Woman Dies After Bike Accident
ద్విచక్రవాహనం ఢీకొని గాయపడిన మహిళ మృతి
– మద్యం మత్తులో డ్రైవింగ్‌పై ఆరోపణలు
నేటిధాత్రి ఐనవోలు:-
ఐనవోలు మండలంలోని పెరుమాండ్ల గూడెం గ్రామానికి చెందిన మధు ఏప్రిల్ 27 న తన స్నేహితుడు చంద్రశేఖర్‌తో కలిసి నడిపిన ద్విచక్రవాహనం ఐనవోలు ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఢీకొనడంతో ఐనవోలు గ్రామానికి చెందిన గడ్డం భాగ్యమ్మ (52) తీవ్రంగా గాయపడిన ఘటన తెలిసిందే.ఏప్రిల్ 27 న జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మ ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించి చికిత్స అందించినప్పటికీ, ఆమె మే 5న చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానికుల ఆరోపణల ప్రకారం, నిందితులు మద్యం మత్తులో వాహనం నడిపినట్లు తెలుస్తోంది. మృతురాలు ప్రేమగల తల్లి, కుటుంబానికి అండగా నిలిచిన మహిళగా గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా, ఆమె వృద్ధ భర్త పూర్తిగా నిరాధారంగా, ఒంటరిగా మిగిలిపోయాడు.
ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిందితుని ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని కఠిన శిక్ష విధించాలని స్థానికులు కోరుతున్నారు.
