కార్పొరేటర్‌ తండ్రి కావరం

కార్పొరేటర్‌ తండ్రి కావరం

ఆయనో కార్పొరేటర్‌ తండ్రి. కొడుకు ఆవేశానికి గురైతే అలా కాదు…ఇలా అని సర్థిచెప్పాల్సినోడు రాజకీయం అంటే ఏంటో చెప్పి కొడుకు జనం తరుపు నాయకుడిగా ఎదిగేలా చేయాల్సినోడు కానీ కొడుకు కంటే ముందు తండ్రికే ఓపిక లేకుండాపోయింది. తనయుడి కార్పొరేటర్‌ పెత్తనాన్ని తనకు ఉన్న కావరాన్ని కలగలిపి డివిజన్‌ ప్రజలపై విరుచుకుపడ్డాడు. నా కొడుకునే నల్లా నీళ్లు కావాలని అడుగుతారా…డివిజన్‌లో నీటి కొరత ఉందని ఫిర్యాదు చేస్తారా…? కార్పొరేటర్‌ అయిన నా కొడుకు మీ ఇంటికి వస్తాడా అని శివాలెత్తాడు. ట్యాంకర్‌ నీళ్లు ఎందుకు…తంతా లం…కొడుకా ఎవడనుకుని మాట్లాడుతున్నావ్‌ అంటూ బూతు పంచాంగం విప్పాడు. నీళ్లు కావాలని అడిగినంందుకు బూతులతో విరుచుకుపడ్డాడు. వివరాల్లోకి వెళితే…గ్రేటర్‌ వరంగల్‌లోని 19వ డివిజన్‌లో నీటికొరత తీవ్రంగా ఉంది. దీంతో స్థానికులందరు కార్పొరేటర్‌ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లాలనుకున్నారు. దీంతో స్థానికుడైన బత్తుల సంపత్‌కుమార్‌ కార్పొరేటర్‌ దిడ్డి నాగరాజుకు ఫోన్‌ చేశాడు. వారు ఎదుర్కొంటున్న నీటి సమస్య గూర్చి వివరించి పరిష్కరించాలన్నాడు. అవసరమైతే డివిజన్‌లోని తమ ప్రాంతానికి వచ్చి నీటికొరత ఎలా ఉందో చూడవచ్చు అన్నాడు. అంతే తన కుమారుడిని సంపత్‌కుమార్‌ ఇంటికి రమ్మన్నాడని కార్పొరేటర్‌ దిడ్డి నాగరాజు తండ్రి దిడ్డి నరేందర్‌ చిందులు తొక్కాడు. సంపత్‌కుమార్‌కు ఫోన్‌ చేసి నానాబూతులు తిట్టాడు. నువ్వు ఎంతటివాడవురా నా కొడుకునే ఇంటికి రమ్మని అంటావా, ట్యాంకర్లు పంపుతున్నా సరిపోవడం లేదా అని నానా దుర్బాషలాడాడు. తెల్లవారేసరికి లేపేస్తా, నరికేస్తా అంటూ సభ్యత, సంస్కారం మరచి వయస్సును మరిచి ఫోన్‌లోనే తీవ్రస్థాయిలో వార్నింగ్‌ ఇచ్చాడు. సంపత్‌కుమార్‌ సతీమణి రమ సార్‌…సార్‌ అంటూ ఫోన్లో మర్యాదగా మాట్లాడిన కార్పొరేటర్‌ తండ్రి ఎంతమాత్రం తగ్గలేదు. వాడు…వీడు…చంపేస్తాం…నరికేస్తాం అంటూ అవే డైలాగ్‌లు వినిపించాడు. ఓ ప్రజాప్రతినిధి జనం సమస్యలు చూడడానికి జనం పిలిస్తే వెళ్లకుండా ఏంచేస్తాడో ఇంగిత జ్తానం లేకుండా మీరు పిలిస్తే నా కొడుకు వస్తాడా…? అంటూ కార్పొరేటర్‌ అయిన తన పుత్రరత్నం తరపున వకాల్తా పుచ్చుకుని మతిపోయినట్లుగా మాట్లాడాడు. స్థానికులందరు కలిసి నీటి సమస్య గూర్చి చర్చిస్తుండగానే కార్పొరేటర్‌ తండ్రి ఫోన్‌లో తన బూతు బాగోతాన్ని కొనసాగించాడు. ఇతగాడి వార్నింగ్‌లు, బూతు బాగోతంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓట్లు వేసి కార్పొరేటర్‌గా గెలిపిస్తే తిట్టు తినాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *