జైపూర్ తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం రోజున తహసిల్దార్ వనజా రెడ్డికి ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా తమ భూములను కోల్పోతున్న రైతులు గ్రామస్తులు తమ ఆవేదనను లిఖితపూర్వకంగా వ్రాసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు వినతి పత్రంలో చేర్చిన అంశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో జైపూర్ మండలంలోని నర్వ గ్రామ శివారు నుండి మొదలుకొని గోపాలపూర్ శివారు వరకు మధ్య గల అన్ని గ్రామాల శివారులలో గల భూములను రైతులు కోల్పోతున్నారని, కోల్పోతున్న భూమికి నష్టపరిహారంగా చాలా తక్కువ మొత్తాన్ని వెలకట్టి ఇస్తూ నోటీసులు జారీ చేశారని, ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం మా యొక్క భూములు 40 లక్షల రూపాయల నుండి మొదలుకొని కోటి రూపాయల వరకు అమ్మకపు ధర పలుకుతున్నాయని తెలిపారు. ఇంతకుముందు అదే గ్రామ శివారులలో పార్వతి బ్యారేజ్ నిర్మాణంలో భూములను కోల్పోతే అప్పటి తెలంగాణ ప్రభుత్వం 2017 వ సంవత్సరంలో ఎకరానికి గాను 8,20,000(ఎనిమిది లక్షల ఇరవై వేలు)వేల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించారని, అప్పటినుండి ఇప్పటివరకు గడిచిన 8 సంవత్సరాల కాలంలో బహిరంగ మార్కెట్ లో భూముల విలువ ఐదు రెట్లు అధికంగా పెరిగిందని తెలిపారు. ఇదే జైపూర్ మండలంలోని టేకుమట్ల,ఇందారం గ్రామాల శివారులలోని భూములు సింగరేణి ఓపెన్ కాస్ట్ లో కోల్పోతే సింగరేణి సంస్థ ఎకరానికి గాను 24 లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించిందని తెలిపారు. అలాంటిది మాకు మాత్రం అతి తక్కువగా ఎకరానికి గాను 4,31,000 రూపాయలు మాత్రమే నష్టపరిహారంగా ఇవ్వడం చాలా దారుణమని వాపోయారు. కావున ప్రభుత్వం మా భూములకు బహిరంగ మార్కెట్ లో గల ధరను దృష్టిలో ఉంచుకొని, మా మనుగడకు ముఖ్యమైన భూములను కోల్పోతున్న రైతు కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకొని నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాలని కోరారు. మా మనవిని అంగీకరించని యెడల ఎట్టి పరిస్థితుల్లోనూ మా భూములను గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఇవ్వడం జరగదని, రైతులందరం ఒక్కటై ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజా రెడ్డి,భూములు కోల్పోతున్న రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *