప్రజలే పోషించుకుంటూ వచ్చారు. అందులో రాజులు కూడా వున్నారు. వారి వారి నమ్మకాలను బట్టి గుళ్లు గోపురాలు నిర్మించారు. దైవ కార్యాలు చేశారు. అందుకే హిందూ మతం ఇప్పటిదాక నిలబడుతోంది. ఎన్ని యుగాలైనా నిలబడుతుంది. ఆసేతు హిమాచలం వరకు హిందూ నాదం మోగుతూనేవుంటుంది. అఖండ భారత్ అనే పదం ఎన్ని వేల సంవత్సరాలకైనా నిలబడుతుంది. అందుకే రాజకీయ పార్టీలు తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు మతాన్ని ఏ పార్టీ అడ్డుపెట్టుకోకూడదు. మన రాజ్యాంగ స్పూర్తిని ఆచరించాలి. వేదాలు, ఉపనిశత్తులు వ్యక్తి ఎలా వుండాలి. సమాజం ఎంత ఔన్నత్యంగా వుండాలని చెప్పాయే గాని, ఒకరు ఒకరిపై ఆదిపత్యం సాగించమని చెప్పలేదు. సమాజంలో మంచి చెడు ఎప్పుడూ వుంటాయి. అనాదిగా మన సమాజంలో హెచ్చు తగ్గులెందుకున్నాయి. సమ సమాజ నిర్మాణం ఎందుకు లేదు. మాటల వరకే పరిమితమైన ఆ సూక్తులు ఎందుకు ఆచరించబడలేదనే చర్చ కావాలి. సనాతన దర్మం అంటే అర్ధమేమిటో కూడా తెలియని వాళ్లు మాట్లాడుతున్నారు. అక్షరం ముక్క తెలియని వాళ్లు సనాతన ధర్మం గురించి చెబుతూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. ఆ దౌర్భాగ్యమే సమాజంలో చీలకలను సృష్టిస్తున్నాయి. హిందువులలో అసమానతలు పెంచి పోషిస్తున్నాయి. ఇప్పటీకి మన సమాజంలో చాలా వర్గాలపై చిన్న చూపు ఎందుకు వుంది? అంటరాని తనం ఒక పాపం అంటూ చెబుతూ వచ్చారు. సమాజంలో చైతన్యం వచ్చిన తర్వాతే అంటరాని తనం ఒక నేరం అని చట్టం తెచ్చుకోగలిగాం. అందుకే విద్యావంతమైన సమాజం నిర్మాణం జరగాలి. విద్య అంటే వేదాలు, ఉపనిత్తులు చదివిన వారే విజ్ఞానవంతులు కాదు. మానవత్వం నిండిన చదువు చదివిన వారు విజ్ఞానవంతులు. తోటి మనిషిని ప్రేమించాలి. గౌరవించాలి. ఆదరించాలి. ఒకరికొకరు సాయ పడాలి అని చెప్పే చదువులు కావాలి. కన్న తల్లికి, తండ్రికి మంచినీళ్లు పోయిని వాడు కూడా దేవుడంటూ కొలుస్తాడు. సనాతన ధర్మం గురించి గొప్పలు చెబుతాడు. ముళ్లోకాలను చుట్టి రమ్మని శివుడు చెబితే, వినాయకుడు తల్లిదండ్రులే ముళ్లోకాలతో సమానమని నిరూపించారు. మరి అదే ప్రజలు తమ తల్లిదండ్రులను దైవంగా చూస్తున్న రోజులున్నాయా? ఒకప్పుడు తల్లిదండ్రులు ముసలి వాళ్లయినా భయంతోనో, భక్తితోనో తల్లిదండ్రులను చివరి వరకు చూసుకున్నారు. కాని నేడు ఆ పరిస్దితి వుందా? తల్లిదండ్రులకు ఒక వయసు వచ్చిందంటే చాలు నేను, నా భార్యా పిల్లలు అంటూ వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులకు దూరమౌతున్నారు. వారిని దూరం చేస్తున్నారు. అలాంటి వారిలో ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా వున్నారు. ఎంత మంది రాజకీయ నాయకుల తల్లిదండ్రులు తమ వద్దనే వుంచుకుంటున్నారు. వారికి సేవలు చేస్తున్నారు. అలాంటి వారు సమాజానికి సేవ చేస్తున్నారంటే నమ్మొచ్చా? ప్రజలకు మేలు చేస్తారంటే విశ్వసించొచ్చా? నీతులు చెప్పి గోతులు తవ్వేవారే నీతి వంతమైన సమాజం గురించి చెబుతున్నారు. వాళ్లకు వేదంలో ఏముందోతెలియదు. పురాణాలు ఏం చెప్పాయో తెలియదు. సనాతన దర్మం ఏం సూచించిందో తెలియదు. కాని ఆ పదం మాత్రం పట్టుకున్నారు. తెలిసీ తెలియని జ్ఞానంతో సమాజాన్ని ఇంకా చెడగొడుతున్నారు. ఒక బ్రాహ్మణుడు ఒక దళితుడితో స్నేహం చేస్తాడా? ఒక బ్రాహ్మణుడు దళితుడిని ఇంటికి తీసుకెళ్లగలడా? ఒక ఉన్నత వర్గానికి చెందని వ్యక్తి, దళితులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారా? ఇప్పటికీ గ్రామాల్లో సహపంక్తి భోజనాలలో ఏర్పాటు చేసినా సంతోషంగా పాలు పంచుకోగలరా? మతం మౌడ్యమని ఇందుకే అన్నారు. అందుకు హిందూ మతం కారణం కాదు. ఆ హిందూ మతంలో మేమే గొప్ప అని చెప్పుకునే వారు చేసిన అపచారం. పురాణాలలో ఏం రాసిందో ఒక యాభై సంవత్సరాల క్రితం వరకు కోట్లాడి మంది నిరక్ష్యరాస్యులైన హిందూ ప్రజలకు తెలియదు. మహాభారతంలో ఏకలవ్యుడు చాటుమాటుగా విలువిద్యనేర్చుకుంటే, తన శిష్యుడి అర్జునుడిని మించిన విద్య నేర్చిన వాళ్లుండొద్దని బొటన వేలు తీసుకున్న గురువును ఆ సమాజం ప్రశ్నించిందా? వారి ప్రశ్నలు అప్పటి పాలకులకు వినిపించాయా? సనాతన ధర్మం మహిళలకు విద్య అవసరం లేదని చెప్పింది. కాని చదువుల తల్లి సరస్వతిని పూజించమని చెప్పింది. ఇందులో ఎక్కడైనా న్యాయం అన్న పదానికి తావుందా? సాక్ష్యాత్తు సరస్వతీ దేవి అమ్మవారే చదువుల తల్లి అయినప్పుడు పూర్వపు కాలంలో కనీసం రాణులైనా చదువుకున్నారా? కనీసం బ్రాహ్మణ స్త్రీలకైనా చదువు నేర్పారా? పూజలు పురుషులే చేయాలని అంటారు. ఇంట్లో మహిళలు పూజలు చేస్తే అందులో పుణ్యం పురుషులకు దక్కదని ఇప్పటికీ చెబుతుంటారు. అంటే స్త్రీలు పూజలు చేయడానికి కూడా పనికిరారా? మహిళలలు చదువుకుంటే వాతావరణాల్లో మార్పులు వస్తాయిని చెప్పిన వాళ్లున్నారు. మహిళలను కేవలం పిల్లలు కనే యంత్రాలుగా మాత్రమే చూశారు. పురుషాదిక్య సమాజంలో మహిళలను ఇంటికే పరిమతం చేశారు. ఒంటింటికే పరిమితం చేశారు. పడక గదికే పరిమితం చేశారు. వారసులను కనిచ్చే యంత్రాలుగా తయారు చేశారు. అంత దాకా ఎందుకు ఇప్పుడు కూడా పిల్లల్ని కనండి? ఎంత మంది వీలైతే అంత మందిని కనండి? అంటున్నారు. తల్లి కావడం ఆడవాళ్లకు వరం అని చెప్పి, పురిటి గండం అనేది ప్రమాదరకమని తెలియదా? ప్రకృతిలో వున్న జీవులన్నీ, మనుషులమూ ఒకటేనా? అందులో ఆడవాళ్లు కూడా ఇతర ప్రకృతి జీవులతోనే సమనామా? భర్త చనిపోతే చితి మంటల్లో వేసి కాల్చిన దర్మం ఎలా సనాతనమౌతుంది. ఇలాంటి అకృత్యాలు సనాతన ధర్మం నేర్పిందా? అందుకే దర్మం ఏమిటో, సనాతన ధర్మం చెప్పిందేమిటో కూడా నేటి సమాజానికి తెలియాల్సి వుంది. యోగులు, త్యాగులు, సర్వసంగ పరిత్యాగులు పెళ్లిళ్లు చేసుకోరు. బ్రహ్మచర్యంలో వుంటారు. అలాంటి వాళ్లు సంసార జీవితాల గురించి సూక్తులు చెబుతుంటారు. సంసారంలో వచ్చే కష్ట నష్టాలు తొలగిపోయేందుకు మార్గాలు చూపిస్తుంటారు. కామి గాని వాడు మోక్ష గాని కాదని మళ్లీ అదే సనాతన ధర్మం చెబుతుందంటారు. ఒక ఊరికి ఒకే దారి వుండాలని లేదు. కాని ఒక ధర్మం కోసం ఒకటే సూక్తి వుండాలి. పది సూక్తులను చూపించి ధర్మాన్నికి పది మార్గాలు రచించకూడదు. కళ్లు తెరిస్తే వెలుగు లోకం కనిపిస్తుంది. కళ్లు మూసుకుంటే లోకం చీకటి కాదు. చీకటైప్పుడు మాత్రమే లోకం కనిపించదు. అలాగే మనలో చీకటి నిండినప్పుడు మాత్రమే లోకంలో వెలుగు కనిపించదు. నిజాన్ని ఇలా చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు. కళ్లు మూసుకొని చీకటైందనుకుంటారు. తన చూసిన కళ్లతోనే వెలుగని, చీకట్లో బతుకుతుంటారు. హిందూ సమాజ ఉద్దరణ మేమే చేస్తున్నామని భ్రమలో బతుకుతుంటారు. సర్వే జనా సుఖినోభవంతు అని చెప్పడం కాదు, అందరి మేలు కోరుకునే వారు మన చుట్టూ ఎంత మంది వున్నారు. పక్కొడి మేలు కోసం సాయం చేయడానికి ఎంత మంది ముందుకొస్తారు. అందుకే ధర్మానికి, మతానికి ముడిపెట్టకండి? మేమే మతానికి కాపాలదారులమని ఎవరూ చెప్పకండి. మన మతాన్ని దేవుడే కాపాడుకుంటాడు. ప్రజలకు వెలుగును ప్రసాదిస్తుంటాడు. అందుకే దేవుడంటారు. ఆ దేవుడిని రాజకీయాలలో బందీ చేయకండి. ప్రపంచంలో వున్న అన్ని మతాలకంటే పురాతనమైనది..గొప్పది హిందూ మతమే. హిందూ మతంలో వున్న గొప్పదనమే ఆ మతాన్ని కాపాడుకుంటుంది. మన దేశ రాజులు ఎంతో మంది మన పొరుగున వున్న రాజ్యాలను పాలించారు. ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వాళ్లు మన దేశాన్ని పాలించారు. కాని ఎవరూ హిందూ మతంపై పగ పట్టిన వాళ్లు ఎవరూ చరిత్రలో మిగిలిపోలేదు. 674 నుంచి 1773 వరకు ముస్లింలు పాలించారు. అయితే అందులోనూ ఎంతో మంది హిందూ రాజులు కూడా వున్నారు. తర్వాత ఆంగ్లేయులు పాలించారు. మన దేశ సంపదను కొల్లగొట్టుకుపోయారే గాని మన సంస్కృతిని మీద దాడి చేయలేకపోయారు. మన హైందవంపై ఆధిపత్యం సాగించలేకపోయారు. నది పారుతున్నప్పుడు అక్కడక్కడ మురికి కూడా చేరుతుంది. అలాగే కొంత మంది మతాలు మారినంత మాత్రాన హిందూ మతం కొన్ని వేల సంవత్సరాలుగా వెలుగుతూనే వుంటుంది. హిందూ మతం అనేది అఖండ జ్యోతి లాంటిది. దానికి వెలిగించే శ క్తి మనిషికి లేదు. దానిని ఆర్పే శక్తికూడా మనిషికి లేదు. అంతే…