అర్ధరాత్రి అంతర్జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ.
తాండూరు,మంచిర్యాల: నేటి ధాత్రి :
బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు మంచిర్యాల జోన్ తాండూర్ రేపల్లెవాడ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి వాహనాల తనిఖీలను పర్యవేక్షించారు.
చెక్‌పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించిన డీసీపీ, విధుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు.ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.
అక్రమ పశువుల రవాణాపై పటిష్ట నిఘా కొనసాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, అనుమానాస్పద రవాణా గమనించినట్లయితే స్థానిక పోలీసులకు లేదా 100 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని,భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
డీసీపీ వెంట తాండూర్ సీఐ దేవయ్య,బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు, తాండూర్ ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
